వ్రత ఫలంగా పరమపదం– పండుగ చెప్పిన పరమార్ధం

 

ఈ ముప్ఫయ్యవ పాశురంలో ఈ ధనుర్మాస వ్రతం చేసేవారికి కలిగే ఫలశ్రుతిని వివరించి చెప్పారు.
వంగక్కడల్ కడైన్ద మాదవనై క్కేశవనై
త్తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రిరైఞ్చ
అంగప్పరైకొణ్డవాత్తయ్ యణిపుదునై
పెంగమలత్తర్డెరియల్ పట్టరు పిరాన్ కోదైశొన్న
శంగత్తమిల్‌మాలై ముప్పదుమ్ తప్పామే
ఇంగిప్పరిశురైప్పా రీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెంగిణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్
ఎంగుమ్ తిరువరుళ్‌పెత్తిమ్బరువరెమ్బావాయ్!!
ఆండాళ్ తల్లి ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించిన తరువాత ముప్ఫయ్యవ రోజున శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకుంటోంది. ఓడలతొ నిండి ఉన్న సముద్రాన్ని చిలికిన పరమాత్మను మాధవుడని, కేశవుడని అంటున్నారు. అప్పట్లో దేవతలు అమృతం కావాలని సముద్రాన్ని చిలికారు. సముద్రం నుంచి వచ్చిన లక్ష్మీదేవిని భార్యగా పొందినందుకు ‘మాధవా’ అంటున్నారు. సముద్రాన్ని చిలికేటప్పుడు విడిపోయిన కేశాలు నలువైపులా చెల్లాచెదురుగా పడి ఉన్నందుకు ‘కేశవా’ అంటున్నారు. పరమాత్మ అందమైన కేశాలు కలవాడని అర్థం. చంద్ర బింబం లాంటి అందమైన ముఖం గల గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించి, ఈ ధనుర్మాస వ్రతం చేసి, కైంకర్యమనే మహా పురుషార్థాన్ని పొందారు.
పరమాత్మానుభవం పొందిన కారణంగా పరమ భాగవతోత్తములైన గోపికలు ముఖాలు చంద్రుడి వంటి చల్లదనం కలిగి ఉన్నాయట. ప్రస్తుతం శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన పెరియాళ్వారుల కుమార్తె అయిన గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతం చేసి, శ్రీకృష్ణ పరమాత్మను అంటే వటపత్రశాయిని భర్తగా పొందింది. “ప్రస్తుతం నేను చేసిన వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో వారికి చతుర్భుజాలు కలిగి, ఎర్రని నేత్ర సౌందర్యం కలిగిన సర్వేశ్వరుడు ఇహ పరలోకాలలో శాశ్వతమైన ఆనందాన్ని అనుగ్రహిస్తాడని, వారు తప్పకుండా పరమ పదాన్ని పొందగలరని ఆండాళ్ తల్లి చెబుతోంది.
– వివరణ, చిత్రంః డాక్టర్ చెలికాని మురళీకృష్ణారావు
94400 09535

 

 

హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాలను వివరించారు.. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగీకులు, ప్రఖ్యాత తెలుగు అవధాని.. గరికపాటి నరసింహారావు…

ముగ్గులు
ఓర్పును నేర్పే కళ…

ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్లు ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్‌మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జెడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్‌సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి.

అదే – ప్రకృతిలోని తోటి జీవుల పట్ల ‘భూతదయ’ కలిగి ఉండటం అన్నది. అందుకే బియ్యపు పిండితోనే ముగ్గులేస్తారు. ఆ పిండిని తినడానికి ఇంట్లోని సూక్ష్మక్రిములు, చీమలు, బొద్దింకలన్నీ లోగిళ్లలోకి వచ్చి చేరతాయి. తద్వార ఇల్లు శుభ్రం అవుతుంది. సంక్రాంతికి 27 చుక్కల నక్షత్రం ముగ్గు ఎందుకు పెట్టేవారంటే – మనకున్న నక్షత్రాలు 27. ఒక నక్షత్రంలో పుడితే మంచిదని, మరో నక్షత్రంలో పుడితే చెడ్డదనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు ప్రతీకాత్మకంగా 27 చుక్కల్ని కలిపి వేస్తే ఒక రంగవల్లిక ఏర్పడినట్లు.. ఏ నక్షత్రంలో పుట్టినా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉందనే భరోసాను కలిగిస్తుంది ఈ ముగ్గు. ఎన్ని చుక్కలు పెట్టి వేస్తే అంత మంచి ముగ్గు వస్తుంది. ఎంత మంది మనుషుల్ని కలుపుకు పోతే అంత ఓర్పు మన సొంతం అవుతుంది అని కూడా ముగ్గులు బోధిస్తాయి. ఏ జీవినైనా కలుపుకుపోయే మనస్తత్వం కంటే నేనొక్కన్నే అన్న భావన ఏ కోశానా మంచిది కాదు.

భోగిమంటలు
వ్యామోహానికి నిప్పు

మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి.

భోగిమంటలకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మంటల కోసం వంట చెరకును వాడరు. యజ్ఞయాగాదుల్లో వాడే సమిధల్నీ ఉపయోగించరు. కేవలం పాత సామాన్లు, దుంగలతోనే మంటల్ని వేస్తారు. భోగిమంటల వల్ల మరో ప్రయోజనం.. అగ్ని ప్రమాదాల్ని నిలువరించడం. ఏటా వచ్చే పండక్కి ఇలా భోగిమంటల్లో పాతసామాన్లు కాలిపోతే ప్రమాదాలు తగ్గిపోతాయి.

గంగిరెద్దులు, హరిదాసులు
భిక్షానికీ ఓ ధర్మం..

ఏ పనీ చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు. గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్లు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామకీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్లిపోతాడు. పండగ పోయాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది.

గుమ్మడికాయ
తీగల్లా అల్లుకుపోవాలి..

ఎప్పుడూ గుర్తుకురాని గుమ్మడి సంక్రాంతి రోజున గుర్తుకొస్తుంది. గుమ్మడి పోషకాల గని. ధాతుపుష్టికి, సంతానవృద్ధికి పనికొస్తుంది. ఏడాదికి ఒకసారైనా గుమ్మడికాయ వంటల్ని తినాలన్నది పెద్దల మాట. గుమ్మడి ఆకారం విశ్వస్వరూపానికి ప్రతీక. గుమ్మడి పాదు కూడా విస్తృతంగా అల్లుకుపోతుంది. మనిషి జీవితాన్ని కూడా ఎంత విస్తృతి చేసుకుంటే అంత ఉత్తమం. ఇరుకైన మనస్తత్వం కలిగుంటే ఇరకాటంలోనే ఉండిపోవాల్సి వస్తుందని గుమ్మడి చెబుతుంది.

గొబ్బెమ్మలు
అసహ్యం నుంచి అద్భుతం

కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమ్మీదున్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంత కాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే, నేల మీద పడని ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు. గుమ్మడిపూలు, చామంతిపూలు, రేగుపండ్లను అలంకరిస్తారు. కులాలకు అతీతంగా మహిళలందరూ కలిసి గొబ్బెమ్మ పాటల్ని పాడతారు. వ్యష్టి కంటే సమిష్టి గొప్పదన్నది దానర్థం. ఆరోజుల్లో స్త్రీ సంబం«ధిత వ్యాధుల (గైనిక్)కు ఈ పాటలే చిట్కాలు చెప్పేవి. ఆరోగ్య చైతన్యాన్ని కలిగించేవి. ‘కాళ్లాగజ్జి కంకాళమ్మ’, ‘వేగూచుక్క వెలగామొగ్గ’, ‘చెమ్మచెక్క చారడేసి మొగ్గ’ వంటి పాటల్లో ఒక్కో జబ్బుకు ఒక్కో ఔషధ సూచన కనిపిస్తుంది.

భోగిపండ్లు
యోగిత్వం.. బదరీఫలం

సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.

బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.

గాలిపటం
దారంలాంటిది జీవితం

ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైన ముందుకు వెళుతుంది. అయితే చేతిలో దారం ఉంది కదాని ఎంతదూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడులాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది.

కోడిపందేలు
యుద్ధనీతిని గెలిపించే పందెం

పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది. యుద్ధనీతిని తెలియజేసింది.

పశు పూజలు
శ్రమకు కృతజ్ఞత

సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు.

ఇంటర్వ్యూ: మల్లెంపూటి ఆదినారాయణ

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.