అమ్మాయిల గురించి అలా రాయను -అంటున్న డైరెక్టర్ పూరీ జగన్నాధ్

 

‘ఇడియట్’ ‘అమ్మానాన్నా తమిళమ్మాయి’ ‘పోకిరి’ వంటి హిట్ చిత్రాలతో యువత మదిని గెలుచుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. ఏ విషయాన్నయినా సూటిగా మాట్లాడే ఆయనతో ఆంధ్రజ్యోతి – ఏబీఎన్ ఎమ్‌డీ వేమూరి రాధాకృష్ణ చేసిన ఓపెన్‌హార్ట్ సారాంశం ఇక్కడ…

మీ పెళ్లి ఎలా జరిగింది?
ఆమె షూటింగ్ చూడ్డానికి వచ్చింది. నాకు నచ్చింది. విజిటింగ్ కార్డిచ్చి ‘నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశముంటే ఫోన్ చెయ్యి’ అన్నా. వారం తర్వాత ఫోన్ చేసింది. ‘ఇలా ఎంతమందికిచ్చావు..’ అంది. అలా మొదలైంది మా పరిచయం. తర్వాత కలిసేవాళ్లం. ఐస్‌క్రీమ్‌లు అవీ తినిపించడానికి స్నేహితుల దగ్గర అప్పు చేసేవాణ్ని. ఒకసారి రెస్టారెంట్‌కెళితే ఆమె తందూరీ కోడి ఆర్డరిచ్చింది. అప్పటిదాకా నేను దాన్ని తినలేదు. అప్పుడు ఆమె ఎంత తింటుందో చూద్దామని నేను తినకుండా ఆగాను. మొత్తం తినేసింది. ‘అమ్మో ఈ పిల్లను నేను పెంచలేను’ అని పెళ్లి మానేద్దామనుకున్నాను. కాని తర్వాత ఇద్దరి కుటుంబాలనూ ఒప్పించాం. వాళ్లు బాగా ఖర్చు పెడతారని ‘నిన్నే పెళ్లాడతా’ షూటింగ్ అప్పుడు ఎవరికీ చెప్పకుండా చేసేసుకున్నాం. అసిస్టెంట్ డైరెక్టర్లు ఒకరు తాళి, ఒకరు కూల్‌డ్రింక్స్ అలా తెచ్చారు.

చేసిన సినిమాలు : పాతిక
హిందీ సినిమాలు : ఇద్దరు ప్రొడ్యూసర్లతో సంతకాలు చేశాను. సల్మాన్ కూడా కబురు పెట్టారు. కానీ అక్కడ పని నెమ్మదిగా నడుస్తుంది. నేనేమో పని లేకుండా ఉండలేను. అందుకని చెయ్యలేదు.
చదువు : డిగ్రీ ఫెయిలయ్యా. ఇంటరే అనుకోండి.
చిన్న సైజు దాసరి : ఆయనలాగా నేను పాటలు రాయలేదు.
తెలుగమ్మాయిలు : హీరోయిన్లుగా అప్రోచ్ అవరు. అదే ముంబైకెళితే వంద ప్రొఫైల్స్ వస్తాయి. ఇక్కడ టాలెంట్ ఉన్నా తల్లిదండ్రులు ప్రోత్సహించరు.
తర్వాత ప్రాజెక్టు : మహేష్‌బాబుతో అనుకుంటున్నా.
పాలిటిక్స్‌లోకి : వెళ్లను. నా పని నాది.
పిల్లలు : కొడుకు 10, కూతురు 9 చదువుతున్నారు.
బలహీనత : డబ్బంటే గౌరవం లేకపోవడం, ఎక్కువ నమ్మడం, మందు
బలం : వెరీ ఫోకస్డ్. పని లేకుండా ఉండలే ను.

– వెల్‌కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం పూరీ జగన్నాథ్‌గారూ. లేటెస్ట్‌గా ‘హార్ట్ఎటాక్’ తీశారు. నిర్మాతకు హార్ట్ ఎటాక్ వచ్చిందా? బానే ఉందా? టాకేంటి?
బానే ఉంది. యూత్‌కు బాగా నచ్చింది. నేనే ప్రొడ్యూసర్ని.
– మిగతా విషయాల్లోకి వెళ్లేముందు, మీకు బ్యాంకాక్ అంటే ఎందుకంత ఇష్టమో చెప్పండి?
బ్యాంకాక్ కాదు, పట్టాయా బీచ్‌లో కూర్చుని రాసుకోవడం ఇష్టం. ‘ఇడియట్’ సినిమా అప్పుడు మొదటిసారి వెళ్లాను. నాకది చాలా నచ్చింది. ఒక ముసలమ్మ, ఆమె కుటుంబం కాఫీ, టీల్లాంటివి అందిస్తారు. మొత్తానికి ఒక పర్సనల్ అటాచ్‌మెంట్ వచ్చేసింది.
– అక్కడే సెటిలయిపోతారా?
ఇప్పుడే కాదుగాని, ఒక చిన్న ఇల్లు కొనుక్కుని నేను, నా భార్య వృద్ధాప్యం అక్కడే గడపాలని ఆలోచన.
– అంతేనా, అక్కడ మసాజ్‌లంటే ఇష్టమా?
ఎన్నాళ్లు చేయించుకుంటాం మసాజ్‌లు? బోరు కొడుతుంది. వాళ్లు బాగా చేస్తారుగాని రోజూ చేయించుకుంటే ఒళ్లు నొప్పులొస్తాయి.
– సరే, మీ టాటూల గురించి కొంచెం…
టాటూ అనేది అడిక్షన్. ఒకటి వేస్తే రెండోది ఎక్కడ వేయించుకుందామా అనిపిస్తుంటుంది. నేను మొదటిది గోవాలో వేయించుకున్నాను. అది చైనా భాషలో లవ్. ఎందుకో చైనా అక్షరాలంటే నాకిష్టం. నేను వేయించుకున్న రెండో టాటూకు స్పానిష్‌లో ‘లెవెంత్ మైల్’ అని అర్థం. మన లక్ష్యం పది మైళ్లయితే, పదకొండు మైళ్లు పరిగెత్తమని చెబుతుంది అది. ఇంకోటి ‘నాట్ పర్మనెంట్’ అని. కష్టాల్లో ఉన్నా డబ్బున్నా లేకపోయినా, ఆఖరికి ప్రేమలో ఉన్నా – ‘ఈ క్షణం శాశ్వతం కాదు’ అని మనకు గుర్తు చేస్తుందది. సింపుల్‌గా చెప్పాలంటే ‘ఒళ్లు దగ్గర పెట్టుకోమని’.
– మీ వ్యక్తిత్వాన్ని ఇలా రూపొందించినవేమిటి?
చిన్నప్పట్నుంచి పుస్తకాలు ఎక్కువగా చదివేవాణ్ని. నన్ను బాగా ప్రభావితం చేసింది చలం, శ్రీశ్రీ, రంగనాయకమ్మ, రాచకొండ విశ్వనాథశాస్త్రి వంటి రెబెల్ రచయితలు.
– వాళ్లలాగా మీరూ దేవుణ్ని నమ్మరా?
నేను దేవుడున్నాడని నమ్ముతాను. ఏదో ఒక శక్తి ఉంది. నాకు బాగా ఇష్టమైన టాపిక్ దేవుడు. నాకేమీ పని లేనప్పుడు ‘ఎవడీడు, ఎక్కణ్నుంచి వచ్చాడు, మనల్ని ఒక్కొక్కర్నీ ఒక్కొక్కలాగా పుట్టించి అతనేం కావాలనుకుంటున్నాడు? ఏమీ కాకపోతే ఇంత డ్రామా ఎందుకు…’ ఇలా ఆలోచిస్తుంటా. నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న ‘మొక్కు తీర్చనందుకే దేవుడు మన ఇంట్లో ఇన్ని అనర్థాలు కల్పిస్తున్నాడు..’ అన్నారు. ‘బొచ్చు ఇవ్వకపోతే దేవుడు కక్షగట్టి ఇలా కష్టాలు కల్పిస్తాడా? టార్చర్ చెయ్యాలని చూస్తే ఆయన దేవుడెందుకవుతాడు’ అన్నాను. మా నాన్న నావైపు చూసి ‘నీకు పెళ్లయి ముగ్గురు పిల్లలు పుడితే అన్నీ అర్థమవుతాయి, నమ్ముతావు’ అన్నారు.
– అది నిజమయిందా మరి?
దేవుణ్ని నమ్ముతాను తప్ప, ఇలాంటివి నమ్మను. దేవుడి దృష్టిలో అన్ని ప్రాణులు ఒకటే. ఎవరెవరు ఏం చేశారో చిట్టాలు రాసుకుని, స్వర్గం నరకం మెయింటెయిన్ చేస్తూ – అలాంటి పాకీ పనులు దేవుడు చెయ్యడు.
– కెరీర్ అప్స్ అండ్ డౌన్స్ చూసినప్పుడు దేవుడికి మొక్కుకోవాలనిపించలేదా?
నేను కష్టాలు, సుఖాలు అన్నీ చూశాను. కన్నీళ్లు పెట్టుకున్నాను. కాని మొక్కుకోలేదు.
– కష్టాలంటే ఎలాంటివి?
సంపాదించిన ఇళ్లూవాకిళ్లూ అన్నీ పోయి, వాటిని అమ్ముకుని అప్పులు తీర్చుకున్న రోజులు. నా దగ్గర పది కుక్కలుండేవి. వాటి ని పోషించలేక ట్రెయినర్‌కిచ్చేశాను. ఆ రోజు చాలా ఏడ్చాను. నాకు తెలిసి నిజమైన కష్టమనేది నేచర్ నుంచి వస్తుంది. ఎవడో మోసం చేసి, డబ్బు పోయి – ఇలాంటివి కాదు. రెండు కళ్లూ పోయి, రెండు కాళ్లూ పోయి లేదా సునామీ వచ్చి అందరూ చనిపోయి… ఇలాంటివి నేచర్ నుంచే వస్తాయి. సరదాగా ఓ సాయంత్రం బీచ్‌లో కూర్చుని వెన్నెల రాత్రి, భూదేవి అంటూ కవిత రాసుకుంటే బాగుంటుంది. కాని అదే రోజు సునామీ వచ్చి అందరూ పోతే అదే నేచర్ వయొలెంట్‌గా కనిపిస్తుంది.
– మీరు ప్రకృతి ప్రేమికులన్నమాట!
నా దగ్గరొక 50 పక్షులున్నాయి, రెండు కోతులున్నాయి, ఒక పిల్లి, కొన్ని బాతులు… తప్పనిసరిగా కాసేపన్నా వాటితో గడుపుతాను. పెట్స్ వల్ల మన నేచర్ మారిపోతుంది. కాస్త పెడితే సంతోషిస్తాయవి. మనుషులకు ఎంత పెట్టినా చాలదు.
– డబ్బు పోయిందన్నారు.. అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది?
నాకు డబ్బంటే రెస్పెక్ట్ లేకపోవడం వల్ల. ఆర్థిక క్రమశిక్షణ లేదు. నాకెవ్వరూ అవి చెప్పలేదు. డబ్బుదేముంది ఎప్పుడైనా సంపాదించొచ్చు.. అంటూ వెళ్లాను. ఎవరేం చేస్తున్నారో పట్టించుకోలేదు.
– అంటే మోసపోయారని…
మోసపోవడం కూడా మన లోపమే. ఇప్పుడిప్పుడే నా మైండ్ మారుతోంది. డబ్బు దాచుకోవాలనిపిస్తోంది.
– క్షవరమైతేగాని వివరం తెలియలేదన్న మాట. ఎంత పోగొట్టుకున్నారు మీరు?
ఓ 85 కోట్లు.
– దీన్నుంచి మిగిలినవాళ్లకు చెప్పే సందేశమేమిటి?
జీవితమంటే యుద్ధం. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గుడ్డలిప్పేస్తారు. అడవిలో ఉన్నట్టు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. మనిషి నుంచి మనిషిని కాపాడటానికి మానవత్వం పుట్టింది. నిస్సహాయత నుంచి దైవం పుట్టింది. ఇవన్నీ ఆయుధాలే. మంచితనం – దుర్మార్గం రెండూ ఆయుధాలే.
– జీవన సారాంశం చెబుతున్నారు. ఆ సందర్భాల్లో డ్రగ్స్‌కు అలవాటు పడ్డారా?
లేదు. గడచిన మూడేళ్లుగా రెగ్యులర్‌గా తాగడం మొదలెట్టాను. మా గురువుగారు రామ్‌గోపాల్‌వర్మ పుణ్యమాని ఆయనతో కూర్చుని తాగుతున్నా. అదో పెద్ద ఎదవలవాటు.
– అంత డబ్బు పోతే డిప్రెషన్‌లోకి వెళ్తారు ఎవరైనా..
డిప్రెషన్‌లోకి వెళితే ఇంకా లోపలికెళ్లిపోతాం. మళ్లీ ఇళ్లుగిళ్లు కావాలంటే ఎలా వస్తాయి? మళ్లీ సినిమాలు రాయాలి, తియ్యాలి. దానికోసం ఫ్రెష్‌గా ఉండాలి. ఇంకా ఎక్కువ ఎక్సర్‌సైజ్ చెయ్యాలి. ఫిట్‌నెస్ ఒక్కటే మనల్ని కాపాడుతుంది. నాగార్జునగారు ఒక మంచిమాట చెప్పారొకసారి. ‘ఏరా భోంచేశావా అని అడిగేవాడుంటాడు, ఏరా సంపాదించి జాగ్రత్త చేసుకున్నావా అని అడిగేవాడుంటాడు. కాని ఎక్సర్‌సైజ్ చేశావా అని ఎవ్వరూ అడగరు’ అని. ఆ ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి. నన్నాయన రోజూ ఎక్సర్‌సైజ్‌కు తీసుకెళ్లేవారు. నాగార్జునగారితో వెళ్లడం కిక్ అని వెళ్లానుగాని, సీరియస్‌గా తీసుకునేవాణ్ని కాదు. అది చూసి ఆయనలా చెప్పారు. అది నాకు చాలా పనికొచ్చింది.
– మరెందుకు మీరు డ్రగ్స్‌కు అడిక్ట్ అయ్యారనే ప్రచారం జరిగింది?
అలా అయితే మళ్లీ రాలేను కదా సార్? నా బ్రెయినే నా పెట్టుబడి. దాన్ని పాడు చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? నాకు తెలిసి జీవితం ఎవ్వర్నీ వదిలిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తుంది. అది అందరికీ కొద్దికొద్దిగా అర్థమవుతూ ఉంటుంది.
– దాసరి, రాఘవేంద్రరావు వంటి వారి తర్వాత వచ్చినవాళ్లలో మీరొక టాప్ డైరెక్టర్. మీ నేపథ్యం ఏమిటి?
మా ఇంట్లో మూడు బీరువాల పుస్తకాలుండేవి. మా నాన్న వ్యవసాయదారుడైౖనా బాగా చదివేవారు. మా ఊరు నర్సీపట్నం దగ్గర బాపిరాజు కొత్తపల్లి అనే పల్లెటూరు. నేను నాలుగైదు తరగతుల నుంచే ఆ పుస్తకాలను చదివేవాణ్ని. ఎనిమిదో తరగతి వచ్చేసరికి రామాయణం, భారతం మొదలుకొని టాప్ రైటర్లందరివీ పుస్తకాలు చదివేశాను. నాకెంత అర్థమైంది అని కాదు. విజయచిత్ర వంటి సినిమా మ్యాగజైన్ల వల్ల సినిమా పరిశ్రమ పట్ల విపరీతమైన గౌరవం కలిగింది. అదీగాక మాకో టూరింగ్ టాకీస్ ఉండేది. ‘నేడే చూడండి… ‘ అని సినిమా ప్రచారం చేసే రిక్షా ఉంటుంది కదా, రోజూ స్కూలయిపోగానే అదెక్కి థియేటర్‌కెళ్లేవాణ్ని. ఫస్ట్ షో అయ్యాక ఇంటి నుంచి వచ్చిన క్యారేజీ తినేసి సెకెండ్ షో అయ్యాక కలెక్షన్ పట్టుకుని ఇంటికెళ్లేవాణ్ని. అలా రోజూ రెండాటలు చూసేవాణ్ని. అలా ఆరో తరగతి నుంచి పొట్టి కథలు రాసేవాణ్ని. మా నాన్న వాటిని చదివేవారు. ఒకసారి మా ఊళ్లో ఒక నాటకాన్ని డైరెక్ట్ చేశా. దాన్ని మా అమ్మానాన్నలు చూశారు. మర్నాడు ఉదయం పిలిచి నా చేతిలో ఇరవై వేలు పెట్టి ‘సినిమా ఇండస్ట్రీకి వెళ్లరా, బాగుపడతావు’ అని పంపించారు. అది 89 -90 ఆ సమయంలో. అలా ఎంటరయ్యాను.
– తల్లిదండ్రులే ప్రోత్సహించడం అరుదు. బాగుంది. తర్వాత?
మధు ఫిలిమ్ ఇనిస్టిట్యూట్‌లో డైరెక్షన్‌లో చేరాను. శ్రీకాంత్ నటనకు అప్పుడే చేరాడు. ఆర్నెల్లు చూసి అక్కణ్నుంచి ఇద్దరం మానేశాం. తర్వాత కె. మురళీమోహనరావు అనే దర్శకుడి దగ్గర అసిస్టెంటుగా చేరదామనుకుని సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసుకెళ్లా. ఆయన గురించి అడిగితే ఆయన బయటికొచ్చి నన్ను లోపలికి తీసుకెళ్లారు. ‘ఇంత సులువా…’ అని నేను లోపల ఆశ్చర్యపోయాను. అప్పుడాయన ఒకమాట చెప్పారు. ‘ఖాళీగా ఉన్న డైరెక్టర్ నిన్ను పెట్టుకుంటాడు కానీ నువ్వు వెళ్లవు. బిజీగా ఉన్న డైరెక్టర్ దగ్గరే అసిస్టెంట్‌గా చేరదామనుకుంటావు. కాని అప్పటికే అక్కడున్నవాళ్లు వెళ్లిపోరు కనుక నీకా ఛాన్స్ త్వరగా దొరకదు. అందువల్ల బిజీ డైరెక్టర్ దగ్గర ఆ స్థాయికొచ్చే అసిస్టెంట్ ఎవడున్నాడో చూడు. అలాంటివారితో స్నేహం చెయ్యి. వాడు పైకొస్తే నీకూ దారి దొరుకుతుంది. వాడు చెడిపోతే నీ ఎంపిక తప్పని తేలిపోతుంది..’ అని చెప్పారు.
– భలే బాగా చెప్పారే ఆయన!
అవును. నేనూ దాన్నే పాటించాను. అప్పట్లో ‘శివ’ పెద్ద హిట్టు. బయటికొచ్చి చూస్తే రామ్‌గోపాల్‌వర్మ పేరు కన్పించింది. ఆయనకు దగ్గరగా ఉన్నది కృష్ణవంశీ. ఆయనతో స్నేహం మొదలెట్టాను. పని అడగలేదు. ఆయనే నన్ను ‘వర్మ క్రియేషన్స్’లోకి అసిస్టెంట్‌గా తీసుకున్నారు, తర్వాత రాముగారితో పనిచేశాను. తర్వాత ఒకసారి బోంబేలో షూటింగ్ చేస్తుంటే మురళీమోహనరావుగారొచ్చారు. ‘సార్ నేను…’ అని తనను తాను పరిచయం చేసుకుంటుంటే నేను ఆయనకు పాతవిషయమంతా చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు. ‘నేను చెప్పిన విషయాన్ని మీరింత సీరియస్‌గా తీసుకుంటారనుకోలేదు. అయితే మరొక్క మాట చెబుతాను. అదేంటంటే, డబ్బు జాగ్రత్తగా పెట్టుకోండి. డబ్బు లేకపోతే ఏదీ ఉండదు. ‘నేను నూరు సినిమాలు చేశా, నూటేభై చేశా…’ అన్నా ఎవ్వరూ పట్టించుకోరు’ అని చెప్పారు. అలాగే అన్నా కాని పట్టించుకోలేదు.
– అయితే మీకు సినిమా కష్టాలేవీ లేవు..
సినిమా కష్టాల్లేకుండా ఎవ్వరూ ఉండరు. కృష్ణానగర్ నుంచి గోల్కొండకు.. షూటింగులకు నడిచి వెళ్లిన సందర్భాలెన్నో ఉన్నాయి. నన్నడిగితే అవసలు కష్టాలే కాదు. చేతిలో ఆఫర్లున్నప్పుడు పడినవే కష్టాలు. ఎదుగుతుంటే బరువు పెరుగుతుంది, కష్టాలు పెరుగుతాయి.
– మీ ఇబ్బంది చూసి అమ్మానాన్నలు బాధపడలేదా?
పడతారు కదండీ. రెండేళ్లు వాళ్లు పంపిన డబ్బు తీసుకున్నాను. తర్వాత నేనే చిన్నచిన్న పనులు చేసి సంపాదించుకున్నా. దూరదర్శన్‌లో ఓ ఎపిసోడ్ రాయడం, ఏదోకటి డైరెక్ట్ చెయ్యడం, పత్రికల్లో బొమ్మలు గియ్యడం… చేసేవాణ్ని. బొమ్మకు యాభై రూపాయలొస్తాయని ఆశ. కానీ వాళ్లు నాలుగు పత్రికలిచ్చి ‘బాగా వేస్తున్నావోయ్…’ అని పంపేసేవారు.
– శ్రమ దోపిడీ అన్న మాట…
అలా జరిగినప్పుడు నేనేం బాధ పడేవాణ్ని కాదు. ఎందుకంటే, అవతలివాడు వాడుకుంటున్నాడంటే నేను పనికొస్తున్నాననే కదా.
– మిగిలినవాళ్లతో పోలిస్తే మీ సినిమా టైటిల్స్, ట్రీట్మెంటు డిఫరెంట్‌గా ఉంటుంది.. అదెవరి ప్రభావం?
కొంత నా సొంతం. కొంత నన్ను ప్రభావితం చేసిన దర్శకులు. బాలచందర్, మణిరత్నం సినిమాలు చూసి ఇన్‌స్పైర్ అవుతాను. రామ్‌గోపాల్‌వర్మ సినిమాలు కాదుగాని ఆయనతో కూర్చుని మాట్లాడ్డం బాగా ఇష్టం. గంటల తరబడి ఆయన చెబుతారు, నేను వింటుంటాను.
ఝ పోకిరి అంత పెద్ద హిట్టవుతుందని అనుకున్నారా?
నేనూ అనుకోలేదు. మహేష్‌బాబూ అనుకోలేదు. నా దగ్గరున్న కొన్ని కథల్లో అదీ ఒకటి. అంతే. మంచి సినిమా అవుతుందనుకున్నాం. ఎడిటింగ్ అప్పుడు నా పక్కనున్నవాళ్లు ఫ్లాపవుతుందని అందరూ అనేవాళ్లు. ఎందుకంటే ఇందులో ఆడవాళ్లు లేరు, ఫ్యామిలీ లేదు… సినిమా నిండా గన్నులే… అని.
– మరి అది ఎందుకు హిట్టయింది?
నిజానికి పోకిరి తర్వాత మూడేళ్ల పాటు ఏ సినిమా తీసినా ‘పోకిరిలా లేదు..’ అనడం మొదలెట్టారు. అసలు అంత బాగా నేనేం తీశానా అని మళ్లీ ఆ సినిమా చూశాను. నిజం చెబుతున్నా, నాకైతే ఏమీ అర్థం కాలేదు. ఏదైనా సినిమా ఎందుకు హిట్టవుతుందో, ఎందుకు నచ్చుతుందో ఎవరికీ తెలియదు. అలా ఎవరైనా ‘నాకు తెలుసు, నాకు రాయడం వచ్చేసింది’ అంటే వాడు పిచ్చోడే.
– ‘అంత కష్టపడ్డా, ఇంత కష్టపడ్డా’ అనకుండా మరీ ప్లెయిన్‌గా చెబుతున్నారు…
నేను ఏ కథైనా వారం రోజులు రాస్తా. మరో వారం రోజులు డైలాగులు రాస్తా. ఏ సినిమా అయినా అంతే. వాటిలో కొన్ని హిట్టు, కొన్ని ఫట్టు.
– మీకు మొదటి అవకాశం ఎవరిచ్చారు?
పవన్ కళ్యాణ్ స్టారయ్యాక ఆయనతో సినిమా చేద్దామని ఆయన మేనేజర్ చుట్టూ తిరిగాను. దూరదర్శన్ పరిచయంతో శ్యామ్ కె. నాయుణ్ణడిగితే ఛోటా కె. నాయుడికి చెప్పారు. ఆయనకు పవన్ కళ్యాణ్ బాగా ఫ్రెండ్. ‘మంచి కథ చెప్పకపోతే నా పరువు పోతుంది. ముందు నాకు చెప్పమను’ అన్నారట ఛోటా. అప్పుడాయనకు ‘శ్రావణి సుబ్రమణ్యం’ కథ చెప్పా. ఆయనకు నచ్చి పవన్ దగ్గరకు పంపిస్తే ఆయన నాకు అరగంటే సమయమిచ్చారు. అదీ ఉదయం నాలుగ్గంటలకు. నేను వెళ్లి ‘బద్రి’ కథ చెప్పాను. ఏకంగా నాలుగు గంటల పాటు! క్లైమాక్స్ నచ్చలేదు మార్చమన్నారు. కొంత ప్రయత్నించాను కాని నాకే నచ్చలేదు. వారం తర్వాత కలిసినప్పుడు మళ్లీ అదే చెప్పాను. ‘నా గురించి నువ్వు క్లైమాక్స్ మారుస్తావా లేదా చూద్దామని అలా అడిగాను. ఇదే బాగుంది’ అన్నారు పవన్. అలా వచ్చింది అవకాశం. ‘ఛోటాకు చెప్పిన కథ వేరేలా ఉందే’ అన్నారాయన తర్వాత. అవకాశం పోతుందని ఆయనకది చెప్పానని నిజం చెప్పేశాను. నిజానికి నేనా సినిమా చేసేనాటికి ఆయన నటించిన సినిమాలేవీ చూడలేదు.
– అదేమిటి?
అమితాబ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ‘మర్ద్’ తర్వాత అన్నీ చెత్త సినిమాలు తీస్తున్నారని నేను సినిమాలు చూడటమే మానేశాను. ఇప్పటికీ ఏడాదికి ఒకటో రెండో తప్ప అసలు సినిమాలే చూడను. ఇప్పటిదాకా నా దగ్గరున్న కొన్ని కథలతో నెట్టుకొచ్చేశా. ఇప్పుడిక అప్‌డేట్ అవాలి కదా. అందుకని వచ్చే నెల బ్యాంకాక్ వెళ్లి చాలా సినిమాలు చూడాలనుకుంటున్నా.
– ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది?
బాధనిపిస్తుంది. ఒక ఐడియా మీద కోట్లు ఖర్చు పెడతాం. వంద సినిమాలు తీస్తే రెండు ఆడతాయి. ఆ రెండులో మనదొకటి ఉండాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఇష్టంగా చేసిన ‘నేనింతే’ పోయినప్పుడు చాలా బాధపడ్డాను. దాన్నిప్పుడు ఎంబీయే స్టూడెంట్స్‌కు ఇన్‌స్పిరేషన్‌గా వాడుతున్నారు.
– మీకూ పవన్‌కూ విభేదాలొచ్చాయని…
నేను ‘ఇద్దరమ్మాయిలతో..’ ప్రమోషన్ కోసమని ఛానెళ్లలో ఇంటర్వ్యూలిస్తున్నా. ఒక కాలర్ ‘పవన్‌తో సినిమా వచ్చే ఏడాది ఉంటుందా..’ అన్నారు. ‘ఉండచ్చు..’ అన్నా. దాన్ని పట్టుకొని మరో కాలర్ ‘అందులో హీరోయిన్ ఎవరు..’ అన్నారు. అలాఅలా పదిహేను ఛానళ్లలో పవన్‌తో సినిమా అనేది టాపిక్కయి కూర్చుంది. అప్పుడు దక్కన్ క్రానికల్ వాళ్లొచ్చి తర్వాత సినిమాలో పవన్నెలా చూపిస్తారు.. అనడిగారు. విసుగొచ్చి ‘అయినప్పుడు చూద్దాం’ అని చెప్పా. దాన్ని నేను పవన్‌తో సినిమా చెయ్యను… అని రాసేశారు. అదీ కథ.
– సినిమా తియ్యాలని ఎందుకనిపిస్తుంది?
నాకు నచ్చిన ఆలోచన ఇతరులకు నచ్చకపోవచ్చు, నమ్మకపోవచ్చు. నేను పడ్డ అవమానాల వల్ల నాకే సొంతంగా సంస్థ ఉండాలని పెట్టుకున్నా. ఒకసారి దాసరిగారు ‘చిన్న సినిమాలు తియ్యవా..’ అనడిగారు. ‘వచ్చినవి చేస్తున్నా..’ అంటే, ‘ఒకరోజు మనకే ఫోన్లూ రావు, ఎవ్వరూ పలకరించరు. అప్పుడు తియ్యాల్సినవి చిన్న సినిమాలే. అవి తియ్యడమూ నీకు తెలియాలి..’ అన్నారు. గారడీవాడికి నాలుగైదు ఫీట్లు వస్తాయి. అవే చేస్తుంటే ఊళ్లోవాళ్లు చూడరు. అందుకని అప్‌డేట్ అవాలి.
– పూరీ సినిమాల్లో ఆడవాళ్లను కించపరుస్తూ డైలాగులుంటాయంటారు..
ఇడియట్, దేశముదురు, బిజినెస్‌మేన్ సినిమాల్లో ఏమే, ఒసే, రావే.. అని ఉన్నాయి తప్ప మిగిలిన సినిమాల్లో ఏమీ లేవు. కాని నాకు ఆడవాళ్లంటే గౌరవం, ఇష్టం. శ్రావణి సుబ్రమణ్యం, అమ్మానాన్న తమిళమ్మాయిలో జయసుధ, గోలీమార్‌లో రోజా ఇలా ఏ సినిమా అయినా చూడండి, దానిలో ఆడవాళ్లకు ఒక గట్టి వ్యక్తిత్వం ఉంటుంది. వాడెవడో ఎదవ ఏమే అంటే అమ్మాయి కారెక్టర్‌ను తక్కువ చేశానంటే ఎలా? నా సినిమాల్లో అమ్మాయిలను ఏదో ఒక పని చేసుకునేవారిగా చూపిస్తాను తప్ప ఖాళీగా ఉన్నట్టు చూపెట్టను. అలాగే పాటల్లో సైతం డబల్ మీనింగ్ రాయను. హీరో మీద మోజుపడి మీదమీద పడే క్యారెక్టర్లు రాయను. హీరోయినంటే పాట ముందొచ్చి పాటయిపోగానే వెళ్లిపోయే పాత్రలు రాయను.
– ‘కుక్కను పెంచుకున్నా మంచిదే, కూతురయితే లేచిపోతుంది’ అన్న డైలాగ్ రాశారుగా మీరు?
అది ‘కూతుళ్లు’ సినిమాలో ఒక తండ్రి ఫీలింగ్. కాని సార్, ఆడవాళ్లు లేకుండా మనం బతకలేం, సినిమాలు తియ్యలేం, సృష్టే ఉండదు.
– మీ యాంబిషన్ ఏంటి? తరువాత ఏం చేయబోతున్నారు?
కొత్త కథలు రాసుకోవాలి. బోల్డన్ని సినిమాలు తియ్యాలి.
ఓకే ఆల్ ద బెస్ట్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.