
“ఇప్పటివరకు బాగా చేశారు. ఇక చాలు. ఈ సంవత్సరంతో ముగిద్దామమ్మా’ అన్నారు. దానికి నేను నవ్వేసి ‘మేము చేస్తాంలెండి’ అన్నాను. ఆ తరువాత మళ్లీ స్టేజి మీద కూడా అదే మాట – ‘ఇంకెంతకాలం చేస్తారు. ఇదే చివరి సంవత్సరం’ అన్నారు.”
సెప్టెంబర్ 28, 2013
హైదరాబాద్ రవీంద్రభారతిలో సాయంత్రం వేళ. ‘రాగసప్తస్వర’ అనే సాంస్కృతిక సేవా సంస్థ ఎప్పటిలాగే ఎ.ఎన్.ఆర్ స్వర్ణ కంకణ ప్రదానోత్సవం వేడుక చేసింది. ఈ వేడుకలో ప్రముఖ డాక్టర్లను, పారిశ్రామిక వేత్తలను, నటీనటులను సత్కరించింది. రాగసప్తస్వర సంస్థకి ఎస్. రాజ్యలక్ష్మి వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఆవిడ స్వాతంత్య్ర సమరయోధురాలు. దువ్వూరి సుబ్బమ్మ మనవరాలు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆ సంస్థ గౌరవ అధ్యక్షురాలు. ఈ సంస్థ ఇరవైయేళ్లుగా ప్రతీ ఏడాది అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజున ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తోంది. నాలుగు నెలల క్రితం జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావుగారు ముందే ఊహించినట్టుగా ‘ఇదే ఆఖరి సంవత్సరం’ అన్నారట. ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ నన్నపనేని రాజకుమారి చెప్పిన మాటలివి…
“రాగసప్తస్వర 28 యేళ్లుగా ఉంది. నాగేశ్వరరావు గారి స్వర్ణకంకణ ప్రదానోత్సవం మొదలుపెట్టి 20 సంవత్సరాలయ్యింది. మీ పుట్టినరోజున సన్మానం చేస్తామని ఆయన్ని కలిస్తే ‘నాకు సన్మానం వద్దు. నాకు కావాల్సింది అది కాదు. నా పేరుతో ఇంకెవరికన్నా సన్మానం చేయండి. నేనొస్తాను’ అన్నారు. అప్పట్నించి ప్రతి ఫంక్షన్‌కి సి. నారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు వచ్చేవారు. ప్రముఖ వైద్యుల్ని, పారిశ్రామికవేత్తల్ని, సినీ కళాకారుల్ని ఈ సంస్థ ద్వారా సన్మానిస్తాం.
విచిత్రం ఏమిటంటే… ఈసారి ఫంక్షన్ చేయడానికి ముందు నాగేశ్వరరావు గారితో మాట్లాడేందుకు ఆయన్ని కలిశాం. అప్పుడాయన నాతో, రాజ్యలక్ష్మితో ‘ఇదే ఆఖరి సంవత్సరం. అన్ని సంస్థలకి ఈ విషయం చెప్పాను’ అన్నారు. ఆయన అప్పటికింకా ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన ఆ మాట అనేసరికి ‘అలా ఎందుకవుతుందండీ. మీరున్నంతకాలం మా సంస్థ తరపున మీరు ఉండాల్సిందే’ అన్నాం నేను, రాజ్యలక్ష్మి. దానికాయన ‘నేనెంతకాలం ఉంటాను… మీరెంతకాలం చేస్తారు? ఇప్పటివరకు బాగా చేశారు. ఇక చాలు. ఈ సంవత్సరంతో ముగిద్దామమ్మా’ అన్నారు. దానికి నేను నవ్వేసి ‘మేము చేస్తాంలెండి’ అన్నాను. ఆ తరువాత మళ్లీ స్టేజి మీద కూడా అదే మాట – ‘ఇంకెంతకాలం చేస్తారు. ఇదే చివరి సంవత్సరం’ అన్నారు. చెస్ట్ పెయిన్ ఏమైనా ఉందా, గుండెకి సంబంధించి సమస్య ఏదైనా వచ్చిందా… ఎందుకిలా మాట్లాడుతున్నారు అనుకున్నాం. దాంతో ఇన్నేళ్లుగా మా సంస్థ ద్వారా ఆయన ఎవరెవరికయితే సన్మానం చేశారో వాళ్లందరూ కలిసి ఆయన్ని సన్మానిస్తే బాగుంటుందని ఆలోచించాం. ఆ ఆలోచనను డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేనిలతో పంచుకుంటే అందుకు వాళ్లు కూడా సరేనన్నారు. అందరం మాట్లాడుకుని రజిత సింహాసనం చేయిద్దామని నిర్ణయించాం. అయితే ఆ మాట ముందుగా చెప్తే ఒప్పుకోరని ఆయనకి చెప్పలేదు. చెప్పకుండా “ఇన్నాళ్లు మీరు సన్మానాలు చేశారు కదా. వాళ్లందరూ కలిసి మీకు సన్మానం చేస్తార”ని మాత్రమే చెప్పి ఒప్పించాం. అలా ఆయనకి రజిత సింహాసనం బహూకరించే అవకాశం దక్కింది మాకు. దానిమీద ఆయన్ని కూర్చోపెట్టి పూలవర్షం కురిపించాం.
ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ల ముందు సినిమా రీలులాగా కదులుతూనే ఉంది. కుర్చీలోంచి లేచేటప్పుడు ఇబ్బంది పడ్డారని ఇప్పుడనిపిస్తుంది. కుర్చీ పట్టుకునే చాలాసేపు నిల్చొన్నారు. ఆ సభలో నేను ప్రసంగించేటప్పుడు ‘ఈ సంవత్సరం ఆపేయమని నాగేశ్వరరావు గారు అంటున్నారు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేయం. ఆయనకిప్పుడు 90 సంవత్సరాలు. ఆయన వంద సంవత్సరాలు తప్పకుండా ఉంటారు. అప్పటిదాకా ఫంక్షన్ చేస్తామ’ని చెప్పాను. నేనా మాటలు చెప్తున్నప్పుడు ఆయన అదో రకంగా నవ్వారు. (ఏడుస్తూ … ఇప్పుడు నాకనిపిస్తోంది ఆ రోజు ఆయనకి కచ్చితంగా తెలిసే ఉంటుందని.) ఆ రోజు చాలా ఘనంగా వేడుక జరిగింది. అదయిన కొన్నాళ్లకే ఆరోగ్యం బాగాలేదని ఆయనే స్వయంగా మీడియా ద్వారా ప్రజలకి చెప్పారు.
రాజకీయాలకి చాలా దూరంగా ఉండేవారాయన. అయినా చాలామందిని ప్రభావితం చేశారు. యువతకి గొప్ప స్ఫూర్తి. మహానటుడు, నిర్మాతే కాకుండా ఆదర్శవంతమైన భర్త ఆయన. అన్నపూర్ణ గారిని కడదాకా బాగా చూసుకున్నారు. పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చారు. ఆయన మాటలో చమత్కారం, గంభీరం రెండూ ఉంటాయి. భాషా చాతుర్యం సంగతయితే చెప్పక్కర్లేదు. అంత బాగుండేది. సినిమాల్లో పాటలకు ఆయన వేసిన స్టెప్పులు, నటనా కౌశల్యం జీవితంలో మరిచిపోలేనివి. ఆయన మరణం ఓ చేదు జ్ఞాపకం.
ఆయన మన నుంచి భౌతికంగా మాత్రమే దూరమయ్యారు గాని ఆయనెప్పుడూ మనతోనే ఉంటారు. అందుకే ఇక మీదట మేము చేసే సన్మానాలకి ఆయన కుటుంబ సభ్యుల్ని ఆహ్వానిస్తాం. నాగేశ్వరరావు గారి శిల్పాన్ని లేదా చిత్రపటాన్ని పెట్టి ఆయన పేరుతో కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. సన్మాన గ్రహీతలకు ఎప్పటిలాగానే ఎ.ఎన్.ఆర్ స్వర్ణకంకణం, సన్మానపత్రం, మెమొంటో ఇచ్చి సత్కరిస్తాం.
మొన్నటి సన్మాన కార్యక్రమంలో నేను, సినీనటి లక్ష్మి కలిసి నాగేశ్వరరావుగారితో ఫోటో దిగాం. అప్పుడాయన ‘ఒకరు సినీ నాయిక. మరొకరు రాజకీయ నాయిక’ అన్నారు నవ్వుతూ” అని ఆనాటి జ్ఞాపకాలను బరువెక్కిన హృదయంతో, తడిబారిన కళ్లతో గుర్తుచేసుకున్నారు నన్నపనేని రాజకుమారి.
గత 20 యేళ్లలో డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ శివారెడ్డి, డాక్టర్ నారాయణ, డాక్టర్ భాస్కరరావు (కిమ్స్), డాక్టర్ సబిత, డాక్టర్ సోమరాజు, డాక్టర్ గోపిచంద్, డాక్టర్ కాకర్ల సుబ్బారావు, డాక్టర్ సీత వంటి ప్రముఖ డాక్టర్లను సన్మానించాం. వీరితోపాటు పారిశ్రామిక వేత్తలు, సినీ కళాకారులకి ఎ.ఎన్.ఆర్ స్వర్ణకంకణాలు, మెమొంటో ఇచ్చి సత్కరించాం. మా కార్యక్రమానికి ముఖ్యమంత్రులు, గవర్నర్లు వచ్చారు. దివంగత ప్రధాన మంత్రి పివి నరసింహారావుగారు కూడా మా కార్యక్రమానికి వచ్చారు.