ఏం చదువుకున్నానంటే…జీవితం చదువుకున్నాను -సత్యానంద్ -ఆంద్ర జ్యోతి

 

కళ్లు తిప్పుకోలేని అందం, ఖరీదైన దుస్తులు, భారీ సెట్టింగులు, అద్భుతమైన నటన.. ఇవన్నీ కుదిరినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా? నటుల ‘ఇమేజ్’ పెరుగుతుందా? పెరగదు. ఇంకా ఏదో కావాలి. అదే పవర్‌ఫుల్ ‘డైలాగ్’. ఒక పంచ్ మాట. అది పడితేనే నటులకు కిక్ వస్తుంది. స్టార్ ఇమేజ్ ఏర్పడుతుంది. అలాంటి మాటల్ని రాస్తూ.. తెలుగు తెర మీద మాయ చేసే ‘డైలాగ్ రైటర్స్’ అనుభవాలను వారం వారం మీ ముందు ఉంచబోతోంది ‘నవ్య’. అందులో భాగంగా నలభై ఏళ్లలో – నాలుగొందల సినిమాలకు రాసిన సినీ రచయిత సత్యానంద్‌తో ఈ కొత్త శీర్షికను ప్రారంభిస్తున్నాం..

“సార్, మీరు ఇండస్ట్రీకి వచ్చి నలభై ఏళ్లు అయ్యింది. మీరు రాసిన సినిమాలు నాలుగొందలు దాటాయి. వాటిలో మీరు రాసిన కొన్ని మంచి డైలాగులను ‘నవ్య’ పాఠకులతో పంచుకోగలరా ?” అని సత్యానంద్‌ను అడిగాము. “ఏ డైలాగని చెప్పమంటారు? రాయడం తప్ప గుర్తుంచుకునే అలవాటు లేదు నాకు” అంటూనే శ్రీనగర్‌కాలనీలోని సాయిసదన్‌లో తను ఉంటున్న ఫ్లాట్‌కు రమ్మన్నారాయన. సహజంగా సినిమా వాళ్ల ఇళ్లకు వెళ్లినప్పుడు ముందుగదిలో కనిపించే దృశ్యం – అవార్డుల ప్రతిమలు, వందరోజుల షీల్డులు. అయితే ఆయన ఇంట్లో అవేవీ లేవు. రాక్‌ల నిండా ఆంగ్ల పుస్తకాలే దర్శనమిచ్చాయి. సినిమాలు తప్ప మరో ధ్యాసలేని సత్యానంద్ 1973లో ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘మాయదారి మల్లిగాడు’తో కెరీర్‌ను మొదలెట్టి.. ఈ మధ్యనే రామానాయుడు నిర్మించిన ‘నేనేం చిన్నపిల్లనా’ వరకు రాస్తూనే ఉన్నారు. తెలుగు సినిమా తెర మీద ‘కథ, మాటలు, స్క్రీన్‌ప్లే- సత్యానంద్’ అన్న కార్డు ఇప్పటికీ పడుతూనే ఉంది.

ఎవరు అమ్ముకోలేదు?
“ఎక్కడని మొదలు పెట్టేది? నాలుగొందల సినిమాలకు రాశాను. ఎందులో ఏ డైలాగ్‌ను చెప్పమంటారు? సరే, నా మొదటి సినిమా ‘మాయదారి మల్లిగాడు’తో మొదలుపెడతాను”అని మెల్లగా గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు సత్యానంద్. “రాజమండ్రిలో డిగ్రీ పూర్తి చేశాక.. సినిమాల మీద ఆసక్తితో మద్రాసు వెళ్లిపోయాను. ఆదుర్తి సుబ్బారావుగారు మా బంధువు. ఆయన దగ్గర రెండు సినిమాలకు పని చేశాను. ఒక రోజు ఆయన “సత్యానంద్, నీకొక సీన్ చెబుతాను. లైన్ పట్టుకుని ట్రీట్‌మెంట్ రాసివ్వగలవా? ప్రయత్నించు” అన్నారు. శ్రద్ధగా విని సీను మొత్తం రాసి ఆయన చేతిలో పెట్టాను. ఆయనకు నచ్చుతుందో లేదోనన్న టెన్ష్షన్ పడలేదు. “నువ్వు రాసింది బాగుంది. కృష్ణ, జయంతి, మంజులతో ‘మాయదారి మల్లిగాడు’ తీస్తున్నాను. దానికి నువ్వే డైలాగ్ రైటర్‌వు!” అన్నారు ఆదుర్తి.

రైటర్‌గా నాకదే తొలి సినిమా. అందులో వేశ్య వేషం వేసిన జయంతి ఒక కోర్టు సీనులో లాయర్‌తో గట్టిగా వాదిస్తుంది. వ్యక్తిగా తన తప్పును సమర్థించుకుంటూనే లోకం పోకడ చెప్పే డైలాగులు అవసరం. ఆ సమయంలో నాకైతే కోర్టు భాష తెలీదు. కొందరు తెలిసిన లాయర్లతో మాట్లాడాను. ఆ సీనులో- కోర్టు బోనులో నిల్చున్న జయంతి (వేశ్య పాత్ర)ని “అందాన్ని అమ్ముకోవడం నీచంగా అనిపించలేదా?” అని సీరియస్‌గా ప్రశ్నిస్తాడు లాయర్. అప్పుడామె “అమ్మకం అనేది అనాధిగా లోకంలో వస్తున్నది. ఎవరికి ఉన్నదాన్ని వారు అమ్ముకుంటూనే ఉన్నారు. కొందరు పదవుల్ని అమ్ముకుంటున్నారు. కొందరు పరపతిని అమ్ముకుంటున్నారు.

కొందరు మాటను అమ్ముకుంటున్నారు. కొందరు ఓటును అమ్ముకుంటున్నారు. కొందరు వరకట్నం పేరుతో కొడుకుల్ని అమ్ముకుంటున్నారు. కొందరు కన్యాశుల్కం పేరుతో కూతుళ్లని అమ్ముకుంటున్నారు. వాళ్లది తప్పు కానప్పుడు నాది తప్పు ఎందుకు అవుతుంది?” అంటూ లాయర్‌నే ఎదురు ప్రశ్నిస్తుంది. వాదోపవాదాలను విన్న జడ్జి “చూడమ్మా నువ్వు ఏం చదువుకున్నావు?” అని అడిగితే “ముప్పయి ఏళ్ల జీవితాన్ని చదువుకున్నాను.. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చదువుకున్నాను” అని సమాధానం ఇస్తుంది. అప్పట్లో ఈ డైలాగులు సినిమాకే హైలైట్ అయ్యాయి.

ఎలా కొట్టాను దెబ్బ..
మోహన్‌బాబు, నేను మంచి స్నేహితులం. ఆయనకు డైలాగులంటే చాలా ఇష్టం. అతని బలం డైలాగ్ డెలివరీనే! వాటిని చెప్పడంలో తనకో ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు. మోహన్‌బాబు ఉన్నాడంటేనే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉండేవి. ‘పదహారేళ్ల వయసు’కు రాస్తున్నానప్పుడు. ఇందులో మోహన్‌బాబు పాత్ర బాగుంటుంది. “ఒరే, నాకు పవర్‌ఫుల్ డైలాగులు ఉండాలి. పెద్ద పెద్దవి రాసివ్వు” అని మా ఇద్దరి మధ్య ఉన్న చనువుతో అడిగేవారు. ‘పదహారేళ్ల వయసు’ డైరెక్టు తెలుగు కథ కాదు. తమిళ కథ. అందులో రజనీకాంత్ చేశారు. ఎదుటివాళ్లను ఏడిపిస్తూ ‘ఇదెప్టి ఇరికు’ (ఇది ఎలా ఉంది?) అనే ఊతపదాన్ని అంటుంటాడు అతను. అదే పాత్రను తెలుగులో మోహన్‌బాబు చేశారు.

‘ఇదెప్టి ఇరికు’ అనే పదాన్ని తర్జుమా చేసే దగ్గరే సమస్య వచ్చింది. మామూలుగా అయితే ‘ఇది ఎలా ఉంది’ అనాల్సి వస్తుంది. ఆ పదం మాకెవరికీ నచ్చలేదు. అందులో పంచ్ లేదు. అదే పదాన్ని – మోహన్‌బాబు శరీరభాష, ఉచ్చారణ శైలికి తగ్గట్టు ‘ఎలా కొట్టాను దెబ్బ’ అని రాశాను నేను. దాన్నే సినిమాలో పెట్టాము. ఆ పదం బాగా పాపులర్ అయ్యింది. అదే మాటను ఒక సన్నివేశంలో మోహన్‌బాబుకి కౌంటర్ ఇచ్చేందుకూ వాడుకున్నాం. “ఏరా కుంటోడా ఇట్రా” అని అటుగా వెళుతున్న చంద్రమోహన్‌తో కెలుక్కుంటుంది మోహన్‌బాబు బ్యాచ్.

అంతవరకు అమాయకంగా ఉన్న అతను కుంటుకుంటూ సీరియస్‌గా వచ్చి మోహన్‌బాబుకు లాగి ఒక్కటిస్తాడు. అది చూసి అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. మోహన్‌బాబువైపు నోరెళ్లబెట్టి చూస్తున్నప్పుడు.. అతని పక్కనే నిల్చున్న సహచరుడు ఒకడు ‘ఎలా కొట్టాడు దెబ్బ’ అని రివర్స్‌లో చెప్పి ప్రేక్షకుల్ని నవ్విస్తాడు.

న్యాయమనేది..
ఎన్‌టిఆర్‌తో త్రివిక్రమరావు ‘జస్టిస్ చౌదరి’ తీస్తున్నారప్పుడు. ఆ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకులు. అందరం కలిసి కథను తయారు చేశాం. దాన్ని ఒక శుభముహూర్తాన ఎన్‌టిఆర్‌కు వినిపించి ఓకే చేయించుకోవాలి. “బ్రదర్ మీరు తెల్లవారుజామున నాలుగు గంటలకు రండి. కథ చెబుదురుగాని” అన్నారాయన. వెళుతూనే “చెప్పండి బ్రదర్” అన్నారు. “సార్, ఇందులో మీది గంభీరమైన జడ్జి పాత్ర..” చెబుతుండగానే ఆయన – “జడ్జి పాత్ర అంటే ఏమంత ఆసక్తిగా ఉంటుంది బ్రదర్?” అన్నారు. “ఇందులో మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది..” అంటూ కథ, మాటలు చెప్పాను. ఆయన ఏం చెబుతారా అని టెన్షన్‌తో ఎదురుచూస్తున్నప్పుడు “నేను మళ్లీ షూటింగ్‌లోనే మీకు కనిపిస్తాను. కథ ఓకే. అంతా సిద్ధం చేసుకోండి.

మనం ఈ సినిమా చేస్తున్నాం” అంటూ వెళ్లిపోయారు. అయితే ఈ సినిమాకు కొన్ని చోట్ల డైలాగులు రాయడం నాకొక సవాలుగా మారింది. తన తమ్ముడు ఒక నేరంలో ఇరుక్కోవడంతో విలన్ వేషం కట్టిన సత్యనారాయణ.. ఆ కేసును వాదించే జడ్జి ఎన్‌టిఆర్ ఇంటికి వెళతాడు. అప్పుడు -“నా తమ్ముడు చేసింది నేరమే అయినా వాడు నిర్దోషి అని మీరు తీర్పు ఇవ్వాలి” అని రవ్వంత బెదిరింపు స్వరంతో చెబుతాడు సత్యనారాయణ. ఆ మాటకు సమాధానంగా ఏ కుర్రహీరోకో అయితే “ఏంది బే నువ్వు నాకు చెప్పేది?”లాంటి మాటలేవో రాయాలి. కాని ఇక్కడున్నది ఎవరు? ఎన్‌టిఆర్! అందులోనూ ఆయనది గంభీరమైన జడ్జి వేషం. అందుకు బాగా ఆలోచించి రాసిన మాటలను అంతే అద్భుతంగా చెప్పారాయన.

“న్యాయమనేది ఎవరి చేతిలోనో కీలుబొమ్మ కాదు.. ఇష్టం వచ్చినట్లు ఆడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కడి స్వార్జితమో కాదు.. ఇష్టమొచ్చినట్లు వాడుకోవడానికి. న్యాయమనేది మార్కెట్‌లో అమ్మజూపే సరుకు కాదు. ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. (కాస్త స్వరాన్ని పెంచుతూ, కనుబొమలు పైకి లేపుతూ) న్యాయమనేది మీ అమ్మ కన్న బిడ్డ కాదు. నువ్వు చెప్పినట్లు వినడానికి” అంటూ సింహంలా గర్జించి చెప్పిన ఎన్‌టిఆర్‌ను, ఆ సినిమాను కూడా మరిచిపోలేము.

బాక్స్ బద్దలవుతుంది..
డైలాగ్ రైటరే అన్నీ రాస్తాడనుకోవడం పొరపాటు. అప్పటికప్పుడు సెట్‌లో నటీనటులు కూడా మంచి డైలాగుల్ని మన మీదికి విసురుతుంటారు. బాగున్నాయనిపిస్తే వాడేసుకోవచ్చు. అలాంటి అనుభవమే ‘రౌడీ అల్లుడు’ తీసే టైమ్‌లో జరిగింది. ఒక సీన్‌లో – చిరంజీవి మానసిక ఆరోగ్యాన్ని తేల్చేందుకు డాక్టర్ వేషంతో వస్తాడు బ్రహ్మానందం. అతని చంకలో ఒక చిన్న నల్లటి సూట్‌కేస్ ఉంటుంది. బ్రహ్మానందం వేసే ప్రశ్నలకు చిరంజీవి వ్యంగ్యంగా సమాధానం ఇస్తుంటాడు. ఆఖర్న “నాతో పెట్టుకుంటే బాక్స్ బద్దలవుతుంది” అంటారు చిరు. అదొక చిన్న డైలాగ్. కాని భలే పాపులర్ అయ్యింది. అప్పట్లో అదొక ట్రెండ్‌ను సెట్ చేసింది. నిజానికి ఆ ఐడియా నాకొచ్చింది కాదు. బ్రహ్మానందం ఏదో ఒక ఊరికి వెళుతున్నప్పుడు ఎవరో కుర్రాడు పక్కనున్నోడితో “ఏంట్రోయ్ నేనంటే ఏమనుకున్నావ్? కొడ్తే బాక్సు బద్ధలైపోతుందిరోయ్” అని తమాషాగా అన్నాడట. ఆ మాటను బ్రహ్మానందం చిరంజీవితో చెప్పాడట. “ఈ మాట భలే ఫన్‌గా ఉందండీ. ఎక్కడైనా పెడితే బావుంటుందేమో ఆలోచించండి”అని చిరంజీవి నాతో చెప్పారు. నాక్కూడా నచ్చడంతో వాళ్లిద్దరికీ మధ్య నడిచే సన్నివేశానికే రాశాను.

ఆస్తి నాకు పాస్తి నీకు..
నేను రాసిన వాటిలో మంచి మాటలున్న మరో సినిమా ‘దేవత’. అక్కాచెల్లెళ్లుగా నటించిన జయప్రద, శ్రీదేవిల మధ్య సెంటిమెంట్‌ను పతాక సన్నివేశాలకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంకో సీన్‌లో శోభన్‌బాబుతో శ్రీదేవి “మా అక్క ఒక దేవత. మంచి తప్ప చెడు, పుణ్యం తప్ప పాపం తెలియని ఆ దేవతను అందుకోగలిగిన దేవుడివి నువ్వు ఒక్కడివే” అంటుంది. “ఆమె బతుకులో దీపం పెట్టడానికి నువ్వు చీకట్లోకి నడిచావు” అంటాడు శోభన్. ఇలాంటి భారమైన మాటలే కాదు.. సినిమాలో హాస్యానికీ కొదవ లేదు. ఆస్తి పంపకం గురించి ఒక చోట మోహన్‌బాబు “ఆస్తీపాస్తిలో ఆస్తి నాకు పాస్తి నీకు. ఇల్లువాకిలిలో ఇల్లు నాకు వాకిలి నీకు. పొలంపుట్రాలో పొలం నాకు పుట్ర నీకు. గొడ్డుగోదాలో గొడ్డు నాకు గోదా నీకు” అని చెప్పే డైలాగుల్ని తెలుగువాళ్లు ఎన్నటికీ మరిచిపోలేరు.

తొలి చిత్రాలకు..
నాగార్జున ‘విక్రమ్’, పవన్‌కళ్యాణ్ ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’, మహేష్‌బాబు ‘రాజకుమారుడు’ ఇవన్నీ ఆ హీరోలు అరంగేట్రం చేసిన సినిమాలు. వీటన్నిటికీ నేనే డైలాగ్ రైటర్ని. అప్పటికి కొత్త హీరోలైనా సరే, వారి ఇమేజ్‌ను పెంచేలాగే డైలాగుల్ని రాయాలి. అది వాళ్ల కెరీర్‌కు అవసరం. అయితే మోతాదు మించితే నష్టం కలిగిస్తుంది. నాగార్జున చేసిన ‘విక్రమ్’ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన సినిమా. సెంటిమెంట్ కూడా ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని రాస్తున్నప్పుడు “అబ్బాయి కొత్తవాడు. లెంతీ డైలాగులు వద్దు. తక్కువ మాటలతో ఎక్కువ యాక్షన్, గ్లామర్‌లతో నడిపిద్దాం” అన్నారు ఆ సినిమాకు దర్శకుడైన వి.మధుసూదనరావు. అనుకున్నట్లే సింపుల్ డైలాగుల్ని రాయాల్సొచ్చింది. నాగార్జునకు అది తొలి సినిమా అయినప్పటికీ చాలా ఎనర్జిటిక్‌గా చెప్పారు. ఆ నాటికి ఆయనకు తెలుగు చదువుకోవడం కాస్త కష్టంగా ఉండేది.అందుకని ఆ డైలాగుల్ని ఇంగ్లీషులో రాసుకుని చెప్పేవారు.

ప్రతి హీరో స్వభావం, ఆలోచనలు, నటనలను ప్రతి డైలాగ్ రైటర్ పరిశీలిస్తుంటారు. ఆ ఇమేజ్‌కు తగ్గట్టే రాస్తారు ఎవరైనా. పవన్‌కళ్యాణ్‌కు అలాగే రాశాను. చిరంజీవి సినిమాలకు రాస్తున్నప్పటి నుంచి పవన్ నాకు బాగా తెలుసు. ఆయనకు పుస్తకాలంటే ఇష్టం. మా ఇంట్లో ఆంగ్ల సాహిత్య పుస్తకాలు చాలా ఉండేవి. వాటి కోసం మా ఇంటికి వచ్చేవారాయన. ఒకప్పుడు థ్రిల్లర్, క్రైమ్, ఫిలాసఫీ పుస్తకాలను బాగా చదివేవారు. ఆ తర్వాత ప్రపంచ చరిత్రలో ప్రముఖులైన స్టాలిన్, హిట్లర్, మావోల పుస్తకాలను చదివేందుకు ఆసక్తి చూపించేవారు. సరే ఇదలా ఉంచితే – అతని గొప్ప లక్షణమేమిటంటే – ఏ డైలాగ్ అయినా ముందు చదువుకుని, ఓన్ చేసుకుంటారు. ఆ తర్వాత చదివి వినిపిస్తారు. అప్పుడేమీ అనిపించదు.

షూటింగ్ స్పాట్‌లోకి వెళ్లాక.. మనమెవ్వరమూ ఊహించని విధంగా చెప్పడం పవన్ గొప్పదనం. అంత అద్భుతంగా డైలాగ్స్ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.’అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ మొదటి సినిమా అయినా డైలాగ్స్‌ను చెప్పడంలో ఆయన ఏమాత్రం ఇబ్బంది పడలేదు. డైలాగులు కాలాన్ని బట్టే పుడతాయి. నాగేశ్వరరావు టైమ్‌లో హీరోయిన్ అక్కడుంటే హీరో ఇక్కడ నిల్చుని మాట్లాడుకునేవారు. ఇప్పుడు సీను మారిపోయింది. ఏ కాఫీడేలోనో దగ్గర దగ్గర కూర్చుని మాట్లాడుకుంటుంటారు యువతీయువకులు. కాబట్టి కాలాన్ని బట్టి సినిమాలు, సినిమాలకు తగ్గట్టు డైలాగులు రాయాల్సి వస్తుంది.”

రజనీకాంత్ అగ్గిపుల్ల..

రైటర్ ఒకటనుకుని రాస్తే, దాన్ని రెట్టింపు చేసి అవలీలగా నటించే వాళ్లలో అగ్రగణ్యుడు రజనీకాంత్. తెలుగులో ఆయన నటించిన ‘ఆమె కథ’కు డైలాగులు రాసేప్పుడు నాకీ అనుభవం ఎదురైంది. సినిమాలో అదొక కీలక సన్నివేశం. ఇందులో రజనీది నెగటివ్ రోల్. ఒక చోట ఒక డైలాగ్ చెప్పి, ఎదురుగ్గా ఉన్న ఆడమనిషి చెంపమీద ఒక దెబ్బ వేయాలి. అది సీను. అందుకు ఆయన చెప్పాల్సిన డైలాగ్ “లోకంలో ఏదైనా సరే పాడైపోతే దాని వాడకం తగ్గిపోతుంది. ఒక్క ఆడది మాత్రం పాడైపోతే దాని వాడకం పెరుగుతుంది. అందుకే నిన్ను పాడుచేసి, నీతో బిజినెస్ చేస్తున్నాను”. దాన్ని చదివిన రజనీకాంత్ “బాగుంది. అయితే కొంచెం స్టయిల్ మారుద్దామా?” అనడిగారు. “ఎలా చేద్దామో చెప్పండి” అన్నాను నేను. “ఆ డైలాగ్ చెప్పి, ఆమెను ఒకటి పీకాలి. అంతేకదా!” అన్నారు. “అవును” అంటూ ఆయన ఏమి చెబుతారోనన్న ఆసక్తితో ఆయన వైపు చూస్తున్నాము. “ఏమీలేదు. ఆ డైలాగ్ చేప్పే ముందు కుడిచేతిలో అగ్గిపుల్ల, ఎడం చేతి వేళ్ల మధ్య సిగరెట్ పెట్టుకుంటా. కుడిచేత్తో కొడుతూ అగ్గిపెట్టె మీద అగ్గిపుల్లను గీసుకున్నట్లే చెంపమీద దెబ్బవేసి అగ్గిపుల్ల గీసుకుని… ఆ అగ్గిపుల్లతో ఈ చేతిలో ఉన్న సిగరెట్‌ను ముట్టించుకుంటాను. అంతే! ఎలా వుంటుంది?” అన్నారు రజనీ. “అద్భుతం” తప్ప మరోమాట రాలేదు మాకు. రజనీ సినిమాలకు పనిచేసిన అనుభవం నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. నన్నోసారి ఆయనింటికి భోజనానికి ఆహ్వానిస్తే వెళ్లాను. అంత పెద్ద ఇమేజ్ కలిగిన హీరో అన్న భావనేదీ తన మనసులోకి రానివ్వకపోవడం ఆయన గొప్పదనం. ఇద్దరం భోంచేశాక నేను బయటికొస్తున్నప్పుడు ఆయనే గేటు తీసి, కారు డోర్ వేసే వరకు పక్కనుండి మర్యాదలు చేశారు.

‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’లో అత్తకు, అల్లుడికి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ప్రతిసీను ఉత్కంఠకు గురి చేసేలా రాశాను. ఒకచోట “నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావో చెప్పు?” అని వాణిశ్రీ ప్రశ్నిస్తే “నీ కూతురు ఆడది కనుక, నేను మగాణ్ణి కనుక. కాదంటావా – నీకేమైనా డౌటా?” అని చిరు చెప్పే డైలాగ్,, అతని స్టయిల్ అద్భుతం.

ఏ ‘ప్రేమించు’లో హీరోయిన్ లయ అంధురాలు. అంధుల భాష, ఉద్వేగాలు ఎలా ఉంటాయి? జీవనవిధానం ఎలా ఉంటుంది? మనం బయట రోజూ చూస్తూనే ఉంటాం. అయితే అదే పనిగా వాళ్ల మధ్యకు వెళ్లి పరిశీలిస్తే కాని పూర్తిగా అర్థం అవ్వదు. ఫీలైతేనే కొన్ని డైలాగుల్ని బాగా రాయగలం. అందుకని నేను రెండుసార్లు హైదరాబాద్‌లోని ఒక అంధపాఠశాలకు వెళ్లాను. అక్కడున్న పిల్లల్ని పరిశీలించి, వారితో కాసేపు మాట్లాడి వచ్చాకే.. ఈ సినిమాకు మాటల్ని రాయడం సులువైంది. హీరోయిన్ లయ కూడా నాలుగుసార్లు ఆ పాఠశాలకు వెళ్లొచ్చి నటించింది.
ఏ రాఘవేంద్రరావు ‘నిండు నూరేళ్లు’ తీస్తున్న సమయం అది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకుకు తల్లి జయసుధ. “ఆ పిల్లవాడు నెల రోజుల్లో చనిపోవాలి” అని కథా చర్చల్లో నిర్ణయించుకున్నాం. ఒక సన్నివేశంలో డాక్టర్ వచ్చి.. ఈ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని చెబితే.. ఆ పిల్లవాడు ఎన్ని రోజుల్లో చనిపోతాడో మనకు తెలిసుండాలి. లేకపోతే డైలాగులు రాశాక చిక్కులొస్తాయి. అందుకని అప్పట్లో కొందరు వైద్యుల్ని కలిసి ఏ జబ్బు వస్తే సుమారుగా ఎన్ని రోజుల్లో చనిపోతారో కనుక్కుని మరీ మాటల్ని రాశాను.

ఏ ‘న్యాయం కావాలి’లో కోర్టు సన్నివేశం ఒకటుంది. దాని కోసం కొన్ని రోజులపాటు చర్చలు నడిచాయి. అందులో చిరంజీవిది నెగిటివ్ పాత్ర. శారదను హైలైట్ చెయ్యాలి. మంచి డైలాగులు పడటం కోసం బాగా ఆలోచించాల్సి వచ్చింది. అందులో చిరు ఒక చోట “తప్పు ఆడది చేసినా.. మగాడు చేసినా శిక్ష మాత్రం ఆడదానికే. ఎందుకంటే దేవుడు మా మగాడు కనుక” అంటాడు. ఆ డైలాగ్‌లో ఉన్న లాజిక్ అప్పట్లో చాలామందికి నచ్చింది. అయితే ఈ డైలాగ్‌ను పెట్టొచ్చో లేదోనన్న సంశయం మొదలైంది. ఇదే సినిమాలో అతిథి పాత్ర వేసేందుకు దాసరినారాయణరావు వచ్చారు. అప్పుడు నేను రాసిన డైలాగ్‌ను తీసుకెళ్లి ఆయనకు చూపించారు. ఆయన “బెస్ట్‌గా రాశారు. బాగుంది” అనడంతో అది తెర మీదికొచ్చింది.
ఏ కమల్‌హాసన్‌తో ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ సినిమాను తిరుపతి దగ్గరున్న తలకోనలో తీస్తున్నప్పుడు.. డైలాగ్ రైటర్‌గా నేనక్కడికి వెళ్లాను. కాగితం మీద రాసిచ్చిన డైలాగుల్ని ఏకాగ్రతతో చదివేవారు కమల్. అప్పటికప్పుడు చిన్న చిన్న మార్పులు చేయాలని అడిగేవారు. మేమందరం విశ్రాంతి గదిలో ఉన్నప్పుడు వచ్చి.. “రేపు షూటింగ్‌లో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. చూస్తారా?” అని అడిగి డైలాగులు చెప్పి, నటించి చూపించడం ఇప్పటికీ గుర్తు. నేను రాసిన డైలాగులకు అదనపు హావభావాలను జోడించేవారు కమల్. ఒక్కోసారి మనం నియంత్రించకపోతే ఎక్కడికి వెళతారో ఆయనకే తెలియదు. నటన అంటే అంత పిచ్చి ఆయనకు.

మల్లెంపూటి ఆదినారాయణ
ఫోటో : శ్రీనివాస్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.