నా దారి తీరు -71
చెరుకు రైతుగా నేను
మేము హిందూ పురం నుంచి 1951లో ఉయ్యూరు వచ్చాం .మా నాన్న గారే వ్యవసాయాం చస్తూఉండేవారు .మేము ఎప్పుడైనా పొలం వెళ్లి వస్తూన్దేవాళ్ళం .అంతకు మించి మాకే వ్యవహారమూ తెలియదు .ఉయ్యూరు చేను ఫాక్టరీ వెనుకనే ఉంది .సాగునీటికి కాలువ సౌకర్యం ఉంది మింట సత్యం అనే అతను మా పొలం పనులు చూసే వాడు నాన్న పర్యవేక్షించేవారు .కౌలుకు ఇచ్చినా ధాన్యం కాని చెరుకు కాని అణా పైసలతో ఇచ్చే రైతులు మాకు దొరికారు .కనుక ఇబ్బంది లేదు .కాటూరు పొలం వర్రే సుబ్బయ్య కుటుంబం చూసేది . .వాళ్ళూ ఏంతో నమ్మకం గా చేసి మాకు తోడ్పడ్డారు .సుబ్బయ్య తర్వాత కొడుకులు వెంకట స్వామి భాస్కర రావు లు చూశారు వాళ్ళ తర్వాత పెద్దకొడుకు వెంకటస్వామి కొడుకు పాములు చూశాడు .కడవకొల్లు లో ఉన్న దేవుడి మాన్యాన్నీ వాళ్ళే చూసేవారు .ఇక్కడా ఏ ఇబ్బందీ లేదు .ధాన్యం బందీల మీద ఇంటికి తోలటం వడ్ల కొట్లో పోయటం లేక పోతే పురి కట్టటం లేక పోతే పాతర లో పోసేవారు పాతర అంటే భూమిలో దాదాపు అయిదడుగులు లోతుగా బాగా పొడవూ వెడల్పు ఉన్న దీర్ఘ చతురస్రాకార గొయ్యి తవ్వి దాని లోపల గడ్డి తో పేనిన వెంట్లు చుట్టి అడుగున గడ్డి మోపులు వేసి ధాన్యాన్ని పోసేవారు దానిపైన మళ్ళీ గడ్డి కప్పి మట్టి కప్పేవారు .దాదాపు ఆరునెలలు ఏమీ పాడుకాదు ధాన్యం .అడుగు ధాన్యం కొంత రంగు మారేది .మిగతాది బానే ఉండేది .అడుగుది కొంచెం తెలుపు పూత వచ్చేది ముక్కి పోవటం అనే వాళ్ళం .కొందరు గాదెల్లో పోసుకొనే వారు .
ఉయ్యూరు పొలం మెరక గా ఉండటం వలన చెరుకు సాగుకు మంచి వీలు .నాన్న ఒకటి రెండు సార్లు చెరుకు సాగు చేయించిన జ్ఞాపకం .నాన్నపేరు చెరుకు రైతుగా కే.సి.పి.ఫాక్టరీ లో రైతు నంబర్ 653. నాన్న1961లో అకస్మాత్తుగా మరణించిన తర్వాత ఆ రైతు నంబర్ నా పేర ట్రాన్స్ఫర్ అయింది నాన్న పేర అప్పటికే కే.సి.పి.షేర్లు కొన్ని ఉన్నాయి .అవీ నాపేరనే బదిలీ చెయ్యమని నాన్న వీలునామా లో స్పస్తీకరించారు.కనుక నా పేరనే బదిలీ అయాయి .అప్పటి నుంచి నేనే పొలం వ్యవహారాలూ చూసుకోవలసి వచ్చింది .మా మేన మామ గంగయ్య గారు నాకు అండగా ఉన్నాడు .కనుక వ్యవహారాల విషయం ఆయన మీదే పెట్టేవాడిని .ఆయనా నాకు బాగా సహకరించి కొంత కాలం వాళ్ళ పాలేర్ల తోనే వ్యవసాయం చేయించి ఖర్చులు నాదగ్గర తీసుకొని మాకు రావాల్సింది అంతా అంద జేసేవాడు .ఇలా కొంత కాలం సాగింది .మామయ్య వ్యవహారాలను తగ్గించుకొని పెద్ద కొడుకు పద్మనాభానికి అప్ప గించాడు .వాడు కూడా మాకు బాగా సహకారం అందించాడు .పొలం వ్యవహారాలన్నీ స్వయం గా చూసేవాడు .కనుక నాఉద్యోగం విషయం లో పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు .పొలాలకు పెద్దగా వెళ్ళాల్సి వచ్చేది కాదు .ఈ విధం గా కొన్నేళ్ళు గడిచాయి .ఆదాయం పెద్దగా వచ్చేదికాదు .ఖర్చులు తడిసి మోపయ్యేవి .ఎలా ఇందులోంచి బయట పాడాలా అని చూస్తున్నాను .అప్పుడు ఒక సారి పొలం లో బోర్ వేస్తె నీటికి ఇబ్బంది ఉండదని అని పించింది .పద్మనాభామూ అదే చెప్పాడు రెండు ఊళ్ళ లోని మా పొలాలు కాలువ చివరి భూములు .అందుకని సాగు నీరు ఆలస్యం గా వచ్చేది .మధ్యలో ఎందరో రైతులూ పొలాలు ఇవన్న్నీ తడిసిన తర్వాత మా పొలాలలో నీరు ప్రవేశించేది .అందుకని ఊడ్పులు ఆలస్యం అయ్యేవి .ఒక్కో సారి నీరు అందకా పైరు ఎండి పోయేది .అందుకని బోర్ వెయ్యటం తప్పని సరి అయింది .ముందుగా కాటూరు పొలం లో వేయాలని నిర్ణయానికి వచ్చాం .
బోర్ వేసే విషయం లో నాకు ఏమీ తెలియదు దీనికీ పద్మనాభమే సాయం .ఒక రోజు మంచి రోజు అని చెప్పి ఉదయం పది గంటలకు ముహూర్తం బాగుందని చెప్పి తాను వస్తానని నన్ను అక్కడ గురతులు కొన్ని చెప్పి అక్కడే పలుగు పాతి కొబ్బరి కాయ కొత్తమన్నాడు .నేను వెళ్లాను కాని వాడు రాలేదు .సరే అనుకున్న సమయానికి ఆ గుర్తులను బట్టి నాకు తోచిన చోట పలుగు పాతి కొబ్బరి కాయ కొట్టాను ఒంటరిగా .ఆ తర్వాత వచ్చాడు వాడు .వాడు చెప్పిన చోట కాక కొద్ది అడుగుల దూరం లో నేను కాయ కొట్టానని చెప్పాడు .సరే అక్కడే బోరు వేద్దామన్నాడు .మనుష్యులను మాట్లాడటం గొట్టాలు దింపటం ,అన్నీ వాడి అజమాయిషీ లోనే జరిగింది .బెజవాడ వెళ్లి కుమ్మమూరు వాస్తవ్యుడు ,మా నాన్న శిష్యుడు ఐన రామినేని బ్రహ్మం దగ్గర వన్ టౌన్ లో కొన్నాం .వాటిని లారీ లో తెప్పించాం కొంత డబ్బు ముందు ఇచ్చి మిగిలింది తర్వాత ఇచ్చాం .మంచి వాడు బ్రహం. చాలా మర్యాదగా ఉండేవాడు .పోట్టిగా కొంచెం బొద్దుగా ఉండేవాడు .అప్పటికే కార్ మెయింటైన్ చేసేవాడు .బాగా సంపాదించాడని అనుకొన్నారు .పద్మనాభం అప్పటికే ఉయ్యూరు పొలం లో బోరు వేసిన అనుభవం ఉన్న వాడు .కనుక పూర్తిగా వాడి మీదే నేను ఆధార పడ్డాను .యాకమూరు లో ఉండే బ్రహ్మం అనే అతను బోరు వేయటం లో అప్పుడు ఎక్స్పర్ట్ అని అందరూ చెప్పారు అతనితోనే వేయించాము .రెండు పూటలా వచ్చి దగ్గరుండి అన్నీ చేయించేవాడు .మంచి నమ్మకస్తుడు .దాదాపు నూట పాతిక అడుగులలో మంచి జల పడింది .మోటారు ఏది కొనాలనే ఆలోచన వచ్చింది .గండి గుంటలో రామ చంద్ర రావు గారనే పెద్ద రైతు –ఉయ్యూరు లో వల్లభనేని గోపాల రావు గారి అబ్బాయి వీర భద్ర రావు గారి తమ్ముడు నాకు ‘’జ్యోతి ‘’మోటార్ ను కొనమని తన పొలాలలో దానినే వాడుతున్నానని మోనోబ్లాక్ మంచిదని చెప్పాడు బెజవాడ గురుదత్తా ఇండస్ట్రీస్ అనే ఓల్డ్ టౌన్ లోని బ్రాహ్మలాయన షాప్ లో కొన్నాం .అప్పటి దాని రేటు పద్దెనిమిది వందలని జ్ఞాపకం .ఇనుప గొట్టాలే వేశాం .కరెంట్ ను కూడా పద్మనాభమే ఉయ్యూరు ఎలెక్ట్రికల్ ఇంజినీర్ ను కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేసి అతి త్వరలో వచ్చేట్లు చేశాడు .ఒక తాటాకుల పాక కూడా వేశాం .మరి డబ్బు నేనే పెట్టుబడి పెట్టాను మా తమ్ముడు మోహన్ కు చెప్పి చేసేవాడిని .వాడేమీ చేపలేదు నా తంటాలేవో నేనే పడే వాడిని .అవసరం అయితే పద్మనాభం సర్దేవాడు .ఆ చుట్టు పక్కల మేమే మొదటి సారిగా బోర్ వేశాం .మా మీద ఎందరో ఆధార పడిన రైతులున్దేవారు నీటికోసం .మాకు కొంచెం దూరం లో కాటూరి వాసి బాలయ్య గారు మా కంటే ముందే బోర్ వేశారు ఆయన కూడా వచ్చి సలహాలిస్తూన్దేవారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-14-ఉయ్యూరు