
ధనుర్మాసం సందర్భంగా ‘తిరుప్పావై’ పదవ రోజున పరమాత్మ ప్రశంసలందుకున్న మరో గోపికను ఇతర గోపికలు నిద్ర లేపుతున్నారు.
నోత్తు చ్చువర్‌క్కమ్ పుగుగిన్ర అమ్మనాయ్!
మాత్తముమ్ తారారోవాశనల్ తిరవాదార్
నాత్తత్తుతాయ్ ముడి నారాయణన్, నమ్మాల్
పోత్తప్పరై తరుమ్ పుణ్ణియనాల్! పండొరునాళ్
కూత్తత్తిన్‌వాయ్ వీళ్‌న్ద కుమ్బకరణనుమ్
తోత్తు అనన్దలుడైయామ్! అరుంగలమే!
తేత్తమాయ్ వన్దు తిరవేలోరెమ్బావాయ్!!
నోము నోచి ఫలం అనుభవించేదానా! లేవమ్మా! బయటి గోపికలు ఎంత పిలిచినా లోపలి గోపిక నిద్ర లేవడం లేదు. ఆమెలో ఉలుకూ పలుకూ లేదు. ఏమీ మాట్లాడడం లేదు. వాకిటి తలుపులు తెరవకపోయినా కనీసం ఓ మాట మాట్లాడాలి కదా? “మా పిలుపులకు సమాధానంగా ఒక్క మాట కూడా మాట్లాడవేమిటి?” అంటున్నారు బయట ఉన్న గోపికలు. అంతేకాదు, భక్తో, ప్రపత్తో సాధన చేసి, తాను ఉన్న చోటనే పరమాత్మానుభవాన్ని పొందుతున్న ఈ గోపిక అదృష్టాన్ని ‘ఏమి అదృష్టమమ్మా’ అని మెచ్చుకుంటున్నారు.
ఈ గోపిక శ్రీకృష్ణ తత్వాన్ని బాగా తెలుసుకుని ఉంది. శ్రీకృష్ణుడే సిద్ధో పాయమని తెలుసుకుని ఆయనను ఆశ్రయించింది. ఆయనను శరణాగతి చెందడం తప్ప ఇంకేమీ చేయనవసరం లేదని భావించింది. పరమ శరణాగతి చేసిన ఏకాంత భక్తులకు ఆమె స్ఫూర్తిగా, సంకేతంగా నిలిచింది. ఉపాయోపాయాలు రెండు నారాయణుడేనని ఈ గోపిక ద్వారా అర్థమవుతోంది. “పరిమళించే తులసి మాలను తలపై పెట్టుకున్న నారాయణుడే మన రక్షకుడు. ఆయననే కీర్తిద్దాం. శ్రీరాముడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుంభకర్ణుడు తన నిద్రను నీకిచ్చాడా? లేచి తలుపులు తీయవమ్మా! మా గోష్టికి నాయకురాలి లాంటిదానివి. నీలాంటి భాగవతోత్తమురాలు మాతో చేరితేనే మా గోష్టి పూర్తవుతుంది. నెమ్మదిగా వచ్చి, తలుపు గడియ తీసి, నువ్వు పొందిన పరమాత్మానుభవాన్ని మాకు కూడా దయ చేయవమ్మా!” అని బయట నుంచి గోపికలు వేడుకుంటున్నారు.
అయిదవ వాక్యమైన ‘శ్రీమత్ పరాంకుశ దాసాయ నమః’ ప్రకారం, పెరియాళ్వారుల్ని(మహా యోగిని) నిద్ర లేపుతున్నారు.
వివరణ, చిత్రంః డాక్టర్ చెలికాని మురళీకృష్ణారావు
94400 09535
భగవంతుడితోనే జీవితం

తిరుప్పావైలోని పదకొండవ పాశురం కూడా గోపికలను నిద్ర లేపడానికి సంబంధించిందే. ఇందులో గోకులాన్ని గురించిన అద్భుతమైన వర్ణన మిళితమై ఉంది.
కత్తు క్కరవైక్కణంగళ్ పలకరన్దు
శెత్తార్ తిరలళియచ్చెన్రు శెరుచ్చెయ్యమ్
కుత్త మొన్రిల్లాద కోవలర్‌దమ్ పొర్కొడియే
పుత్తవ రవల్‌గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు తోళి మారెల్లారుమ్ వన్దు నిన్
ముత్తమ్ పుగున్రు ముగిల్ వర్రన్ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ
ఎత్తుక్కుఅంగుమ్ పారుళేలోరెమ్బావాయ్!!
ఈ పదకొండవ రోజున లెక్కలేనన్ని గోవుల పాలు పితుకుతూ ఉండే గొల్ల కులంలో పుట్టిన బంగారు తీగ వంటి గోపికను మిగిలిన గోపికలంతా నిద్ర లేపుతున్నారు. “లేవమ్మా, లేచి తయారై మా గోష్టికి రావమ్మా!” అని బయటి గోపికలంతా ఆమెను అనేక విధాలుగా పిలుస్తున్నారు. గోకులంలోని గోవులు కూడా నాలుగైదు ఈతలు ఈనినప్పటికీ, లేగ దూడల్లాగానే ఉంటాయట. బృందావనంలోని గోవులు విశిష్టతే అదట. కారణం ఏమిటంటే, ఈ గోవుల్ని బాలకృష్ణుడే మేపుతుండడం వల్ల అవి మరింత ఆనందంతో చిన్న దూడలుగా కనిపిస్తుంటాయట. తీగ ఎట్లా కొమ్మను వదిలి ఉండలేదో, అలాగే శ్రీకృష్ణ పరమాత్మను వదిలి ఉండలేని స్థితి గల ఈ గోపికను “పుట్టలోని సర్పం లాంటి నితంబం కలదానా! అడవిలో నెమలి వంటి కేశపాశాలు కలదానా! బంగారు తీగ వంటి దానా! లేచి రావమ్మా” అని బయటి గోపికలు ఆప్యాయంగా పిలుస్తున్నారు.
“నేను రావడానికి అంతా వచ్చారా” అని లోపలి గోపిక అడుగుతోంది. “పరమప్రాప్యమైన నీ ఇంటి ముందు నీ బంధువులు, స్నేహితురాళ్లు అందరమూ చేరామమ్మా! నీల మేఘ శ్యాముడైన కృష్ణ పరమాత్మ తిరునామ సంకీర్తనం చేస్తున్నప్పటికీ, ఆయన కల్యాణ గుణాలను మనసారా కీర్తిస్తున్నప్పటికీ, నీలో కొంచెమైనా మార్పు రాలేదే! మాట్లాడకుండా పడుకున్నావేమమ్మా” అని అంటున్నారు బయటి గోపికలు. అంతేకాదు, “నువ్కొక్కదానివే పరమాత్మానుభవాన్ని పొందుతున్నావే! భాగవతులు లేని పరమాత్మానుభవం కైవల్యంతో సమానమా! బంగారు తీగ వంటి నువ్వు మా గోష్టికి రాకుండా ఎలా నిద్రపోగలుగుతున్నావమ్మా” అని బయటి గోపికలు అడుగుతున్నారు. ఈ రోజు గురు పరంపరలోని ‘శ్రీమద్యామునయే నమః’ అనే ఆరవ వాక్యంతో ప్రతిపాదించిన ‘పూదత్తాళ్వారు’లను మేల్కొలుపుతున్నారు.