ఆచార్య పింగళి లక్ష్మీ కాంత దర్శనం -మూర్తిమత్వం

ఆచార్య పింగళి లక్ష్మీ కాంత దర్శనం

   మూర్తిమత్వం

‘’ నీతల యూపు ,నీనడక ,నీ నుడికారము ,ఠీవి,యే మహీ నేతకు గల్గు ?తెల్గునం గదగల్గె నేటి విఖ్యాతి

కవీన్ద్రులన్ మలచి నట్టి కవీశ్వర సాహితీ పరంజ్యోతివి నీవు పింగళి మహోదయ విశ్వ కళా జగద్గురూ ‘’

అని శ్రీ నండూరి రామ కృష్ణమాచార్యుల వారు వర్ణించిన మూర్తి మనకు కళ్ళెదుట దర్శన మిస్తే శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారు –

‘’ఎగ దువ్వగా వంగక ఎగయు పట్టు తురాయి వలే నిల్చు తెలి కేశముల బెడంగు

నిడుడైన నొసటి పై నిలువుగా దిద్ది తీర్చిన యెర్ర చాదు వాసనల సౌరు

మడత పెట్టిన బెట్టు మాయని ,నును పట్టు బంగారు పొడవు జుబ్బా పసందు

చలువ చేసిన సన్న తెలినూలు పొందూరు మడుగు దోవతి ,పింజె మడుగుల తీరు

నయనముల తాలుచు సులోచానముల మెరపు –కంఠమున వ్రేలు గ్రైవేయకమ్ము

వేదికను నిల్చి నటి యించు విగ్రహమ్ము –గురులకు గురుండోమారు శ్రీ వరుడో యనగా ‘’’

అంటూ ఆయన కట్టూ బొట్టూ ,వస్త్రధారణ లను వివరించారు మాటల్లో గాంభీర్యం చూపులో గాంభీర్యం ,ముఖ భంగిమల్లో గాంభీర్యం ,నడక లో గాంభీర్యం తో రాజ ఠీవి ఉండేవి అందుకే ఆయన తో చాలా మంది చనువుగా ఉండటానికి జంకే వారు .

చిట్టూర్పు లో జీవితం

చిట్టూర్పు లో ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి పై సాహిత్య సభ చిట్టూర్పు -12-1-14

కాంతం గారి తండ్రి పింగళి వెంకట నరసయ్య గారు కృష్ణా జిల్లా చల్లపల్లి ఎస్టేట్ లో చిన్న ఉద్యోగి గా ఉండేవారు చిట్టూర్పు లో కాపురం కొద్దిగా పొలం వ్యవసాయం ఉండేవి ఊరిలో మంచి పలుకుబడి గల వ్యక్తీ .బందరు దగ్గర అర్తమూరు లో మోచర్ల మృత్యుంజయుడు గారి చెల్లెలును వివాహమాడారు .లక్ష్మీ కాంతం గారు ఈ తాలిదంద్రులకుమాతామహుల ఇంట్లో 10-1-1994లో అర్తమూరు లో జన్మించారు .చిట్టూర్పు లో పెరిగారు .తండ్రిగారు  అక్షరాభ్యాసం చేశారు .వీఎది బడిలో చదువుకొన్నారు .తాటాకుల పుస్తకం కుట్టి ,దాని మీద గంటం తో సమతీ శతకం లోని ఒక పద్యాన్ని గురువు గారు రాసి ఇచ్చి మూడు సార్లు అని పించి మర్నాడు ఒప్ప జెప్పుకోనేవారు .ఈయనకు ఆనేదికాడు రోజుకు పది పద్యాలైనా కావాలన్నంత ఆకలి .కాని గరువు మరీ బతిమిలాడితే రెండు పద్యాలు రాసేవారంతే .రెండు నెలలో సుమతీ శతకం పూర్తీ చేశారు .ఒక్క ఏడాదిలో ఎనిమిది శతకాలు బట్టీ పట్టేశారు .ఆ రోజుల్లో పద్యానికి అర్ధం చెప్పేవారు కాదు .పిల్లలు అడిగే వారూ కాదు .అప్పుడు చదువు అంటే భాష రావతామే స్వచ్చంగా ,స్ఫుటం గా ఉచ్చరించటం మాట్లాడినా చదివినా ఎలా పలకాలే బాగా తెలిసేది .ఒరవడి అంటే కాపీ రాయించేవారు దానితో దస్తూరి బాగా కుదిరేది నోటి లెక్కలు ,వడ్డీ లెక్కలు నేర్పేవారు బాల రామాయణం వల్లే వేయించేవారు .దస్తావేజుల మతలబు ,భూమికోలతలు ,పంచాంగం చూసి మంచి చెప్పతంలగ్నాలు పెట్టటం కూడా వీధి బడిలో నేర్పేవారు .భజనలు కూచి పూడి నాటకాలు ఊరిలో జరుగుతూ ఉంటె వెళ్లి శ్రద్ధగా వినే వారు చూసే వారు నాటకం పూర్తీ అయ్యేసరికి తెల్లారేది .అందులోని పాటలన్నీ నోటికి వచ్చేసేవి .ఒక వేల పాత మర్చి పోతే స్వంత మాటలతో పూరించి పాడుకొంటూ ,తోటి వారితో పాడించేవారు లక్ష్మీ కాంతం తిరునాళ్ళ లో పుస్తకాలు కొని చదివే వారు .పదమూడవ ఏటికే వందలాది పద్యాలు నోటికి వచ్చేశాయి కనీసం వంద పాటలూ వచ్చాయి ఈ విషయాలన్నీ లక్ష్మీ కాంతం గారే తమ రేడియో ప్రసంగం లో తెలియ జేశారు .అయిదవ తరగతి వరకు చిట్టూర్పు లోనే చదువుకొన్నారు

పై చదువు

ఆరు ఏడు క్లాసులు గుంటూరు జిల్లా రేపల్లె లో చదివారు. బందరుకి చేరి ఐదో ఫారం లో చేరారు అప్పుడే తండ్రి గారి మరణం సంభవించింది గురువు గారు చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారు ఈ కుర్రాడిని చిట్టూర్పు వెళ్ళమని చెప్పి రావటానికి కొంత కాలం పడుతుంది కనుక ‘’తెలుగు మహా భారతం’’ బాగా చదువుకొని రమ్మని పంపారు తండ్రి నరసయ్య గారు పెత్తందారు .ఊళ్ళో వాళ్ళు ఆయన దగ్గరే డబ్బులు దాచుకొనేవారు వాటిని వడ్డీకి తిప్పి వాళ్లకు అంద జేసే వారు .తండ్రి మరణం తో డబ్బులు ఇచ్చిన వారు డబ్బుకోసం వత్తిడి తెచ్చారు . ఉన్న ఆస్తి అంతా అమ్మేసి బాకీలు తీర్చింది తల్లి .ఆవిడకు కాని మిగిలిన వారికి కాని డబ్బు విషయాలేమీ తెలీదు సంతానానానికి ఏమీ మిగలలేదు అప్పుడే ఆ ఊరి మునసబు గారి అమ్మాయి తనకు మహా భారతం పురాణం గా చెప్పేవారేవరున్నారని వాకబు చేసింది లక్ష్మీ కాంతం గారే చెప్పగలరని అందరు చెప్పగా వచ్చి అడిగితే వారింటికి వెళ్లి భారతాన్ని చక్కగా విడమర్చి రెండు నెలల్లో పూర్తీ చేసి  ఆవిడతో బాటు విన్న వార్సందరికి సంతృప్తి కలిగించారు .ఇలా గురువు గారి మాట నిల బెట్టారు .అదే భారత ప్రవచనానికి నాంది అయింది .భారతాన్ని క్షున్నం గా పరిశీలించే ప్రయత్నానికి ఇక్కడే అంకురార్పణ జరిగింది .లక్ష్మీ కాంతం గారింనగారు నరసయ్య ,తమ్ముడు వీరయ్య ,సోదరి సుందరమ్మ .ఇక చిట్టూర్పు లో ఉండలేక తల్లి పిల్లలతో పుట్టిల్లు అర్తమూరు చేరింది తండ్రి మరణం ,వ్యవహారాలూ తో ఒక ఏడాది చదువు ఆగిపోయింది మళ్ళీ బందరు చేరి తినటానికి ఏమీ లేక వేరుసెనగ పప్పులు తిని మున్సిపల్ కుళాయి నీరు తాగి గడిపేవారు కాంతం గారు .

సాహిత్యవిశేషాలు

1960లో ఆగ్రా లో అఖిల భారత బెంగాలీ సభలు జరిగితే ప్రత్యెక అతిధిగా వెళ్లి మహా భారతం విశిష్టత మీద గంట సేపు అనర్గళం గా ఆంగ్లం లో ప్రసంగించి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేశారు .అక్కడి వాళ్ళు ‘’మీ ఆంద్ర దేశం లో చైతన్య ప్రభువు ప్రభావం లేదటగా కృష్ణ భక్తీ మీకు తెలియదట గా ?’’అని అడిగితే లక్ష్మీ కాంతం గారు ‘’మీ చైతన్యుడి కంటే ముందే మా మధుర కవి పోతన్న భాగ వతాన్ని రాశాడు. కృష్ణ భక్తిని ఇంటింటా పాదుకోల్పాడు ఆయన పద్యాలు రాని తెలుగు లోగిలి లేదు ‘’అని చక్కని సమాధానం చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపించారు .

ఆంద్ర ప్రభ వార పత్రికలో శ్రీ తిరుమల రామ చంద్ర ‘’మరపు రాని మనీషులు ‘’శీర్షిక తో తెలుగు ప్రముఖులను గురించి రాస్తున్నారు .ఆయన ఈయన ఇంటర్వ్యు కోసం వస్తే ‘’నాకు మీ ప్రచారం అక్కర్లేదు నా పనేదో నేను చేసుకు పోతున్నా ‘’అని నిష్కర్షగా చెప్పారు .ఆయన వీరిపై వ్యాసం రాసి అందులో ‘’పింగళి వారికి ప్రచార సాధనం వారి శిష్యులే .నూటికి నూరు పైసలా ఆయన ఆచార్యులు .నిజమైన ఉపాధ్యాయులు ‘’అని ముక్తాయింపు  ఇచ్చాడు .

కేంద్ర సాహిత్య ఎకాడమి కి ఎక్సి క్యూటివ్ కౌన్సిల్ సభ్యులైనారు దాని అధ్యక్షుడు నెహ్రు .ఒక మంచి పుస్తకానికి పురస్కారం ఇవ్వాలని కౌన్సిల్ మీటింగ్ లో పింగళి వారు సూచిస్తే నెహ్రు అది అనువాద పుస్తకం కదా అంటే అనువాదం చేసిన తీరు వర్ణించి నెహ్రూను ఒప్పించి పురస్కారాన్ని అందించారు .అప్పటి నుండే తెలుగులో అనువాదమైన వాటికి  పురస్కారాలివ్వటం ప్రారంభ మైంది ఇది పింగళి వారి చలవే .

ఇరవై అయిదేళ్ళు యూని వర్సిటి స్థాయిలో ‘’ఆంద్ర సాహిత్య చరిత్ర ‘’బోధించిన అనుభవం పింగళి వారిది ఆయన రాసిన ‘’సాహిత్య శిల్ప సమీక్ష ‘’వంటి పుస్తకం న భూతో గా నిలిచి ఆయన ప్రతిభకు గీటు రాయి అయింది దీనికి ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి అవార్డు వచ్చింది .కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు రాకుండా ఒక మంత్రి అడ్డు పడ్డారని వారి కుమారుడు సుందరం గారు రాశారు సాహిత్య శిల్ప సమీక్ష లో పరమ ప్రామాణిక మైన పారిభాషిక పదాల సృష్టి చేశారు లక్ష్మీ కాంతం గారు ‘’aesthetic art ‘’కు లలిత కళలు అనే చక్కని మాటను వాడారు ‘’.climax’’పదానికి శిఖరారోహణం అన్నారు

కాటూరి వెంకటేశ్వరరావు గారితో కలిసి జంట కవిత్వం చెప్పారు .తొలకరి సౌందర నందం రాశారు .కాటూరి వారు మరణిస్తే ‘’నాకు మిత్రుల కంటే శత్రువుఎ ఎక్కువ .ఉన్న ఒక్క మిత్రుడూ వెళ్లి పోయాడు ‘’అని బాధ పడ్డారు .గురువు వెంకట శాస్త్రి గారిని కాటూరి వారిని స్తుతిస్తూ పింగళి వార్ చెప్పిన పద్యం చిరస్మరణీయం .

‘’ప్రేణిత సద్రసజ్నుడు పింగళి కాంతుని కావ్య శిల్ప ని –ర్మాణ దురీణ బుద్ధి గరిమంబున కిర్వురే సాక్షులిమ్మహిన్

వాణికి వాణి యైన గురు వర్యుడు చెల్పిల వేంకటేశుడున్ ,-ప్రాణము ప్రాణమైన గుణరమ్యుడు  కాటురి వేంకటేశుడున్ ‘’   తెలుగు ఎకాడేమిలో పుస్తకాలు ఎలా ఉండాలి అన్న దాని పై జరిగిన వాదోప వాదాలలో పింగళి వారు ఒక రాజీ ఫార్ములా చెప్పి అందరిని సంతృప్తి పరచారు ‘’మాత్రు భాషా గ్రంధాలలో సరళ గ్రాంధికం ద్వితీయ భాషా గ్రంధాలలోశిష్ట  వ్యావాహారికం  ఉండాలి ‘’అన్నది వారి గొప్ప సూచన. సంక్స్క్రుత వ్యాకరణాన్ని పింగళి వారు ‘’ఒక కావ్యం చెప్పినట్లు చెప్పి మనో రంజనం కల్గిస్తారు ‘’‘’అని ముఖ్య శిష్యుడైన ప్రసాద రాయ కులపతి కీర్తించారు .ఆయన చెప్పే ప్రతి వాక్యం ‘’ఒక కావ్య శిల్పమే’’నన్నారు కులపతి ..ప్రసిద్ధ స్సహితీ వేత్త శ్రీ తంగిరాల సుబ్బారావు గారు వీరికి శిష్యులే పి హెచ్ డి పరీక్షలో ‘’నన్నే చోడుడు ‘’పై తంగిరాల రాసిన వ్యాసం ఏంతో  నచ్చి ‘’దీన్ని నా‘’దగ్గర ఉంచుకొంటాను ‘’అన్న సంస్కార మూర్తి పింగళి . పద్దెనిమిదేళ్ళు ఆంద్ర విశ్వవిద్యాలయం లో లెక్చరర్ గా రీడర్ గా పని చేసినా ప్రొఫెసర్ గా ప్రమోషన్ ఇవ్వనే లేదు .ఆ లోటు శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం .తీర్చి ఆచార్య పదవినిచ్చి గౌరవించింది .

రేడియో స్టేషన్ అనుబంధం

విజయవాడ రేడియో స్టేషన్ లో ఏడున్నరఏళ్ళు   ప్రయోక్తగ పని చేశారు’’ ‘’.రేడియో స్టేషన్ ను ఒక యూని వర్సిటి గా మార్చారు పింగళి ‘’అన్నారు శ్రీ వాత్సవ .శంకరన్ అనే కొత్త స్టేషన్ డైరెక్టర్ వచ్చి చేరినప్పుడు పాత ఆయన పింగళి ని పరిచయం చేస్తూ ‘’వీరు సంస్కృతిక కార్య క్రమాలను నిర్వహిస్తున్నారు ‘’అని చెబితే ‘’ వంకరన్  ‘’’’I am number one enemy of sanskrtit ‘’అన్నాడు .వెంటనే పింగళి ‘’sanskrit loses nothing on that account ‘’అని ఎదురు దెబ్బ కొట్టారు విజయ వాడ నుంచి హైదరాబాద్ కు మారుస్తామని చెబితే ‘’నేను ఉద్యోగం నుంచి తప్పుకొంటాను ‘’అని కరాఖండీ గా చెబితే ఆ ప్రయత్నం మానుకొన్నారు పై వాళ్ళు .రేడియో లో p.p.l.v.ప్రసాద్ అనే యువకవి అష్టావధాని తో రేడియో లో మొదటి అష్టావధానాన్ని చేయించిన ఘనత  పింగళి ది ఈ ప్రసాద్ యే తర్వాత ప్రసాద రాయ కులపతి అయ్యారు ఇప్పుడు కుర్తాలం పీఠాది పతి గా ఉన్నారు .అప్పుడు విజయ వాడ హైదరాబాద్ లకు పింగళి వారే ప్రయోక్త ఆ తర్వాతదేవుల పల్లి కృష్ణ శాస్త్రి హైదరాబాద్ కు జాషువా గారు మద్రాస్ కు ప్రయోక్తలయ్యారు

గురు శిష్య బంధం

చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారి ప్రధాన శిష్యుడు పింగాలి తన వెంటే ఎప్పుడూ తీసుకొని వెళ్ళే వాత్సల్యం వారిది .శాస్త్రి గారిఉ మరణిస్తే అప్పటి దాకా ఆయన నిర్వహించిన ఆస్థాన కవి పదవి ఖాళీ అయితే ఎవరిని నియమించాలన్న విషయం లో మంత్రి గోపాల రెడ్డి వీరి దగ్గరకు వచ్చి సలహా అడిగారు .అప్పుడు పింగళి ‘’మీ ఆస్థాన కవి పదవి మా గురువు గారికి ఒక ‘’ఫుట్ స్టూల్ ‘’లాంటిది .నేనుద్దేశించిన వాజ్మయపు గద్దె అది కాదు ‘’అని చెప్పి వేరేవారి పేరో సూచించారట .ఇంగ్లీష్ -తెలుగు నిఘంటువు ను నిర్మించిన ఘనత పింగళి వారిది .అందులో ప్రయోగం అనువదించే పధ్ధతి చూపి కొత్త మార్గం పట్టించారు .ఆంధ్రా యూని వర్సిటి లో ఉద్యోగ విరమణ త్తర్వాత ఇరవై ఏళ్ళు కవిత్వం జోలికే పోలేదు

1948 లో వెంకట శాస్త్రి గారిని ఆస్థాన కవిగా మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే విజయ వాడ లో గొప్ప సన్మాన సభ జరిపారు శిష్యులు .అప్పుడు కట్టమంచి రామ లింగా రెడ్డి మాట్లాడుతూ ‘’వెంకట శాస్త్రి గారు చేసిన సాహిత్య వ్యాసంగం అవధానాలు ఒక ఎత్తు అయితే పింగళి లక్ష్మీ కాంతం  అనే శిష్యుడిని తయారు చేసి ఆంద్ర విశ్వ విద్యాలయానికి సమర్పించటం ఒక ఎత్తు ‘’అని శ్లాఘించారు  గురు శిష్యులిద్దరికి గర్వకారణమైంది

‘’భూలోకం లో నువ్వు ఏమేమి పనులు చేశావో చెప్పు ?అని దేవుడు నన్ను ప్రశ్నస్టే ‘’కవిత్వం రాశా .నాటకాలలో రాజు పాత్రలు ధరించా అని తల ఎత్తుకొని చెబుతా .కొంత కాలం ఉపాధ్యాయుడిగా పని చేశాను అని తల దించుకొని చెబుతా ‘’అన్నారట విశాఖ పట్నం లో విశ్వ విద్యాలయం తన పదవీ విరమణ రోజున అందరూ ప్రశంశలు కురిపిస్తుంటేదీని భావమేమిటో తెలీక అందరూ బుర్రలు దిన్చుకోన్నారట .

శిష్య వాత్సల్యం చూపిస్తూ గురువు పింగళి వారి క్లాసు లో కూర్చుని ఆంధ్రా వర్సిటి లో పాఠంవిన్నారు .బయటికి వచ్చి ‘’నా పేరు నిల బెట్టాడు మా శిషుడు .నేను ఊహించిన దాని కంటే ఎన్నో రెట్లు పెరిగాడు నా ఊహకు అంద నంత ఎదిగాడు ‘’అన్నారు గురువు గారు ..భారత ఉప రాష్ట్ర పతి సర్వేపల్లి రాదా కృష్ణన్  1957.లో విజయ వాడ వచ్చినప్పుడు పింగళి వారు కనపడక పొతే వారెక్కడ అని నిర్వాహకులను నిలదీశారట .ఆయనకు ఈయనతో ఇంట అను బంధం ఉందని తెలియని నిర్వాహకులు పింగళి వారిని ఆహ్వానిన్చనే లేదట అందుకని పింగళి రాలేదు

క్లాసులో పాఠాలు చెప్పా టానికి వెళ్లి నప్పుడు చెప్పులు క్లాస్ బయటే వదిలేసి ఒక దేవాలయం లో ప్రవేశిస్తున్న భావం తో లోపలి వెళ్లి చెప్పేవారు .చేతిలో పుస్తాకం కానీ చిన్న కాగితం కాని ఉండేది కాదు. గంట సేపు గంట కొట్టినంత పకడ్బందీ గా ఆరోజు విషయాన్నిసమయం లో పూర్తీ చేసి బయటికి వచ్చే వారు ఇది అందరికి ఆదర్శం కావాల్సిన విషయం పింగళి వారు యూని వర్సిటి లో చూపించిన తయారు చేసిన పాఠ్య ప్రణాళిక అనేక విశ్వ విద్యాలయాల్లో యాభై ఏళ్ళు అవిచ్చిన్నం గా చూపుడు వేలితో శాసించి,కొనసాగింది అది ఆయనకు గొప్ప గర్వ కారణం .ఆయనకే కాదు మనకూ.ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తీ పై మాట్లాడుతూ ‘’చక్రాంకితాలు లేని సహజ వైష్ణవులు లక్ష్మీ కాంతం ‘’అన్నారు ఆచార్య కోగంటి సీతా రామాచార్యులు .ఇంతకంటే కితాబు వేరొకటి ఉంటుందా ? .Johnstone ‘’ఇంగ్లీష్ పాఠాలు ఎలా చెప్పేవాడో అలాగే పింగళి తెలుగు పాఠాలు అంత గొప్పగా ,సొగసుగా చెప్పేవారు .కాటూరి వారిది శ్రీ వత్స గోత్రం ఇది ఎర్రన గోత్రమే .పింగళి వారిది గౌతమ్ గోత్రం తిక్కన సూరన గారిదీ ఇదే గోత్రం

దుగ్గిరాల గోపాల క్రిష్నయ్య బందరు వచ్చి స్వాతంత్ర్యోద్యమం లో పని చేయాలని యువకులను ప్రోత్సహిస్తున్నారు .పింగళి వారు ఆయన వెంటే ఉన్నారు .కాని స్పందించలేదు బందరు నుంచి వెళ్లి పోతు దుగ్గిరాల you have disappointed me ‘’‘’అని బాధ తో వెళ్లారట .పింగళి జనం జనవరి పది మరణం 10-1-1972అంటే జనన మరణాలు ఒకే తేది. దీనిపై శ్రీ మల్లెల గురు మూర్తియా అనే శిష్యుడు –

‘’జనవరి పది జననంబా –జనవరి పది నాదే –దైవ సాయుజ్యంబా /ఘనమగు ణీ సా ధర్మ్యము –జననము –మృతి యొక్క తన్న సత్యము చాతెన్ ‘’అని గొప్ప తత్వికామ్శాన్ని జోడించారు .పింగళి వారి పదవీ విరమణ కూడా 1949జనవరి పది ఏ అవటం విచిత్రం

పింగళి –కాటూరి

ఉయ్యూరు దగ్గర తోట్ల వల్లూరు జమీన్ లో వేణు గోపాల స్వామి ఆలయం లో రాజా బొమ్మదేవర సత్య నారాయణ ప్రసాద్ కవి సమ్మేళనం ఏర్పాటు చేసే వారు .లక్ష్మీ కాంతం గారికి ప్రత్యెక అవకాశమిచ్చే వారు ఆయన స్వీయకవితలను చదివింప జేసి ఆయన తోనే ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయించి ఆయనతో నే  చెప్పించేవారు భూరి సమ్మానం  అందించేవారు .ఇక్కడే మూడు సార్లు శాతావదానమూ చేశారు .పింగళి –కాటూరిజంట  ముదునూరు లో శతావధానం చేశారు

నాటకాను భవం

1911లో గుంటూరు లో ‘’నరకాసుర వధ ‘’నాటకం లో కృష్ణ పాత్ర పోటీలు జరిగాయి అందులో పింగళి ‘’మణి భద్రుడు ‘’పాత్ర ధరిస్తే అందరూ ఈయనకే ప్రైజ్ ఇవ్వాలని పట్టు బట్టారట .అంత గొప్పగా చిన్న నాటే నటించారు .పెద పులి వర్రు లో వీరి అన్నయ్య నరసయ్య గారు నాటక కంపెని పెట్టి తమ్ముడిని ఆహ్వానిస్తే వెళ్లి ఆడారు నరసయ్య గయుడు వీరు అర్జునుడు .నరకాసుర వధ లో కృష్ణుడు తమ్ముడు అన్న నరకుడు గా చేశారు .తూ గో జి.లో పసర్ల పూడి నాటక కంపెని నరసయ్య ను ఆహ్వానిస్తే తమ్ముడి తో వెళ్లి నాటకాలాడి మంచి పేరు తెచ్చుకొన్నారు అన్న రాజు ,తమ్ముడు సారంగ ధర, రామ్భాయి చిత్రాన్గిగా వేశారు పాదుకా పట్టాభిషేకం లో లక్ష్మీ కాంతం భరతుడు వేశారు బందరు రాయల్ కంపెనిలోధర్మ రాజు గా అన్న భీముడు గా వేశారు మున్జులూరి కృష్ణా రావు కృష్ణుడు వేశాడు. పింగళి వారు –ఉద్యోగ విజయాలలో ధర్మ రాజు గా వేస్తె నటనను మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి మామ గారు పురాణం సూరి శాస్త్రి గారు మెచ్చి తన పుస్తకం ‘’నాట్యాంబుజం‘’లో రాశారు పద్యం తో రాగం ఆపెయ్యటం పింగళి ప్రత్యేకత .దేవా గాంధారి రాగం అమితం గా ఇష్టం .కేదార గౌళ కానడ రాగాలు కూడా బాగా అభిమానించేవారు ధర్మ రాజు శాంతం కోపం ఉద్రేగం ఉద్వేగం అన్నీ ణ భూతో నటించేవారు లక్ష్మీ కాంతం ప్రేక్షకుల చేత కంట తడి పెట్టించేవారు

పింగళి వారి నాటక రంగ ప్రవేశం యాదృచ్చికం గా జరిగింది గురువు గారితో ఒక ఊళ్ళో పాండవ ఉద్యోగ విజయ నాటక ప్రదర్శనకు వెళ్ళారు అనుకోకుండా ధర్మ రాజు పాత్ర దారికి జబ్బు చేసి నటించలేకపోయాడు గురువు శిష్యుడిని వేషం కట్టమన్నారు .అంతే రంగం లోకి దూకారు అద్భుతం గా నటించి మెప్పించారు ఇలా అరంగేట్రం కాదు తెరంగేట్రం చేశారు .కంతా భరణం లో కృష్ణా రావు ,రసపుత్ర విజయం లోరాజ నరసింహుడు ,ప్రతాప రుద్రీయం లో విద్యానాధుడు ,చిత్ర నలీయం లో బాహుకుడు ,ముద్రా రాక్షసం లో రాక్షస మంత్రి ,మృచ్చకటికం లో చారుదత్తుడు వేషాలను గొప్పగా నటించి రక్తి కట్టించారు రాజ సింహ పాత్ర్సకు బంగారు పథకం పొందారు కవిత్వం లోనే కాక నాటకం లోను తరిఫీదు నిచ్చే వారు గురువు వెంకట శాస్త్రి ఆయన రాసిన నాటకాలే ఎక్కువ .ఆయన శిష్యులు వేషం వేస్తున్నారంటే నటులకు గౌరవం పెరిగింది నాటక కళకు, నటులకు గౌరవం తెచ్చారు శాస్త్రి గారు

పింగళి ప్రత్యేకత

‘’పింగళి అనుకరిస్తూ వెంట తిరిగే వాడిని ‘’అన్నాడు విశ్వనాధ .ఆంధ్రా యూని వర్సిటి  సెనేట్ సభ్యులు గా చాలా కాలం ఉన్నారు .1947లో మళ్ళీ పోటీ చేసి ఒడి పోయారు. వేయి పడగలు నారాయణ రావు నవలలకు దేనికి మొదటి బహుమతి ఇవ్వాలి అని యూని వర్సిటి లో వివాదం వస్తే పింగళి వారితో సహా నారాయణ రావు కే మొగ్గారు .కాని రాజా విక్రం దేవ వర్మ వేయి పడగలు కు మొగ్గారు .చివరికి రాజా వారి ఆర్ధిక సాయం ఇద్దరికి పంచారు .

‘’ నాగురించి ఎవరూ ఏమీ రాయక్కర  నేనే రాసుకొంటాను’’అని చెప్పి ఆత్మ కధను ‘’ఆత్మ లహరి ‘’గా రాసుకొన్న గడసరి పింగళి .తరతరాలుఆ వీరితో బాటు వీరి వంశం సూర్యోపాసకులే

‘’విశ్వనాధ కు అన్న వంటి వాడిని .ఈ మధ్య రైలు లో బందరు దాకా ఇద్దరం కలిసే ప్రయాణం చేశాం దూరమైన హృదయాలు దగ్గరయ్యాయి .ఇద్దరం తాటి తేగలు కొనుక్కుని తిన్న విషయం గుర్తుకు తెచ్చుకోన్నాం ‘’అన్నారు పింగళి విశ్వనాధ షష్ట పూర్తీ సన్మానసభలో .దీనికి సమాధానం గా విశ్వనాధ ‘’కవిత్వపు ముఖ్య గుణాలన్నీ పింగళి ,రాయప్రోలు ల నుండే నేర్చాను .ఆ తర్వాత ‘’నేనే వాళ్ళ కంటే గొప్ప వాణ్ని అనుకోన్నానను కోండి’’ బందర్లో అందరితో బాటు నేను ఆయన్నే అనుకరించాను ‘’అని గర్వం గా ధీమాగా చెప్పాడు విశ్వనాధ పింగళి కంటే ఏడాది రెండు నెలలు చిన్న వాడు . ‘’’’భావంబున కోరుదు –భవ్యా వేశుడనైన-సమయ మందున –నాయీ జీవుడు నిర్జర తటినీ ప్లావితుడ నయి –భాను మండలము చొరబారన్ ‘’అని తన కవితా వేష లక్షణాన్ని ,తన జీవిత లక్ష్యాన్ని చాటుకొని తానూ ఆరాధించే ఆ సూర్య మండలం లోకి చేరాలనే కోరిక ను చెప్పుకొన్నారు అంటే దుర్నిరీక్షుడు గా వెలిగి పోయారు పింగళి లక్ష్మీ కాంతం గారు .

ఇందులోని విషయాలను నిన్న చిట్టూర్పు లో జరిగిన లక్ష్మీ కాంతం గారి సభలో చెప్పాలని రాసుకోన్నవి .కాని అవకాశం లేక ఈ వ్యాస రూపం గా రాసి అందరికి తెలియ జేస్తున్నాను

సంక్రాంతి శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -13-1-14-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.