అత్తుకాల్ భగవతి ఆలయం
కేరళ లో తిరువనంతపురానికి మూడు కిలో మీటర్ల దూరం లో అత్తుకాల్ అనే చోట ఉన్న దేవతనే అత్తుకాల్ భగవతి అమ్మ వారు అంటారు .కాళికాదేవి అంశ మధుర మీనాక్షీ దేవి స్వరూపం ఉన్న దేవి .కన్నగి అనే అమ్మాయిని కోవలం అనే ధనికుడికి ఇచ్చి వివాహం చేశారు .అతను వేశ్యాలోలుడై భార్యను మరిచి పోయాడు .ఉన్నది అంతా క్షవరం అయి చివరికి తిండి లేక భార్య కన్నగి దగ్గరకు చేరాడు .ఆమె దగ్గర కూడా ఒక్క కాలి బంగారు అందెలు తప్ప అమ్ముకొని తినటానికి ఏమీ లేదు .మధుర వెళ్లి అమ్ముదామని ఇద్దరూ మధుర రాజ్యానికి చేరారు .ఒక అందే ఇచ్చి మధుర రాజు కు అమ్మమని కన్నగి భర్తను పంపింది .అతడు వెళ్లి అమ్మే ప్రయత్నం చేయగా అది రాణి గారి నగ అని దొంగిలించాడని కోవలం ను ఖైదు లో పెట్టించాడు
రాజు .ఈ విషయం కన్నగి కి తెలిసి రాజును రాణిని కలిసింది .తన దగ్గర ఉన్న రెండవ అందే ను రాజుకిచ్చి రాణీ గారి అన్దేనూ తెప్పించమని కోరింది .తన అందే ను పగల కొడితే అందులో వజ్రాలు బయట పడ్డాయి .రాణి గారి నగ ను పగల కొడితే అందులోంచి ముత్యాలు బయట పడ్డాయి .రాణి చెప్పింది అబద్ధం అని తేలింది .రాణి మోసం చేసి తన భర్త ను ఖైదు చేయించిందని కన్నగి మధుర రాజు రాణీలను నగరాన్ని శపించింది .కన్నగి ముక్తి పొన్దగా ఆ నగర దేవత దర్శన మిచ్చింది ..స్వంత ఊరు కొడుం గల్ వెడుతుంటే అక్కడ అట్టుకల్ నది దాటింది అక్కడ ఒక ముసలాయన నదిని దాటలేక ఇబ్బంది పడుతుంటే చిన్న పిల్లగా మారి ఆయన చేయి పట్టుకొని నది దాటించి వాళ్ళ ఇంటి దగ్గర దిగ బెట్టి అదృశ్యమైంది .ఆ రాత్రి ఆ ముసలాయన కలలో కన్పించి తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని కోరింది .మూడు బంగారు గీతాలు కనీ పించిన తోటలో ఆలయాన్ని కట్టమని ఆదేశించింది .అలా వెలసిన ఆలయమే ఈ దేవాలయం ..
కుంభ మేళా నాడు లక్షలాది భక్తులు సందర్శించి అమ్మ వారికి పొంగళ్ళు నైవేద్యం వండి పెడతారు .ఎటు చూసినా అయిదు కిలో మీటర్ల దూరం లో పొయ్యిల మీద పొంగళ్ళు వండి నైవేద్యం పెట్టె వారే కని పించి ఆశ్చర్య పరుస్తారు .ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది .అంతటి ప్రాధాన్యత ఉంది ఈ ఆలయానికి .అమ్మవారికి శాస్త్రోక్తం గా పూజాదికాలు బ్రాహ్మణులు నిర్వహిస్తారు .చాలా మహిమాన్విత మైన అమ్మ వారు గా ప్రసిద్ధి .సాయంత్రం అర్చన చేసి హారతి ఇస్తూంటే కన్నుల పండువగా మహా వైభవం ఆ మధుర మీనాక్షీ దేవి ని చూస్తున్నంత దివ్య విభూతిగా ఉంటుంది .ఫిబ్రవరి తొమ్మిది నుండి పది హీను రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి .మేము వెళ్ళే నాటికే ఏర్పాట్లు ముమ్మరం గా జరుగుతున్నాయి విశాల మైన ప్రాంగణం .కళా భవనం ఆరు బయట పొంగళ్ళకు ఏర్పాట్లు కని పించాయి.
నాల్గు భుజాలతో ,చేతులలో ఆయుధాలతో అమ్మవారు దర్శన మిస్తుంది .విగ్రహాన్ని బదరీ నాద నుంచి వచ్చిన పురోహితుడి ఆధ్వర్యం లో ప్రతిష్టించారు . ఈ ఆలయాన్ని ‘’మహిళా శబరి మల దేవాలయం ‘’అని కూడా అంటారు .కన్నగి మధురను శపించి ఇక్కడ దేవతగా వేలిసిందని చరిత్ర .ఆమె సాక్షాత్తు పార్వతీదేవి అవతారం గా భావిస్తారు .తమిళ సంగం సాహిత్యం లో కన్నగి కద కు విశేష ప్రాముఖ్యం ఉంది .కేరళకు చెందిన విద్యాధర చట్టంగి స్వామి ఆలయాన్ని గుర్తించి పునర్ వైభవానికి కారకుడయ్యాడు .ఆలయ శిల్ప కళ ముగ్ధుల్ని చేస్తుంది. కేరళ, తమిళ కళా మిశ్రమ శిల్ప కళ ఉంటుందిక్కడ .ఆలయం లో మహిషాసుర మర్దిని ,రాజ రాజేశ్వరి పార్వతి దేవి విగ్రహాలు కనుల విందు చేస్తాయి గోపురం మీద దశావతార చిత్రాలు కన్నగి జీవిత చరిత్ర శిల్పాలు ఆకర్షనీయం గా ఉంటాయి .దక్షయజ్న శిల్పాలూ ఉన్నాయి .గర్భాలయం లో రెండు అమ్మ వారి విగ్రహాలుంటాయి .అందమైన విగ్రహం సకల ఆభరణ సుసోభితమై ఉన్న మనోజ్ఞా సుందర మూర్తి ఒకటి .ఈ అమ్మ వారి వెనుక ఇంకొక విగ్రహం అమ్మ వారిది ఉంటుంది .గణేశుని శిల్పాలూ ఉన్నాయి. ఒక వైపు భగవతి చిత్రం రెండవ వైపు శ్రీ చక్రం ఉన్న బంగారు నాణాలు ఇక్కడ ప్రత్యేకత .వీటిని కొని భద్రం గా దాచుకొంటాడు భక్తులు భక్తిగా .
Photo of Kadampuzha Bhagavathy Temple
కన్యాకుమారి
తమిళ నాడు లో కన్యాకుమారి క్షేత్రం ఉంది .కన్యకా దేవి అయిన ప్రదేశం ఇది దక్షిణాగ్రమే కన్యా కుమారి .ఇక్కడ హిందూ మహా సముద్రం బంగాళాఖాతం అరేబియా సముద్రం మూడు సముద్రాలు కలిసే ప్రదేశం ఇది’’ త్రిసాగర సంగమం’’ ప్రదేశమే కన్యాకుమారి .ఇక్కడ సముద్రం మీద సూర్యోదయ సూర్యాస్తమయాలు చూడ దగ్గవి .అందుకోసమే లక్షలాది జనం దర్శించి ఆ మధురానుభూతి ని పొందుతారు .ఇక్కడి వివేకానంద్ రాక్ మెమోరియల్ తిరువల్లువార్ విగ్రహాలు తప్పక దర్శించాలి .
కన్యాకుమారి దేవత ఆలయం చాలా అందం గా ఉంటుంది అమ్మ వారికి భగవతి బల భద్ర ,శ్రీ బాల అనే పేర్లున్నాయి .దేవి అని కూడా పిలుస్తారు .అమ్మ వారి విగ్రహాన్ని పరశురాముడు స్థాపించాడు .వేదకాలం నాటి ఆలయం గా గుర్తింపు ఉంది .రామాయణ మహా భారతాలలో ప్రస్తావన ఉంది .మణి మేఖల అనే తమిళ సాహిత్యం లో దీనికి ప్రాధాన్యత ఉంది .నారాయణ ఉపనిషత్ ,తైత్తిరీయ సంహిత లోను ప్రస్తావన ఉంది .కృష్ణ యజుర్వేదం లో ప్రస్తావన ఉన్నది .
రామ కృష్ణ పరమ హంస ,వివేకా నదులు సందర్శించిన మహా క్షేత్రం ఇది .అమ్మవారు కన్యక గా సన్యాసి వేషం లో దర్శన మిస్తంది .1863 ,1938లో అనేక మంది బాలికలను కన్యాకుమారికి పిలిపించి స్వామి నిర్మలానంద అమ్మ వారికి పూజ చేయించారు .1935,36లలో కూడా ఇలాగే పూజలు చేయించారు కన్యకా మణులతో ఇదొక విశేషం .
ఒకప్పుడు ఈ ప్రాంతం ‘’పరవార్ రాజుల ‘’పాలన లో ఉండేది .ఇక్కడ అమ్మ వారు వెలయ టానికి ఒక గాధ ప్రచారం లో ఉంది .బాణాసురుడిని మహా శివుడు వదించే సమయం లో ఒక పిల్ల శివుడి పై ప్రేమ ను పెంచుకొని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొన్నది .శివుడూ వివాహానికి ఇష్టపడ్డాడు .బాణుడు కన్య వలననే మరణిస్తాడని తెలుసు కొన్న నారద మహర్షి వారిద్దరి పెళ్ళికి అడ్డు పడ్డాడు .కాని వివాహ ముహూర్తం కూడా నిర్ణయమై పోయింది .బ్రాహ్మీ ముహూర్తం లో వివాహ లాగ్నాన్ని నిర్ణయించారు .వివాహాన్ని ఎలాగైనా ఆపాలని నారదుడు నిర్ణ యించి నారదుడు కోడి పుంజు గొంతుతో ముందే కూశాడు .ముహూర్తం మించి పోయిందని భావించిన శివుడు పెళ్ళికి తరలి వెళ్ళకుండా ఆగి పోయాడు .పాపం ఆ పిల్ల శివుడు వచ్చి వివాహం చేసుకొంటాడని ఎదురు చూస్తూనే ఉంది.యెంత చూసినా శివుడు రాలేదు నిరాశ చెందింది కన్యక.అన్నమూ నీరు లేకుండా రోజులు గడిపింది .చేతికి వేసుకొన్న పెళ్లి గాజులు పగల కొట్టుకొన్నది .సన్యాసిని గా మిగిలి పోయింది .
అమ్మ వారిని ఇక్కడ బాలాంబిక గా పూజిస్తారు .నవ దుర్గాలలో ఒకటి అయిన కాత్యాయిని గా ఆరాధిస్తారు .భాద్రకాళిగా అర్చిస్తారు .దగ్గర లో పాతాళ భైరవ తీర్ధం కాల భైరవ దేవాలయం చూడ దగినవి .కన్యాకుమారి ని నారాయణి ,నిమిషా ,విజయ సుందరి ,బాల సుందరి గా కూడా ఆరాధిస్తారు .కన్యాకుమారి ఒక శక్తి పీఠం కూడాఽమ్మ వారి ముక్కెర చాలా విలువైంది .యెన్తొ దొరం దాకా కాంతి వెదజల్లుతుంది .
కన్యా కుమారికి దగ్గర లో ఆల్వార్ తిరు నగరి,కుర్తాలం ఉన్నాయి. ముట్టూర్ లో ‘హాన్గింగ్’ బ్రిడ్జ్ ‘’ఉంది. మండుర్తరై లో పులుల అభయారణ్యం ఉంది .నాగర్ కోయిల్ లో నాగ రాజ దేవాలయం ఉంది. పద్మనాభ పురం లో ‘’వుడేన్ పాలస్ ‘’చూడ తగినది .అలాగే పచియప్పన్ డాం కూడా .
అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )
మరో దేవాలయ విశేషాలు మరో సారి
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-14-ఉయ్యూరు