నిశ్శబ్ద సేనాని అరుణారాయ్! -జాన్‌సన్ చోరగుడి

 

కారణాలు ఎవరికి ఏమితోచినా, ఒకందుకు మాత్రం మన రాష్ట్రాన్ని మనం ‘షోకేసింగ్’ చేసుకోవాల్సి ఉంది. దీనర్థం లేనిది ఉందని బడాయిలు పోవడం కాదు.ఉన్నది – ఉందని అంగీకరించడం. అలా చేయవల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇంకా ఎక్కడైనా ఏమూలనైనా ఊగిసలాంటిది ఏమైనా ఉంటే, దాన్ని విదిలించుకుని మరీ ముందుకు రావాల్సి ఉంటుంది. ఎలా చూసినా అది మంచిదేకదా! అరుణారాయ్ మేడమ్‌కు మన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) గౌరవ డాక్టరేట్ ఇవ్వడం, తెలుగు – జ్ఞానసమాజం మొత్తం తన భుజాలను తాను తట్టుకునే సందర్భమవుతుంది! ఎవరిని ఏరీతిన గౌరవించాలి, అనేది పూర్తిగా ఒక యూనివర్సిటీ గవర్నింగ్ బాడీకి సంబంధించిన విషయం కావడం వాస్తవమే. కానీ ఆ యూనివర్సిటీ ఉన్న భౌగోళిక ప్రాంతం కూడా దాని నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఎలాగంటే, అది ఏ క్యాంపస్ అయినా అది ఉన్న ప్రాంత ప్రధాన సమాజానికి ఒక ‘మినియేచర్’గా ఉంటుంది, ప్రవర్తిస్తుంది. కనుక సంస్థలు కూడా తాము తీసుకోబోయే నిర్ణయాలకు స్థానిక పౌర సమాజ ఆమోదాన్ని – ‘ఉండి ఉండవచ్చు’ (డీమ్డ్ టు బి)గా భావిస్తాయి. అటువంటి ఒక వెసులుబాటును ‘హెచ్‌సీయూ’కి ఇవ్వడం ద్వారా తెలుగు పౌర సమాజం అభినందనీయమైంది.

అరుణారాయ్ 1946, జూన్ 26న జన్మించారు. ఐఏఎస్ అధికారిగా 1968-74 మధ్య పనిచేసి ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేసి కొంతకాలం భర్త రాయ్ నడుపుతున్న సేవాసంస్థలో పనిచేశారు. దాన్లోనుంచి బయటకువచ్చి శంకర్ అనే థియేటర్ కార్యకర్తతో కలిసి రాజస్థాన్‌లో గ్రామీణ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే క్రమంలో – మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ సంస్థను స్థాపించారు. ఆ వేదిక నుంచి ఆమె క్రియాశీలత, ప్రజాజీవనానికి సంబంధించిన పలు మౌలిక అంశాలను ‘అడ్రెస్’ చేయవలసిన దిశలోకి మళ్ళింది. సుదీర్ఘమైన కసరత్తు అనంతరం సమాచార హక్కు చట్టాన్ని 2005లో యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించేలా ఆమె కృషిచేశారు.

ఆర్థిక మంత్రిగా తొలుత సరళీకరణను సూత్రప్రాయంగా ప్రవేశపెట్టి, ఆ తర్వాత ప్రధానమంత్రిగా దానినే అమలుచేయవలసిన బాధ్యతలు డా. మన్మోహన్‌సింగ్ చేపట్టవలసి వచ్చింది. మారిన భారత రాజకీయ ముఖచిత్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఒక అనివార్యత, దాంతో ప్రధాని కార్యాలయానికి సమాంతరంగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నేషనల్ ఎడ్వయిజరీ కౌన్సిల్ (ఎన్.ఎ.సి.) చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇదంతా జరిగింది 2004లోనే. అదే ఏడాది అరుణారాయ్‌ని దాన్లోకి సభ్యత్వమిచ్చి ప్రభుత్వం తీసుకుంది. ఆమె అప్పటికే తన వ్యక్తిగతస్థాయిలో చేస్తున్న ‘సామాజిక నాయకత్వ’ కృషికి 2000 సంవత్సరంలో రామన్‌మెగసేసే అవార్డు అందుకున్నారు. ఇక్కడ మన గమనంలోకి అంత తేలిగ్గా రాని ఒక కీలకమైన మర్మం ఏమంటే – ప్రభుత్వాలు తమను తాము సరళీకరించుకోవడానికి దోహదపడే చోదకశక్తుల్ని తామే తమవెంట ఉంచుకోవడం! అరుణారాయ్ నియామకం అటువంటిదే. అది మరొకరకమైన అనివార్యత. 2005లో సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 2006లో ఆమె ఎన్.ఎ.సి.తో విభేదించి దాన్లోనుంచి బయటకు వచ్చారు. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని సక్రమంగా అమలుచేయడం లేదనేది ఫిర్యాదు. 2010లో మళ్ళీ తిరిగి ఎన్.ఎ.సి.లోకి వచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు వేతనం పెంచాలనేది ఆమె మరొక డిమాండ్. కర్ణాటక హైకోర్టు ఆ మేరకు తీర్పు కూడా ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం దానిమీద స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. కానీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. దీనిపై ప్రభుత్వ తీరును అరుణారాయ్ నిరసించారు. నిరుపేద కూలీలకు కనీస వేతనాలు చెల్లించకుండా మీరు చెబుతున్న ‘కలుపుగోలు వృద్ధి’ (ఇన్‌క్లూజివ్ గ్రోత్) ఏమిటి? అని ఆమె యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఉపాధి హామీ పథకం మీద అరుణారాయ్ అభిప్రాయం ఇలా ఉంటే, 2004-2009 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయరంగం మీద ‘రోడ్ మ్యాప్’ ఇచ్చిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ జయతీఘోష్ దృష్టికోణం మరోరకంగా ఉంది. ‘పథకంలో అవినీతిగురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు, ఒకవేళ అటువంటిది ఏదైనా ఉందనుకున్నా, అటువంటి కంతల నుంచి జారే సొమ్ము తిరిగి అదే మార్కెట్లో చలామణి అవుతుందికదా?’ అని ఆమె ప్రశ్నించారు! అరుణారాయ్‌కి ‘హెచ్‌సీయూ’ గౌరవ డాక్టరేట్ ఇస్తున్న సందర్భంలో గుర్తుచేసుకోవలసిన మరో గొప్ప వ్యక్తి – శ్రీమతి శాంతసిన్హా. బాల కార్మికుల విద్య కోసం శ్రమిస్తున్న ఆమె ప్రస్తావన తేవడం, అరుణారాయ్‌తో చిన్న పోలికకోసం. అరుణారాయ్ మెగసేసే అవార్డు తీసుకుని ఆ తర్వాత ‘హెచ్‌సీయూ’ డాక్టరేట్ తీసుకుంటూ ఉంటే, మన తెలుగు మహిళ శాంతసిన్హా ‘హెచ్‌సీయూ’లో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ మెగసేసే అవార్డు తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రస్తావించుకున్న ప్రధానమైన పేర్లు అన్నింటికీ ఉన్న సారూపత్య ఏమిటి? అందరూ మహిళలు కావడమే! ఇంచుమించు అందరూ మన రాష్ట్రంతో ‘కనెక్ట్’ కావడమే! వీరంతా నిశబ్ధ సేనానులు. కొంతమందిలా ‘కల్ట్ వీరులు’ కాదు. చిత్రం – కొందరు ఎప్పుడూ అలాగే క్రియాశీలంగా ఉంటారో లేక చానల్ కెమేరాలు పనిచేస్తున్నప్పుడే అలా ఉంటారో తెలీదు. ఈ మధ్య జంతర్ మంతర్ వద్ద కనిపిస్తున్న అటువంటి వారికి భిన్నమైన సేనానులు వీరు! అరుణారాయ్‌కి జరుగుతున్న ఈ గౌరవం మనకి మనం చేసుకుంటున్న పౌర సన్మానం అవుతుంది.
జాన్‌సన్ చోరగుడి
(నేడు అరుణారాయ్‌కి హెచ్‌సీయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న సందర్భంగా)

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.