భాషా వికాసానికి ప్రణాళిక శూన్యం -ఆంద్ర జ్యోతి

 

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ప్రకటిస్తున్న చర్యలన్నీ నత్తనడకే నడుస్తున్నాయి. ప్రకటించిన చర్యల్లో అమలు కానివే ఎక్కువ. ఇక మంత్రిత్వ శాఖ ఎప్పటి నుంచి పని ప్రారంభిస్తుందో తెలియదు.

తెలుగు భాష కోసం తెలుగుతనం కోసం అందరిని కూడగట్టి విశాలాంధ్రగా అవతరించిన ఆంధ్ర ప్రదేశ్‌లో భాష సంస్కృతుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయటానికి 60 ఏళ్ళు పట్టింది. 2014 తొలి రోజున జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఇక మీదట మన రాష్ట్రంలో తెలుగు భాష, సంస్కృతుల కోసం మంత్రి, అందుకు తగిన సిబ్బంది, హంగులు ఏర్పాటవుతాయి. గత 33 ఏళ్ళుగా మనుగడలో ఉన్న రాష్ట్ర సాంస్కృతిక శాఖకు ముందు “భాష” అంటూ రెండు అక్షరాలు చేర్చటంతోనే కొత్త మార్పులు తెలుగుతనం వికాసం చకచకా జరిగిపోతాయా, మనం ఉత్తుత్తినే మురిసిపోతున్నామా అంటూ భాషాభిమానులు మథనపడుతున్నారు.


2013 ఏడాదినంతా తెలుగు భాష వికాస సంవత్సరంగా ప్రకటించిన దరిమిలా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో గర్వంగా ఉన్నాయా అని ప్రశ్నించుకుంటే, అట్టహాసాలు, పటాటోపాలు కళ్ళ ముందు కదలాడతాయి. 2012 డిసెంబరు నెలలో తిరుపతిలో 3 రోజులపాటు జరిగిన 4వ ప్రపంచ మహాసభలలో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలను అమలు చేయడానికి చాలా కాలం పట్టింది. ఈ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ మీద కూడా అనుమానాలు ఏర్పడుతున్నాయి. అన్నిటికన్నా ముందస్తుగా సచివాలయ స్థాయిలో తెలుగును సంపూర్ణంగా అమలు చేయటానికి గతంలో జారీ అయిన వాటినన్నింటిని ఉటంకిస్తూ ఫిబ్రవరి 26న తాజా మార్గదర్శకాలు జారీ చేశారు. శాఖాధిపతులందరితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్‌లకు మన ఏలుబడిలో అన్నింటా తెలుగు వెల్లువెత్తాలని ఆదేశించారు. ఆ తరువాత ఏప్రిల్ 10న మరొక ఉత్తర్వు విడుదల అయింది. 1985లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసిన అకాడమీలను పునరుద్ధరించడానికి ఉగాది రోజున కచ్చితమైన ప్రకటనతో ఆదేశాలు జారీ అయ్యాయి.

కాగితాలపైనే వాగ్దానాలు
తిరుపతిలో తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి ప్రకటించిన వాగ్దానాల అమలులో నిబద్ధత చాటేలా అదే రోజున తెలుగుభాష సాంస్కృతిక సంవత్సరం ప్రకటన ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వుల తీరుతెన్నుల్ని తెలుగు మహాసభల నిర్వహణ ముందునాటి నుంచే నిశితంగా విమర్శిస్తూ అసలు సిసలు భాషా వికాసం కోసం చేయాల్సిన వాటిని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువస్తున్న తెలుగు భాష ఉద్యమ సమాఖ్య వారు ఆ ఉత్తర్వుల వెనుక ఊగిసలాటను గమనించారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత కూడా 1966 దాకా అధికార భాషకు చట్టం చేయలేకపోయిన ప్రభుత్వాన్ని వావిలాల గోపాలకృష్ణయ్య వంటివారు తీవ్రంగా మందలించడంతో ఒక కదలిక వచ్చింది.
ఇదమిత్థమైన అధికారాలు విధానాలు లేని అధికార భాషా సంఘంలో నియమితులైనవారు కొందరు క్యాబినెట్ హోదా హుందాగా బాధ్యతలు నిర్వహిస్తే మరికొందరు అంతంతమాత్రం అమలును కూడా అస్తవ్యస్తం చేశారు. అలాంటి వ్యవస్థలో తెలుగువారిలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారికి దీటుగా దేశ విదేశాలలో స్థిరపడిన తెలుగువారికి కూడా కావలసినవన్నీ సమకూర్చటంలో ఎవరికీ శ్రద్ధ, నిబద్ధత లేకుండా పోయింది. తెలుగు మహాసభల నిర్వహణలో మొదటి సభలకు 1974-75లలో చురుకుగా వ్యవహరించిన మండలి వెంకట కృష్ణారావు తీరులోనే ఆయన తనయుడు బుద్ధప్రసాద్ 2012లో 4వ మహాసభలకు కావలసినవన్నీ తీర్చిదిద్దారు. వారం రోజుల తొలి మహాసభల సమయంలో మూడవ రోజున అంతర్జాతీయ తెలుగు అధ్యయన కేంద్రం ఉండాలని వచ్చిన సూచనలను ఆలకించిన నాటి ముఖ్యమంత్రి ఆదేశాలతో సభల ముగింపురోజు నాటికి సంబంధిత ఉత్తర్వులు, సిబ్బంది ఏర్పాట్లు జరిగాయి. ఉదాత్తమైన ఆశయంతో నెలకొన్న ఆ కేంద్రం ఆ తరువాతి రోజులలో బాలారిష్టాలు పడుతూ కొట్టుమిట్టాడుతున్న దశలో 1985లో తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. రాష్ట్రేతర తెలుగువారంతా గంపెడు ఆశలతో ఆ కేంద్రం ఆసరా కోసం చూస్తుంటే చిటికెడు కూడా అందించటానికి అంతర్జాతీయ తెలుగు అధ్యయన కేంద్రం కుంగిపోయింది.

అమలుకు రాని లక్ష్యాలు
ప్రస్తుతం మండలి వెంకట కృష్ణారావు పేరుతో ఆయన స్మారకంగా తెలుగువారి సమైక్యతా కేంద్రంగా వికసించాల్సిన ఆ కార్యాలయం అక్షరాలా కునారిల్లిపోతోంది. తెలుగుభాష ప్రేమికులు తెలుగుతనంపై పట్టింపు గల వారికి కాస్తంత ఉపశమనంగా జివో 263తో ప్రభుత్వం అవసరమైన నిధులతో కార్యాచరణ ప్రణాళికను తెలుగుబాట పేరుతో నిర్దేశించింది. ఏప్రిల్ పది నుంచి అన్ని వైపులా తెలుగు వైభవం వెల్లువెత్తేలా చేయాలనుకున్నవన్నీ తొలి మెట్టులోనే చతికిలపడ్డాయి. సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి, పర్యాటకశాఖ, అధికారభాషా సంఘం, తెలుగు అకాడమీ, ఉర్దూ అకాడమీ, హిందీ అకాడమీ, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు పలు ప్రభుత్వ శాఖలు కలసి తెలుగుబాటను అందరూ తమదిగా అందిపుచ్చుకు నడవాలని తలపెట్టాయి. అందులో భాషాపరంగా సాంస్కృతికపరంగా పాటించటానికి మార్గదర్శకత్వక సూత్రాలను రూపొందించారు. వాటిల్లో ప్రధానమైనవి…
-అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10 దాకా తెలుగు ఉండాలి .
-నిఘంటువులు, వృత్తి పదకోశాలు, మాండలిక పదకోశాలు రూపొందించాలి.
-భాష సంస్కృతులపై పరిశోధనల్ని ముమ్మరం చేయాలి.
-కొత్త పదాలు రూపొందించాలి.
-పిన్నలకు, పెద్దలకు తెలుగు పట్ల మమకారం పెంపొందించే పుస్తకాల ప్రచురణ విరివిగా జరగాలి.
-రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలో నామ ఫలకాలు అన్నీ తెలుగులో ఉండి తీరాలి.
-తెలుగు పద్యాలు, సామెతలు, పొడుపు కథలు, ఆటలు, ప్రదర్శనల కళలు అన్నిటిలో ప్రవేశం, ప్రతిభ పెంచేలా సమస్త కార్యక్రమాలు జరగాలి.
-ప్రతి జిల్లా కేంద్రంలో తెలుగు తోట పేరిట వేదికలు, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలి.
-టమన గ్రామాల పేర్లు చరిత్ర తెలిపే కైఫీయత్తులు ప్రచురించాలి.
-ఇంటిపేర్లపై పరిశోధనలు జరిపించాలి.
-అన్ని పర్యాటక కేంద్రాల వివరాలు తెలిపేలా ఆకర్షణీయ పుస్తకాలు ముద్రించాలి.
-తెలుగుతనం పెంచిన పెద్దల చరిత్ర పుస్తకాలతో పాటు పల్లె పల్లెలో పెద్దలను గుర్తించి, సత్కరించి సందేశాలు ఇప్పించాలి.
-మన సంప్రదాయ వస్త్రధారణ, వంటలు, ఆటలు, వ్యవసాయ పనిముట్లు, పశువులు, పక్షులు వంటి ప్రదర్శనలు విస్తృతంగా నిర్వహించాలి.
ఏప్రిల్ లో జారీ అయిన ఆ ఉత్తర్వుల మేరకు ఎక్కడ ఏమి జరిగాయో చెప్పకనే తెలిసిపోతుంది. మళ్లా కొత్త ఏడాదికి స్వాగతంతో వాటి అన్నింటి సమన్వయంగా సరికొత్త శాఖ “ఆంగ్ల భాషలో ఉత్తర్వులతో” అమలులోకి వచ్చింది. భాష అంటే తెలుగేనా? ఉర్దూ, హిందీ వంటి వాటికి వర్తిస్తుందా? సంస్కృతి అంటే తెలుగు సంప్రదాయ వ్యవహారాలు మాత్రమేనా అన్న సందేహాలు పలు వైపుల నుంచి వినవస్తున్నాయి.
-జి.ఎల్.ఎన్. మూర్తి

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.