జగమే మాయ అనే ఎరుక తో మరో ప్రపంచానికి మహా ప్రస్థానం సాగించిన బాటసారి-అక్కినేని

జగమే మాయ అనే ఎరుక తో మరో ప్రపంచానికి  మహా ప్రస్థానం సాగించిన బాటసారి-అక్కినేని

స్వర్గీయ అంజలీ దేవి ,అక్కినేని లకు సరసభారతి నివాళి -23-1-14

అక్కినేని ని నేను మొదటి సారిగా 1963లో రాజమండ్రి రైల్వే ప్లాట్ ఫాం మీద చూశాను .నేనప్పుడు బి ఇ డి.ట్రయిం గ్ చేస్తున్నాను .మెయిల్ కోసం ఎదురు చూస్తున్నాను  బెజవాడ వెళ్లి ఉయ్యూరు రావటానికి .పంచ కట్టు లాల్చీ మెడలో ఉత్తరీయం తో తెలుగు తేజం గా కనిపించాడు .ఆయనా మెయిల్ కోసమే ఉన్నాడు .కొంచెం ఎత్తైన బల్ల మీద నుంచుని ఉన్నాడు .పొట్టి వాడు కదా అందుకని పొడుగ్గా కనీ పించాలని అలా ఉన్నాడేమో ననుకొన్నా .చాలా సేపు వెయిట్ చేశాం .కాని నేనెందుకో సాహసించి మాట్లాడలేక పోయా .ఆయనా ఎవరైనా వచ్చి పలకరించి మాట్లాడుతారేమో నన్నట్లున్నాడు .చిన్నప్పటి నుంచీ ఉన్న ఆరాధ భావం మరింత బల పడింది ఆయన్ను చూడగానే .ట్రెయిన్ రావటం ఎవరి దారిణ వారు వెళ్ళటం  జరిగి పోయింది .

Inline image 1     

రెండో సారి జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి తీస్తున్న ‘’ప్రతి బింబాలు ‘’సినిమా షూటింగు లో ప్రసాద్ లాబరేటరి లో చూశాం నేనూ మా శ్రీమతి .అందులో మేమూ నటించాం గెస్ట్ లుగా .లాబ్ లో విరామ సమయం లో జయ సుధ కోసం ఎదురు చూస్తూ అందరం సీట్ల లో కూర్చుని ఉన్నాం .మా ముందు వరుసలోనే నాగేశ్వర  రావు కూర్చుని ఉన్నాడు .వేరెవరో పక్కన కూర్చుని మాట్లాడుతున్నారు .అక్కినేని మాటల్లో పల్లెటూరి మొరటు తనపు మాటలు విన్నాం .అప్పుడూ మా వైపు చూసి మాట్లాడుతారేమోనని ఎదురు చూసినట్లే అని పించింది .మాకెందుకో మాట్లాడాలని పించేలేదు .కారణం ప్రక్కవానితో అతని మాటల్లో సంస్కారం నాకు అప్పుడు కనీ పించలేదు విని పించానూ లేదు  .షూటింగ్ లో ఉదయం నుంచీ చాలాసేపు ఉన్నాం .రాత్రి ఏడు దాకా జరిగింది .కాని ఆ సినిమా ప్రతిబింబాలు ఎన్నో సార్లు విడుదలకు సిద్ధమై అసలు విడుదలె కాలేదు. చాలా ఏళ్ళు దానికోసం ఎదురు చూశాం నిరాశే మిగిలింది .

మూడవ సారి మా రెండో అబ్బాయి శర్మ హైదరాబాద్ లో రాజ్యలక్ష్మీ టెక్స్టైల్స్ లో కంప్యూటర్ అసిస్టంట్ గా పని చేసినప్పుడు మాటల్లో అక్కినేని దానికి ఒక డైరెక్టర్ అని తరచు అక్కడికి మీటింగులకోసం వస్తాడని చెప్పేవాడు .స్టాఫ్ లో ఆఫీసర్ రాంక్ వారికి ఆయన నంబర్ ఇచ్చేవాడట ఆ నంబర్ కు చేస్తే నే నాగేశ్వర రావు ఫోన్ ఎట్టేవాడట .ఒకసారి శర్మ ఆ నంబర్ మాకు ఇచ్చిమాట్లాడ మంటే ఫోన్ చేసి మాట్లాడాం .వెంటనే లిఫ్ట్ చేసి చక్కగా మాట్లాడాడు .మేము ఉయ్యూరు నుంచి మాట్లాడుతున్నామని ఆయనంటే పిచ్చ అభిమానమని ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు చూశామని నేను మా ఆవిడా చెప్పాం. చాలా శ్రద్ధగా విని సంతోషించాడు .అక్కినేని తో మాట్లాడామని రొమ్ములు విరుచుకొని బంధువులందరికీ చాటు కున్నాం కూడా .

ఆ తర్వాత హైదరాబాద్ లో అనేక సభల్లో నాగేశ్వర రావు ను చూశాను .నారాయణ రెడ్డీ నాగేశ్వర రావు లు లేని సాహిత్య సభాలు ఉండేవి కావు .అప్పుడు నేనొక కప్లేట్ రాసుకోన్నాను ‘’నా.నా(నాగేశ్వరరావు నారాయణ రెడ్డి )లు లేని సభయును  –బోనాలు లేని ఇల్లు భాగ్యనగరం లోలేదంటే లేదు సుమ్మీ  ‘’‘’అని .పేపర్లలో కూడా దీనిపై చాలా మంది చెవులు కొరుక్కున్నారు .వీల్లిద్దరేనా ?ఇంకెవరూ లేరా?అని అది వారికే చెల్లింది వాళ్ళుంటే నిండుగా ఉంటుందని నిర్వాహకుల తాపత్రయం వారు ఉంటె  సాహితీ పరులు చేరుతారని ఆశా కావచ్చు .అయితే ఈ రహస్యం తెలిసిన అక్కినేని దాదాపు రెండేళ్ళపై బడి ఇలాంటి సభలకు హాజరుకాలేదు .రెడ్డి కూడా తగ్గించుకొన్నాడు .ఇదీ నాకు నాగ్ తో ఉన్న ప్రత్యక్ష సంబంధం .

నాగేశ్వర రావు ఎవరికీ చేతకాని విధం గా ‘’తల డిప్ప ‘ను పైకేత్తేట్లు చేయటం నాకిష్టం స్టెప్పులు ఇష్టం .భగ్న ప్రేమికుడిగా మరీ ఇష్టం .జయ భేరి నాగ్  అంటే మరీ క్రేజ్ .ఇద్దరు మిత్రుల అక్కినేని ఆ ఆరాధన. సుమంగళి నాగ్ పై జాలి .బాటసారి పై సానుభూతి ,దేవదాస్ పై విచారం ,వెలుగు నీడల నాగ్ ఆంటే అయ్యోపాపం .సువర్ణ సుందరి నాగ్ తమాషా .సంసారం ,ఆత్మీయులలో చిలిపి తనం ,భాలేరాముడిలో కొంటెతనం ధర్మ దాత లో ఓవర్ యాక్టింగ్ ,జక్కన్న నాగ్ లో ,అనార్కలి నాగ్ లో పాత్రోచితం నాకు కు బాగా ఇష్టం .

ఇన్ని ఇష్టాల కంటే అతి ఇష్టమైంది సుడి గుండాలు ,మరో ప్రపంచం .మొదటి దానిలో సమాజం లోని లోపాలు యువత  పెడదారిలోకి జారుతున్న వైనం సమాజం బాధ్యతా రాహిత్యం ,నేరానికి తగిన శిక్ష లేకపోవటం మొదలైన సమస్యల్ని ఎక్స్పోజ్ చేశాడు ఆదుర్తి తో కలిసి .ఇది అందరూ అన్ని సినిమాల్లోనూ చేసేదే .ఆపనే వీరిద్దరూ చేశారని సరిపెట్టుకోవటానికి వీలు లేదు .సమస్యను తడిమిన వారు పరిష్కారాన్ని చూపించాలి అనే సత్యాన్ని తెలిసిన వారు వీరిద్దరూ .అందుకే పరిష్కార మార్గం గ మరో ప్రపంచం తీశారు   సెహబాష్ భేష్ అని పించారు చూస్తుననంత సేపు నిజం గానే మరో ప్రపంచం లో ఉన్న అను భూతి కలిగించారు .నటీ నటులందరూ పండిన నటన ప్రదర్శించటం ఒక హై లైట్ .ఆ ప్రతిభను వెలికి తీసిన ఆదుర్తి కి హాట్స్ ఆఫ్ .సాహసం గా చేతులు కాల్చుకుని కీ రెండు చిత్రాలను తీసిన అ .ఆ .(అక్కినేని ఆదుర్తి )లకు సినీ ప్రేక్షకులు ఏమిచ్చినా ఋణం తీరదు .అందులో లో మోదుకూరి జాన్సన్ రచన ప్రశంసనీయం

అక్కినేని నటన అంటే నాకు చిరకాలం గుర్తుండి పోయేది ‘’సీతారామయ్య గారి మనవరాలు ‘’అరవై ఏళ్ళ నటనాను భవాన్ని రంగరించి నటించాడు అక్కినేని .ప్రతి అంగుళం లో నిండుతనం ,స్పూర్తి మత్వం ,ప్రేరణా అనుభవం ఆపేక్ష ,బాంధవ్యాలు ,మమకారం నిర్మ్మమ కారం ,హాస్యం కారుణ్యం ,తపన ,ఎదురు చూపు ,పెద్దరికం అన్నిటికీ ఒక పెద్ద బాల శిక్ష గా నటించాడు .క్రాంతికుమా ర్ సిని మాని  ఒక క్లాసిక్ గా తీర్చిదిద్దితే ,కీరవాణి సంగీత స్వరామ్రుతం తో తడిపేశాడు .చిన్న. మీనా ఇంత ఎదిగి పోయిందా వయసులోనూ, నటనలోను చిలిపిదనం తోను అని అబ్బురపరచే చిత్రం ఇది

ఎనభై మూడేళ్ళ తెలుగు చలన చిత్ర రంగ చరిత్ర లో అక్కినేని లేకుండా ఒక  అయిదేళ్ళు మాత్రమె గడిచింది మిగతా కాలమంతా అతని తో నడిచింది .అది చాలు మనం గర్వం గా చెప్పుకోవటానికి. వందేళ్ళ సినీ చరిత్ర మూడు వంతులు నాగేశ్వర రావు తో గడిపింది .ఇంత కంటే అదృష్ట  వంతులు ఏవరుంటారు ?

అక్కినేనికి రావాల్సిన అవార్డులూ రివార్డులూ వెతుక్కుంటూ వచ్చేశాయి .తాను పొందినవి కాదు తాను ఇచ్చేది గొప్ప ఏమనిషి కైనా.అందుకే తన పేర జీవన సాఫల్య పురస్కారాలను ఏర్పరచి చిత్ర రంగం లో తమదైన ముద్ర వేసిన వారికి అందించాడు .ఈ యోచన రావటమే విశేషం .వచ్చింది అమలు చేశాడు .ఇక్కడా తనకు సాటి లేరని పించుకున్నాడు .

అక్కినేని అంటే ఆ చిరునవ్వే ఎవరికైనా చిరకాలం గుర్తుండి పోతుంది .ఆతెలుగు తనానికి నిలు వెత్తు రూపం గా నిలిచాడు .ఏ సినీ ఉత్సవానికైనా అదే వేష ధారణ తో రావటం అక్కినేని ప్రత్యేకత .అందుకే మరింత చేరువయ్యాడు అందరికి .దేవుడు ఉన్నాడో లేదో తనకు అనవసరం కాని  పనిలోనే దైవాన్ని చూసుకొన్న కర్మిష్టిఅని పించాడు .రోజులు మారాయి లో పొలం దున్నే రైతు అయితే నమ్మిన బంటు లో యజమానికి నమ్మిన బంటు ,దౌష్ట్యానికి చెక్ పెట్టిన వీరుడు ,మిస్సమ్మ చక్ర పాణి లలో హాస్యం పండిస్తే ,ప్రేమించి చూడు లో ముసలి యువకుడుగా చలాకీ చూపించాడు అందరూ మెచ్చే ప్రేమ నగర్ సినిమా బోర్ కొట్టి మధ్యలోనే వచ్చేశాను ప్రేమాభిషేకం దాసరి పైత్యం అని విసుక్కొన్నాను మేఘ సందేశామూ నాకేమీ ఆనలేదు అతుకుల బొంత అని పించింది .అర్ధాంగి అక్కినేని అంటే ఒక మార్గ దర్శి అందులో సావిత్రి స్వయం సిద్ధ .ఆరాధనా మాంగల్య బలం చక్రవర్తి నాగులు నాకు బాగా నచ్చినోళ్ళు.

‘’ బుడ్డి మంతుడైనా ,బుద్ధి మంతుడైనా ‘’అక్కినేనే .తోడికోడళ్ళు నాగ్ మంచి తమ్ముడు .చెంచు లక్ష్మి లో విష్ణు మూర్తి నాగేశ్వర రావు నాకు అభిమాని .సూత్రధారులు అక్కినేని విశ్వనాద్ తీర్చి దిద్దిన బంగారు బొమ్మ .అందులో కొడుకు ప్రయోజకుడైనందుకు సంతోషిస్తూ సుజాత అక్కినేని ని రాహస్యం గా ఒక గదిలో కి తీసుకెళ్ళి ‘’ఎంత మంచి కొడుకును ఇచ్చావయ్యా ?’’అన్నప్పుడు నా కళ్ళ వెంబడి ఆనంద  బాష్పాలు ఎప్పుడూ జలజలా రాలి పోతూంటాయి .ఇద్దరో ముగ్గురో ఉన్న రాముళ్ళ లో భలే రాముడికే నా మార్కులు . దొంగల్లో దొరలో నాగ్  అంటే చారిస్మా ఉంది అందులోని జి.వరలక్ష్మి తో బాటు .పెళ్లినాటి ప్రమాణాలను నిజ జీవితం లోను పాటించాడు .అందుకు అభినందనలు .పెళ్ళికానుక ,ఇల్లరికం నాగ్ మహా మోజు .శాంతినివాసం అక్కినేని ని ఎన్ని సార్లు చూశానో జ్ఞాపకమే లేదు .కాళిదాసు ,జయదేవుడు గా నే నాకు ఆయన కనిపించి నన్ను మురిపించాడు.  మంచి మనసులు లో నాగ్  జీవించాడని పిస్తుంది ..గుండమ్మ కద కులగోత్రాల అక్కినేని సరదా మనిషి .చదువుకున్న అమ్మాయిలూ ఆత్మ బలం ,పూజా ఫలం లోని నటన ముగ్ధుణ్ణి చేసింది .అందాల రాముడు అక్కినేని నాకు ప్రాణం .మాయాబజార్ ,కృష్ణార్జున యుద్ధం లలో అక్కినేని, నందమూరి అందగాడితో పోటీపడి నటించి మెప్పించాడు .డైలాగ్స్ బొడ్డులోంచి తెచ్చుకొని అరిచినట్లు పలికినా నాకు బలే ఇష్టం .అభి గా సుందర యువకుడై నయనాందం గా కనిపించాడు మూగమనసుల్లో భావ గర్భిత పాటలు పాడి జన్మ జన్మ ల అనుబంధాన్నిగుర్తుకు చేశాడు  చాణక్యుడుగా చంద్ర గుప్తుడిని మించాడు.పల్లెటూరి బావ ,బ్రహ్మ చారి గా మెప్పించాడు జక్కన్న గా శిలలపై శిల్పాలు చెక్కి శిల్ప కళా కారుడని పించాడు .ఇలా ఎన్నని చెప్పను? అన్నీఅన్నే.  కాని కొన్ని సినిమాలు ఇప్పుడు చూస్తుంటే ఈ అక్కినేనినా నేను ఆరాధించింది?/అనే బాధ కూడా వస్తుంది కొన్ని ఇప్పుడు చూడనే లేము ..రామదాసులో కబీర్ నాగ్ వేషం కృతకం గా ఉన్నాజేవించాడు .రామ రాజ్యం లో మాత్రం వాల్మీకి గా నుంచో లేక చతికిల పది కూర్చుని  నటించి ,పేలవమైన మాటలతో నాకు చిరాకే కల్గించాడు .

అక్కినేనిని అమెరికా ప్రభుత్వం స్టేట్ గెస్ట్ గా ఆహ్వానించి గౌరవించింది .అలాగే జర్మని ఫ్రాన్స్ ఇంగ్లాండ్ లు కూడా గౌరవించాయి .అక్కడ నాటక సినిమా కళలను అధ్యయనం చేశాడు .ఆస్ట్రేలియా సిడ్నీ ఫిలిం ఫెస్టివల్ కు అంతస్తులు చిత్రాన్ని అక్కినేని ఆధ్వర్యం లో పంపారు .మారిషస్ ఫిలిం ఫెస్టివల్ కు కూడా నాయకత్వం వహించాడు .

మద్రాస్ నుంచి చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్ తరలటానికి ముఖ్య కారకుడు అక్కినేనే .అంత ముందు చూపు ఆయనది .తర్వాతే మొత్తం అందరూ తరలి వచ్చారు .అన్న పూర్ణ స్టూడియో నిర్మించి సారధికి దీటుగా నడిపాడు స్వంత బేనర్ పై గొప్ప చిత్రాలను నిర్మించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక శిఖరాయమైన వాడయ్యాడు .కుటుంబ సభ్యులందరూ నటులయ్యారు .అంతా కలిసి నటించి ‘’మనం ‘’అని పించుకొన్నారు .ఎక్కడో వెంకట రాఘవాపురం నుంచి ఒక పేద రైతు కుటుంబం లోంచి వచ్చిన ఈ బాల రాజు హైదరాబాద్ లో ఒక సినీ సామ్రాజ్యాన్నే స్థాపించి పాలించాడు .అవార్డులిచ్చాడు ఇప్పించాడు ,పొందాడు ఏది చేసినా గుర్తుండి పోయేట్లు చేశాడు .తాను  చదువుకోలేక పోయానే అనే దుగ్ధ జీవితాంతం అక్కినేని ని వేధిస్తూనే ఉంది .దాన్ని బయటికి చెబుతూనే ఉన్నాడు .అందుకే విద్యా దానాలు చేశాడు .సంస్థలకు విరాలాలిచ్చాడు .కళా కారులకు అండగా నిలిచాడు .రాష్ట్రం కరువు కాటకాలు తుఫాను వరదల భీభత్సం లో అతలా కుతలమైనప్పుడు రామా రావు తోకలిసి మిగిలిన వారందరినీ కలుపుకొని భిక్షాటనం చేసి విరాళాలు సేకరించి ప్రజలను ఆదుకొన్న మానవీయుడు అక్కినేని. కృష్ణా జిల్లాకు చెందిన ఘంటసాల, అక్కినేని. రామా రావు త్రయం చరిత్రనే సృష్టించి యావద్భారత ఖ్యాతి పొందారు జిల్లాకు రాష్ట్రానికి దేశానికి తెచ్చారు .

Inline image 2       

‘’అన్న అడుగేస్తే మాస్ అన్న లుక్కేస్తే మాస్ ‘’అని ఇప్పుడు ఆయనకొడుకు నాగార్జున ను గురించి అనుకొంటే మేమేప్పుడో అరవయ్యవ దశకం లో నే అంతటి క్రేజ్ ను అక్కినేని పై చూపించాం .కేన్సర్ వస్తే అందరూ దాచి పెట్టుకొని బయట పడనీయ కుండా గుంభనగా ఉంటారు .అలా ఉంటె అక్కినేని ఎందుకు అవుతాడు ?తన జబ్బును తానే బయట పెట్టుకొని కుటుంబం వారికి అభిమానులకు ,ప్రజలకూ తెలియ జేసి నిబ్బరం గా ఉండమని చెప్పి ధైర్యం చెప్పాడు తాను మరి కొంతకాలం జీవించి ఆనందం కలిగిస్తానని భరోసా ఇచ్చాడు .ఇదికూడా చరిత్రలో నిలిచి పోయే ఘట్టం .గుండెకు బైపాస్ జరిగినా ఇన్నేళ్ళు ఆరోగ్యం గా జీవించి నటించి సినిమాలు తీయటం ఒక రికార్డు ఇది చూస్తె మేము2012లో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ‘’రేడియేషన్ పోయెమ్స్ ‘’అనే సానెట్ కవితా సంకలనాన్ని చదివాను .అది ఒక కవయిత్రి రాసిన పుస్తకం .ఆమె భర్త యూని వర్సిటి లో జువాలాజి  ప్రొఫెసర్ ఆయనకు కేన్సర్ సోకింది .దానికి నలభై రోజులు రేడియేషన్ ట్రీట్మెంట్ ఇప్పించారు .రోజూ ఈ అమ్మాయి ఆయన్ను హాస్పిటల్ కు తీసుకు వెళ్లి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేది .ఆ సమయం లో అ నలభై రోజుల్లో భర్త పడిన బాధ తాను పడిన మానసిక క్షోభ డాక్టర్ల లోని మాన వీయతలను చూసి చలించి రోజూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సానెట్ రాసింది నలభై రోజుల్లో నలభై సానేట్స్ రాసి పెద్దలకు చూపిస్తే అద్భుతం గా ఉన్నాయని మెచ్చి ప్రచురించమని ప్రోత్సహిస్తే అలానే చేసింది .దీన్ని చదివి నేను నెట్ లో ఆ పుస్తకం పై ఒక ఆర్టికల్ రాస్తే విహంగ వెబ్ మాస పత్రిక లో ప్రచురితమైంది .అది చదివిన అమెరికా లోని మా మిత్రులు మైనేని గోపాల కృష్ణ మూర్తి గారు  అదే రేడియేష ట్రీట్మెంట్ పొందిన ప్రముఖ చిత్రకారుడు సినీ దర్శకుడు బాపు గారికిపంపితే ఆయన చదివి మెచ్చుకొన్నారని మైనేని చెప్పారు ఇలాంటి రచనలు అవతలి వారిలో ఉపశమనం కలిగిస్తాయి .అదే నాగ్ చేసిన పని .దీనికి ఏంతో ఆత్మా పరిశీలనా శోధనా ఉండాలి .అవి ఉన్నవాడుకనుకే అలా చేశాడు

నాగేశ్వర రావు జీవితం లో అన్నీ పొందాడు అన్నీ  సాధించాడు .సంత్రుప్తికర నిండు  జీవితాన్ని ,సార్ధక జీవితాన్ని గడిపాడు .దేవుడి పై నమ్మకం లేక పోయినా నట దేవుడు అని పించుకొన్నాడు .అతనకు ఒక విజ్ఞాన సర్వస్వం అని పించాడు .జీవిత విలువలకు నడవడికి ,నటనా విశ్వ రూపానికి ఒక విశ్వ  విద్యాలయమే అయ్యాడు .అక్కినేని నట వారసులు ఉన్నా అన్నిటా నాగేశ్వర రావు కవళికలు ,అభినయ చాతుర్యం ,ఈజ్ ఉన్న వాడు మాత్రం నాకు ఆయన మనవడు  ఒక్క’’ సుమంత్’’ లోనే కనిపిస్తాయి .ఎన్ని చెప్పినా చెప్పుకున్నా తనివి తీరని చరిత్ర అక్కినేనిది . ,లక్షలాది అభిమానుల అశ్రు తర్పణం అందుకొన్న అమరజీవి .మంత్రాలు లేక పోయినా ఆ రెండు రోజులూ ఘంట సాల భగవద్గీత ను క్షణం వదలకుండా ఆయన పార్ధివ దేహం వద్ద వినిపించటం  అయన అభిమాన గాయకుడికి ఇచ్చిన విశేష గౌరవం ,భగవద్గీత సారాన్ని జీవితం లో అమలు చేసి పాటించిన అక్కినేని కి ఘన నివాళి కూడా .అతని మరణాన్ని ఏమనాలి ?పార్వతిని వెతుక్కుంటూ వెళ్ళిన దేవదాసు అనాలా ,అనార్కలి తో అమరుడైన సలీం అనాలా ?బహుదూరపు బాట సారి అనాలా ?ఏది అన్నా అన్నీ సరిపోతాయి .అందుకే నేను శీర్షికను అలా పెట్టాను .

ఈ జనవరి లో ఉదయ కిరణ్ తో ప్రారంభమయి ,అంజలీదేవి ,అక్కినేని లు మరణించటం చిత్ర పరిశ్రమకుఅభిమానులకు తీరని  బాధ నే కలిగించింది .ఇక ఫుల్ స్టాప్ అయితే బాగుండు .అక్కినేని అమర్ రహే .

రిపబ్లిక్ దిన శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-14-

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

1 Response to జగమే మాయ అనే ఎరుక తో మరో ప్రపంచానికి మహా ప్రస్థానం సాగించిన బాటసారి-అక్కినేని

  1. SriRam says:

    నగేశ్వర రావు గారు నటించిన సినేమాలను గుర్తు చేసుకొంట్టూ, చాలా బాగా రాశారు. చక్కటి నివాళి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.