నా దారి తీరు -72
నమ్మకస్తులైన ఇద్ద్దరు నిఖా మాన్లు
కాటూరు పొలం లో బోర్ వేయటం అద్భుతమైన జలధార పడటం ,నాలుగు అంగుళాల గొట్టం ద్వారా నీరు ఎడతెరపి లేకుండా రావటం మా అదృష్టం .మా చేలకు నీరు సమృద్ధిగా అందివ్వటం తో బాటు చుట్టు ప్రక్కల రైరులు కూడా ఈ బోరు మీద చాలా మంది ఆధార పడ్డారు .వేసవిలో చెరుకు తడికి నారలు పోసుకోవటానికి ఆరు తడికి అందరూ మా మీదే ఆధార పడ్డారు .అప్పటి దాకా ఎన్నో ఏళ్ళ నుండి మాకు సహకరిస్తున్న వర్రే సోదరులు చెరుకు వేశారు మాకోసం .బాగా పండింది .మాకు రావాల్సింది అంతా బాగానే ముట్టజెప్పారు .మ పేరనే ఫాక్టరీ కి చెరుకు తోలి నేనే డబ్బు తీసుకొనేట్లు చేశారు .చెరుకు రెండు ఏళ్ళ పంట .రెండో పంట అయిన తర్వాత వాళ్ళు లెక్కలకు వచ్చారు .అన్నీ సరిగ్గా లెక్క చెప్పాను .కాని అందులో తమ్ముడు భాస్కర రావు కొంచెం తొందర మనిషి .నేనేదో కొంత కక్కూర్తి పడ్డానని వాళ్లకు రావాల్సింది అంతా ఇవ్వకుండా కొంత నోక్కేశానని కడవకొల్లు లో ఎవరితోనో అన్నట్లు నాకు తెలిసింది .నన్ను ‘’తమ్ముడూ ‘’అని పిలిచే భాస్కరరావు లో ఇంత క్రూర ఆలోచన ఉండటం నేను సహించ లేక పోయాను .ఒక రోజు ఇంటికి పిలిపించి అన్న దమ్ములిద్దరితోనూ మాట్లాడాను. మళ్ళీ లెక్కలన్నీ చూపించాను. అన్న వెంకటస్వామి చాలా మర్యాదస్తుడు మా నాన్న కాలం నుండి ఉన్న అత్యంత నమ్మకమైన వాడు .అందుకని ఆతను కూడా ‘’తమ్ముడు గారూ మా వాడు తొందర పడ్డాడు .మనసులో పెట్టుకోకండి .దీన్ని ఇంతటితో మరిచి పోదాం ‘’అన్నాడు భాస్కర రావు కూడా తప్పు ఒప్పుకున్నాడు .వీళ్ళు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా అమ్మ వాళ్లకు స్వయం గా వడ్డన చేయించి కడుపు నిండా భోజనం పెట్టి పంపేది మా నాన్న కాలం లోనూ మా కాలం లోనూ కూడా .పురి కట్టేటప్పుడు ధాన్యం బండ్ల మీద తోలుకొచ్చి కొట్లో పోయటం ,పురి కట్టటం ,ఇంటి దగ్గరే వెంట్లు పేనటం అంతా వాళ్ళు చేశేవారు .వాళ్ళ తండ్రి సుబ్బయ్య కూడా అంత బాధ్యత గా ప్రవర్తించేవాడు వాళ్ళ తో పాటు కొందరు కూలీలు వచ్చే వారు .వీరందరికీ అమ్మ మా ఆవిడ వండి తృప్తిగా భోజనం పెట్టి చేతిలో కొంత డబ్బు పెట్టి పంపేవాళ్ళం .ఇదొక ఆనవాయితీ గా వచ్చింది అది అలానే అమలు చేశాం .మా స్వంత మనుష్యుల కిందనే చూశాం .మానాన్నాను బాబాయి గారు అనేవాళ్ళు .మా అమ్మను పిన్నీ అని పిలిచేవారు .
నా మనసులో భాస్కర రావు ఉదంతం కలత పెడుతూనే ఉంది.వీళ్ళను తప్పించటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను .కాటూరులో మా ప్రక్క చేను కడవకొల్లు లో ఒకప్పుడు ఉండి అప్పుడు బెజవాడలో ఉంటున్న ఒక బ్రాహ్మణాయన పొలం ఉంది. దాన్ని సీతారామయ్య అనే ఉప్పరి అతను సాగు చేసేవాడు .వాళ్ళ నాన్న పెద్ద మీసాలతో పొట్ట తో పొట్టిగా లావుగా నీరుకావి పంచ ,కోరా బనీను తో ఉండేవాడు . అతను కమ్మరి పనీ బాగా చేసేవాడు .సీతారామయ్య ఈ కరణం గారి పొలం లో పని చేస్తుంటే నాకు ;కాళింది;మడుగులో నాగేన్ద్రుడి పడగల పై నృత్యం చేసే కృష్ణుడు కనీ పించేవాడు. తన పనేదో తాను చేసుకు పోవటం మర్యాద గా మాట్లాడటం చాలా స్పీడ్ గా పని చేయటం నాకు ఎంతో నచ్చాయి .అందుకని అతనికి మా పొలం పనులు అప్పగిస్తే బాగుంటుంది అని పించింది .ఆ విషయ పై తర్జన భర్జన పడుతున్నాను .ఒక సారి చేలో కనీ పిస్తే సీతారామయ్య ను మా పొలం వ్యవసాయం కూడా చూడమని అడిగాను .కొన్ని రోజులు ఆలోచించి చెబుతానన్నాడు .అలానే ఒక రోజు ఇంటికి వచ్చి తాను మా చేను సంగతి చూడటానికి ఒప్పుకొన్నాడు .బోరు ఉంది కనుక ఎకరానికి పద్దెనిమిది బస్తాలు మాకు ఇచ్చి ,ఖర్చులు పెట్టుకొని మా తరఫున సాగు చెయ్యమన్నాను. నీళ్ళు కరెంటు ఖర్చు మాదే .సరేనన్నాడు .ఒక మంచి రోజు నేనే చూసి పొలం పని లోకి దిగమన్నాడు .ముందు గా సరి హద్దు గట్లు పెట్టటం తో అతను మా పని లో ఉన్నట్లయింది .నా టెన్షన్ తగ్గింది .వర్రే వాళ్ళు ఇంటికి వచ్చి ‘’తమ్ముడు గారూ !ఇలా చేశారేమిటి ?’’అని అడిగారు .అప్పుడు నేను ‘’మీ అన్నదమ్ములలో ఒకరి మాట ఒకరికి పడటం లేదు .నా మీద నింద కూడా వేశారు .ఇలాంటి పరిస్తితులలో ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయిన తర్వాతా ఇక మీరూ మేమూ ఎవరి దారి వారు చూసుకోవటం మంచిది’’ అన్నాను .ఏమీ అనలేక వెళ్ళిపోయారు .ఇలా సీతారామయ్య అనే సమర్ధుడు మా పొలం చూడ టానికి ఏర్పడ్డాడు.ఇది నాకు సంతృప్తి గా ఉంది పెద్దగా పొలం వెళ్ళకుండా తప్పింది. మా అమ్మాయి చిన్నపిల్ల గా ఉన్నప్పుడు సీతారామయ్య రంగ ప్రవేశం చేశాడు మాఅమ్మాయి విజ్జి అంటే మహా ముచ్చట పడేవాడు .అతని భార్యా ,కొడుకు బసవయ్య కూడా కస్టపడి పని చేసేవారు సీతారామయ్య కు మంచి ఆలోచన ఉండేది ,చక్కగా అమలు చేసేవాడు .బోరు ఉన్ది కనుక మే రెండో వారం లోనే నారు పోసేవాళ్ళం .జూన్ చివరికి బోరు నీళ్ళతో సాగు చేసేవాళ్ళం .పంట బాగా పందేది .లాభాలలోకి వ్యవసాయం వచ్చింది .ఎప్పుడైనా మరీ అవసరం అయితేనే డబ్బుసహాయానికి నా దగ్గరకు వచ్చే వాడు .అలానే సర్దేవాడిని. పంటల్లో తీర్చేసే వాడు .ఇలా కొనసాగింది కొంతకాలం .
ఉయ్యూరు చేను ఫాక్టరీకి వెనక ఉంది .దీనిలో కూడా బోరు వేయాలనుకోన్నాం . మామయ్యగారి చేను మా పక్కనే ఉంది ఇక్కడా కాటూరు లో కూడా .ఇప్పటిదాకా పద్మనాభమే మా వ్యవసాయం చూసేవాడు వాడిదీఅలవి కాని వ్యవసాయం .ఖర్చులకు తగిన ఫలసాయం రావటం లేదు .ఎలా అని ఆలోచనలో పడ్డాను .మా నాన్న కాలం లో మా పొలం వ్యవహారాలూ చూసే మింట సత్యం మేనల్లుడు చిన్నబ్బాయి అనే వెంకటరావు మంత్రాల రాధాకృష్ణ మూర్తి గారి పొలం చూసేవాడు .అతనూ కస్టపడి పని చేసేవాడిలా గమనించాను .ఒక రోజు చిన్నబ్బాయి ని అడిగాను మా పొలం కూడా చూడమని సరే నన్నాడు .మంచి నమ్మకస్తుడు .నెమ్మదిగా మాట్లాడేవాడు .కొడుకు సత్యం సహాయం కూడా ఉంది .బండీ ఎడ్లు ఉన్నాయి .కనుక ఇబ్బందేమీ లేదు .అతన్నీ మంచి రోజు చూసి చేలోకి దిగామన్నాను .గట్లు పెట్టటం తో పని ప్రారంభించాడు .కనుక ఉయ్యూరు సమస్యా తీరింది .ఇక్కడ తరచుగా చెరకు వేసేవాళ్ళం .బోరు వేయటానికి మంటాడలో ఒకకాపు ఆయన దగ్గరకు వెళ్లి సరైన ప్రదేశం చూసి చెప్పమన్నాను ఆయన అనుకొన్న రోజు వచ్చి చేతిలో ఒక చిన్న కర్ర పుల్లను రెండు చేతుల వేళ్ళ మధ్యా పట్టుకొని చేలో తిరిగాడు. ఒక చోట ఆపుల్ల గిరగిరా తిరిగింది అదే సరైన స్థానం బోరు వేయటానికి అని చెప్పాడు .సరే నని గుర్తుపెట్టుకొని పద్మ నాభం సాయం తో బోరు వేశాము .ఆయనకు నూట పదహార్లు తాంబూలం గా చిన్నబ్బాయి చేతికిచ్చి పంపాను .దాదాపు రెండువందల అడుగుల్లో నీరు పడింది .అంత గొప్ప ధార కాదు.ఇనపగోట్టాలు ఉయ్యూరులోనే తీసుకొన్నాం బ్రహ్మం బావమరిది ఆరిక పూడి నాగేశ్వర రావు గారి దగ్గరా వెంకటేశ్వర దియేటర్ దగ్గరున్న ఇంకొక శిష్యుడి దాగ్గారా కొన్నాం .మోటారు కొనలేదు కాటూరు పొలం మోటారు తెచ్చి వాడేవాళ్ళం నాకు బోరుకు మోటారు బిగించటం ఆడించటం చేసేవాడిని .నా స్నేహితుదు సూరి నరసింహం కే.సి.పి. లో ఎలేక్త్రీషి యన్ .అతని సహాయం ఇక్కడా కాటూరు లోనూ తీసుకొనే వాళ్ళం అర్ధ రాత్రి అపరాత్రి ఎప్పుడు పిలిచినా డ్యూటీ వేళకాక పోతే నరసింహం వచ్చి వాలేవాడు .అలాగే నా శిష్యుడు చిలుకూరి కూడా .బోరు వేసే ఖర్చులు ఉమ్మడి డబ్బు లోన్చేపెట్టాను మూదు అంగుళాల నీరు బానే పోసింది ..కరెంట్ కు కూడా పద్మనాభమే అప్పటి ఏం ఎల్ ఏ అన్నే బాబూరావు గారి స్నేహితుడు బందర్లో డివిజనల్ ఇంజినీర్ అవటం తో అప్లికేషన్ పెట్టిన వారం లోనే శాంక్షన్ అయింది .షెడ్డు కట్టాము అయితే ఇక్కడొక సమస్య వచ్చింది మొటారును అయిదు అడుగుల గుంటలో పెదితేకాని ఆడదని చెప్పారు .అలానే చేశాం .ఇక చెరుకు సాగుకు ధోకా లేదు .చుట్టూ పక్కల వారికీ నీరు సప్ప్లై చేశాం .అప్పటిదాకా అంటే మా అమ్మ ఉన్నంత కాలం ఉమ్మడి గానే డబ్బు వాడాను .ఎవరికీ ఏమీ ఇవ్వలేక పోయాను .మాఅమ్మ మరణం తర్వాత మా అమ్మ పేరా ఉన్న ఎకరం పొలం లో అయివేజు మా ఇద్దరక్కయ్యలకూ చెరిసగం పంటలు రాగానే ఇచ్చేవాడిని .పార్టిషన్ డీడ్స్దీ అందరం కలిసి రాసుకొని ఎవరి వాటాకు ఎంత వస్తుందో అంతా ఇచ్చేసేవాడిని . ఖర్చులు రాసి అందరికి అంద జేసేవాడిని . శిస్తులూ కరెంటు బిల్లులూ నేనే కట్టి లెక్కల్లో చూపించేవాడిని .నీళ్ళు పక్క చేను వాళ్లకు ఇస్తే వారిచ్చే డబ్బు కూడా జమల్లో చూపించేవాడిని .కొందరు రైతులు కల్లాలలో ధాన్యం రూపం లో ఇవ్వటం కూడా ఉండేది .ఏమైనా మా రెండు బోర్లు బంగారు తల్లులు .గంగ మా పొలం లో కదం తొక్కు తోందా అన్నట్లు అని పించింది .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –1-2-14-ఉయ్యూరు