సినిమా గా సినిమా దాసరి పుస్తకం -ఆంద్ర జ్యోతి

సినిమా చరిత్రకు సంబంధించి ఇటీవల కాలంలో వచ్చినన్ని పుస్తకాలు ఇంతకు ముందెన్నడూ రాలేదు. అలా తాజాగా విడుదలయిన పుస్తకం విశ్వవిజేత విజయగాథ. త్వరలో విడుదల కానున్న మరో పుస్తకం- సినిమాగా సినిమా. దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన 150 సినిమాల వివరాలు, వాటి చరిత్రపై సీనియర్ జర్నలిస్టు వినాయకరావు రాసిన పుస్తకం- విశ్వవిజేత విజయగాథ. ప్రతి రోజు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూసే సినిమాల గురించి, ఆరాధించే నటుల గురించి, తెరవెనకుండే 24 క్రాఫ్స్ట్ గురించి- సినీ చరిత్రకారుడు, విమర్శకుడు నందగోపాల్ రాసిన పుస్తకం ‘సినిమాగా సినిమా’. ప్రగతి ప్రింటర్స్ సౌజన్యంతో ప్రచురించిన ఈ పుస్తకానికి మేకప్ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ రెండు పుస్తకాల నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు…

ఓ విందులో ఓ మోతుబరి ఆసామీ వేసిన అర్ధం పర్ధం లేని ప్రశ్నకు జవాబుగా ‘ఇపుడు సినిమాగా సినిమా రాస్తున్నాను’ అన్నాను సవినయంగా. ఆయన చూపులో ‘నేడు కినిమా గురించి హస్కుకొట్టగ లేని కోన్ కిస్క లేనే లేడు’ అనే భావన. ఆయన మాటల్లో ‘సినిమా చూడటమే దండగ. పైగా దాని మీద ఓ పుస్తకం! పెద్ద దండగ. దాన్ని కొనేదెవడు? చదివేదెవడు స్వామీ!’ ‘ఇంతకీ నీ అమూల్య అభిప్రాయం అడిగిన అడ్డగాడిద ఎవడు? పెరియసామీ?’ అందామని లోలోన అనుకున్నాను. అనలేకపోయాను. (ఎందుకంటే) ఆయనకు కొమ్ములు ఉన్నాయి నాకు లేవు. సినిమా పట్ల ఈ చిన్నచూపు, ఈ నిర్లక్ష్యం, ఈ నిర్లిప్తత, ఈ నిరసన భావం తెలుగువారిలో చాలా మందిలో చాలా కాలంగా, చాలా బలంగా అల్లుకుపోయింది. (నిజానికి) సినిమా మన జీవనశైలి మీద, సామాజిక సాంస్కృతిక రంగాల మీద అపారమైన ప్రభావం చూపుతోంది. సినిమా మన జీవితంలో ఓ భాగం. సినిమా ఓ కళ, ఓ శాస్త్రం. (అయినా) మన రాష్ట్రంలో సినిమా నిరక్షరాస్యత (ఫిల్మ్ ఇల్లిటరసీ) ఎక్కువ. అందుకనే తెలుగులో విభిన్నచిత్రాలకు ఆదరణ కరువైపోయింది. బెంగాల్, కేరళ, కర్ణాటకలలో సినిమా ముఖచిత్రం మనకన్న భిన్నంగా మెరుగ్గా ఉంది.

చక్రపాణి చిత్రాలలో సన్నివేశం నుండే సున్నితమైన హాస్యం వెలువడి గిలిగింతలు పెట్టేది. సునిశితమైన వ్యంగ్యం చురుక్కుమనేది. చక్రపాణి నిజజీవితం గమనిస్తే విషాదం గుండెలనిండా నింపుకుని, హాస్యాన్ని, వ్యంగ్యాన్ని ఎలా పండించగలిగారా అని అబ్బురపడతాం! కోడె వయసులో 24వ ఏట క్షయవ్యాధి సోకింది. మదనపల్లిలో ఆపరేషన్ చేసి ఒక ఊపిరితిత్తి తీసివేశారు. శానిటోరియంలో ఉన్న 3 నెలలలో పక్క పడకమీద ఉన్న ఓ బెంగాలి బాబుతో పరిచయం పెంచుకుని బెంగాలి భాష నేర్చుకున్నారు ఆ భాషా పరిజ్ఞానంతోనే బెంగాలి శరత్ చంద్ర ఛటర్జీని తెలుగు శరత్‌ను చేశారు. తన 33వ ఏట భార్య రంగమ్మ అకాల మరణం. భువిమీద ఉంది తనూ, ఇద్దరు కొడుకులూ. పెద్ద కొడుకు తిరుపతి రాయుడుకు భార్యా వియోగం. అప్పటికి తిరుపతి రాయుడుకు ఇద్దరు బిడ్డలు. మళ్లీ పెళ్లి చేశారు రాయుడుకు చక్రపాణి. కొంతకాలం తర్వాత రాయుడూ పోయారు. ఇలా కుటుంబంలో ముగ్గురు తన కళ్ల ఎదుట రాలిపోయినా ఆ విషాద ఛాయలు తన చిత్రాల మీద పడకుండా, అమృతం వర్షించిన స్థితప్రజ్ఞుడు చక్రపాణి.
6 మే 1971 ఉదయం విజయా చిత్రాలకు పదసంపదను చేకూర్చిన పింగళి కాన్సర్‌తో, కాన్సర్ కన్న భయంకరమైన పేదరికంతో నిరుపేదగా మరణించారు. ఆ మరునాడు ‘ఆంధ్రపత్రిక’లో పింగళి అస్తమయ వార్తను ప్రచురిస్తూ పైన చక్రపాణి ఫోటో ముద్రించారు. భరాగో, యమ్వీయల్ లబలబలాడుతూ పత్రికాధిపతి శివలెంక శంభుప్రసాద్‌కు ఫోన్ చేశారు – జరిగిన దారుణాన్ని వేలెత్తి చూపుతూ. శంభుప్రసాద్ నొచ్చుకుని ‘క్షమాపణలతో సవరణ రేపటి సంచికలో వేస్తాం’ అన్నారు. ఆ వేడిలోనే చక్రపాణికి కూడా ఫోన్ చేసి ‘పింగళి మరణవార్తపై మీ ఫోటో వేశారు’ అని తెలియచేశారు. చక్రపాణి తాపీగా ‘మరంతేగా, ఆడు పోతే ఈడు పోయినట్టేగా’ అన్నారు. దటీజ్ చక్రపాణి. చక్రపాణి చివరి చిత్రం శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. చిత్రం టైటిల్‌లో సంచాలకులు చక్రపాణి, సహాయకుడు బాపు అని వస్తాయి. చిత్రం అమరజీవి చక్రపాణికి అంకితం ఇవ్వబడింది. విజయావారి చిత్రాలలో కెవి రెడ్డి తీసినవి కాక, మిగిలిన వాటికి ముళ్లపూడి అన్నట్లు ‘ఇన్ డైరెక్టర్’ చక్రపాణి.

ఒకనాడు సినిమాలో పాత్రలు మాట్లాడేవి. నేడు పాత్రలోని నటి లేదా నటుడు ముఖ్యంగా హీరో మాట్లాడుతున్నాడు. డ్రెస్ కోడ్‌లో వచ్చిన మార్పు డైలాగుల్లోనూ వచ్చింది. హీరో ఇమేజికి సరితూగే డైలాగులు కడుతున్నారు. కుడుతున్నారు. ‘డిజైనర్ డైలాగ్స్’ నేటి ఫ్యాషన్. ‘వెధవ డైలాగుదేముంది? సరిపోలేదనుకుంటే ఊడదీసి, సరిచేసి మళ్లీ కుడతాం. సినిమా రచయితలం సాహిత్య దర్జీలం కదా!’ అనలేదా ఆంధ్రవిశారద తాపీ ధర్మారావు తాతాజీ ఏనాడో!

నేటి సినిమాలలోనూ ఇంగ్లీషు వినపడుతోంది, అవసరం లేకపోయినా. అది మోడర్న్ ట్రెండ్ అట. ఈ సందర్భంలో మరుధూరి రాజా అనుభవం వినవలసిందే. ‘ఈ మధ్య నేను రాసిన ఒక సినిమాలో ఓ సీను ఇలా మొదలవుతుంది. ‘హాయ్! హౌ ఆర్ యు’ అని హీరో అంటే ‘ఐ జస్ట్ కేమ్’ అంటుంది హీరోయిన్. ‘షల్ వి గో’ అంటాడు హీరో. అప్పుడే సరదాగా దర్శకునితో చెప్పా, నేను ఇంగ్లీషు సినిమాకు అక్కడక్కడా తెలుగు డైలాగులు రాస్తున్నాను అని.’ లెస్స పలికితిరి మరుధూరి రాజా. వచ్చీరాని ఇంగ్లీషు మాటల్లో తెలుగు చిలకరించిన డైలాగులతో హాస్యాన్ని పండించారు డైరెక్టర్ శివ నాగేశ్వరరావు. మనీ చిత్రంలో కోట శ్రీనివాసరావు ‘సో మెనీ పీపుల్ టాక్ నీతి, నీతి, నీతి. లాస్ట్ వైఫ్ డిమాండెడ్ దశరధ. రామ గో టు ఫారస్ట్. రామ నాట్ గివెన్ రాజ్యం. గంతెందుకయ్యా…’ కలిపి కొట్టరా కావేటి రంగా లాంటి కోట మాటలు వింటూ జనం నవ్వుకున్నారు. ఇలా సింటాక్స్, వాక్య నిర్మాణం గతి తప్పి మాట్లాడటాన్ని ‘మంకీయింగ్ ఇంగ్లీషు’ అన్నారు యం. చలపతిరావు. కోతిపనులు ఎప్పుడూ నవ్వు పుట్టిస్తాయి.

నా గుండె గుడిలో ఇరువురు దేవతామూర్తులు. యన్‌టిఆర్, ఎయన్ఆర్. 1989లో ప్రత్యగాత్మ నాదెళ్ల (నందగోపాల్ కుమారుడు) సంపాదకత్వాన మా తెలుగు భారతి ప్రచురించిన ‘విజేత’ యన్‌టిఆర్ జీవిత చిత్ర కథ, పిక్టోరియల్ బయోగ్రఫీ ఓ అద్భుత ప్రయోగం. యన్‌టిఆర్ జీవితం నుండి నట జీవితం నుండి ఎంపికయిన అరుదయిన ఫోటోలను సేకరించి 24 ఏళ్ల క్రితమే 3 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో ప్రచురణను అద్భుతంగా తీర్చిదిద్ది నందమూరి బసవతారకం గారికి అంకితం ఇచ్చాం. రవీంద్రభారతి ఆవిష్కరణ సభలో యన్‌టిఆర్ మాట్లాడుతూ ’40 ఏళ్లు జీవితం పంచుకున్న నా అర్ధాంగి జ్ఞాపకార్థం నేను ఏమీ చేయలేక పోయాను. నా పరమ సోదరుడు నందగోపాల్ విజేతను ఆమెకు అంకితం ఇచ్చారు. వారినీ, వారి బిడ్డలనూ మా కుటుంబం ఏనాడూ మరువదు’ అన్నారు. అది గత చరిత్ర.

నందగోపాల్ ఓ సారి మీటింగ్‌లో ‘మనమంతా సినిమా పారిశుధ్య కార్మికులం. తెర మాలిన్యాన్ని శుద్ధి చేస్తున్నాం కనుక’ అనే జాన్ ట్రెవిలియన్ మాట ‘ఠ్ఛీ ్చట్ఛ ఞ్చజీఛీ జౌట ఛ్ఛజీnజ ఛీజీట్టడ’ ఉదహరించి నవ్వించారు. ఇలా నవ్వుతూ, నవ్వించే నందగోపాల్ ఎనిమిది ఏళ్ల కంచి గరుడ సేవ తర్వాత 1985లో సెన్సార్ పదవికి రాజీనామా చేసి బయటపడ్డారు. 1990లో హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ సభ్యునిగా ఆయనను నియమించింది సిబియఫ్‌సి – కొత్తగా హైదరాబాద్‌లో ప్రాంతీయ బోర్డ్ ఏర్పడటంతో సీనియర్ సభ్యునిగా నందగోపాల్ సేవలు ఉపయోగపడతాయని భావించి. ఒకటిన్నర ఏళ్లు పళ్ల బిగువున పదవిలో వుండి ఆ వెంటనే దానికీ రాజీనామా చేశారు. ఇలా సెన్సార్ పదవికి రెండుసార్లు రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ‘ఒకే ఒక్కడు’ కనపడుతున్నాడు. అతను నందగోపాల్.
– డాక్టర్ జయదేవ్ (ముందుమాట నుంచి)

 

 

1973 జూలై 21న చెన్నయ్‌లోని విక్రమ్ స్టూడియోలో ‘సంసారం- సాగరం’ షూటింగ్ ప్రారంభమైంది. ఆ రోజు రెండు, మూడు షాట్స్ తీయడం తప్ప ఎక్కువ వర్క్ జరగలేదు. షూటింగ్ మొదలైన రెండో రోజే సినిమాలోని పతాక సన్నివేశాలను తీయాల్సి వచ్చింది.
డైలాగులు మార్చనన్న దాసరి

సెట్‌లో దూరంగా కూర్చున్న ఎస్వీ రంగారావుకి డైలాగ్ చెప్పి రమ్మని అసోసియేట్ డైరెక్టర్ అంజిబాబుని పంపించారు దాసరి. డైలాగు చెప్పగానే ఓసారి సీన్ పేపర్ చూసి “ఆ.. ఇదంతా ఎందుకు? ఆమె గురించి ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలు” అని అయిదు లైన్ల డైలాగులో రెండు లైన్లు తీసేశారు రంగారావు. ఆ విషయం దాసరికి చెప్పారు అంజిబాబు. ఆ రెండు లైన్లు తీసేస్తే పతాక సన్నివేశం దెబ్బతినే అవకాశం ఉంది. రంగారావు దగ్గరకు వెళ్లి “ఆ రెండు లైన్లు తీసేస్తే నష్టం జరుగుతుంది సార్” అని కన్విన్స్ చేయబోయారు దాసరి. ఆయన వినిపించుకోకుండా ఆ రెండు లైన్లు తీసెయ్యాల్సిందేనని గట్టిగా చెప్పారు. దాసరికి అది రెండో సినిమా. రంగారావు సీనియర్ ఆర్టిస్టు. అయినా సరే వెనుకంజ వేయకుండా “ఈ సీన్ గురించి.. నాకు తెలిసినంతగా మీకు తెలీదు సార్” అన్నారు దాసరి. ఆ మాటతో రంగారావుకి కోపం వచ్చి “నాకు తెలియదంటావా? అయినా రచయిత దర్శకుడైతే ఇదే ఇబ్బంది. చేతిలో కలం ఉంది కదాని రాసేస్తారు. అవసరమా ఇదంతా?” అని గట్టిగా ప్రశ్నించారు. సెట్‌లో అంతా నిశ్శబ్దం. మిగిలిన ఆర్టిస్టులు వీళ్లిద్దరి వంకే చూస్తున్నారు. “ఈ సీన్ ఎలా ఉంటే బాగుంటుందో నేను, నిర్మాత, నా అసోసియేట్స్, కెమెరామాన్ అందరం ఒకటికి పదిసార్లు చర్చించుకుని, ఓకే అనుకున్న తర్వాతే ఆ డైలాగులు రాశాను. నిజంగా అవసరమైన డైలాగ్ అది. అనవసరపు డైలాగ్ అయితే మీరు చెప్పగానే తీసేసేవాడ్ని” అన్నారు దాసరి వెరవకుండా. దాంతో ఆగ్రహం పట్టలేక చేతిలో ఉన్న కర్రను విసిరికొట్టారు రంగారావు. తల మీదున్న టర్బన్‌ని నేలమీద పడేసి, విసురుగా సెట్‌లోంచి బయటకు వెళ్లి పోయారు. ఇదంతా చూస్తున్న నిర్మాత రాఘవకి భయం పట్టుకుంది. రంగారావు అలా వెళ్లిపోతే తన షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోతుందేమోనని కంగారు మొదలైంది. రాఘవ టెన్షన్ తట్టుకోలేక “ఏమిటయ్యా నారాయణరావు.. రాకరాక ఆయన షూటింగ్‌కి వస్తే ఇలా చేశావు? సరే.. నేను వెళ్లి ఆయన్ని తీసుకువస్తాను కానీ మిగిలిన షాట్స్ సంగతి చూడు” అని చెప్పేసి తనూ బయటికి పరిగెత్తారు. అప్పటికే రంగారావు కారు ఎక్కడం, రయ్‌మని వేగంగా పోనివ్వడం జరిగిపోయాయి. రాఘవ కారులో ఆయన్ని అనుసరించారు. కోడంబాకం బ్రిడ్జి దిగి రైట్‌కు టర్న్ తీసుకుంది రంగారావు కారు. అప్పటికి కానీ ఆయన కోపం చల్లారలేదు. ఏమనుకున్నారో ఏమో కారు మళ్లీ వెనక్కి తిప్పి విక్రమ్ స్టూడియోకి చేరుకున్నారు. సెట్‌లోకి అడుగుపెట్టి “స్టిక్ ఎక్కడ .. తలపాగా పట్టుకురా” అని అరిచి అంజిబాబుని పిలిచి “ఎన్ని పేజీల సీన్ తీస్తారో మీ దర్శకుడ్ని తీసుకోమను. నటించడానికి సత్తాలేని వాళ్లు భయపడాలి. కానీ నాకేంటి? ” అన్నారు. దాసరి వెంటనే “థాంక్యూ సార్” అన్నారు. ఆ సీన్ చిత్రీకరణ పూర్తయింది. అందులో అద్భుతంగా నటించారు రంగారావు.

మీరు కుశలమేనా?
‘బలిపీఠం’లో పాటలన్నీ ఆణిముత్యాలే. ఇందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ‘కుశలమా.. మీరు కుశలమేనా’ పాట వెనుక చిన్న కథ ఉంది. ఈ సినిమాలో శోభన్‌బాబు, శారద మీద ఒక డ్యూయెట్ తీయాలి. కథాపరంగా శోభన్‌బాబు పాత్ర ఆశయాలు, ఆదర్శాలు కలిగినది. అందుకే రొటీన్ యుగళగీతం ఆయన మీద తీయకూడదు. పసుపు కుంకుమలతో చనిపోవాలనుకునే బాల్య వితంతువు పాత్ర శారదది. వీళ్లిద్దరికీ పెళ్లయిన నేపథ్యంలో వచ్చే యుగళగీతం అది. దాసరి, దేవులపల్లి, సంగీత దర్శకుడు చక్రవర్తి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూర్చున్నారు. దేవులపల్లికి సన్నివేశం వివరించారు దాసరి. నోటి క్యాన్సర్ కారణంగా దేవులపల్లికి అప్పటికే మాట పోయింది. అందుకే తనతోపాటు ఎప్పుడూ ఓ నోట్‌బుక్ ఉంచుకునేవారాయన. కాలం గడుస్తోంది కానీ పల్లవి పుట్టలేదు. పాట పలకలేదు. ఇంతలో కృష్ణశాస్త్రిని కలవడానికి ఎవరో వచ్చారు. “మీరు మాట్లాడండి సార్” అని దాసరి బయటకు వచ్చేశారు. కృష్ణశాస్త్రి వచ్చిన వాళ్లని చిరునవ్వుతో పలకరించి ‘కుశలమా’ అని నోట్‌బుక్ మీద రాశారు. వాళ్లలో ఒక వ్యక్తి తలూపి ‘మీరు కుశలమేనా?’ అని రాశారు. కొంతసేపటికి వచ్చిన వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత చేతిలో ఉన్న నోట్ బుక్‌ని కిందపెట్టి బాత్‌రూంలోకి వెళ్లారు కృష్ణశాస్త్రి. ఇంతలో చక్రవర్తి తిరిగి వచ్చి అదే పల్లవి అనుకుని బాణీకట్టేపనిలో నిమగ్నమయ్యారు. కాసేపటికి దాసరి వచ్చి “ఏం చక్రవర్తి.. పల్లవి వచ్చిందా” అని అడిగారు. “ఇదిగోండి.. రెండు లైన్లు రాశారు. కుశలమా మీరు కుశలమేనా” అంటూ పాడి వినిపించారు చక్రవర్తి. దాసరికి ట్యూన్, లిరిక్ నచ్చాయి. ఇంతలో కృష్ణశాస్త్రి వచ్చి “ఏం చక్రవర్తి నా బదులు నువ్వే పాట రాసేశావా?” అని నోట్‌బుక్ మీద రాశారు. చక్రవర్తి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టేసి “అంతలేదు సార్. మీరు రాసిన వాక్యాలకే ట్యూన్ కట్టాను” అని రాశారు. “నేను పల్లవి రాశానా?” అని ఆశ్చర్యపోయారు కృష్ణశాస్త్రి. నోట్‌బుక్‌లో ఆయన రాసిన రెండు లైన్లు చూపించారు చక్రవర్తి. “నీ బొంద.. ఇది పల్లవి కాదు. వచ్చిన వాళ్లని పలకరించి అలా రాశాను” అన్నారు కృష్ణశాస్త్రి. “లేదు గురువుగారు.. ఇది బాగుంది. ఇలాగే కంటిన్యూ చేయండి” అన్నారు దాసరి. అలా “కుశలమా మీరు కుశలమేనా?” పాట పుట్టింది.

అక్కినేనికి స్క్రిప్టు ఇవ్వాలి..
అక్కినేనికి ముందే బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఆయన ఇంటి దగ్గర చదువుకుని రిహార్సల్స్ చేసేవారు. షాట్ కోసం బాగా ప్రిపేర్ అయి సెట్‌కి రావడం ఆయన పద్ధతి. అయితే దాసరి స్కూల్ అది కాదు. సెట్‌లోకి వచ్చిన తర్వాతే డైలాగులు రాయడం ఆయనకు అలవాటు. ఆయన పద్ధతిలోనే రెండు రోజుల షూటింగ్ జరిగింది. అయితే మూడో రోజు నుంచి అక్కినేని అసోసియేట్ డైరెక్టర్ రమణబాబుని పక్కకు పిలిచి డైలాగుల గురించి అడగటం ప్రారంభించారు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలని చూసినా అక్కినేని వదల్లేదు. సెట్‌లో రమణబాబు కనిపిస్తేచాలు స్క్రిప్ట్ అడిగేవారు అక్కినేని. ఈ విషయం దాసరికి చెబితే ఆయనెలా రియాక్ట్ అవుతారోననే భయం ఒకపక్క, స్క్రిప్ట్ ఇవ్వకపోతే అక్కినేని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే ఆందోళన మరోపక్క ఉండటంతో ఎటూ చెప్పలేక కొన్ని రోజులు సతమతమయ్యారు రమణబాబు. ఆ రోజు దాసరి సెట్‌లో ఓ మూల కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్లి సీన్ గురించి మరోసారి గుర్తు చేశారు రమణబాబు. “ఏమిటయ్యా.. సీన్ పేపర్ అంటూ వెంటపడుతున్నావు. ఎవరన్నా అడిగారా?” అనడిగారు దాసరి. “లేదు సార్” అన్నారు రమణబాబు. “డైలాగుల కోసం నువ్వు టెన్షన్ పడనవసరం లేదు. సెట్‌లోనే నేను డైలాగులు రాస్తానని నిర్మాతలందరికీ తెలుసు. నాగేశ్వరరావుగారికీ తెలుసు. నిన్నెవరూ ఇబ్బంది పెట్టరు” అని సెట్‌లో అందరికీ వినిపించేలా చెప్పారు దాసరి. కాసేపటికి అక్కడికి చేరుకున్న అక్కినేని “నేను డైలాగులు అడుగుతున్న విషయం మీ గురువుగారికి చెప్పావా?” అనడిగారు. “చెప్పలేదు సార్” అన్నారు రమణబాబు. “నేను ఏమో అనుకున్నాను కానీ మీ గురువు చాలా మేధావయ్యా.. నీకు ఇప్పుడు చెప్పిన మాటలు నాకు కూడా అర్థం కావాలనే ఆయనంత గట్టిగా చెప్పాడు” అని అన్నారు నాగేశ్వరరావు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో, సినిమా and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.