
తొలి తెలుగు కథ ఏది? సమాధానం వెతుక్కుంటూనే ఉన్నాం ఇప్పటికీ. గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’ కన్నా ముందే బండారు అచ్చమాంబ ‘ధన త్రయోదశి’ అచ్చయిందని బయట పడింది. అచ్చమాంబవే 1902 కన్నా ముందు రాసిన కథలు వెలుగులోకి వచ్చాయి. అసలు ‘దిద్దుబాటు’కి ముందు తొంబై తెలుగు కథలున్నాయని ‘కథానిలయం’ ఇప్పుడు వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో- కొన్ని భారతీయ భాషల్లోని తొలి కథలతో ఒక సంకలనం తెలుగులో వస్తోంది. స.వెం.రమేశ్, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు సంకలనం చేసిన ఈ పుస్తకం, జనవరి 4న పొన్నూరులో అ.జో.వి.భో భాషా సదస్సులో విడుదలవుతోంది. ‘తొలి కతలు’ ముందుమాట ఇది…
‘కతా కతా… నువ్వెప్పుడు పుట్టావు?’ అనడిగితే, పక్కున నవ్వింది కత. పగలబడి నవ్వింది కత. పడీ పడీ నవ్వింది కత. మూతి ముడుచుకుని, ‘ఎక్కడ పుట్టావో చెప్పు?’ అన్నా. ఎర్రిబాగులోడా… అన్నట్టుగా చురుగ్గా చూసింది కత, నా చేతిలోని పెన్నూ కాయితాలని జాలిగా చూస్తా. ‘పోనీ గానీ, ఎవురికి పుట్టావో అదన్నా చెప్పు?’ అన్నా. ఈ తూరి, కోపంగా చూసింది కత. కొర కొరా చూసింది కత. ‘అనగనగా… అంటా నీకు కతలు చెప్పిన అవ్వనడుగుపో’ అనింది విసురుగా. ‘మా యవ్వ ఇప్పుడేడుండాది అడిగేదానికి…’ అన్నా. ‘అయితే, సందేళ సందేళ నిన్ను సంకనేసుకోని, అద్దో సందమామలో అవ్వ పిలగాడికి బువ్వ పెడతావుండాది చూడు అంటా కత చెప్పి నిన్ను మరిపించి అన్నం తినిపించిన మీయమ్మ నడుగు’ అనింది కత. ‘అమ్మ గూడా ఎల్లిపాయనే ఈ నడమే’ అన్నా నిట్టూరస్తా. ‘పోనీ, యాపచెట్టుకింద ఎండపూట ఎన్నెన్ని కతలు చెప్పినాడు మీ చెంగన్న… ఆయన్ననడుగుపో’ అనింది దయగా.
‘యాడ చెంగన్నా… ఎప్పుటి కతా…’ అన్నా, ఇంకేమన్నా చెప్పు అన్నట్టుగా. సందర్భాన్ని బట్టి కత చెప్పే సమాది రవణయ్యనీ, కతలగంప అని అందురూ అనే మాదిగ పేరమ్మనీ, దెయ్యం కతలే చెప్పే బయపిత్తులోడు ముక్కుతిమ్మడినీ… ఇట్టా ఎందురెందురినో గుర్తు చేసింది కత. ‘ఎవురెవురి కతో నాకెందుకు గానీ… నీ కతేందో చెప్పు ముందు’ అని తగులుకున్నా వదలకుండా. ‘నీకు అమ్మంటే పిచ్చి కదా… మీయమ్మకి అమ్మెవురు?’ అనడిగింది. ‘చెంచురత్నమ్మ’ అన్నా టక్కున. ‘చెంచురత్నమ్మకి అమ్మెవురు?’ అనడిగింది. ‘పేరు తెలీదు, కానీ ఉండేవుంటాది గదా’ అన్నా. ‘ఆ ఉండే ఉండిన అమ్మకి అమ్మెవురు? ఆయమ్మకి అమ్మెవురు? అసలుకి ఈ బూమండలం మింద తొట్టతొలి అమ్మెవురో కనుక్కోని రాబో… అప్పుడు చెప్తా నా కత’ అని నా కళ్ళలోకి లోతుగా చూసింది కత. దిక్కూ దిశా తెలీక తికమకగా చూశా, అప్పుడు నవ్వింది కత. విరగబడి నవ్వింది. మళ్ళీ మళ్ళీ నవ్వింది. నవ్వీ నవ్వీ నవ్వులోనే మాయమై పొయ్యింది కత.
అవును గదా, అమ్మలగన్న అమ్మ ఎవురూ అని కనిపెట్టే పని ఏ నరమానవుడికైనా సాధ్యమయ్యేదేనా? తొలి అమ్మ మాదిరే గదా, తొలి కతా! ఏదన్నా ఒక గీత గీసుకుంటే తప్ప తొలి అని దేన్నయినా అనుకోలేంగదా. కతలకి సంబంధించినంత దాకా ఆ గీత అచ్చు మిషను. అచ్చులోకి వచ్చిన కాణ్ణుంచీ దొరికిన కతల్నే తొలి కతలని అనుకుంటా ఉన్నాం. అనుకుని ఎతుక్కుంటా ఉన్నాం. ఎతుక్కుని ఏరుకుంటా ఉన్నాం. ఏ దేశాన అయినా, ఏ భాషలో అయినా ఇదే తీరు. మొరసునాడనీ, తొండనాడనీ, హోసూరనీ… యాడాడ కతలో ఏరి కూర్చి పుస్తకాలేసే పనిలో ఉండేటపుడు చేతికొచ్చింది ఒక పుస్తకం. ‘తొలి తెలుగు కథ-ఏడు అభిప్రాయాలు’ దాని పేరు. గురజాడ దిద్దుబాటా, బండారు అచ్చమాంబ ధన త్రయోదశా ఏది తొలి కత అని ఇప్పటికే చాలా కొట్లాట జరిగిపొయ్యింది తెలుగులో. ఈ పుస్తకం బుర్రలో దూరి రొద పెడతా ఉండాది. 1910 లేదా 1902, తొలి కత ఏదైనా ఎనిమిదేళ్లే వారా. తెలుగులో కత ఇంత ఎనకబడి మొదులయ్యిందేందబ్బా? అయినా, ఆ రెండు కతల్లో గూడా ఆ భాషేంది సామీ గులకరాళ్ళు నవిలినట్టు అని బాధ కలగతానే ఉండింది. అప్పుడు తెలిసింది తాతాచారి కతల గురించి. నెల్లూరు నుంచి ఈతకోట సుబ్బారావు, తాతాచారి కతలు జెరాక్సు చేసి పంపించినాడు. బంగోరే వేసిన పుస్తకం కాపీ అది. 1855లోనే తాతాచారి కతల పుస్తకాన్ని బ్రౌన్ దొర అచ్చేయించినాడు. ఈ కతలు మనం మాట్లాడుకున్నంత తేలిగ్గా ఉండాయి. అయితే, తాతాచారి స్వయంగా ఈ కతలు రాయలేదు.
తాతాచారి చెప్పిన కతలన్నిట్నీ గుర్తు బెట్టుకుని బ్రౌన్‌దొర ఇంకెవురి దగ్గరో రాయించి అచ్చేయించినాడు. ఓహో, ఇందుకన్నమాట వీటిని మొదుటి కతలు అనలేదనుకుంటా ఉండంగానే, వాసిరెడ్డి నవీన్ చెప్పినాడు, దిద్దుబాటు కన్నా ముందరే అరవై అయిదు కతలుండాయి తెలుగులో అని. అసలికి, బండారు అచ్చమాంబ రాసినవే ధన త్రయోదశి కన్నా ముందుటి కతలుండాయని మహబూబ్ బాషా బయటపెట్టినాడు. తెలుగులో తొలికత చుట్టూరానే ఇంత కత నడస్తా ఉండాది కదా, మన దేశంలోనే వేరే వేరే భాషల్లో తొలి కతలు ఏ మాదిరిగా ఉండాయి? మనకన్నా ముందొచ్చినాయా, తర్వాతనా? అనే దాని మీదకి మనసు మళ్ళింది. అప్పుడు మొదులైంది, తండ్లాట. ఎందురికో ఫోన్లు చేసి, ఎందురితోనో నేరుగా మాట్లాడి, వెంటబడి, వేధించి, విసిగించి, కోపం తెప్పించి పన్నెండు కతలు కువ్వబోసినాం. ఏది తొలి కత అనే గొడవ తెలుగులో ఉన్నంత గంగనాగోలగా వేరే భాషల్లో ఉన్నట్టు లేదు.
మరాఠీలో, తమిళంలో, మలయాళంలో, హిందీలో, బెంగాలీలో కూడా తొలి కత ఏదనే దాని మింద వాదాలు నడిచినా, వాళ్ళకి వాళ్ళే కొన్ని గీతలు గీసుకుని ఇదీ మా భాషలో తొలి కత అని ఒప్పందానికి ఒచ్చేసినారు. ఈ లెక్కన చూస్తే, మన దేశంలో తొట్ట తొలి కత పుట్టింది 1870లో. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఉర్దూ భాషలో రాసిన ‘గుజారుహా జమానా’ కతని తొలీదని అనుకోవాలి. 1884లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘ఘాటీర్ కథ’నే బెంగాలీలు, వాళ్ళ భాషలో తొలికత అనేసుకున్నారు. 1890లో మరాఠీ భాషలో హరినారాయణ్ ఆప్టే రాసిన ‘దహా రూపాయాంచీ ఫేడ్’ని తొలి కతగా చెప్పుకుంటా ఉండారు.
అయితే, మరాఠీలో దీనికన్నా ముందే ఒక దళిత రచయిత కత రాసాడనే వాదనా ఉండాది. ఆ కత జాడ దొరకలేదు. మలయాళంలో 1891లో తొలి కత అచ్చయితే, ఒడియాలో 1898లో తొలి కత వచ్చింది. కన్నడ, గుజరాతీ, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో 1900 తర్వాతే తొలి కతలు వచ్చాయి. కొంకణి, తుళు భాషల్లో 1933 దాకా కత లేదు. కాశ్మీరీలో 1955లో గానీ తొలి కత రాలేదు. అంటే అప్పటి దాకా అక్కడ అమ్మలూ, అవ్వలూ, తాతలూ పిలకాయలకి కతలే చెప్పలేదని కాదు. చెప్పిన కతలు అచ్చుకాలేదు. అచ్చయినా సాహితీ ప్రపంచం గీసుకున్న గీతల్లోకి అవి ఒదగలేదు. అసలీ గీతలు తొలీగా గీసుకున్నది మనం కాదు, ఐరోపాలో, అమెరికాలో చిన్నకత అనే మాట 1700 ఆఖర్లోనే వాడుకలోకి వచ్చింది. పిట్టకతలు అనే మాట మన జానపద సాహత్యంలోనూ ఉన్నా, ఇంగ్లీషులో పోస్తేనే కదా తీర్థం! 1790-1830 నడుమనే ఈ దేశాల్లో చిన్న కతలు ప్రచారంలోకి వచ్చినాయి. ఇంగ్లండులో వాల్టర్ స్కాట్ రాసిన ‘ది టూ డ్రోవర్స్’ 1827లో అచ్చయింది. అమెరికాలో 1837లో నెతానియేల్ హాతరాన్ రాసిన ‘ట్వైస్ టోల్డ్ టేల్స్’తో చిన్న కతల దుమారం మొదులైందని అంటారు.
తెలుగులో తొలికత చుట్టూరానే ఇంత కత నడస్తా ఉండాది కదా, మన దేశంలోనే వేరే వేరే భాషల్లో తొలి కతలు ఏ మాదిరిగా ఉండాయి? మనకన్నా ముందొచ్చినాయా, తర్వాతనా? -అని పన్నెండు కతలు కువ్వబోసినాం. మరాఠీలో, తమిళంలో, మలయాళంలో, హిందీలో, బెంగాలీలో కూడా తొలి కత ఏదనే దాని మింద వాదాలు నడిచినా, ఇదీ మా భాషలో తొలి కత అని ఒప్పందానికి ఒచ్చేసినారు. ఈ లెక్కన చూస్తే, మన దేశంలో తొట్ట తొలి కత పుట్టింది 1870లో. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఉర్దూ భాషలో రాసిన ‘గుజారుహా జమానా’ కతని తొలీదని అనుకోవాలి.
చార్లెస్ బ్రోకెన్ బ్రౌన్ 1805లోనే చిన్న కతలు రాసినా, 1819లోనే వాషింగ్టన్ ఇర్వింగ్ రాసినా హాతరాన్తోనే చిన్న కతల గురించి మాట్లాడుకోవటం పెరిగింది. 1832-1849 నడమ ఎడ్గార్ ఎలెన్ పో కతలు వచ్చాకే, ఇవి గదా చిన్న కతలంటే అన్నారు. జర్మనీలో 1810లోనూ, ఫ్రాన్స్‌లో 1829లోనూ తొలి కతలు వచ్చినాయని అంటారు. 1860 నుంచీ రష్యాలో చెహోవ్ చిన్నకతల యుగం మొదలైంది. తొలి రోజుల్లో జానపద, నీతి, డిటెక్టివ్ కతలు అందరికీ నచ్చినాయి. బతుకు సమస్యలు, మనుషుల నడుమ సంబంధాలు వంటివి ఆ తర్వాత కతలుగా మారాయి. ప్రపంచ యుద్ధాల తర్వాత చిన్నకత మరింత ముదురుపాకాన పడింది. కావ్యాలూ, నవలలూ వీర విహారం చేసే దినాలలో… మొదులుబెడితే ఒకే తూరి చదివేయగలిగిన కతలు జనానికి బలే నచ్చినాయి. పత్రికలు వీటిని బాగా అచ్చేసేవి. తొలి దినాల్లో నూరు పేజీల కతని కూడా చిన్న కత అనే అనేవాళ్లు. ఇంతకీ ఈ కతల వెనకుండే కతంతా ఆడా ఈడా పోగేసి తెలుసుకునిందే. ఇదంతా తెలుసుకున్నాక అనిపించిందేమంటే, ఐరోపాలోనో, అమెరికాలోనో పుట్టినా చిన్న కత అదే మాదిరి గుణాలతో మన దేశంలోకి అడుగు పెట్టడానికి ఎక్కువ కాలమేం పట్టలేదని. 1840ల్లో ఎడ్గార్ ఎలన్ పో రాసిన కతలనే అచ్చమైన కతలుగా అనుకుంటారు.
1870 నాటికే మన దేశంలో తొలి కత అచ్చయిపొయ్యింది. ఇంగ్లీషోళ్ళ పాలన వల్లే మనకు ఈ కతలు బిన్నా వచ్చేసినాయి. చిన్నతనంలోనే మొగుడికి దూరమైన అమ్మాయి, గంగలో తనువు చాలించిన కతని ఒక రేవు చెప్పినట్టుగా రవీంద్రనాధ్ ఠాగూర్ 1884లోనే రాశాడు. ఇరవై నాలుగేళ్ళ తరువాత వచ్చిన తమిళ కతకీ, ఈ బెంగాలీ కతకీ పోలికలుండాయి. మాట తప్పిన మొగుడ్ని పల్లెత్తు మాట అనకుండా నీట మునిగి ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి కతని గుంట కట్ట మీదుండే రాగిమాను చెబుతాది. ఇది ఠాగూర్‌కి కాపీ అని తమిళనాట కొంత గొడవ జరిగినా, కానే కాదని ఆ తరువాత తేల్చేసినారు. ఇంటి పెద్ద చావుతో స్మశానంగా మారిన గ్రామ కరణం కుటుంబం కతని ఒడియాలో ఫకీర్ మోహన్ సేనాపతి 1898లోనే మనసుకి పట్టుకునే మాదిరిగా రాసినాడు. చేసిన పని తలుచుకుని చింతపడుతున్న దొంగ కతని మలయాళంలో వేంగయిల్ కున్హిరామన్ నయనార్ 1891లో రాసినాడు. ఒక్కో కతదీ ఒక్కో తీరు. ఈ కతల్లో మరీ లేటుగా వచ్చిన కత కాశ్మీరీ భాషలో. 1955లో అఖ్తర్ మొహియుద్దీన్ రాసిన మేజికల్ వెబ్ తొలి కాశ్మీరీ కత. కాలానికి తగిన కత ఇది. ఈ కతని మాత్రమే ఇంగ్లీషులో నుంచి తెలుగులోకి తెచ్చుకోవాల్సి వచ్చింది. మిగతా కతలన్నీ నేరుగా ఆ భాషల నుంచే తెలుగులోకి వచ్చినాయి.
ఈ కతలన్నీ పోగేసుకున్నాక కొంచం దిగులూ కలిగింది. కొంచెం సంతోషమూ వేసింది, అమెరికా, ఐరోపా దేశాల కతేమోగానీ మన దేశంలో గూడా తొలీగా వచ్చిన కతల్లో మంచి మంచివి ఎన్నో ఉండాయి. ఇంక, దిగులెందుకంటే.. కత నడిపే తీరులో, కతకి ఎన్నుకున్న విషయంలో, కత చెప్పే భాషలో తొలి తెలుగు కతలు ఎనకబడే ఉండాయి కదా అని. సాహిత్యాన్నీ, చరిత్రనీ తెలంగాణలో మళ్ళీ లోడి బయటకి తీసుకుంటా వుండారు గదా, అదే మాదిరిగా తెలుగులో గూడా తొలి తెలుగు కతల కోసం వెతుకులాట ఇంకా లోతుగా జరిగితే, మంచి కతలే దొరకతాయనే ఆశగా ఉండాది. ఈ మాదిరిగా ఇన్ని భాషల కతలనీ ముందేసుకోని తలబోసుకుంటా ఉంటే, ‘అబయా..’ అంటా వచ్చి పలకరించింది కత. ఎళ్ళిపోయిన అమ్మ, ఎనక్కొచ్చి నిద్దర మంచం కాడ నిలబడి పిలిచినంత సంతోషం కలిగింది.
-ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు