ఎదిరించకపోతే అన్యాయాలదే రాజ్యం

 

సాఫీగా సాగిపోయే మార్గాన్ని ఎంచుకునేందుకు అనువైౖన జీవన నేపథ్యం ఆయనది. అయినా నిరంతరం పోరాట మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నట్లు? ఏ చిన్న బాధకైనా కన్నీటి పర్యంతమైపోయే బొజ్జా తారకం అనుక్షణం తీవ్రమైన సంఘర్షణకు గురిచేసే మార్గంలో ఎందుకు నడిచినట్లు? కులపోరాటాల్ని, వర్గపోరాటాల్ని సమన్వయ పరచనిదే భారతదేశంలో ఏమీ సాధించలేమని నొక్కి పలికే ఆయన అనేక విషయాల్లో దళితలోకానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. నాలుగున్నర దశాబ్దాల న్యాయవాద వృత్తిలో, ఏడు పదుల జీవితంలో బొజ్జా తారకం ఎదుర్కొన్న కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’

“అన్యాయమైన పద్దతిలో ఎవరైనా ఒకసారి తప్పించుకోవచ్చు. కానీ అక్కడితోనే మన ం ఆగిపోతే, అది వారి న్యాయమైన గెలుపుగా చలామణీ అవుతుంది. అందుకే అన్యాయాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని గెలిపించుకోవచ్చని ఆ రోజు నాకు బోధపడింది.

తూర్పు గోదావరి జిల్లాలోని కందికుప్ప మా ఊరు. కాకపోతే ఆ ఊరికి కిలోమీటర్ దూరంలోని ‘మాలపేట’ మా నివాస స్థలం. ఇది బంగాళాఖాతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా తాతయ్య గోవిందదాసు తత్వాలు పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఆయనకు వేల మంది శిష్యులు ఉండేవారు. ఆ ప్రాంతంలో ప్రముఖంగా ఉండే రాజులు, కాపులు కూడా తరుచూ మా ఇంటికి వచ్చేవారు. అంటరాని కులానికి చెందిన వాడైనా ఆయనను ఎవరూ అలా చూసే వారు కాదు. అందుకే నా బాల్యంలో అంటరానితనం తాలూకు సమస్యలేవీ ప్రత్యక్షంగా నన్ను తాకలేదు కానీ, పరోక్షంగా వాటి గురించి కొంత తెలుసు.

నా పసితనంలో పెసరట్లు అమ్ముకోవడానికి ఒక వ్యక్తి మా పేటకు వచ్చేవాడు. మోకాళ్ల దాకా పంచె తప్ప అతని ఒంటి మీద చొక్కా కూడా ఉండేది కాదు. పెద్ద బొజ్జ ఉండేది. అతడు గొల్ల కులస్తుడు. అతను పెసరట్లను మాల పిల్లలకే అమ్ముకోవడానికి వచ్చినా ఎవరూ తనను ముట్టుకోకుండా దూరదూరంగా ఉండేవాడు. తననే కాదు తన సైకిలును గానీ, పెసరట్లు తెచ్చిన డబ్బాను గానీ ఎవరూ తాకడానికి వీలులేదు. పిల్లలు డబ్బులు ఇస్తే పైనుంచి అరచేతిలోకి వేయాలి. తను కూడా పెసరట్లను ఆకులో పెట్టి పైనుంచి అరచేతుల్లోకి వదిలేవాడు. అతను బతుకుతున్నది మాలపిల్లలు ఇచ్చిన డబ్బులతోనే అయినా వాళ్లు మాత్రం తనను తాకడానికి వీల్లేదనడంలోని ఆ వైరుధ్యం ఏమిటో మొదట్లో అర్థం కాకపోయినా ఆ తర్వాత రోజుల్లో అర్థమవుతూ వచ్చింది. నిజానికి ‘గొల్ల’ అగ్రకులమేమీ కాదు. అయినా అతనికి ఆ వాసనలు సోకాయి. 1942లో అంబేద్కర్ చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యటన తర్వాత కుల వివక్ష కొంత బలహీనపడింది. ఏ సంఘ సంస్కరణ అయినా, ఉద్యమస్థాయిలో జరిగితే తప్ప ఆశించిన మార్పు జరగదన్నది నా భావన.

ఎక్కడో ఎదురవుతుంది
నాన్నగారు అప్పలస్వామి టీచర్‌గా పనిచేసేవారు. ఆయన 1952 నుంచి 1962 దాకా ఎంఎల్ఏగా ఉన్నారు. ఆ తరువాత ఎన్నికల్లో ఓడిపోయినా తన సామాజిక కార్యక్రమాలను మాత్రం యథావిధిగా కొనసాగించారు. ఎన్నో సామాజిక పోరాటాలు చేశారు. తాతయ్య చాలామందికి పూజనీయుడిగా ఉండడం వల్లగానీ, నాన్నగారు ఎం.ఎల్.ఏగా, ఒక సామాజిక నాయకుడిగా ఎదగడం వల్ల గానీ, నా చదువైపోయేదాకా ఎక్కడా కుల వివక్ష తాలూకు కష్టాలు నన్ను వేధించలేదు. కానీ, న్యాయవాద పట్టా తీసుకుని 1966లో కాకినాడలో తొలిసారిగా ప్రాక్టీస్ మొదలెట్టినప్పుడు మాత్రం ఆ సమస్యలు నన్ను ఢీకొన్నాయి. ఆ రోజుల్లో కాకినాడలో ఉన్న ఎస్సీ న్యాయవాదిని నేనొక్కణ్నే. నా కేసుల్ని స్వీకరించే విషయంలో గానీ, నా వాదనల్ని వినే విషయంలో గానీ, తీర్పు చెప్పే విషయంలో గానీ, న్యాయమూర్తులు చాలా వివక్షతో వ్యవహరించేవారు.

అది నన్ను తీవ్రమైన ఆవేదనకు గురిచేసేది. అక్కడంతా బ్రాహ్మణుల ఆధిపత్యమే ఉండేది. వాళ్ల కుటిలమైన ఎత్తుగడల వల్ల ఎస్సీ కేసులు తప్ప వేరే ఏవీ నా వద్దకు వచ్చేవి కాదు. పనిగట్టుకుని కొందరు అలా రాకుండా చేసేవారు. నాన్నగారి నుంచి ఆర్థిక సహాయం అందడం వల్ల సరిపోయింది గానీ, లేదంటే న్యాయవాద వృత్తి నాకు భారమయ్యేది. సరిగ్గా అదే సమయంలో ఒక భూస్వామి వద్ద పనిచేస్తున్న పాలేరును అన్యాయంగా ఒక కేసులో ఇరికించి అతన్ని దారుణంగా కొట్టి జైలుకు పంపించారు. వాళ్లు బెయిల్ కోసం నా వద్దకు వ చ్చారు. పిటిషన్ వేస్తే చాలా సులువుగా రావలసిన బెయిల్ రాలేదు. అది నన్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేసింది. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న న్యాయవాద వృత్తి నాది. చివరికి బెయిల్ కూడా ఇప్పించలేని న్యాయవాదిననైతే నా ఉనికికి అర్థమేముంటుంది? జరిగిన కుతంత్రమేమిటో తెలుసుకుని ఐదు రోజుల తర్వాత బెయిల్ తిరస్కృతిని సవాలు చేస్తూ మళ్లీ పిటిషన్ వేశాను. ఇక తప్పదన్నట్లు ఈ సారి బెయిల్ ఇచ్చారు. అన్యాయమైన పద్దతిలో ఎవరైనా ఒకసారి తప్పించుకోవచ్చు. కానీ అక్కడితోనే మన ం ఆగిపోతే, అది వారి న్యాయమైన గెలుపుగా చలామణీ అవుతుంది. అందుకే అన్యాయాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని గెలిపించుకోవచ్చని ఆ రోజు నాకు బోధపడింది.

అన్యాయానిదే రాజ్యమై…
నిజామాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న బోయిభీమన్న గారి కూతురు విజయభారతిని 1968లో నేను పెళ్లి చేసుకున్నాను. మొదట్లో వీలును బట్టి నిజామాబాద్‌కు వస్తూపోతూ ఉన్నా, ఆ తర్వాత నిజామాబాద్‌కే వచ్చేసి అక్కడే ప్రాక్టీస్ మొదలెట్టాను. ఆ రోజుల్లో నిజామాబాద్‌లో దళిత లాయర్‌గా ప్రాక్టీసు చేసినవాడ్ని నేనొక్కడ్నే. అక్కడే ‘అంబేద్కర్ యువజన సంఘం’ స్థాపించాను. ఎస్సీలే కాకుండా బీసీ యువకులు కూడా అందులో ఉండేవారు. అలా ఉండడం అదే ప్రథమం. బీసీని అధ్యక్షుడిగా, ఎస్సీని కార్యదర్శిగా పెట్టడం ద్వారా ఆ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. అంటరానితనానికి, అణచివేతకు, దళితుల మీద జరిగే దాడులకు వ్యతిరేకంగా ఉద్యమ స్పూర్తితో ఈ సంఘం పనిచేసేది. లాయర్‌గా నాకు కేసులైతే వచ్చేవి కానీ, సంపాదనైతే ఏమీ ఉండేది కాదు. నా భార్య ఉద్యోగం చేస్తున్నందువల్ల సంసార భారమంతా ఆమే మోసేది. నిజామాబాద్ పట్టణానికి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘పాలెం’ అనే గ్రామంలో ఒక రోజు ఒక కాపు తన జీతగాణ్ని కొట్టి చంపేశాడు. ఆ వెంటనే ఆ శవాన్ని దళితులతో పాతిపెట్టించాడు కూడా. అటువంటి సంఘటనలు అంతకు ముందు చాలా జరుగుతూ వచ్చాయి.

కాని నేను అక్కడికి వెళ్లాక జరిగిన తొలి సంఘటన అదే. ఆ వార్త తెలియగానే నిరసన ర్యాలీ తీయడానికి 40 మంది కుర్రాళ్లతో కలిసి లారీలో ఆ ఊరు వెళ్లాం. ఒక ఎస్సీ వ్యక్తిపై దాడి జరిగితే, ఒక గుంపు ప్రజలు ఆ గ్రామానికి వెళ్లి, నిరసన ప్రకటించడం నిజామా బాద్ చరిత్రలో అదే ప్రథమం. మేము వెళ్లే దారిలో ఆర్మూరు అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ మా మీద దాడిచేస్తారని, వెళ్లొద్దని కబురొచ్చింది. అయినా భయపడకుండా వెళ్లాం. అందరూ చెప్పినట్లు ఆర్మూరు గ్రామం వద్ద ఎవరూ మమ్మల్ని ఆపలేదు. పైగా మేము వెళ్లగానే బాధితుడి పక్షాన పాలెం మాల మాదిగలంతా వచ్చేశారు.

వారిని వెంటతీసుకుని కాపుల వీధుల్లోంచే ఊరేగింపు తీశాం. రెడ్లంతా వాళ్ల మిద్దెల మీద నిలుచుని చూశారే గానీ, మమ్మల్ని నిరోధించడానికి గానీ, దాడి చేయడానికి గానీ ఏ ఒక్కరూ సాహసించలేదు. అప్పటిదాకా తాము చేసేవన్నీ న్యాయబద్ధమే అనుకునే వాళ్ల అవగాహనను తప్పని వారికి చెప్పగలిగాం. అందుకే వారు ఒక అపరాధ భావనతో చేష్టలుడిగి నిస్సహాయంగా నిలబడిపోయారు. ఆ తర్వాత నిందితుడ్ని అరెస్టు కూడా చేయించి జైలుకు పంపించాం. అన్యాయాన్ని ఎవరూ ధిక్కరించకపోతే, అదే పనిగా అన్యాయం చేసేవారికి అది న్యాయంగానే అనిపిస్తుంది. ఎవరో ఒకరు అది అన్యాయమని రుజువు చేయగలగిన నాడు, అన్యాయస్తులు తమ శక్తి సామర్థ్యాలను కోల్పోతారు.

అనుకున్నదే కదా!
1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు నిజామాబాద్‌లో నన్ను అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకుల్ని రెచ్చగొడుతున్నానన్నది పోలీసులు నా మీద మోపిన ప్రధాన అభియోగం. నిజామాబాద్ జైలుకు తరలించడానికి ముందు నన్ను పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఆ విషయం తెలిసిన వెంటనే మా నాన్నగారు కాకినాడ నుంచి హుటాహుటిన బయల్దేరి నేనున్న జైలుకు వచ్చారు. నాకు తీవ్రమైన జ్వరంగా ఉంది, నన్ను చూడటానికి ఎవరినీ రానివ్వడం లేదు. నాన్నగారు నా వద్దకు రాగానే ఏడ్చేశాను. అప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన ఆయనకు నా బేలతనం సరైంది కాదని అనిపించిందేమో! ” ఎందుకు ఏడుస్తావ్? నీకు నువ్వుగా ఎంచుకున్న మార్గమే కదా ఇది?” అన్నారు. ఆ మాటలు నాలో అదే పనిగా మార్మోగాయి. మనం ఎంచుకున్న మార్గమనే విషయం మనమే మరిచిపోతే మనమెంత బలహీనపడతామో ఆ మాటల ద్వారా నాకు తెలిసొచ్చింది. ఆ తర్వాత చంచల్‌గూడ జైలులో ఏడాది పాటు నిశ్చలంగా గడపడానికి కావలసిన శక్తినంతా ఆ మాటలే నాకు ప్రసాదించాయి.

పోరాటమిచ్చిన జ్ఞానం
1979 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ అనేక దళిత సమస్యలపై పోరాడుతూ వచ్చాను. ఉన్నట్లుండి 2013 లో ఒకరోజు దళిత సమస్యల పని మీద ఎక్కడికో వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాను. అయితే నేను ఎక్కడినుంచి వచ్చానో నాకేమీ గుర్తు రావడం లేదు. ఆ మాటే నా భార్యను అడిగితే అదేం ప్రశ్న అన్నట్లు చూసింది. నాకు నేనే గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నా గుర్తుకు రాకపోవడంతో ఏడుపొచ్చేసింది. వైద్య పరీక్షల్లో మెదడులో కణితి ఉన్నట్లు బయటపడింది. వెంటనే సర్జరీ చేశారు. అది కేన్సర్ కణితి అనే విషయం సర్జరీ అయిపోయే దాకా నాకు తెలియదు. ఆపరేషన్ తర్వాత నా ఆరోగ్యం క్రమక్రమంగా చక్కబడుతూ వచ్చింది. ప్రస్తుతం మా తాతయ్య, మా నాన్న గారి జీవిత కథల్ని ఒకే పుస్తకంగా రాసే పనిలో ఉన్నాను. అది పూర్తయితే మరో నవల కూడా రాయాలన్న సంకల్పం ఒకటి నాలో బలంగా ఉంది. నిరంతరం పోరాటాల మధ్య జీవించడం కారణంగానేమో గానీ, నన్నేదీ భయపెట్టదు.

పోరాటాలు ఏం నేర్పుతాయి? గెలుపోటములను సమదృష్టితో చూసే శక్తినిస్తాయి. జీవితాన్నీ మరణాన్నీ సమదృష్టితో చూసే జ్ఞానాన్నిస్తాయి. ఆ జ్ఞానమే బహుశా కేన్సర్ అని తెలిసినా నన్ను నిశ్చలంగా ఉండేలా చేసింది. నేను త్వరగా కోలుకోవడానికి కూడా బహుశా అదే దోహదం చేసింది. ఏ సమస్యను అధిగమించడానికైనా, ఏ వ్యాధిని జయించడానికైనా ఆత్మవిశ్వాసాన్ని మించిన ఔషధం మరొకటి లేదనుకుంటాను. ఇన్నేళ్ల నా పోరాటానికి ఏ ఆత్మవిశ్వాసం కేంద్రంగా ఉంటూ వచ్చిందో, ఆ ఆత్మవిశ్వాసమే నా భవిష్య జీవనానికి కూడా ఊతంగా ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం
– బమ్మెర

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.