
భారతంలో భీష్ముడిది ఒక అరుదైన పాత్ర. ఆయన ఒక కఠోరమైన ప్రతిజ్ఞకు కట్టుబడినవాడు. మహా పరాక్రమశీలి. సత్యాన్ని అతిక్రమించనివాడు. అందరి పట్ల ఆదరభావం, సమదృష్టి కలిగిన నాయకుడు. దేశభక్తిని అణువణువునా నింపుకున్నవాడు. తన దేశ సరిహద్దులను రక్షించటానికి ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడిన వాడు. అధికార వాంఛా రహితుడు..ఒక్క మాటలో చెప్పాలంటే- ప్రస్తుతం మన సమాజంలోని నేతలందరికీ ఉండాల్సిన లక్షణాలు పుణికిపుచ్చుకున్నవాడు. అలాంటి భీష్ముడు తన ఆత్మకథ రాస్తే ఎలా ఉంటుంది? తనలోని సంశయాలను ఆయన ఎలా వెల్లడిస్తాడు? ఈ ఊహకు ప్రతిరూపమే ‘నేను భీష్ముడిని చెబుతున్నాను’. డాక్టర్ భగవతీ శరణ్ మిశ్రా రాసిన ‘మై భీష్మ బోల్ రహా హూ’ హిందీ నవలకు అనువాదమిది. దీనిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..
బాధ్యత-నిబద్ధత
‘యుద్ధమెందుకు ప్రారంభం కావటం లేదు?’- అడిగాడు దుర్యోధనుడు.
‘సేనాపతి నువ్వా? నేనా? ‘- సాధారణంగా కోపగించుకోని నేను కొంచెం గట్టిగానే అడిగాను. నిశ్చయంగా నా రజిత, శ్వేత, దీర్ఘ భృకుటిపై ఒత్తిడి పడి ఉంటుంది. అది దుర్యోధనుడు గమనించకపోయి ఉండడు. అయినా అతను తన ఉద్ధండతను నియంత్రించుకోవటమే శ్రేయస్కరమని భావించాడు. అతను సాధారణ స్వరంతోనే అన్నాడు. ‘నిస్సందేహంగా తమరే! సైన్యాధ్యక్షుడిగా తమరినే అభిషిక్తుని చేశాం కదా.’ ‘మరి అలాంటప్పుడు యుద్ధమెప్పుడు ప్రారంభించాలి? ఎలా ప్రారంభించాలి? అన్నది నా అధికార పరిధిలో ఉంటుంది. నీ పరిధిలో ఉండదు. నీవు ఈ నా అధికారాన్ని ధిక్కరించే దుస్సాహసం చేయకు’- అని గంభీరంగా అన్నాను. ‘కాని నేను యువరాజును.
హస్తినాపుర భావి చక్రవర్తిని. సంగ్రామం ప్రారంభించాలని మన యోధులు ఆతృత చెందుతున్నారు. ప్రారంభించటానికి ఆలస్యమెందుకు జరుగుతోందో తెలుసుకొనే అధికారం నాకుంది..’ అతని స్వరం మామూలుగానే ఉంది కానీ ‘యువరాజు’ అనే పదాన్ని పలికినప్పుడు అతని ముఖంలో గర్వం తొణికిసలాడింది. ‘నీవు రాజసభలోనే యువరాజువి. ఈ యుద్ధభూమిలో ఇతర యోధులవలె నీవు కూడా ఒక యోధుడవు. అంతకంటే ఎక్కువ కాదు. కావున నీవు కూడా నా అధీనంలోనే ఉన్నావు. నా ఆదేశాలకు బద్ధుడవు కూడా. కావున నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు. ప్రశ్నించాలనుకుంటే- నేను నిన్ను ప్రశ్నించగలను. అయితే నువ్వు నా సలహా తప్పక అడగవచ్చు.
ఒక సేనాధిపతిగా నీకు సముచితమైన, మేలు చేయగల సలహా ఇవ్వటం నా బాధ్యత’ అన్నాను. అని- ‘ హస్తినాపుర భావి చక్రవర్తి కావటం విధి చేతుల్లో ఉంది. దానిపై మన ఇద్దరి నియంత్రణ ఉండదు. మనం యోధులం కావచ్చు. కానీ భవిష్యద్రష్టలం కాము. విధి ఎవరి పక్షాన నిర్ణయం తీసుకుంటుందో ఎవరికి తెలుసు? హస్తినాపుర భావిచక్రవర్తిని ఎన్నుకునేందుకే యుద్ధం మొదలయింది. ఇందులో ఎవరు విజయలక్ష్మిని వరిస్తారో, వారే భావి చక్రవర్తి కాగలరు. కానీ యుద్ధంలో ఎవరు విజయలక్ష్మిని వరిస్తారో, ఎవరు పరాజితులవుతారో, ఎవరికి తెలుసు? కావును నీవు కొంత కాలం గర్వము, అహంకారం త్యజించి, వీరోచితంగా ప్రవర్తించమని నా ఉచిత సలహా. శక్తినంతా ప్రయోగించి శత్రుసైన్యంతో పోరాడు. నీ హితులైన యోధుల మనోబలాన్ని పెంచు. నేను సైన్యాధ్యక్షుడిగా ఉన్నంతవరకూ నీవు నన్ను ప్రశ్నించకుండా ఉండటమే నీకు శ్రేయస్కరం..’ అని తేల్చి చెప్పాను.
నియమ పాలన
అర్జునుడు నిరాయుధుడైయున్నాడు. దుర్యోధనుడి ముఖంలో ఆనందం కనిపిస్తోంది. ‘యుద్ధం ఆరంభించండి’ అన్నాడు దుర్యోధనుడు.. ‘నేను యుద్ధమారంభించలేను.. ఎందుకంటే అర్జునుడి చేతిలో ఆయుధం లేదు. అతను నిరాయుధుడు’ అన్నాను. ‘అయితే ఏమయింది? ఇదే యుద్ధమారంభించటానికి సరైన సమయం. అంతే కాదు సువర్ణావకాశం కూడా’ అని అతను తొందరపెడుతూ అన్నాడు. ‘నువ్వంటున్నదేమిటి’- నేను ఆశ్చర్యంగా అడిగాను. ‘అవును. మీరు విన్నది నిజమే.
నిరాయుధుడైన అర్జునుడు యుద్ధమారంభించే స్థితిలో లేడు కాబట్టి యుద్ధమారంభించే బాధ్యత సహజంగా మీపైనే ఉంది. తమలాంటి యుద్ధనేర్పరి ఒక శరాఘాతంతోనే అర్జునుని శిరచ్ఛేదం చేయగలరు. అప్పుడు ఈ మహాభారత యుద్ధం ప్రారంభించకముందే సమాప్తమవుతుంది. అర్జునుని వధించిన తర్వాత పాండవ సైన్యం నిలదొక్కుకోగలదా?’- అన్నాడు దుర్యోధనుడు. ఈ మాటలు అంటున్నప్పుడు అతని స్వరంలో మార్పు వచ్చింది. ‘నువ్వేమంటున్నావు?- సాధారణ యుద్ధ నియమాలు కూడా నీకు తెలియవంటే నేను అంగీకరించను. నిరాయుధుడిపై ఆయుధం సంధించటం గర్హనీయం. అది కూడా ఒక మహారధిపై మరో మహారధి..ఒక సేనాధిపతిపై మరో సేనాధిపతి..’ అన్నాను. ‘తమరు యుద్ధ నియమాల్లో పారంగతులు కావచ్చు. కానీ రాజనీతితో మీకు సంబంధం తక్కువ. యుద్ధంలో అన్నీ ఉచితమైనవే! నేను చెబుతున్నాను. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. అర్జునుడు ఇప్పటికీ నిరాయుధుడే. కృష్ణుడు ఆయుధం చేపట్టనని ప్రతినబూనాడు. అర్జునుడి శిరస్సును లక్ష్యం చేసుకొని తమరు శరసంధానం చేయండి..’ అన్నాడు దుర్యోధనుడు. ‘కౌరవుల సంక్షేమం కోరి నేను చేయదగినవేవో, చేయకూడనివేవో- ఇప్పటి దాకా పట్టించుకోలేదు. ఇప్పుడు జీవిత సంధ్యాసమయంలో ఒక నిరాయుధుడైన యో«ధుడిని మోసంతో హత్య చేసి ఆ పాతకం నేను భరించలేను’ అన్నాను. ‘అయితే ఒక సువర్ణావకాశం కోల్పోతున్నాం’ అన్నాడతను. అతని స్వరంలో బాధ ఉంది.
‘ఇది అవకాశము కాదు. సువర్ణావకాశము అసలే కాదు. విధి గురించి నీకు తెలియదు. నేను నియమ విరుద్ధంగా పాపకార్యం చేయలేను. ఒక వేళ చేసినా అర్జునుడి శిరచ్ఛేదం జరుగుతుందన్న నమ్మకం లేదు. నీతి విరుద్ధమైన పని చేస్తున్నప్పుడు నా చేతులు కంపించవచ్చు. నా బాణం గురి తప్పవచ్చు’ అన్నాను. ‘అయితే ఇప్పుడేం చేయాలి?’ అన్నాడు దుర్యోధనుడు. ‘అర్జునుడు గాండీవం ధరించే వరకూ ఎదురు చూడటమే!’ అన్నాను. ‘ఎంత వరకూ?’ మళ్లీ రెట్టించాడు దుర్యోధనుడు. ‘అతను స్వయంగా గాండీవం ధరించేవరకూ’ అన్నాను నేను నిశ్చయస్వరంతో. ‘ఒక వేళ సూర్యాస్తమయం వరకూ గాండీవం ధరించకపోతే?’ అన్నాడు దుర్యోధనుడు. ‘అలా జరగదు’ అన్నాను దృఢస్వరంతో. ‘ఎందుకని’ అని తిరిగి ప్రశ్నించాడు దుర్యోధనుడు. ‘అర్జునుడి మిత్రుడు, రథ సారథి అయిన కృష్ణుడు – కపటనీతి, రాజనీతి, రణనీతి- అన్నింటిలోను నేర్పరి. ఆయన తన సఖుడి చేత ఆయుధం ధరింపచేస్తాడు. యుద్ధం జరుగుతుంది’ అని వివరించా.
* * *
ఆత్మావలోకనం
‘ప్రతి అతికి ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. అపరిపక్వమైన వయస్సులో, పితృప్రేమ అంధత్వంలో నేను చేయకూడనిది చేశాను. అతి అతిగానే అనిపించుకుంటుంది. నా అవివేకానికి ఫలితం నేనెన్నోసార్లు అనుభవించాను. ప్రత్యేకించి ఈ జీవిత ఉత్తరార్థంలో, ఈ దుర్యోధనునివంటి వాడిని నిలబెట్టింది ఎవరు? నేనే కదా! నేను చేసిన క్షమించరాని పొరపాటు ఫలితమే ధృతరాష్ట్ర పుత్రుడగు దుర్యోధనుడు. ఇంకా ఎన్నని చెప్పేది? మెల్లమెల్లగా అన్నీ మీకే బోధపడతాయి. జీవితపు ఈ మలుపు వద్ద, ఈ అంపశయ్యపై ఉన్న నేను, ఆకాశంలో తిరుగాడుతున్న కళంకిత చంద్రుని చూసినప్పుడు, హస్తినాపుర సింహాసనం సురక్షితంగా వర్థిల్లునట్లు చేయటానికి నేను నా ఉత్తరీయంపై ఎన్ని కళంకాలు పూసుకున్నానో అనిపిస్తుంది. ఇతరుల దృష్టిలో పరమపూజ్యుడు, గంగాతనయుడు, సత్యవ్రతుడు, దేవవ్రతుడిగా- భీష్ముడిగా- ఎంతో గౌరవనీయుడినైన నేను చేసిన అనేక అనాలోచిత కృత్యాలకు, ఈ ఘడియలో నన్ను నేను నిందించుకుంటున్నాను. మహాభారత యుద్ధానికి మూలం ద్రౌపదో, శకునో, కర్ణుడో లేక ఈ ఉద్ధండ అన్యాయపరుడైన దుర్యోధనుడని ఎవరంటారు? ఈ మహాసమరానికి ఏకైక కారణం నేను. ప్రపంచమంతా భీష్ముడనే పేరుతో పూజించే దేవవ్రతుడను. బహుశా ఈ ప్రపంచమంతా ఇక ముందు కూడా నన్ను పూజిస్తూనే ఉంటుంది. కానీ ఈ కురుక్షేత్రంలో ప్రవహించిన అపార రక్తధారలకు, అసంఖ్యాక మహిళలు తమ నొసటిన కుంకుమలు కోల్పోవటానికి, తల్లులు పుత్రులను కోల్పోయి విలపించటానికి, వీటన్నింటికీ మూల కారణమైన వ్యక్తిని నేనే. ఆ అవివేకిని నేనే…
నేను భీష్ముడిని చెబుతున్నాను (రెండు భాగాలు)
అనువాదం: డాక్టర్ కొమ్మిశెట్టి మోహన్
ధర: రూ. 200
పేజీలు: 323
ప్రతులకు: 9441323170