అమ్మ కు నిర్వచనం జిల్లెళ్ళమూడి అమ్మ
‘’నీ పిల్లలో ఏమి చూస్తున్నావో అందరిలో దానినే చూడటం బ్రహ్మస్తితి పొందటమే .తిధులు విధిని మార్చలేవు .పెట్టింది కాదు ,జరిగేదే ముహూర్తం .మానవుడి నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు ,రాగ ద్వేషాలు అనే రెండే రెండు గ్రహాలమీదే .జీవితం సమస్యల తోరణం , సమస్యలతో రణం .వైకల్యం లేనిదే కైవల్యం .తృప్తే ముక్తి, దిగులే జిజ్ఞాస ,తపనే తపస్సు .వర్గం లేనిదే స్వర్గం .విశ్వాసం కర్తవ్యమే భగవంతుడు .విధి వర్షం లాంటిది కొందరికి అనుకూలం కొందరికి ప్రతికూలం .ప్రేరణే దైవం .సర్వత్రా అనురాగమే విరాగం .నేను అమ్మను ,మీరు నా బిడ్డలు ‘’ఇవీ అందరికి అమ్మ అమ్మకి నిర్వచనం అయిన జిల్లెల్ల మూడి అమ్మ అభిభాషణం .చిన్న చిన్న మాటలలో ఎంత జీవిత పరమార్ధాన్ని కర్తవ్యాన్ని ,బోదొంచిందో .?సకల వేదోపనిషత్తుల సారం అంతా వీటిలో నే ఉంది .ఆప్యాయతకూ ఆత్మీయతకు ,ఆదరణకు అమ్మ మారు పెరి నిలిచింది .జిల్లెల్ల మూడి అమ్మగానే అందరికి తెలుసు .అమ్మ జీవిత విశేషాలను తెలుసుకొందాం .
బాల్యం –వివాహం
అమ్మ గుంటూరు జిల్లా పొన్నూరుకు దగ్గరలోని మన్నవ గ్రామం లో 28-3-1923న ఆఊరి కరణం మన్నవ సీతాపతి శర్మ ,రంగమ్మ లకు జన్మించింది .అనసూయమ్మ గా నామకరణం చేశారు. పసితనం గొల్ల నాగమ్మ పెంపకం లో గడిచింది .చిన్నప్పటి నుంచే అమ్మ అనేక మహిమలు చూపి అందరికి ఆశ్చర్యం కలిగించింది .తల్లి రంగమ్మ చనిపోతే అందరూ ఏడుస్తుంటే ఏడవ వద్దని అమ్మ దేవుడి దగ్గరకే వెళ్లిందని ఓదార్చింది .ఒక సారి బాపట్ల భావనారాయణ స్వామి గుడికి వెడితే పూజారి గమనించకుండా గుడి తలుపులు మూసేసి వెళ్ళిపోగా అక్కడే విచికిత్స చేసి అన్నిటికీ ఆధారం భూమి కనుక భూమి పూజ చేయాలని చెప్పింది .మర్నాడు ఉదయం పూజారి వచ్చి గుడి తలుపులు తెరవగానే అమ్మ రాజ్యలక్ష్మీ అమ్మ వారుగా దర్శన మిచ్చింది .మరో సారి ఒక పోలీసు ఉద్యోగి అమ్మ మెడలోని పులిగోరు తీసుకోవటానికి ప్రయత్నిస్తే అమ్మే తీసి ఇచ్చింది .అతను ఆశ్చర్య పడి మళ్ళీ భక్తితో అమ్మ మెడకు అలంక రించి నమస్కరించి వెళ్లి పోయాడు .అమ్మ పై అందరికీ అనంత విశ్వాసం కలిగింది ఆమెను సర్వ దేవత స్వరూపిణి గా భావించారు .పదమూడవ ఏట అమ్మకు మేనత్త కనకమ్మ గారి పెద్ద కొడుకు బ్రహ్మాండం నాగేశ్వర రావు తో 5-5-1936న బాపట్ల లో వివాహం చేశారు కాపురం బాపట్ల లో పెట్టారు .నాలుగేళ్ల తర్వాత 1940లో జిల్లెల్ల మూడి కి ఆ దంపతులు చేరి అక్కడ కాపురమున్నారు .ఆగ్రామానికి ప్రయాణ సౌకర్యమే లేదు వారి పెద్దకొడుకు సుబ్బారావు గ్రామ సర్పంచ్ అయిన తర్వాతే 1966లో రోడ్డు వేశారు .
ధార్మిక కార్యక్రమాలు
1950నది వేసవి లో ఒక సన్యాసి ఆకలితో అలమటిస్తూ నడిచి సోలిపోతుంటే అమ్మ చూసి ఇంటికిపిలిచి ఆతిధ్యంస్వీకరించమని కోరింది .ఆ ఊళ్ళో దేవాలయం లేదు కనుక తాను భిక్ష స్వీకరించనని చెప్పగా అమ్మ మనసు తల్లడిల్లి ఒక దేవాలయం ,స్వంత సత్రం ఏర్పాటు చేయాలని భావించింది .ఊరి వారందరి సహకారం కోరుతూ ఎవరికీ ఇబ్బంది కలుగ కుండా రోజుకు ‘’పిడికెడు కెడు బియ్యం పధకం ‘’ఏర్పాటు చేసింది .ప్రతి ఇంటి వారు దాన్ని సేకరించి అండ జేసేవారు వాటిని భద్రం చేసి అందులో కొంత భాగం దేవాలయ నిర్మాణానికి ఉపయోగించటం ఆమె ఆలోచన .కొద్ది కాలం లోనే ఇది అద్భుతా విజయం సాధించింది .’’పిడికెడు బియ్యం ‘’అనేది మంత్రం లా పని చేసింది .1958ఆగస్ట్ పదిహేను న‘’అన్న పూర్ణాలయం ‘’కు ప్రారంభోత్సవం చేసింది .ఆ సత్రం లో భోజనం చేయటానికి ఆకలే అర్హత .అర్హత వేషధారణ బట్టి కాకుండా ఆకలిని బట్టే అన్నం పెట్టింది .అన్ని బాధల కంటే ఆకలి బాదే ఎక్కువ అనేది అమ్మ .సమాజం లోని అన్ని వర్గాల వారు అన్ని రకాల వారు అమ్మ చేతి అన్న పూర్ణ ప్రసాదాన్ని అమ్రుతోప మానం గా ఆర గించారు .అమ్మ తన ఇంటిని ‘’అందరి ఇల్లు ‘’అని పేరు పెట్టింది .
బాపట్ల కుష్టు ఆస్పత్రిరోగులకు అరటిపళ్ళు ,పరవాన్నం ,పులిహోరా పంపేది అమ్మ .అందరినీ సమానం గా చూడటమే అమ్మ మనసు .ఒక జ్యోతిష్యుడు వచ్చి ఏదైనా ప్రశ్న అడగమంటే ‘’సృష్టిలో ఏ ప్రాణీ ఆకలితో బాధ పడకుండా ఉండే రోజు ఎప్పుడొస్తుందో చెప్పండి ?’’అని అడిగి ఆయన్నుఅప్రతిభుడిని చేసింది .అదే అతిలోక మాతృత్వం అది అమ్మకే సాధ్యం .అన్నం తో బాటు బట్టలనూ అందరికీ అందించేది .జిల్లెల్ల మూడి వచ్చిన ప్రతి వారు అమ్మ ప్రసాదం తిన కుండా ,అమ్మ ఇచ్చిన వస్త్రాలను పొందకుండా వెళ్ళిన వాళ్ళు లేనే లేరు .మరో సారి వాసుదాస స్వామి అనే వైష్ణవ స్వామి వద్దకు అమ్మ వెళ్ళగా తల్లి లేని పిల్ల అని తెలిసి అందరూ తనను ప్రేమించేట్లు చేయనా అని అడిగాడు. అమ్మ ‘’అందరూ నన్ను ప్రేమించినా ద్వేషించినా నేను అందర్నీ ప్రేమించేట్లు ఆశీర్వ దించండి ‘’అని కోరి తన నడవడికి ఒక దివ్య మార్గాన్ని ఎన్ను కొన్నది అమ్మ .
సంస్కృత పాఠ శాల –విద్యాలయం –హైమాలయం –ఆదరణాలయం
ప్రేమ మయ వాతావరణం లో ఉండేట్లు అందరినీ చేసింది అమ్మ .అందరూ అక్కా చెల్లి అన్నా తమ్ముడు గానే అక్కడ మెలగటం విశేషం .అమ్మ సన్నిధిదైవసంనిదే వారికి . .1971లో సంస్కృత పాఠశాల ,కళా శాలను అమ్మ నెలకొల్పి మన సంస్కృతీ సంప్రదాయ వ్యాప్తికి ముందడుగు వేసింది .అక్కడ చదివే ప్రతి వారికి ఉచిత వసతి ,భోజన సౌకర్యాలు కలిగించి ఆదర్హ ప్రాయమైనది ..1978రోగార్తులకోసం ఒక ఉచిత విద్యాలయాన్ని స్థాపించి సేవలందించింది .అప్పటికే ఉన్న ఆయుర్వేద విద్యాలయానికి తోడుగా హోమియో వైద్య శాల ,అల్లోపతి వైద్య శాల ఏర్పరచింది .తన కుమార్తె హైమ లో అందరిలో మానవత్వాన్ని ,అనుబంధాన్ని అనురాగాన్నీపెంపొందించే తలం పు తో పెంచింది .ప్రసిద్ధ జర్నలిస్టు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు హైమ ను చూసి హైమ లో దేవత స్వరూపం కనీ పిస్తోంది అని కొనియాడారు .అమ్మ తన దగ్గరకు వచ్చే రోగుల్ని హైమ వద్దకు పంపేది.ఆమె వారి పాలిటి కల్ప వృక్షం కామ ద్వేనువు గా బాధలు నివారించేది .పదవీ విరమణ చేసిన వారికి ,జబ్బుతో బాధ పడుతూఎవరూ పట్టించుకోని వారికి అండగా ‘’ఆదరణాలయం ‘’ఏర్పరచి వారి పాలిటి దీన బంధువే అయింది అమ్మ .
ప్రచురణలు –సినిమాలు
మాతృశ్రీ పబ్లికేషన్ ట్రస్ట్ ను 1966లో ప్రారంభించి సంస్కృతాంధ్ర హిందీ ఒరియా భాషలలో వందకు పైగా ప్రచురించి అమ్మ సాహిత్యాన్ని ప్రపంచమంతా పంచి బెడుతున్నారు .1971లో ‘’విశ్వ జననీ పరిషత్ ‘’ను ఏర్పరచారు .అమ్మ పై అడపా రామ కృష్ణా రావు గారు మొదటిగా కొన్ని స్లైడులు తయారు చేశారు .తర్వాత అరగంట డాక్యుమెంటరి చిత్రం అమ్మ పై వచ్చింది .పది హీను రీళ్ల లో జిల్లెల్ల మూడి లో జరిగే అన్ని కార్యక్రమాలను ,అమ్మ పర్యటనలు స్వర్ణోత్సవ వేడుకలు ఆన్నీ చిత్రీకరించి శ్రీ కొండముది రామ క్రిష్ణ స్క్రిప్ట్ రాయగా ప్రముఖ నటుడు పి.జే.శర్మ కామెంటరి చెప్పాడు సూక్తులతో మరో కామెంటరి ఫిలిం తయారైంది. అమ్మ జీవితంపై ‘’మాతృశ్రీ జీవితం –సాహిత్యం –సౌందర్య సర్వస్వం ‘’పేరు తో డాక్టర్ బి.ఎల్ సుగుణ తెలుగు విశ్వ విద్యాలయం లో పరి శోధన చేసి ‘’మాతృశ్రీ తత్వ సౌరభం ‘’పేర ముద్రించారు
అమ్మ మహా ప్రస్తానం
.విశాల మైన నుదురు భ్రుకుటి పై పెద్ద యెర్ర కుంకుమ బొట్టు ,ముక్కుకు ముక్కెర ,చేతుల నిండా గాజులు ,ఒంటి నిండా చీర కొంగు కప్పుకొని,చిరునవ్వు తో ఆప్యాయం గా రారా నా కన్నా రా అమ్మా అని ఆప్యాయం గా పిలుస్తున్నట్లు చేతులు చాపి అపర అన్న పూర్నా దేవిలాగా సాక్షాత్కరించేది అమ్మ అనసూయమ్మ చూడగానే భాతి ప్రపత్తులతో ప్రనమిల్లాలనే ఆలోచన మనసులో వచ్చి నిండు హృదయం తో నమస్కరిస్తారు .ఆ సంస్కారం ప్రేమ ,ఆదరణ అమ్మ దానం లో ఉన్న కమ్మదనం అమ్మ లోనే అందరూ దర్శంచే వారు . అమ్మ పై ఆరాధన ఉన్న వారికోసం హైమాలయం అనసూయేశ్వరాలయాలు ఏర్పడ్డాయి పరిస్తితులకు మించిన గురువులేదు అన్న అమ్మకు గురువులే లేరు .1958మాఘ పౌర్ణమి నాడు నల్ల మడ వాగు అనే ఓంకార నదిలో అసంఖ్యాక భక్తులకు అమ్మ దేశి రాజు రాజమ్మ గారి అభ్యర్ధన మేరకు మంత్రోపదేశం చేసి చిరస్మరణీయురాలైంది .16-2-1981.అమ్మ భర్త, అందరికి ‘’నాన్నగారు’’ అయిన నాగేశ్వర రావు గారు మరణించారు..5-4-1968అమ్మ కూతురు హైమ చనిపోగా విగ్రహం చెక్కించి ప్రాణ ప్రతిష్ట చేసి దేవాలయం కట్టించింది .1973లో అమ్మ యాభై ఏళ్ళ స్వర్ణోత్సవ సమయం లో ఒకే పంక్తిలో లక్ష మందికి భోజనం పెట్టింది అమ్మ .మిగిలిన పదార్ధాలను పశు పక్ష్యాడులకు జల చరాలకు పెట్టించింది .వజ్రోత్సవం నాడు పశువులకు పూజ చేయించింది . అమ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది ..ఎందరో వైద్యులు అమ్మ ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు .అమ్మకు భ్రుకుటీ భేదం ,సహస్రార భేదం జరిగింది తలనుండి , భ్రుకుటి నుండి రక్తం చిమ్మి త్రుటిలో భస్మం గా మారిపోవటం జరిగి అందరికి ఆశ్చర్యం కలిగించింది .అమ్మ ను ‘’యోగ పరాకాష్ట స్తితి పొందిన జగన్మాత ‘’గా కొమర్రాజు లక్ష్మీ కాంత యోగి, కాంతయ్య యోగి వర్ణించారు .12-7–1985లో అరవై మూడవ ఏట అమ్మ జగదమ్మలో కలిసి పోయింది .5-5-1987 అమ్మ కళ్యాణ దినోత్సవం రోజున అమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది
అమ్మను జీవితకాలం లో సందర్శించిన ప్రముఖులలో రఘువర దాసు ,ఆత్మానంద స్వామి లక్ష్మణ యతీంద్రులు ,నరసింహ యోగి ,ప్రభాకర ఉమా మహేశ్వర పండిట్ ,కుర్తాలం పీఠాధిపతి శివ సదానంద భారతీస్వామి ప్రసాద రాయ కులపతి ,కరుణశ్రీ ,జటావల్లభుల పురుషోత్తం జమ్మలమడక మాధవ రామ శర్మ ,ఎక్కిరాల కృష్ణమాచార్య ,పుట్టపర్తి నారాయణాచార్యులు ,పళ్ళే పూర్ణ ప్రజ్ఞాచార్యులు, దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు వంటి వారెందరెందరో ఉన్నారు .ముప్ఫై కి పైగా తెలుగులోనూ అయిదు ఆంగ్లం లోను అమ్మపై పుస్తకాలను మాతృశ్రీ పబికేషన్స్ ప్రచురించి అమ్మ భావ వ్యాప్తికి దీప్తి కల్గిస్తోంది .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –