విప్లవం, వికాసం, విజ్ఞానం..!

నేడు వివేకానందుడి 150వ జయంతి

వివేకానంద ఒక చైతన్య స్ఫూర్తి. ఆధ్యాత్మిక దీప్తి. విజ్ఞాన ప్రదీప్తి. అంతేకాదు… ఆయన ‘విప్లవ స్ఫూర్తి!’ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. వివేకానందుడిలో విప్లవ కోణమూ ఉండటం నిజంగా నిజం. ఒకవైపు ఆధ్యాత్మికతను, మరోవైపు హేతుబద్ధతను తన తల్లిదండ్రుల నుంచి జన్మతః అందుకున్న మహనీయుడు వివేకానందుడు. బ్రిటిష్ ఇండియా రాజధాని కోల్‌కతా నగరంలో 1863 జనవరి 12తేదీ మకర సంక్రాంతినాడు హైకోర్టు అటార్నీ విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి దంపతులకు నరేంద్రనాథ్ దత్త (వివేకానంద) జన్మించారు. తండ్రిలోని ప్రగతిశీల, హేతువాద ఆలోచనలు, తల్లిలోని మత భావోద్వేగాలు నరేంద్రుని ఆలోచనను, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. బ్రిటన్‌కు చెందిన ఉదారవాద, అనుభవవాద, ఉపయోగవాద తత్వవేత్త జేమ్స్ స్టూవర్ట్ మిల్ రాసిన ‘మతంపై మూడు వ్యాసాలు’ పుస్తకం యువ నరేంద్రునిలో సత్యానేషణను రగిల్చింది.

ఒకవైపు భారతీయ వేద, వేదాంత దర్శనాలు, రామాయణ, మహాభారత పురాణాలు… మరోవైపు పాశ్చాత్య తత్వవేత్తలు, శాస్త్రవేత్తల, సాహితీవేత్తల రచనలను లోతుగా అధ్యయనం చేశారు. పర్యవసానంగా ఆయన నిరీశ్వరవాదాన్ని బోధించే బ్రహ్మసమాజం వైపు ఆకర్షితులయ్యారు. నిజానికి వివేకానందుడు చాలాకాలం పాటు మతం – తత్వ శాస్త్రాల మధ్య నలిగిపోయారు. మే«థో మధనం సాగిస్తూ… దేవుడి అన్వేషణలో అనేక మంది సాధు, సన్యాసులను ప్రశ్నిస్తూ దేశమంతా తిరిగారు. చివరకు 1882 ప్రారంభంలో రామకృష్ణ పరమహంసను కలవడంతో ఆయన తాత్విక తృష్ణ ఉపశమించింది.

నిజానికి 1893లో చికాగో ప్రసంగం ద్వారా నరేంద్రుని తాత్విక జైత్రయాత్ర ప్రారంభమైంది. నరేంద్రుడు పాశ్చాత్య ప్రపంచానికి వేదాంతాన్ని, యోగ జ్ఞానాన్ని పరిచయంచేసిన కీలక భారతీయ తత్వవేత్త. ఆధునిక భారతంలో హిందూ మతాన్ని సంస్కరించి జాతి అంతరాత్మను జాగృతం చేసేందుకు ప్రయత్నించిన చింతనాపరుడు. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ల ద్వారా ప్రజల్లో జాతీయ భావాలను ప్రేరేపించేందుకు ఆయన కృషి చేశారు. 1884లో వివేకానందుని కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. సహాయం కోసం ఆయన కాలినడకన అనేక కార్యాలయాల చుట్టూ తిరిగారు. ప్రతిచోటా ఆయనకు తిరస్కారమే ఎదురయింది. నిజమైన అర్థంలో మానవుడి సానుభూతి అంటే ఏమిటో ఆయనకు అనుభూతమైంది.

కులీన కుటుంబంలో పుట్టి పెరిగిన వివేకానందుడికి వాస్తవ జీవితం గురించి జ్ఞానోదయమైంది. బలహీనులకు, పేదలకు, దిక్కులేనివారికి ఈలోకంలో చోటు లేదన్న విషయం ఆయనకు చక్కగా అవగతమైంది. 1880లలో భారత ప్రజలకు, బ్రిటిష్ వలసపాలకులకు మధ్య దేశ వ్యాప్తంగా ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో వివేకానంద తాత్విక, సామాజిక-రాజకీయ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కొద్దిమంది దేశభక్తులను సమీకరించి వలస పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేసేందుకు ఒక విప్లవ పార్టీ నిర్మాణం చేయాలని వివేకానందుడు భావించారు. ఆయన యూరప్‌లోని ప్రజాస్వామిక దేశాల్లో సంభవిస్తున్న సామాజిక పరిణామాలను సునిశితంగా అధ్యయనం చేశారు. పాశ్చాత్య ప్రజాస్వామ్యాల్లోని డొల్లతనాన్ని, వలసవాద స్వభావాన్ని విమర్శించారు. భారతదేశంలోని భూస్వామ్య వ్యవస్థను, కుల దొంతర దుర్మార్గ వ్యవస్థను ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. ఒక దేశ భవిష్యత్తు ఆ దేశవాసులపై ఆధారపడి ఉందన్నది వివేకానందుడి ప్రగాఢ విశ్వాసం. అందువల్ల ఆయన బోధనలన్నీ ప్రధానంగా మానావాభివృద్ధిని ఉద్దేశించి సాగుతాయి. ఈ ఆలోచనలు అప్పటికీ, ఇప్పటికీ, మరెప్పటికీ విలువైనవే కావడం విశేషం. – మాదిరాజు సునీత

ఆధునిక అద్వైతం
తత్వశాస్త్ర మౌలిక ప్రశ్న అయిన పదార్థం, చైతన్యాల మధ్య సంబంధాన్ని పరిష్కరించడంలో వివేకానందుడు అద్వైతాన్ని ఆశ్రయించారు. ఆయన అద్వైతం మిథ్యావాదం కాదు. పదార్థం, చైతన్యం రెండింటి అస్థిత్వాన్ని, ప్రాథమ్యాన్ని గుర్తించడమే కాకుండా, వాటిని వ్యక్తీకరించే ‘అంతఃస్సార ప్రపంచం’ లేదా బ్రహ్మ లేదా ఆత్మ ప్రపంచం అనే మూడో ప్రపంచాన్ని ఆయన ప్రతిపాదించారు. పదార్థం, చైతన్యం రెండూ సహజీవనం చేస్తుంటాయని, అవి రెండూ బ్రహ్మ ప్రపంచ ఉత్పాదితాలుగా ఆయన సూత్రీకరించారు. అలా భావ, భౌతిక వాద తత్వవేత్తలను పూర్వపక్షం చేసేందుకు ప్రయత్నించారు. తాత్వికంగా ఆయన వస్తుగత భావవాది అయినప్పటికీ, సామాజిక వాస్తవికతను భౌతిక వాదిగానే దర్శించగలిగారు. శ్రమ విలువను ఎత్తిపడుతూ, సంపన్నుల దాష్టీకాన్ని నిరసించారు. సమాజ పరిణామాన్ని వర్ణ వ్యవస్థతో అన్వయిస్తూ సోషలిజం సూచించే సామాజిక పరిష్కారాన్ని దర్శించారు. వర్ణ వ్యవస్థ పైఅంతస్తులో ఉన్న బ్రాహ్మణులు ప్రారంభంలో పాలకులుగా ఉన్నారని, ఆ తర్వాత క్షత్రియులు (ఫ్యూడల్ వ్యవస్థ) పాలకులయ్యారని, ఆధునిక సమాజంలో వైశ్యులు (పెట్టుబడిదారులు) రాజ్యాధికారంలోకి వచ్చారని, భవిష్యత్‌లో శూద్రులు (శ్రామిక జనావళి) అధికారంలోకి రాక తప్పదని అద్భుతంగా సూత్రీకరించారు.

నరేంద్ర వివేకం
హైందవ వేదాంత తత్వాన్ని పాశ్చాత్య ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన దార్శనికుడు.. వివేకానందుడు. ఆయన జీవితంలో చాలా ఘట్టాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని..
రామకృష్ణ పరమహంస అస్తమయం తర్వాత.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా పర్యటించాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఒకే చోట స్థిరనివాసం ఏర్పరచుకున్న సన్యాసి కంటే.. విస్తృతంగా పర్యటించే సన్యాసి సమాజంలోని కుళ్లును ఎక్కువగా తొలగించగలడనేది ఆయన ఉద్దేశం. దీంతో, రామకృష్ణులు తుదిశ్వాస విడిచిన 15 రోజుల తర్వాత ఆయన తన సహచరులైన రఖల్ చంద్రఘోష్, తారక్‌నాథ్ ఘోషల్, బాబూరామ్ ఘోష్ తదితరులతో కలిసి దేశపర్యటన ప్రారంభించారు.

-వివేకానందుడు ఒకసారి స్వామి ప్రేమానందతో కలిసి వారణాసి వీధుల్లో వెళ్తుండగా.. కోతుల గుంపు ఒకటి వారి వెంట పడింది. దీంతో వారు భయంతో పరుగులు తీశారు. అప్పుడు ఒక వృద్ధ సన్యాసి.. ‘పరిగెత్తవద్దు, ఆగిపోండి’ అని అరిచాడు. ఆయన మాట ప్రకారం వారు ఆగిపోగానే కోతులు కూడా ఆగిపోయాయి. ఈ సంగతిని ఒకసారి వివేకానందుడు న్యూయార్క్‌లో ప్రస్తావించారు. దాన్నుంచి తాను నేర్చుకున్న పాఠాన్ని వివరిస్తూ.. “ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలబడండి. ధైర్యంగా ఆటంకాలను ఎదుర్కోండి. భయాన్ని, అడ్డంకులను, అమాయకత్వాన్ని తొలగించుకోవాలనుకుంటే మనం వాటి మీద యుద్ధాన్ని ప్రకటించాలి” అని శ్రోతల్లో ఉత్తేజం నింపారు.

– ఒకసారి స్వామి వివేకానంద ఆగ్రా నుంచి బృందావనానికి కాలినడకన పయనిస్తున్నారు. దారిలో ఒక బోయ కులస్థుడు రోడ్డు పక్కన కూర్చుని చిలుం తాగుతూ కనిపించాడు. నరేంద్రుడు అతడి వద్దకు వెళ్లి.. తాను కూడా చిలుం పీలుస్తానని అడిగారు. దానికి అతడు.. ‘మహరాజ్.. మీరో సాధువు. నేనో బోయవాణ్ని’ అని సందేహంగా ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఆ మాటలు విని వెళ్లిపోబోయిన స్వామి ఉన్నట్టుండి ఆగిపోయారు. “నేనో సన్యాసిని. అన్ని బంధాలను, మతాన్ని వదిలేశాను. నేనెందుకు ఇతడి నుంచి చిలుం తాగకూడదు” అని ఆలోచించి మాట్లాడకుండా అతడి వద్ద నుంచి తీసుకుని చిలుం పీల్చారు. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ.. “మీ తోటి మనుషుల్ని ఎప్పుడూ ద్వేషించకండి. మనందరం ఆ దేవుడి పిల్లలమే” అని చెప్పారు.

– వివేకానందుడు కొన్నాళ్లపాటు రిషీకేశ్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన మలేరియా బారిన పడ్డారు. ఒకదశలో ఆయన నాడీ స్పందనలు, గుండె కొట్టుకోవడం దాదాపు ఆగిపోయాయి. దగ్గరలో వైద్యులెవరూ లేరు. వైద్యులు ఉన్న చోటుకు తీసుకెళ్దామంటే అందుకు ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు. దీంతో.. తనకు చివరిఘడియలు సమీపించాయనే అనుకున్నారు. కానీ.. ఉన్నట్టుండి ఆయన వద్దకు ఒక వృద్ధ సన్యాసి వచ్చారు. స్పృహలో లేని వివేకానందుడితో తేనె, పిప్పళ్ల చూర్ణం తినిపించి అక్కణ్నుంచీ వెళ్లిపోయారు. కొద్దినిమిషాల వ్యవధిలోనే వివేకానందుడికి స్వస్థత చిక్కింది. ఆ తర్వాత.. “అవ్యక్తచేతనలో ఉన్నప్పుడు.. దేవుడి కోసం ఏదో గొప్ప పని చేయాలని నాకు బలంగా అనిపించింది. ఆ పనిని పూర్తి చేసేదాకా నాకు శాంతి, విశ్రాంతి లేవు” అని చెప్పారు.

– ఒకసారి అల్వార్ (రాజస్థాన్) సంస్థానం దివాన్ వివేకానందుణ్ని తమ రాజుగారి భవనానికి ఆహ్వానించాడు. ఆ రాజు పేరు మంగళ్‌సింగ్. ఆయనకు విగ్రహారాధన మీద నమ్మకం లేదు. అదే విషయాన్ని వివేకానందుడిని అడిగారు. దీనికి స్వామి.. ఆ గదిలో గోడకు వేలాడదీసి ఉన్న రాజుగారి చిత్రపటాన్ని చూసి, అక్కడే ఉన్న దివాన్‌ను పిలిచి.. ఆ పటంపై ఉమ్మి వేయవలసిందిగా కోరారు. అందుకు ఆ దివాన్ అంగీకరించలేదు. అప్పుడు నరేంద్రుడు.. “ఆ చిత్రపటం మహారాజులాగా మాట్లాడలేదు, కదల్లేదు. అయినా మీరు దానిపై ఉమ్మేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే.. ఆ పటం మీద ఉమ్మేయడమంటే మీ ప్రభువు అవమానించడమేనని మీకు తెలుసు” అని వారికి చెప్పి మహారాజువైపు తిరిగారు. “మహారాజా. .మీరు చిత్రపటంలో లేకపోయినా.. మీ సేవకులు దాని పై ఉమ్మివేయడం మిమ్మల్ని అవమానించినట్టుగానే భావిస్తున్నారు. దేవుడి విగ్రహాలకు కూడా అదే వర్తిస్తుంది.” అని చెప్పారు.

వివేకానందుడి ప్రసంగాలకు అక్షర ‘రూపం’ గుడ్‌విన్
స్వామి వివేకానంద.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగాలే! ఆ మాటలు గాలిలో కలిసిపోకుండా చరిత్ర పుటల్లో నిక్షిప్తం చేసిన అక్షర రూపశిల్పి.. జోసియా గుడ్‌విన్. వివేకానందుడి స్టెనోగ్రాఫర్ ఆయన. 1870లో ఇంగ్లండ్‌లో జన్మించిన గుడ్‌విన్.. 14వ ఏటనే పాత్రికేయవృత్తిలోకి ప్రవేశించి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ.. స్వామిజీ చికాగో ప్రసంగానికి ముగ్ధుడై వీరాభిమాని అయ్యారు. సర్వమత సమ్మేళనం అనంతరం నరేంద్రుడు అమెరికా మొత్తం తిరుగుతూ ప్రసంగాలిచ్చారు. అప్పట్లో పలువురు అమెరికన్లు ఆ ప్రసంగాలను రికార్డు చేయాలని నిర్ణయించుకుని ఆ బాధ్యతలు చేపట్టే వ్యక్తి కోసం ప్రకటన ఇచ్చారు. వెంటనే గుడ్‌విన్ ఆ ఉద్యోగంలో చేరారు. వివేకానందుడి మీద అభిమానంతో గుడ్‌విన్ తన అవసరాలకు అతికొద్ది మొత్తాన్ని జీతంగా తీసుకునేవారు. వివేకానందుడితో కలిసి కోల్‌కతాకు వచ్చేసి నాలుగేళ్లపాటు ఆయన వెంటే ఉండి.. తన 27వ ఏట ఊటీలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన స్వామీజీతో కలిసుంది నాలుగేళ్లే.. అయితేనేం.. స్వామీజీ ప్రసంగాలను అచ్చు వేయడం ద్వారా చిరంజీవిగా నిలిచారు. ఊటీలోని ప్రఖ్యాత సెయింట్ థామస్ చర్చికి అనుకుని ఉన్న శ్మశానంలో.. గుడ్‌విన్ సమాధి ఇప్పటికీ కనిపిస్తుంది!

ఏ వ్యక్తి అయినా, ఏ దేశమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మూడు లక్షణాలు అవసరం. అవి 1.మంచితనానికి ఉన్న శక్తి మీద అఖండ విశ్వాసం 2. అసూయ, అనుమానం లేకుండా ఉండడం. 3. మంచిగా ఉండాలనుకునే వారికీ, మంచి చేయదలచుకునే వారికి తోడ్పడటం.
కష్టాలు పర్వతం అంతగా కనిపించినా, పరిస్థిలన్నీ భయంకరంగా, నిరాశాజనకంగా ఉన్నా అవి అన్నీ మాయే, భయపడవద్దు. అది తొలిగి పోతుంది; అణచిపెట్టండి, అది అదృశ్యమవుతుంది; త్రొక్కివేయండి, అది అంతరిస్తుంది. భయపడకు! ఎన్నిసార్లు పరాజయాన్ని పొందానని ఆలోచించవద్దు. కాలం అనంతం, ముందుకు సాగిపో!

ప్రపంచంలోని రుగ్మతలకు మందు… బలం. ధనికులచే పీడింపబడినప్పుడు పేదల దగ్గర ఉండవలసిన మందు… బలం. పండితులచే అణగ దొక్కబడినప్పుడు పామరులకు కావలసిన మందు… బలం. నీవు పౌష్టికాహారం తీసుకొని దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే మనస్సు బలంగా ఉంటుంది. శరీరం యొక్క సూక్ష్మరూపమే మనస్సు.
విశ్వాసం సౌశీల్యం గల కొద్దిమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. నాయకత్వాన్ని వహించేటప్పుడు సేవకుడిగా ఉండండి. నిస్వార్థంగా ఉండండి. అనంత సహనం కలిగి ఉండండి. అప్పుడు విజయం మీదే.

 

 

మాధవుడిని మానవుడిలో చూడగలిగే మహాత్ముడతను. అట్టడుగున ఉన్న తన తమ్ముల దుర్భర జీవితాలను సందర్శించాడు. వారిని నిర్లక్ష్యం చేయడం వల్లే
నేను (భరతమాత) పతానవస్థకు చేరువవుతున్నానని గ్రహించి, వారికి విద్యాబుద్ధులు నేర్పించ సంకల్పించాడు. వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధిని కల్పించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని సందేశమిచ్చాడు.
ఆచరణలో కూడా వేదాంతాన్ని అనుష్ఠించవచ్చనీ, ఆ విషయాన్ని తన సోదర, సోదరీమణులందరికీ తెలియజేయాలనీ తపించాడు.

ఈ ఉషోదయ వేళ…
బాలభానుడి లేలేత కిరణాలు భరతావనిపై ప్రసరించే వేళ.
ఆ కాషాయ వర్ణశోభను తిలకిస్తూ మన మాతృమూర్తి పులకించిన వేళ.
తన ఔన్నత్యాన్ని దేశ, విదేశాలలో గొంతెత్తి చాటిన తన ముద్దుల తనయుడు, కాషాయాంబరధారి వివేకానందుని ఆ సూర్య కిరణాలలో దర్శించి, తరించిన వేళ, ఆయమ్మ మనసు ఉత్తుంగ తరంగమై, తన అంతరంగాన్ని మనముందించిన వేళ…
“చిరంజీవులారా! ఈ రోజు కదా… నా జన్మధన్యమైనది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నా కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. ఎందరో ఆధ్యాత్మిక సంపన్నులకు ఆలవాలమై, అనేక దేశాలకు ఆదర్శప్రాయమై వెలిగిన నేను ఈనాడు అంతులేని బాధలో ఉన్న విషయాన్ని మీరు గుర్తించారా? అవినీతి, లంచగొండితనం, అన్యాయం, అక్రమార్జన, అనైక్యత…ఒకటేమిటి? నైతిక విలువలన్నిటికీ తిలోదకాలిచ్చిన నా బిడ్డలను ఎవరు కాపాడగలరని విలపిస్తున్న నాకు ఈ సూర్యోదయం కొత్త ఆశను చిగురింపజేస్తోంది. అరుణారుణ కాంతులలో స్ఫురద్రూపియైన నాయనుంగు తనయుని గుర్తుకుతెస్తోంది.

అది 1863 జనవరి 12వ తేదీ కలకత్తా ప్రాంతంలోని భువనేశ్వరీ-విశ్వనా«థుల ఇంట చిన్నారి నరేన్ జననం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు అతని చేష్టలు సర్వదా ఆనందదాయకాలే. బాల్యం నుంచే స్ఫురద్రూపం, ధైర్యం, ఏకాగ్రత, నాపై అనురాగం, దైవభక్తి, ధ్యానరక్తి, సర్వమత సహనం, సకల జనావళిపై ప్రేమ ఇలా…సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పగల సాహసి కదా నా బిడ్డడు అనుకున్నా! 1882 సంవత్సరంలో అనుకుంటా..భగవద్దర్శనం కోసం తపించే నా తనయుడు తగిన గురువు కోసం అన్వేషణ. ఆ… అతనూ నా ప్రియ పుత్రుడే! రామకృష్ణ పరమహంస! ‘దేవుని మీరు దర్శించారా?’ అన్న ప్రశ్నకు సమా«ధానంగా ‘ధైర్యముంటే నీకూ చూపిస్తా రా!’ అని దైవదర్శనం చేయించాడు. గురుశిష్య సంబంధానికి నిలువెత్తు నిదర్శనం వారిద్దరే.
మాధవుడిని మానవుడిలో చూడగలిగే మహాత్ముడతను. అట్టడుగున ఉన్న తన తమ్ముల దుర్భర జీవితాలను సందర్శించాడు. వారిని నిర్లక్ష్యం చేయడం వల్లే నేను పతానవస్థకు చేరువవుతున్నానని గ్రహించి, వారికి విద్యాబుద్ధులు నేర్పించ సంకల్పించాడు. వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధిని కల్పించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని సందేశమిచ్చాడు.

ఆచరణలో కూడా వేదాంతాన్ని అనుష్ఠించవచ్చనీ, ఆ విషయాన్ని తన సోదర, సోదరీమణులందరికీ తెలియజేయాలనీ తపించాడు. అవమానాలను సహించలేని అమ్మ మనసు గ్రహించి, అమెరికా దేశంలో షికాగో కొలంబస్ భవనంలో జరిగిన మహాసభలో ‘సోదర సోదరీమణులారా!’ అని ఆరంభించిన ఆ గళం ‘వసుదైక కుటుంబమ్’ అన్న నా ధర్మాన్ని ఎంత చక్కగా ప్రబోధించిందని మురిసిపోయా! ఎంతో ప్రాచీనమై, సమున్నతమై, త్యాగభరితమైన సనాతన హైందవ ధర్మాన్ని ప్రపంచ దేశాలకు ఎలుగెత్తి చాటిన మహా వక్త, నా ఇంటిరత్నం వివేకానందుడు.
ఇలా దాదాపు మూడున్నర సంవత్సరాలు నా ఔన్నత్యాన్ని చాటి చెప్తూ, ప్రపంచవ్యాప్తంగా నాపై ఉన్న అపోహలను తొలగించి, గురువర్యుల ఆచరణాత్మక బోధనలను ప్రచారం చేస్తూ ‘రామకృష్ణ మఠ’ స్థాపన చేసి, భావితరాలకు దిశానిర్దేశం చేసిన ధీశాలి.

“హైందవమ్మంటే ఆనంద నందనమ్ము
సుందరోద్యాన సువిశాల ప్రాంగణమ్ము
అందుకొనరయ్య జనులార!” ఆర్తి తోడ
‘బండబారిన గుండెల బరువుదీర!’

అంటూ గొంతెత్తి నలుదిక్కులా నినదించిన ధీశాలి, ధీరుడు, త్యాగశీలి, మానవతామూర్తి, జగజ్జేత, నా తనయుడు. తల్లిని కదా! ఇంతకన్నా ఎక్కువ స్తుతించకూడదేమో! కానీ నన్ను వదిలి.., ఇవి కన్నీళ్లు కాదు. ఆనంద బాష్పాలు! ఎందుకంటే 150 వసంతాల తర్వాతైనా అతని సహోదరులకు గుర్తుకు రావడం. వీధి వీధినా, ఊరూరా, నగరాల్లో రథయాత్ర జరిపి, ఆశీస్సులడగడం… చాలా సంతోషం.
నాయనా! వివేకానందా! నా బిడ్డలందరికీ..

ఆత్మబలాన్ని, ధైర్యం, దేశభక్తి
సత్యశోధన సర్వదా గెలిచే శక్తి
సూక్ష్మబుద్ధియు దేవతా ధ్యానరక్తి
యువత నిల్పుము వివేకానందమూర్తి!
యువత నిల్పుము వివేకానంద స్ఫూర్తి!
అని ఆకాంక్షిస్తూ…
– పార్నంది రాధాశర్మ

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.