మా గిర్మాజీపేట ఎప్పటికీ మాజీ కాదు-మాడ భూషి శ్రీధర్-ఆంధ్ర జ్యోతి

 

వార్తల కోసం వీధులన్నీ కలయ తిరిగిన రోజుల నుంచి అదే వీధుల్లో వీఐపీగా అధికారిక వాహనాల్లో తిరిగే స్థాయికి ఎదిగిన వ్యక్తి మాడభూషి శ్రీధర్. పాత్రికేయుడిగా, నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకుడిగా సుపరిచితుడైన ఆయన ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. యువకుడిగానే ‘జనధర్మ’, ‘వరంగల్ వాణి’ పత్రికలు నిర్వహించి జనంలో ఒకరిగా పేరు సంపాదించుకున్న ఆయన సొంతూరు గిర్మాజీపేట విశేషాలే ఈ వారం మా ఊరు.

వరంగల్లు పట్టణానికి ఆనుకుని ఉండే గిర్మాజీపేట మా ఊరు. బొడ్రాయివాడలో ఉండేది మా ఇల్లు. బొడ్రాయి ఎక్కడుందో తెలియదు కానీ, ఆ వాడను బొడ్రాయి వాడే అనేవారు. అసలైతే మా ఊరు నెల్లికుదురు అని నాన్న చెప్పేవారు. కాకపోతే మేము ఆ ఊరికి పోయింది లేదు. అక్కడున్నదీ లేదు. నాన్నకు, ఆయన నలుగురు అన్నదమ్ములకు మాత్రం ఆ ఊరంటే ప్రాణం. నాకు మాత్రం మండి బజార్, లక్ష్మిటాకీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, రామా విలాస్(ఇప్పుడు లేదు), ఆకారపు వారి గుడి, శ్రీకృష్ణకాలనీ, అండర్ బ్రిడ్జి, స్టేషన్, మిల్స్‌కాలనీ…ఇవన్నీ కలిసిందే మా ఊరు. హన్మకొండ మా పక్కనే ఉన్నా అది వేరే ఊరనిపించేది.

మాది అయ్యగార్ల ఇల్లనేవారు
నేను మాసూంగల్లీలో ఉన్న మాసూం అలీ హైస్కూల్‌లో చదువుకున్నా. ఇంటికి దగ్గరలో ఉందని నాన్న మమ్మల్నందరినీ అక్కడే చేర్పించారు. మాసూం అలీ అనే పెద్దమనిషి తన ఇంటిని బడికి కిరాయికి ఇచ్చినప్పుడు తన పేరు పెట్టాలని షరతు పెట్టడం వల్ల ఆ పేరు వచ్చిందట. ఇప్పుడక్కడ ఆ బడి లేదనుకోండి! స్కూల్లో ఒక్కో బెంచీ మీద అయిదారుగురం కూర్చునేవాళ్లం. నోట్స్ ఏ విధంగా రాసుకోగలిగామో ఏమో! పుస్తకాల సంచీ బెంచీ కిందనే పెట్టుకునేవాళ్లం. అందులో చదువుకున్న చదువులే నన్ను ఇప్పటికీ నడిపిస్తున్నాయంటే..అందుబాటులో ఏదో ఓ బడి ఉండటం ఎంత ముఖ్యమో అనిపిస్తుంటుంది.
బొడ్రాయి వాడలో మాది అయిదారు గదుల ఇల్లు. ఆ వాడలో ఉండే వారిని కులాల పేర్లతోనే పిలిచేవారు. మా ఇల్లు అయ్యగార్ల ఇల్లు అనీ, పక్కన ఉన్నది కటికవారిల్లనీ, ఇంకొంచెం ముందుకుపోతే బెస్తవారి ఇల్లనీ పిలిచేవారు. కాని ఎక్కడా కులభేదం ఉండేది కాదు. స్నేహమే అన్ని కులాలను కలిపి ఉంచింది. ఇప్పుడైతే ఆ ఉమ్మడి కుటుంబాలూ లేవు, వాడల్లో ఆ స్నేహమూ లేదు. ఆ ఇండ్లు ఇప్పటికీ అక్కడ ఆ విధంగానే ఉన్నాయి. ఇటీవలే మాకు విద్య నేర్పిన గురువు ఎనభై నాలుగేళ్ల సాంబశివరావును అక్కడే కలిసి సన్మానించుకున్నాను.

కొట్టులో పొట్లం కడితేనే…
మా నాన్నావాళ్లు అయిదుగురు అన్నదమ్ములని చెప్పా కదా. నాన్న ఎం.ఎస్.ఆచార్య రెండో వాడు. జనధర్మ పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర సమరయోధుడు. పెదనాన్న సంగీత విద్వాంసుడు. సంగీత పాఠాలు చెప్పేవాడు. కొన్నాళ్లు పెదనాన్న, ఆ తరువాత నాన్న.. ఐదుగురు అన్నదమ్ముల కుటుంబాలనూ నడుపుతుండేవారు. నా చిన్నప్పుడు నాన్న ఆంధ్రపత్రిక ఏజెంటు. ఆ ఏజన్సీయే మా కుటుంబాన్ని నడిపేది. పేపర్ బిల్లులు వసూలైతే వచ్చే డబ్బులో మిగిలే కమిషన్ సమకూరితేనే ఆ రోజు వంటకు కావలసిన వస్తువులను కొనుక్కోవడం. ఆ రోజులు నాకింకా గుర్తే. పప్పు, ఉప్పు, చింతపండు, కారం, కూరలు, బియ్యం సహా అన్నీ డబ్బు చేతికి అందాకే కొనేవాళ్లం. వాటిని మా ఇంటి పక్కన ఉండే ఆగయ్య కిరాణా దుకాణంలో చిన్న చిన్న పొట్లాలు కట్టి ఇచ్చేవారు. ఆ తరువాతే ఇంట్లో వంట మొదలయ్యేది. మొన్న వరంగల్ వేంకటేశ్వరాలయంలో నా క్లాస్‌మేట్స్ అందరితో ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన ఆగయ్య కొడుకు నాగయ్యను చూసినప్పుడు ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి.

బాల విద్యార్థి సంఘం
చిన్నతనంలో నేను, అన్నయ్య కలిసి ‘బాల విద్యార్థి సంఘం’ స్థాపించాం. అందులో నా క్లాస్‌మేట్సే ఎక్కువ మంది సభ్యులు. దానికి వార్షిక ఉత్సవాలు జరిపేవాళ్లం. నాటకాలు వేసేవాళ్లం. మా చిన్నమ్మలు కరుణమ్మ, జానకమ్మలు మేకప్, దర్శకత్వం నిర్వహించేవారు. నేను పాటలు పాడటం, హరికథలు చెప్పడం, సీతాకల్యాణంలో రావణ పాత్ర పోషించడం చేసేవాణ్ణి. అవన్నీ మరిచిపోలేని జ్ఞాపకాలు.

ఇల్లు మారి…ఇరుకై
జయప్రకాష్ నారాయణ్ రోడ్(ఇప్పుడు జేపీఎన్ రోడ్, ఒకప్పుడు ముఖరంజా రోడ్)లో బాలాజీ ప్రెస్ పెట్టినప్పుడు మేము బొడ్రాయి వాడ నుంచి బేతి నర్సయ్యగారి కూతురు ఇంటికి కిరాయికి వచ్చాం. 1970 తొలి నాళ్లలో ప్రెస్ పెట్టాం. ముందు ప్రెస్ ఉంటే, వెనక మూడు గదులు, వరండాతో ఉన్న ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములం, చెల్లెలు, కొన్నాళ్లు మామయ్య కుటుంబం కూడా ఉన్నారు. ఇప్పుడు తలుచుకుంటే అంత చిన్న ఇంట్లో ఎలా ఉన్నామా అనిపిస్తుంది. ఆ ప్రెస్‌లోనే నేను కంపోజింగ్, బైండింగ్, పేపర్ ఇంపోజింగ్ నేర్చుకున్నా. రోజుకు పది గంటలకు పైగా ప్రింటింగ్ చేసిన రోజులెన్నో! ఇందిరాగాంధీ హత్య, రామారావు ప్రభుత్వం కూల్చివేత రోజుల్లో ప్రత్యేక సంచిక రూపొందించి నేను ట్రెడిల్ ప్రెస్ మీద ప్రింట్ చేస్తూ ఉండటం, ఆర్డర్ల మీద ఆర్డర్లు రావటం…ఎంత బిజీగా గడిచేవో అలాంటి సందర్భాలు.

ఆ ప్రెస్ ఉన్న ఇల్లు ఇంకా అలాగే ఉంది. అక్కడిప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్ నడుస్తోంది. వరంగల్‌లో’ జనధర్మ’ ఒక చెరగని గుర్తు అయితే, ఆ వాడలో ఆ ప్రెస్ ఒక మైలురాయి. తెలుగు మాట్లాడటం, తెలుగు పత్రిక చదవడమే నేరం అని నిజాం నవాబు పరిగణించిన రోజుల్లో ఆంధ్ర పత్రికకు విలేకరిగా ఉండి వార్తలు రాయడం, ఏజెంటుగా ఉండి పత్రికలు అమ్మడం నాన్న చేసిన సాహసం. కేవలం తెలుగు పత్రికలు అమ్మినందుకు ఇంతెజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ ముందు నిజాం పోలీసులు నాన్నను కిందపడేసి కొట్టిన సంఘటన ఆయనే స్వయంగా నాకు చెప్పారు. వరంగల్‌లో ఏ పత్రికా లేని రోజు ‘వరంగల్ వాణి’ దినపత్రికగా వచ్చింది. ఇప్పుడు అన్ని పత్రికలు వరంగల్ నుంచి వస్తున్నా, వరంగల్ వాణి మాత్రం ఆగిపోయింది.

‘జనధర్మ’ ప్రత్యేకం….
వరంగల్ కోసం నాన్న పడిన తపన నేనెప్పుడూ మరువలేను. ‘జనధర్మ’ పత్రిక వరంగల్ జనజీవనంలో కలిసిపోయిన రోజులు నాకు బాగా తెలుసు. నాన్నకు ‘జనధర్మ’ ఆచారిగారనీ, ‘జనధర్మ’ అయ్యగారనీ పేరు. నన్ను కూడా ప్రెస్సులో, బయటా ‘జనధర్మ’ చిన్నయ్యగారనీ, ఆచారిగారి కొడుకనీ పిలిచేవారు. వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజీ ఉండాలని కోరుతూ వచ్చిన అనేక వ్యాసాలు, వార్తలు, ఉద్యమ ప్రకటనలు ‘జనధర్మ’లో నేను చూశాను. రాశాను. అలాగే కాకతీయ యూనివర్శిటీ స్థాపించాలని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వ్యాసాలు వచ్చాయో లెక్కేలేదు. అటువంటి సాధన ఉద్యమాలకు అవసరమైన సామాగ్రిని ‘జనధర్మ’ అందించింది. ఆ విధంగా పత్రిక చేసిన అక్షర పోరాటాలతో కాకతీయ విశ్వవిద్యాలయం వచ్చింది. నేను అందులోనే చదువుకోవటం, లా మొదటి బ్యాచ్ విద్యార్థి కావటం, గోల్డ్‌మెడలిస్ట్‌ను కావటమే కాదు…ఇటీవలే ఆ కాలేజీలో నాకు అభినందన సమావేశం జరగటం నాకు ఒక ఆశ్చర్యం, ఆనందం!!

కనుమరుగైన మిల్లు…
గ్రేన్ మార్కెట్ దాటిపోతే ఆజంజాహి మిల్స్ వస్తుంది. అప్పుడది తెలంగాణలో ఏకైక పరిశ్రమ. వరంగల్ నగరానికే ఆ మిల్లు ఒక బొడ్రాయి. అందులో వందలాది మందికి ఉపాధి దొరికేది. దానిలో పనిచేసే అధికారుల కోసం పెద్ద ఇళ్లతో ఒక కాలనీ ఉండేది. అదే మిల్స్ కాలనీ! అందులోనే ఒక పోలీస్ స్టేషన్. పెద్ద పెద్ద సభలు, సమావేశాలు జరగాలంటే ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్‌లోనే. ఇందిరాగాంధీ బహిరంగ సభ ఎప్పుడైనా అక్కడే జరిగేది. ఆ మిల్లు కార్మిక నాయకులే అంచెలంచెలుగా రాజకీయ నాయకులుగా ఎదిగేవారు. కానీ ఇప్పుడు అజాంజాహి మిల్లు ఆనవాళ్లు కూడా లేవు. మిల్లులోని వస్తువులన్నీ అమ్మేశారు. చెక్క సామాన్లు చిల్లరగా వేలం వేశారు. మిల్లు స్థలాన్ని, గ్రౌండ్స్‌ను కాలనీల నిర్మాణానికి ఉపయోగించారు. మిల్లు పోయి రియల్ ఎస్టేట్ మిగిలింది. అది అభివృద్ధి అని చెప్పేవాళ్లున్నా… నాకు మాత్రం ఒక చరిత్రను, సంస్కృతిని, ఒక నాగరికతను పాతి పెట్టారనిపిస్తుంది.

నగరానికి ప్రాణ బిందువైన మిల్లును చంపి అక్కడ ప్రాణంలేని వ్యాపారాత్మక కాలనీలను నిలబెట్టారు. ఇంతమంది నాయకులు, మంత్రులు ఉన్నారు. వరంగల్లు ఉద్యమ పోరాట కేంద్రం అని చెబుతుంటారు. కానీ ఒక్క మిల్లును కాపాడుకోలేకపోయారు. మా ఇంటికి దగ్గర్లో కె. బుచ్చయ్య సిగార్ కంపెనీ ఉండేది. ఆ ప్రాంతంలో అదొక పెద్ద పరిశ్రమ. చుట్టలు తయారు చేసేవారందులో. ప్రతి చుట్ట మీద రంగుల కాగితం. దాని మీద రంగుల్లో బుచ్చయ్యగారి ఫోటో ఉండేది. ఆయన కుమారుడు కె.ప్రభాకర్ ఫోటోగ్రాఫర్. నాకు మిత్రుడు కూడా. చెప్పొచ్చే విషయం ఏమిటంటే..ఇప్పుడక్కడ ఆ ఫ్యాక్టరీ లేదు.

కాలినడకనే కోటకు…
వరంగల్లుకు ఆ పేరును ఇచ్చింది వరంగల్ కోట. అందులోని ఏకశిలా పర్వతం, దాని మీద ఉన్న చిన్న గుడి. నా చిన్నతనంలో నలుగురైదుగురం కలిసి ఇంటి నుంచి అండర్‌బ్రిడ్జ్ మీదుగా శివనగర్ దాటి కోట వరకు నడిచి వెళ్లేవాళ్లం. రైల్వేలైన్ తరువాత పొలాల గట్ల మీద నుంచి మర్రికోటకు చేరుకుని, తరువాత రాతికోటను దాటి, వరంగల్ కీర్తితోరణాలు, ఖుషీ మహల్, అందులో విరిగిపడి ఉన్న ప్రతాపరుద్రుడి విగ్రహం తలను చూసేవాళ్లం. ముక్కులు, చేతులు చెక్కేసిన ఆ శిల్పాలు చూస్తే హృదయం ద్రవించేది. వెంటనే వాటిని నాశనం చేసిన వాళ్ల మీద కోపం వచ్చేది. నేను చాలా ఆవేశంగా ఓ కవిత్వం కూడా రాసినట్టు జ్ఞాపకం. నాకున్న కోట గుర్తులలో అంతయ్య కూడా ఒకరు. ఆయన తాయెత్తులు కట్టి చిన్న పిల్లలకు విరేచనాలు, వాంతుల వ్యాధులను నిరోధించడంలో చాలా పాపులర్!

కొన్ని విశేషాలు..ఒక విషాదం
‘రాజేశ్వరీ’ టాకీస్‌లో చూసిన లవకుశ, ‘కృష్ణా టాకీస్’లో చూసిన దీవార్, ‘అలంకార్’లో చూసిన అభిమాన్ సినిమాలు ఇప్పుడు థియేటర్ల పేర్లు మారినా ఇంకా గుర్తుండిపోయాయి. భద్రకాళి చెరువు దగ్గర జరిగిన పోతన ఉత్సవాలు, జేపీఎన్‌రోడ్‌లో పరుగెత్తుతూ నెహ్రూను చూడటం, అదే రోడ్డు మీద ఇందిరాగాంధీని చూడటం ఎప్పటికీ మరిచిపోలేని విశేషాలు. ఎంజీఎం ఆస్పత్రిలో నాన్నను కోల్పోవటం నన్ను ఎప్పటికీ కదిలించే సంఘటన.

తర్వాత కాలంలో వరంగల్ వదిలి హైదరాబాద్‌లో పరిశోధనాత్మక జర్నలిస్టుగా కాలం గడిపినా, నల్సార్‌లో న్యాయశాస్త్ర అధ్యాపకుడినైనా, ఇప్పుడు ఢిల్లీలో సమాచార కమిషనర్‌ను అయినా నాది ఏ ఊరంటే వరంగల్లనే చెబుతాను. నేను ఓ విలేకరిగా ముఖ్యమంత్రులను, మంత్రులను కలిసిన సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లోనే నేనే ఓ విఐపీగా బస చేయడం, జర్నలిస్టుగా రాజకీయ నాయకుల సమావేశాలను కవర్ చేయడానికి పరిగెత్తిన రోడ్ల మీద నేనే ముఖ్య అతిథిగా ఎస్కార్ట్ కార్ల మధ్య అధికారిక వాహనంలో తిరగడం, విలేకరులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం గొప్పగా అనిపిస్తున్నా, నా పదవిని, వైభవాన్ని చూడటానికి మా ఊళ్లో నాన్న లేడే అనే బాధ మాత్రం ఉంది.నాన్న సైకిల్ మీద తిరిగి పేపర్లు పంచిన ఊరు, నేను స్కూటర్ మీద పగలనక, రాత్రనక తిరిగి వార్తలుసేకరించిన ఊరు, అదే వీధుల్లో నన్ను వి.ఐ.పి.గా ఊరేగించిన ఊరు నన్ను వరంగల్ వాణి(ణ్ణి)గా తీర్చిదిద్దిన ఊరు.

అలా బడి బతికింది

ఆ మధ్య గిర్మాజీపేటలో నేను చదువుకున్న బడి గురించి నా క్లాస్‌మేట్స్‌ను అడిగితే సమాచారం తెలియలేదు. అయితే ఒకసారి వరంగల్లులో నా మిత్రుడు కలెక్టర్‌గా ఉన్నప్పుడు కలవడానికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన ఏదో సమీక్షలో ఉన్నప్పటికీ నన్ను లోపలికి పిలిపించారు. అప్పుడక్కడ విద్యుచ్ఛక్తి అధికారులు ఓ ట్రాన్స్‌ఫార్మర్ పెట్టడానికి ఒక బడి స్థలం అడుగుతున్నారు. మట్టెవాడ హైస్కూల్ గేటు దగ్గర ఉన్న కొంత జాగా కావాలట. చాలా తక్కువ స్థలం చాలని వాళ్లు అడగటం, కలెక్టర్‌గారు దాదాపు అంగీకరించడం జరిగిపోతున్నది. నిజానికి నేను జోక్యం చేసుకోకూడదు కానీ, నా వల్ల కాలేదు. ఆ మట్టెవాడలో ఎన్ని బడులు నడుస్తున్నాయో తెలుసా? అని కలెక్టర్‌గారిని అడిగాను. ఆయన అధికారులను అడిగితే, వాళ్లు మూడు అని చెప్పారు. సొంత భవనాలు లేకపోవడం వల్ల మూడు బడులు మూడు షిప్టులలో నడుస్తూ ఉంటాయి. అంటే చాలామంది పిల్లలుంటారు. ఆ మూడింటిలోనే నేను చదువుకున్న మాసూం అలీ హైస్కూల్ ఉంది. మట్టెవాడ బడిముందున్నది చిన్న స్థలమే. అందులో ట్రాన్స్‌ఫార్మర్ పెడితే ఎంత ప్రమాదం? అదే మాట నేను కలెక్టర్‌గారితో అన్నాను, జోక్యం చేసుకుంటున్నందుకు క్షమించమంటూనే. కలెక్టర్‌గారికి విషయం అర్థమైంది. బడి స్థలం బతికిపోయింది.

మిషన్లో వేళ్లు నలిగి…

జనధర్మ, వరంగల్ వాణి పత్రికా రచయితగా నాకు వరంగల్ ఇచ్చిన గుర్తింపును మరువలేను. మా ఊరి కోసం నాన్న సాగించిన అక్షరయజ్ఞంలో నా పాత్రను కూడా వరంగల్ గౌరవించడం నా భాగ్యమే. ఒకసారి కాలివేలు, మరోసారి చేతివేళ్లు ప్రింటింగ్ మిషన్‌లో పడి నలిగిపోవటం అప్పుడప్పుడూ గుర్తుకు వస్తుంటాయి. నేను చెమటే కాదు..నెత్తురు కూడా ధారపోసిన పత్రిక ఆగిపోయిన తరువాత మా నాన్న గుండె కూడా ఆగిపోయింది.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.