
భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా ఇద్దరు కవుల పేర్లు ప్రతి విద్యా వంతునికి తెలుసు. వారిలో ఒకరు రవీంద్రుడు. మరొకరు సరో జినీనాయుడు. ఇంగ్లీషు పాఠ్యాంశంలో భాగంగా ఆమె కవితను ఏదో ఒక తరగతిలో ప్రతి విద్యార్థి చదవడం అనివార్యం.
ఆధునిక భారతీయ ఆంగ్ల కవితకు హైదరాబాద్ నగరం వేదికన్నది ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. కానీ భారతదేశంలో ఇప్పటికీ పేరిన్నిక గన్న సరోజినీ నాయుడు ఆధునిక ఆంగ్ల కవితా రచనకు హైదరాబాద్ జనజీవితమే ప్రాతిపదిక. సరిగా 130 ఏళ్ల క్రితం హైదరాబాద్ జనజీవితం మీద కవిత రాసినవారు లేరు. ఆనాటి హైదరాబాద్ సూఫీ సంస్కృతిని, తెలంగాణ జీవన రీతిని ప్రేమించిన గొప్ప సెక్యులర్ మానవతావాది సరోజిని. ఆ మాటకు వస్తే ఒక మహానగరపు జీవితాన్ని ఈ స్థాయిలో కవిత్వీకరించిన వారు ఆంగ్లంలో కూడా అరుదే.
హైదరాబాద్ చారిత్రిక కట్టడాలే కాదు అనేక రకాల కష్టజీవులపై కవిత కట్టిన రచయిత్రి ఆమె. ఒక హైదరాబాద్ బజార్స్ కవితలో ఆనాటి ఈ నగరపు సబ్బండ వర్ణాల జనజీవన రీతిని చిత్రిక పట్టిన జన కవయిత్రి. ఇంతేకాదు, ఆనాటి చేతివృత్తులవాళ్లు, గాజులమ్ముకునేవాళ్లు, బోయీ లు, విసుర్రాయి మీద పిండి పట్టే స్థానిక మహిళలు, ఫకీర్లు వాటిలో తారసపడతారు. ఈ స్థాయిలో జనజీవనాన్ని చిత్రించిన రచయిత ఇప్పటికీ ఆంగ్ల కవులలో లేరు. న్యూయార్క్ మీద కవిత రాసి న్యూయార్క్ పోయెమ్స్ పేరుతో సంకలనం వేసిన స్పానిష్ అమర కవి లోర్కా, ఇటీవలే మనల్ని వదిలిపోయిన దళిత మహాకవి నామ్‌దేవ్ ధసాల్ ఉన్నారు. ఆమె కవితా రచనకు, ఆమె కుటుంబానికి, హైదరాబాద్‌కు ఆధునిక తెలంగాణ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలకు బలీయమైన సంబంధమున్నది. హైదరాబాద్ స్థానిక సంస్కృతిపై, జనజీవనరీతిపై చర్చ జరుగుతున్న సందర్భమిది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13న ఆమె జయంతి సందర్భంగా ఆమె కవితా రచనపై, వారి కుటుంబం చేసిన త్యాగాలపై ఒక పరిచయం.
ఆంగ్ల ప్రపంచాన్ని అబ్బురపరిచిన సరోజిని
ఆంగ్లంలో కవిత రాసి ఆ సాహిత్య ప్రపంచాన్ని అబ్బుర పరిచిన తొలి భారతీయ కవయిత్రి సరోజినీ నాయుడు. రవీంద్రుని గీతాంజలి కంటే ముందే తన కవిత రాసి పాశ్చాత్య సమాజాన్ని ప్రధానంగా ఆంగ్లో అమెరికన్ సమాజాన్ని మెప్పించిన ప్రతిభావంతురాలు, మహిళా మేధావి సరోజినీదేవి. ఆమె ప్రతిభకు అబ్బురపోయిన నిజాం ఆమెకు ప్రత్యేక పరిగణన కింద స్కాలర్‌షిప్పు మంజూరు చేశారు. 1893లో లండన్‌కు పయనమైన సరోజిని ఉన్నత చదువులకోసం కేంబ్రిడ్జ్‌లో చేరారు. అక్కడ ఆంగ్ల సాహితీ విమర్శకుడు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఇంగ్లీషు ఆచార్యుడు ఎడ్మండ్ గూస్ ప్రోత్సాహం దొరికింది. తొలుత ఆమె ఇంగ్లీషు కవులను అనుసరించినా గూస్ సలహాతో ఆ ప్రయత్నాన్ని విరమించి భారతీయత ఉట్టిపడే కవితా రచనకు పూనుకున్నారు. 1905లో వెలువడిన మొదటి సంకలనానికి ముందుమాట రాసింది ఇంగ్లీషు సింబాలిస్టు, సర్రియలిస్టు కవి ఆర్థర్ హీనే. అదే రోజులలో మిస్టిక్ వర్స్ అనే ఆంగ్ల కవితా సంకలనంలో సరోజిని రాసిన ది లోటస్ కవిత చోటుచేసుకోవడంతో చిన్న వయస్సులోనే ఆమె ప్రశస్తి బాగా పెరిగింది.
మొదటి సంకలనమైన గోల్డెన్ థ్రెషోల్డ్ 1894-1905ల మధ్యలో సరోజిని వెలువరించిన కవితలతో ప్రచురితమైంది. విలియమ్ హీనమన్ అనే సంస్థ ప్రచురించింది. ఒకరకంగా భారతీయ నగర జీవితం మీద అందులో అనేకమంది కష్టజీవులపై ఆంగ్లంలో కవిత్వం రాసి అంతర్జాతీయం చేసిన కవయిత్రి ఆమె. మౌలికంగా కవయిత్రిగా బతికిన రచయిత్రి సరోజిని. 1893 నుంచి 1920 వరకు కవితా రచన చేశారు. పదమూడేళ్లకే ఆమె కవితా సంకలనం మెహిర్ మునీర్ అచ్చయింది. ఫార్సీ ప్రభావంతో రాసిన కవిత్వం అది. అటు తర్వాత గోల్డెన్ థ్రెశోల్డ్ (1905), ది బర్డ్ ఆఫ్ టైమ్ (1912), ది బ్రోకెన్ వింగ్ (1917) వెలువడ్డాయి. తర్వాత జాతీయోద్యమంలో తీరిక లేకుండా ఉండడంతో కవితా రచన వదిలేశారు. ఆమె ఆగమనం వరకు వలసవాదుల కవితకు అనుసరణగా మాత్రమే భారతీయ రచయితల ఆంగ్ల కవిత ఉండేది. దానిని దేశీకరించి ఇండియన్ ఇంగ్లీషు అనే భావనకు అంకురార్పణ చేసిన గొప్ప కవయిత్రి సరోజినీ నాయుడు.
సరోజినీ కవితకు సినారె అనువాదం
ఆమె పేరు రెండు వైద్య, విద్యాసంస్థలకు, ఒక రోడ్డుకు పెట్టినప్పటికీ ఆమె సాహిత్య కృషి తెలంగాణ, హైదరాబాద్ సాహిత్య, సాంస్కృతిక చైతన్యంలో భాగం కాలేకపోయింది. 1979లో శత జయంతి సందర్భంగా ఆమె కవితలలో మొత్తం 50 రచనలను ఎంపిక చేసి మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి ముత్యాల కోకిల పేరుతో తెలుగు చేసి పుస్తకం వేశారు. ఆమె ఆంగ్ల కవితలకు సరిధీటిగా తెలుగులోకి అనువదించినప్పటికీ ఆ పుస్తకం మరుగున పడిపోయింది. ఛందస్సుపై, హైదరాబాద్ దకనీ సంస్కృతి, దాని విలువల గురించి బాగా అవగాహన ఉన్న సినారె అనువాదం మూలప్రతి ప్రతిఫలించిన సరోజిని ఆత్మను పట్టుకోగలిగింది. ఆంగ్ల ఛందస్సులో ఆరితేరిన వ్యక్తి సరోజిని. ఆమె 20 ఏళ్లలోపే వెలువరించిన ఆంగ్ల కవిత అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి ఇదొక కారణం కావచ్చు. ఆమె కవితా రచనకు సినారె అనువాదం ఒక గొప్ప నిరాజనం.
ఆంగ్లకవితకు జవసత్వాలు అద్దిన జనకవయిత్రి
మొత్తం భారతదేశంలో భారతీయ ఆంగ్ల కవితకు తొలి నిరేర్దశకులుగా కోల్‌కతాకు చెందిన డిరేజియో, మైకేల్ మధుసూదన్ దత్తు, తోరుదత్తు (మహిళా కవయిత్రి)లని భారతీయ ఆంగ్ల సాహిత్య చరిత్రకారులు చెబుతుంటారు. విచిత్రంగా డిరేజియోకు సమకాలంగా మహాత్మా ఫూలే భార్య, ప్లేగు రోగులను ఆదుకుంటూ అదే రోగం అంటుకుని మరణించిన మహనీయురాలు సాహిత్రీబాయి ఫూలే కూడా ఉన్నారు. నిజానికి తొలి భారతీయాంగ్ల కవులలో ఆమె కూడా ఒకరు. కానీ ఆమెకు ఆ ప్రశస్తి రాలేదు. వారి సమీప సమకాలికులలో హైదరాబాద్‌కు చెందిన సరోజినీనాయుడు, నిజామత్ జంగ్‌లు ఉన్నారు. గోల్డెన్ ట్రజరీ పేరుతో భారతీయ ఆంగ్ల కవితను సంకలించిన సీఫెల్ (ఇఫ్లూ) వైస్ ఛాన్స్‌లర్, కన్నడ సాహితీ రంగంలో ప్రముఖ రచయిత వీకే గోకక్ బెంగాలీ ఆంగ్ల కవుల తర్వాత సరోజినీనాయుడు, నిజామత్ జంగ్‌లకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో భారతీయ ఆంగ్ల కవితారంగంలోకి అరుదెంచిన మహా కవయిత్రి సరోజినీదేవి. అప్పటి వరకు భారతీయ ఆంగ్ల కవితకు అంతగా ప్రశస్తి లేదు. గుర్తింపు కూడా అంతంత మాత్రమే. అప్పటి వరకు ప్రాథమిక దశలోనే ఉన్నది. డిరేజియో, మైకేల్ మధుసూదన్ దత్తు, తోరుదత్ సరోజిని కంటే ముందే ఆంగ్ల కవితా రచన చేసినవాళ్లే. భారతీయత తక్కువ. ఆంగ్ల కవితలో స్థానికతను, జాతీయతను, అంతర్జాతీయతను ప్రవేశపెట్టిన తొలి భారతీయ కవయిత్రి ఆమె. అటువంటి పరిస్థితులలో హైదరాబాద్‌లో పుట్టి అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేసిన భారతీయాంగ్ల కవితకు అంతర్జాతీయ ప్రతిష్ఠ, మన్నన సముపార్జించిపెట్టడం అసాధారణ విషయమే. ఆంగ్ల కవులుగా ప్రసిద్ధులైన రవీంద్రుడు, అరవింద్ ఘోష్ ఆమె తరువాతే ఆ కవితా రచన చేపట్టారు.
దేశవ్యాప్తంగా ఆమె కవితను చదవడం అనివార్యం
1870ల నుంచి 1980ల వరకు వారి కుటుంబం మొత్తం హైదరాబాద్, తెలంగాణ రాజకీయ, సాంఘిక సాంస్కృతిక, సాహిత్య వికాసానికి అంకితమై స్థానిక జనానికి అండగా నిలబడి అక్కడి సంస్కృతిలో సంలీనమైన కుటుంబం. 1940లో బెంగాల్‌లో ఒక మీటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు ఆమెను బెంగాలీ మహిళగా పిలుస్తారు. తనను అట్లా పిలువరాదని తనను తెలంగాణ మహిళగా పిలువాలని స్పష్టం చేశారు. భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా ఇద్దరు కవుల పేర్లు ప్రతి విద్యావంతునికి తెలుసు. వారిలో ఒకరు జాతీయగీతం రచయిత రవీంద్రుడు. మరొకరు సరోజినీనాయుడు. ఇంగ్లీషు పాఠ్యాంశంలో భాగంగా ఆమె కవితను ఏదో ఒక తరగతిలో ప్రతి విద్యార్థి చదవడం అనివార్యం. గాంధీజీ, ఆజాద్, పటేల్ స్థాయిలో భారతదేశ జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన సరోజిని హైదరాబాద్ ప్రజల మనిషి.
సరోజినీని తెలుసుకోవడమంటే హైదరాబాద్‌ను తెలుసుకోవడమే
హైదరాబాదే కాదు తెలంగాణ ఆధునిక చేతనలో భాగం కావల్సిన ఆమె కవితకు తగిన మన్నన లేకపోవడం శోచనీయం. మద్రాసు భారతి, కోల్‌కతా వాసులకు రవీంద్రుడు ఎటువంటివారో సరోజినీ హైదరాబాద్‌కు అంతే. ఇప్పుడిప్పుడే వారి కుటుంబం స్థానిక హైదరాబాదీలు, తెలంగాణవాసుల యాదిలోంచి కనుమరుగవుతున్న పరిస్థితి దాపురించింది. కాళోజి కవితను చదవడమంటే తెలంగాణను తెలుసుకోవడమే. సరోజినీ గురించి తెలుసుకోవడమంటే హైదరాబాద్ గురించి తెలుసుకోవడమే. తెలంగాణ ఎట్లాగు తమ చేజారిపోతుందన్న సీమాంధ్ర పాలకవర్గాలు హైదరాబాద్‌నైనా హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న సందర్భమిది. ఈ సందర్భంలో హైదరాబాద్ ఆధునిక చరిత్రకు అమ్మ లాంటి సరోజినీ దేవిని పదే పదే చదువుకోవడం, తలుచుకోవడమే అందుకు జవాబు.
-సామిడి జగన్‌రెడ్డి
94904 91551