
విప్లవయోధుడైన మావో ఒక కవిగా, రచయితగా, సాహిత్యాభిలాషిగా చైనా ప్రజలకు సుపరిచితుడే. బహుశా దేశ నాయకుడిగా మావోకు ఉన్న పేరు ప్రతిష్ఠలు ఆయనకు ఒక రచయితగానూ పేరు తెచ్చిపెట్టి వుండవచ్చు. సాహితీవేత్తగా, వచనకవిగా ఆయన శక్తి సామర్థ్యాలు అంచనాకు మించే ఉన్నాయనాలి. మావో వచన కవితల శైలి, కూర్పు, భావన, సాహితీ విలువలు దాదాపు పూర్తిగా ఆయన అనుభవాల ఆధారంగానో లేదా ఒక విప్లవ కమ్యూనిస్టు యోధుడి ఆలోచనా ధోరణికి అనుగుణంగానో వున్నాయని సమకాలీన రచయితల అభిప్రాయం.
నవ చైనా జాతి పిత మావో 120 వ జయంతిని ఘనంగా జరుపుకునేందుకు కమ్యూనిస్టు చైనా సిద్ధమవుతోంది. వంద కోట్ల రూపాయల వ్యయంతో ధగ ధగలాడే (యాభై కిలోలకు పైగా ఉన్న) మావో బంగారు విగ్రహంను ఇప్పటికే షెంజెన్ పట్టణంలో ఆవిష్కరించారు. వాస్తవానికి వంద అడుగుల నిడివిగల మావో సే టుంగ్ భారీ విగ్రహాన్ని కూడా ఆయన 120 వ జయంతిని పురస్కరించుకుని నేడు ఆ మహానాయకుని స్వస్థలమైన ఛాంగ్ షాలో ప్రతిష్ఠించనున్నారు. మావో 32 వ ఏట ఎలా ఉండేవాడో , అచ్చు అలానే , అది కూడా ఛాంగ్ షా గురించి ఆయన తనదైన శైలిలో ఒక చక్కటి వచన కవిత రాసినప్పుడు ఏ విధంగా కూర్చుని ఉన్నారో అలాగే తీర్చి దిద్దారు ఆ విగ్రహాన్ని . ఆ కవిత ఇలా సాగుతుంది:
‘వణికించే చలిలో ఏకాంతంగా
ఉత్తరాన పారే నదిని వీక్షించగా
నారింజ వర్ణ ద్వీపం సమీపాన
గులాబి పర్వతాల పక్కన
అడవిలోని ఎర్రని ఆకుల నందుకుని
ఆ ఉద్రేకపూరితమైన నీళ్లలో ఎలా వెళ్లామో
నాతోవచ్చిన వందలాది నేస్తాలు నీకు గుర్తున్నారా?
భయానకమైన ఉప్పెనలో
మన నావలు చిక్కుకున్న తీరు
నీటి అలజడి సృష్టిస్తున్న హోరు
మనమంతా అల్లల్లాడిన వైనం
చేసేదిలేక వెనుతిరగాలనుకున్న తరుణం
నీకు గుర్తున్నదా?’
ఉత్తర దిక్కుగా ప్రవహించి, టుంగ్ టింగ్ నదిలో కలుస్తుండే ప్రదేశంలో, షియాంగ్ నదికి తూర్పుతీరాన వుంటుంది ఛాంగ్ షా నగరం. నారింజ వర్ణ ద్వీపంగా ఆయన పేర్కొన్న ప్రాంతం పడమర దిశగావుండగా, మరింత పడమటగా వెళ్తే, పర్వతాల సముదాయం కన్పిస్తుంది. మావో రాసిన వచన కవితల్లో కల్లా దానికొక ప్రత్యేకత వుందంటారు. ఆయన వర్ణించిన భూ భాగం, మావో జ్ఞాపకాలను ప్రతిబింబిస్తాయి. అలాంటిది మరో వచన కవిత 1929 అక్టోబర్ 11న ఆయన రాశారు. ఆంగ్ల సంవత్సరాదిలోని తొమ్మిదో నెల తొమ్మిదో తేదీని వర్ణించుతూ రాసిందది. ఆనందంతో పొంగిపోయే రోజుగా ఆహ్లాదంగా పండుగ జరుపుకునే రోజుగా మావో వర్ణించారు. చైనీస్ భాషలో మావో రాసిన వచన కవితలను మైఖెల్ బుల్లక్, జెరోమ్ చెన్ ఇంగ్లీష్‌లోకి అనువదించారు. తొమ్మిదో నెల తొమ్మిదో తేదీ గురించి మావో కవిత ఇలా సాగుతుంది:
‘వయసు పైబడేది స్వర్గానికి కాదు
మనిషికి
నవ మాసంలో వచ్చే నవ్యమైన పండగ
ఏటా వచ్చే పండగ
ఏటేటా వస్తూనే వుంటుంది
యుద్ధభూమిలో మాత్రం పసుపు పుష్పాలు
సువాసనలు వెదజల్లుతూనే వున్నాయి
ఏడాదికి ఒకసారి వచ్చే శీతాకాలం
ఈ ఏడు భారంగా వచ్చి నవ్వింది
ఎప్పటి లాగ కాక నిస్సారమైన రంగు పులుముకుంది
గతం కన్న మిన్నగా
చల్లని అకాశంలో ఆ నీటిలో
లెక్కలేనన్ని ఆకులు పలకరిస్తున్నాయి’.
1949లో మావో, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను నెలకొల్పారు. 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన వారిలో మావో ఒకరు. మార్క్సియన్ కమ్యూనిజం సిద్ధాంతాలను నేల నాలుగు చెరగులా ప్రచారం చేసిన వారిలో మార్క్స్, లెనిన్ సరసన మావో కూడా ఉన్నారు. అభివృద్ధి దిశగా, సామ్యవాదం-కమ్యూనిజం స్థాయిలలో వర్గపోరాటం ఎలా కొనసాగుతుందో అనే దానికి సైద్ధాంతిక స్వరూపం ఇచ్చిన ఘనత ఒక మార్క్సిస్ట్ ఆలోచనాపరుడిగా మావోకు మాత్రమే దక్కుతుంది. గ్రామీణ రైతాంగానికి నిరుపేదలకు భూమి పెంపకం ఒక్క అవసరాన్ని ప్రాధాన్యతను నొక్కి వక్కాణించిన వ్యక్తిగా మావో చరిత్ర ప్రసిద్ధికెక్కారు. ఆయన సిద్ధాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధిచెందని మూడో ప్రపంచ దేశాలను ప్రభావితం చేశాయి.
ఒక రాజకీయవేత్తగా, సైనికనాయకుడిగా, విప్లవకారుడిగా, తిరుగుబాటుదారుడిగా మావో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసినవాడే. బహుశా అందరికీ తెలియక పోయినా మావో ఒక గొప్ప రచయిత, వచన కవి, సాహితీవేత్త. చరిత్ర గమనానికి, మార్పులకు మావో చేసిన సేవ ప్రపంచ చరిత్ర మార్పుకే దారి తీసింది. చైనా దేశానికి ఒక స్థిరత్వాన్ని, ప్రజల ప్రజాస్వామ్యాన్ని అందించిన వ్యక్తిగా అలనాటి చైనాను సంకెళ్ల నుంచి విముక్తి చేయించిన వ్యక్తిగా, పీపుల్స్ రిపబ్లిక్ స్థాపనకు ముఖ్యకారకుడిగా మావో చిరస్మరణీయుడు. ఆయన మాటల్లో చేతల్లో కనిపించే నిజాయితీ, ప్రజల సమస్యలను అవగాహన చేసుకుని వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడంలో చూపిన చొరవ బహుశా అతికొద్ది మందిలో మాత్రమే కనిపిస్తుంది. కష్టకాలంలో చైనా కమ్యూనిస్టు పార్టీని ఏక తాటిపై నడిపించడానికి, అందులో భాగంగా మావో రాసిన ఉద్రేకపూరితమైన వచన కవిత్వం ఆయనలోని స్నేహ కోణాన్ని ఆవిష్కరించేలా వుంటాయి.
తనను, తన ఆలోచలను, సిద్ధాంతాలను అంగీకరించని వారికి వ్యతిరేకంగా మావో చేసిన పోరాటాలను విశ్లేషిస్తే ఆయనలోని పోరాట పటిమ, శత్రువులను అణచివేసిన విధానం స్పష్టంగా గోచరిస్తుంది. కేవలం 26 సంవత్సరాల వయస్సులోనే 1919లో మార్క్సిజం వైపు ఆకర్షితుడయ్యారు. ఒక తిరుగుబాటుదారుడిగా, విప్లవకారుడిగా మారి ఆయుధాలు పట్టుకుని అధికార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడడం మరో ఎనిమిది సంవత్సరాలు తరువాత అంటే 1927లో ప్రారంభమయింది. 1934-35లో ఓటమితో సహా, లాంగ్ మార్చ్, యునైటెడ్ ఫ్రంట్, అంతర్యుద్ధం.. ఇవన్నీ దాటుకుంటూ అంతిమ విజయం సాధించడానికి మావోకు సుమారు 22 సంవత్సరాలు పట్టింది. అంతకాలం ఆయన నిరంతర పోరాటం సాగిస్తూనే వున్నారు.
గ్రామీణ వాతావరణ నేపథ్యంలో 1893 డిసెంబర్ 26న మావో జన్మించారు. ఆయన తండ్రి నూటికి నూరుపాళ్లు రైతు. కాకపోతే బీదరికంలోను, అప్పుల బాధలలోను జీవించే వాడు మొదట్లో . దరిమిలా ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకున్నాడు . తల్లికి నైతిక విలువలంటే అమిత మైన గౌరవం . ఎప్పుడూ ఎవరికో ఒకరికి సాయపడాలనే మనసత్త్వం ఆమెది. దైవమంటే భక్తి ప్రపత్తులు మెండుగా వుండేవి. చిన్నతనం నుంచే మావోకు, తాను చేసే ప్రతి పనిలోను ఒక రకమైన స్పష్టత ఉండేది. చిన్న తనంలో ఏడేళ్ల వయసులో చదువుకొరకు మాస్టారు దగ్గరకు పంపడంతో పుస్తకాల మీద అభిమానం, శ్రద్ధ పెరిగింది. గ్రంథపఠనంతో ఒక కొత్త ప్రపంచం మొదలైందన్న భావన కలిగింది ఆ చిన్నారి మనసులో. చదువుతోపాటు తండ్రి వ్యవసాయక్షేత్రంలో కూడా పనిచేస్తుండేవాడు మావో. విప్లవయోధుడైన మావో ఒక కవిగా, రచయితగా, సాహిత్యాభిలాషిగా కూడా చైనా ప్రజలకు సుపరిచితుడే .
బహుశా మావో రాజకీయ విప్లవ నేపథ్యం, దేశనాయకుడిగా ఆయనకున్న పేరు ప్రతిష్ఠలు ఆయనకు ఒక రచయితగా కూడా పేరు తెచ్చి పెట్టి వుండవచ్చు. అయితే మావోకు రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా సాహితీవేత్తగా, వచనకవిగా ఆయన శక్తి సామర్థ్యాలు అంచనాకు మించే ఉన్నాయనాలి. సమకాలీన చైనా సాహిత్యంలో ఆయన రాజకీయ జీవితంతో ముడిపెట్టకుండా మావోకు మంచి పేరు వచ్చేది. మావో వచన కవితల రచనా శైలి, కూర్పు, భావన, సాహితీ విలువలు దాదాపు పూర్తిగా ఆయన అనుభవాల ఆధారంగానో లేదా ఒక విప్లవ కమ్యూనిస్టు యోధుడి ఆలోచనా ధోరణికి అనుగుణంగానో వున్నాయని సమకాలీన రచయితల అభిప్రాయం.
ఒకటి రెండు సందర్భాలలో తప్ప మహిళలు, ప్రేమ అనే పదాలు అరుదుగా ఆయన కవిత్వంలో కనిపిస్తాయి. మానవ నైజం, మానవవిలువలు, సమాజం, చైనా దేశం, ప్రపంచం… సంబంధించిన అంశాలే మావో కవితల కథా వస్తువు. పాఠశాల విద్యార్థిగా వుండగానే సాహిత్యంపై అభిలాష కలగడం, కవితలు అల్లడం ప్రారంభించారు. వచన రచన అంటే మావోకు చాలా ఇష్టం. ఆయన వచన కవిత్వానికి, గేయ కవిత్వానికి పోలికలు ఉన్నాయి. గ్రామీణ నేపథ్యం, ప్రకృతి అందచందాలు మావో కవితల ప్రత్యేకత. మావో రాసిన మరో కవిత ఇలా సాగుతుంది:
‘ఆ శ్వేత మేరు పర్వతాల పైన
మబ్బులు వెలిశాయి
అదే తెల్లని కొండల కింద
వేదన ఉబికింది
ఎండిపోయిన అడవులు వృక్షాలు సైతం
యుద్ధానికి సై అన్నాయి
తుపాకీల మోత మోగింది
ఫిరంగుల వాన కురిసింది
ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు
సైన్యం ముందుకు దూసుకొచ్చింది
పదిహేనురోజుల్లో రెండు వందల మైళ్లు
సైనికుల దండు కదిలింది
ఫ్యూకేన్ పర్వతాల మీదుగా
కన్ నదికి చేరువగా
శత్రు సైన్యాన్ని తుద ముట్టించే దిశగా
వేలాదిగా సేన కదిలింది విజయం వైపు
కాని మెల్లగా ముందుకొచ్చిన తీరుని
ఆలశ్యంగా పన్నిన పన్నాగాన్ని
జీర్ణించుకోలేని మనసు ఒకటి
మౌనంగా కన్నీరు పెట్టింది’
ఇతర చైనా సాహితీవేత్తల మాదిరిగానే మావో కూడా అపారమైన సాహితీసంపదను తన కవిత్వం ద్వారా ఆ దేశానికి అందించారు. ఆయన రచనలు చాలావరకు ఆంగ్లంలోకి అనువదితమయ్యాయి. బహుశా ఇతర భాషలలో కూడా వచ్చి వుండవచ్చు. ప్రాచీన-ఆధునిక ప్రపంచం పోకడలను ప్రతిబింబిస్తాయి మావో రచనలు.
– వనం జ్వాలా నరసింహారావు
(నేడు మావో 120వ జయంతి)