ఏ జీవితమూ ఒక ఓటమితో ఆగి పోదు అని భరోసా ఇస్తున్న సినీ రచయితా మరుధూరి రాజా-

 

‘మనసు సున్నితం.. రాత నవరసభరితం’ డైలాగ్‌రైటర్ మరుధూరి రాజా మీద మనమొక డైలాగు వేయాలనుకుంటే దీన్ని వేయవచ్చునేమో! ఆయనతో కాసేపు మాట్లాడినా, ఆయన రాసిన సినిమాలను చూసినా ఇదే అభిప్రాయం కలుగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసెరిగి రాయకపోతే – ముప్పయి ఏళ్లపాటు రెండొందల సినిమాలకు రాసుండేవారు కాదేమో! ‘నవభారతం’ నుంచి ఈ మధ్యే వచ్చిన ‘దేనికైనా రెడీ’ వరకు ఇప్పటికీ రాస్తూనే ఉన్న మరుధూరి అనుభవాలే ఈ వారం ‘డైలాగ్‌గురూ’

30 ఏళ్లు.. 200 సినిమాలు
గుంటూరులో జన్మించిన మరుధూరి రాజా ఒంగోలులో చదువుకున్నారు. ఆయనకు ఐదుగురు సోదరులు. పెద్దన్నయ్య ఎంవిఎస్ హరనాథరావు కూడా పేరున్న సినీ మాటల రచయిత. తండ్రి క్లర్కుగా చేసేవారు. తల్లి సంగీత ఉపాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచే నాటకాలు రాయడం, వేషాలు కట్టడం, దర్శకత్వం చేయడం వంటి విషయాల్లో ఆరితేరారు మరుధూరి. సినిమాల్లోకి రాకమునుపే పద్దెనిమిది నాటకాలను రాసి గట్టి పునాది వేసుకున్నారు. ‘శ్రమదేవోభవ’ అనే నాటకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శిస్తూ.. హైదరాబాద్‌లోని రవీంధ్రభారతిలో వేశారు ఒకసారి. నాటకాన్ని తిలకించడానికి వచ్చిన జంధ్యాల మరుధూరి ప్రతిభను ప్రశంసిస్తూ.. “సినిమాల పట్ల ఆసక్తి ఉంటే మద్రాసుకు వచ్చేయ్’ అన్నారు. వెంటనే ఆయన జంధ్యాలగారి వద్దకు వెళ్లి ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘పుత్తడిబొమ్మ’, ‘రావూ గోపాలరావు’ సినిమాలకు సహాయ దర్శకులుగా పనిచేశారు. ఆ తర్వాత – ఈతరం ఫిలిమ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘ప్రజాస్వామ్యం’ అనే సినిమాకు మాటలు రాస్తున్న పరుచూరి బ్రదర్స్ దగ్గర చేరారాయన. వారి వద్ద మెళకువలు నేర్చుకుని.. ‘నవభారతం’ అనే సినిమాతో డైలాగ్ రైటర్ అయ్యారు. అది హిట్ కావడంతో వెనుదిరిగి చూడలేదు. పోకూరి బాబూరావు, రాఘవేంద్రరావు, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జి.నాగేశ్వర్‌రెడ్డిల సినిమాలతోపాటు సుమారు రెండొందల సినిమాలకు డైలాగ్స్ రాశారు.

‘నా చేతులకు పదకొండు వేళ్లు ఉన్నాయి. ఆ పదకొండో వేలు ఇదే’ అంటూ సిగరెట్టును ముట్టిస్తూ.. ‘ఇది వెలిగితేనే మది వెలుగుతుంది..’ అని తన మీద తనే డైలాగును విసురుకుని.. మాట్లాడటం ప్రారంభించారు మరుధూరి రాజా. “ఈతరం బ్యానర్‌లో వచ్చిన ‘నవభారతం’ నాకు మొదటి సినిమా. ఒంగోలులో పోకూరి బాబూరావుగారికి ‘నవభారత్’ అని ఒక లాడ్జి ఉంటుంది. దానినే టైటిల్‌గా పెట్టి ఈ సినిమాను తీశారాయన. షూటింగ్ కూడా అదే ఊర్లో పెట్టుకోవడంతో.. ఆ లాడ్జిలోనే ఒక గదిని నాకు కేటాయించారు. అందులో కూర్చుని డైలాగ్స్ రాస్తున్నాను. అప్పట్లో ఒంగోలు ఫ్యాక్షన్ గడ్డ. ఎవరినైనా మర్డర్ చేయాలంటే స్ట్రీట్ లైట్లు తీసేసేవారు. ఆ రోజు కూడా లైట్లు లేవు. మర్డర్ గ్యారెంటీ అనుకున్నారు జనం. అనుకున్నట్లే – మా లాడ్జి ఎదురుగ్గానే ఒకతన్ని వేటకొడవళ్లతో ఎడాపెడా నరికిపడేశారు. నేను ధైర్యం చేసి రెండడుగులు వేశానో లేదో, లాడ్జి మేనేజర్ వచ్చి ‘సార్, అటు వెళ్లకండి. డేంజర్’ అని నా రూము ఖాళీ చేయించి వెళ్లగొట్టాడు. ‘నవభారతం’ కోసం డైలాగులు రాస్తున్నంత సేపు అదే దృశ్యం గుర్తుకొచ్చేది. ఒంగోలులో ఇలాంటి హత్యలు సర్వసా«ధారణమే అని నాకు తెలుసు. అయినా నా కళ్ల ముందు జరిగిన మర్డర్‌ను అంత సులువుగా మరిచిపోలేకపోయాను. ఎంత మొనగాడైనా సరే కత్తిని నమ్ముకుని బతికితే అదే కత్తి అతని అంతు చూస్తుంది అన్నది.. అప్పుడు నాకు కలిగిన అభిప్రాయం. సరిగ్గా ఇదే భావాన్ని ఒక సీన్‌లో పెట్టాల్సి వచ్చింది. దాని కోసం నేను రాసిన డైలాగ్ ‘కత్తితో మొదలైన యుద్ధం కత్తితోనే అంతం అయిపోతుంది’. ఈ డైలాగ్ పోకూరి బాబూరావుగారికి బాగా నచ్చింది. ఆ ఒక్కమాటతోనే సినిమా మొత్తం గుర్తుండిపోయిందని ఇప్పటికీ ప్రేక్షకులు చెబుతుంటారు.

అభ్యుదయ చిత్రాల దర్శకుడు టి.కృష్ణ గారి అబ్బాయి గోపీచంద్ అమెరికాలో చదువు ముగించుకుని హైదరాబాద్ వచ్చాడు. ఆయన హీరోగా ఫ్యాక్షన్ కథతో వచ్చిన సినిమా ‘యజ్ఞం’. ఫ్యాక్షనిస్టుల చేతిలో అమాయకజనం ఎలా బలైపోతారన్నది ఇందులోని సారాంశం. ఈ సినిమాకు రాస్తున్నంతసేపు 30 ఏళ్ల కిందట నవభారత్ లాడ్జి ఎదుట జరిగిన సంఘటనే మళ్లీ మళ్లీ కళ్ల ముందు మెదిలింది. ‘యజ్ఞం’లో ఒక చోట పోలీసైన ప్రకాష్‌రాజ్ విలన్‌తో అంటాడు ఇలా “ఛత్రపతి శివాజీకి దుర్గాదేవి ఖడ్గం ఇచ్చినట్టు నీ కూతురు నా చేతికి కంప్లయింట్ ఇచ్చింది. కంప్లయింట్ చేతికొచ్చాక రెడ్డెప్ప అయితేనేం? బోడి బొక్కప్ప అయితేనేం?” అని. ఈ డైలాగ్‌లో ఫ్యాక్షనిస్టులతో విసిగిపోయిన పోలీసుల అసహనం కనిపిస్తుంది. థియేటర్‌లో కూడా ప్రేక్షకులతో విజిళ్లు వేయించిన డైలాగ్ ఇది. ‘నవభారతం’లో రాసిన ‘కత్తితో మొదలైన యుద్ధం’ అనే మాటను మళ్లీ ఈ సినిమాలో కూడా రాశాను. క్లయిమాక్స్‌లో అందరూ కత్తులను పడేసి.. రక్తపాతానికి స్వస్తి చెబుతారు. ఆ సీన్‌కు ఒక శక్తివంతమైన మాటను రాస్తేనే న్యాయం చేయగలం. అందుకని ‘కత్తితో..’ డైలాగ్‌ను మళ్లీ వాడుకున్నాను.

ఈవీవీ సత్యనారాయణ చనిపోయిన రోజు- టీవీని ఆఫ్ చేసి మూడీగా ఉండిపోయాను. ఈవీవీ తీసిన ‘అలీబాబా అరడజను దొంగలు’ దగ్గరి నుంచి ‘కత్తికాంతారావు’ వరకు పదకొండు సినిమాలకు డైలాగులు రాశాను నేను. ఎదుటివాళ్ల బాధను అర్థం చేసుకునే మంచి మనిషి ఆయన. ‘అలీబాబా అరడజను దొంగలు’ తీస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ముందుగా కథను అనుకోకుండా రెండొందల యాభై సీన్లు రాసేశాను. పది రోజుల్లో షూటింగ్ ఉంది. ఈవీవీ దగ్గరికి వెళ్లి ‘ఇదీ పరిస్థితి ఏంచేద్దాం?’ అన్నాను. ‘ఏముంది కుస్తీ పట్టడమే’ అన్నారాయన. వైజాగ్‌లోని షూటింగ్ స్పాట్‌కు వెళ్లిపోయి యూనిట్ మొత్తం కూర్చుని కథను రెడీ చేసుకున్నాం. షూటింగ్ మొదలైంది. ఒక చోట – విలన్‌కు కోపం వచ్చినప్పుడల్లా ‘వేసేసేదా సార్?’ అంటుంటారు అతని పక్కనుండే ఇద్దరు గన్‌మెన్‌లు. సమయం సందర్భం లేకుండా అదే మాట పదే పదే అంటుండటంతో.. ఒకసారి విలన్‌కు చిర్రెత్తుకొచ్చి “ముందు వీన్ని వేసేయండ్రా’ అంటాడు కోపంగా. వెంటనే అక్కడున్న అనుచరులు ఆ గన్‌మ్యాన్‌ను పక్కను లాగేస్తారు. అంతటితో ఆ పాత్ర ముగుస్తుంది. నిజానికి కథా పరంగా అతన్ని పంపించాల్సి అవసరం లేదు. కాని గన్‌మ్యాన్ అర్జెంటు పనిమీద ఇంటికి వెళ్లాల్సి రావడంతో అలా చేయాల్సివచ్చింది. దీని వెనక సంఘటన చెబితేకానీ మీకది పూర్తిగా అర్థం అవ్వదు. ఒకరోజు గన్‌మ్యాన్ వేషం వేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి “సార్, మా అమ్మగారు చావు బతుకుల్లో ఉన్నారు. నేను వెంటనే ఊరికి వెళ్లిపోవాలి..” అనడిగాడు. అదే విషయాన్ని ఈవీవీతో చెబితే ‘ “ఇప్పుడు ఉన్నట్లుండి విలన్ పక్కన అతన్ని తొలగించడం కష్టం. కాని ఆయన బాధ చూస్తుంటే మాత్రం ఇంటికి వెళ్లకా తప్పదు. ఏం చేయాలి? నువ్వే ఏదో ఒకటి చెయ్!” అని నాకు వదిలేశారు. నేను ఏం చేయాలన్నా డైలాగులతోనే మాయ చేసి అతని పాత్రకు ముగింపును ఇవ్వాలి. ఆలోచిస్తుంటే ‘ముందు వీడి సంగతి చూడండ్రా’ అని ఎవరో ఎప్పుడో అన్న మాట గుర్తొచ్చింది. అదే మాటను ‘వీడ్ని వేసేయండ్రా’గా మారిస్తే ఎలా ఉంటుంది? అనుకుని కాగితం మీద రాసి ఈవీవీకి చూపిస్తే భలేగుంది అన్నారు. ప్రేక్షకులకు బాగా నవ్వు తెప్పించిన సీన్లలో ఇదొకటి. సినిమాలో ఈ సీన్‌ను చూసినప్పుడల్లా – ఒకరికి మంచి చేయబోతే మనకూ మంచే జరిగింది అనుకుంటుంటాను.

‘అమ్మాయిని చేయి పట్టుకుని’ వంటి మామూలు డైలాగులు రాసినా సరే.. “అమ్మమ్మో! వద్దండీ బాబు వద్దు!! మనవన్నీ ఫ్యామిలీ సినిమాలు. అక్షరం కూడా అశ్లీలం దొర్లకూడదు”అనేవారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఒకప్పుడు వరుస హిట్లతో ఒక వర్గం ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఆయన సినిమా ‘ఎగిరేపావురమా’కు నేను మాటలు రాశాను. అందులో – ఇంట్లో పనిమనిషిని బలాత్కరిస్తాడు చరణ్‌రాజ్. విషయం తెలుసుకున్న ఆయన భార్య సుహాసిని – పనిమనిషిని ఇంటి నుంచి బయటికి పంపిస్తుంది. అప్పుడు చరణ్‌రాజ్ “ఎందుకే ఆ అమ్మాయిని బయటికి పంపిస్తున్నావ్”అంటాడు. వెంటనే ఆమె “మిమ్మల్ని పంపించలేను కాబట్టి” అంటుంది. మళ్లీ ఆమే కలుగజేసుకుని “చూడండీ! ఏ తండ్రి అయినా తన కూతురికి పెళ్లి చేసి కాపురానికి పంపించాలనుకుంటాడు. కన్నెరికం చేసి కాపురం పెట్టాలని ఎవ్వడూ అనుకోడు. ఆ సంప్రదాయం పశువుల్లోనే కానీ మనుషుల్లో లేదు. అది నా కూతురులాంటిది. అందుకే బయటికి పంపిస్తున్నాను” అని ఘాటుగా అంటుంది సుహాసిని. ఆ డైలాగ్‌లో ‘తండ్రి, కన్నెరికం’ అనే పదాలు ఒకే దగ్గర రావడం ఎస్వీ కృష్ణారెడ్డికి నచ్చలేదు. “ఈ పదాలు ఎందుకో చాలా ఇబ్బందిగా ఉన్నాయండీ బాబూ” అన్నారు. ‘సన్నివేశం అలాంటిది. కంచే చేనుమేస్తే సామెత ఉండనే ఉంది. ఆ మాత్రం రాయకపోతే సన్నివేశానికి సానుభూతి లభించదు’ అని ఆయన్ని ఒప్పించగలిగాను. సినిమా విడుదలయ్యాక.. కొందరు మిత్రులు ఫోన్లు చేసి అభినందించడం నాకిప్పటికీ గుర్తు. ఇదే సినిమాలో మరొక సీన్‌లో- నిర్మలమ్మ “నీ పెదవుల చప్పుడు నాకు వినిపించకపోయినా నీ గుండెచప్పుడు నాకు వినిపిస్తుంది” అనంటుంది కొడుకు జేడీ చక్రవర్తితో. షూటింగ్ చేస్తున్నప్పుడే చిత్రబృందంలోని వాళ్లందరికీ ఈ డైలాగ్ మనసును తాకింది. కొందరైతే ‘మా అమ్మకూడా అచ్చం ఇలాగే అంటుంటుంది సార్’ అన్నారు.

ఒక రోజున నాగార్జునగారి నుంచి కబురొస్తే – ఆఫీసుకు వెళ్లాను. “రాజాగారూ.. నాకు కచ్చితమైన హిట్ కావాలి. ఇందులో నా కొడుకు నటిస్తున్నాడు. ఒకవేళ సినిమా పోతే స్కూల్‌లో వాణ్ణి పిల్లలంతా ఏడిపిస్తారు. అప్పుడు నేను బాధపడాల్సి వస్తుంది. మీరందరూ గట్టిగా పని చేయాలి” అన్నారు. ఆ సినిమా పేరు ‘సిసింద్రీ’. ఇందులో అఖిల్ పసివాడుగా నటించాడు. ‘బేబీస్ డే అవుట్’కి ఇది రీమేక్ సినిమా. నేటివిటీకి తగ్గట్టు మాటలు రాయడం అంత సులువు కాలేదు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుధాకర్, గిరిబాబుల మధ్య నడిచే సరదా సీన్లకు అనూహ్య స్పందన వచ్చింది. క్లయిమాక్స్‌లో జంతువులన్నీ కలిసి సిసింద్రీని రక్షిస్తాయి. అప్పుడు శరత్‌బాబు “ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మనిషిలో మాత్రం ప్రతి జంతువు లక్షణం ఉంటుంది” అంటాడు. జంతువుల్ని చూసినప్పుడల్లా నాకు అనిపించే భావననే డైలాగ్‌గా రాశాను.

కల్మషం లేని మనిషి జగపతిబాబు. ఆయనకు వ్యక్తిగత అభిమానిని నేను. మొన్నీమధ్యనే ఏబీఎన్ ఛానల్‌లో జగపతిబాబు ఇంటర్వ్యూ చూసి ఆయనకు ఫోన్‌చేసి మాట్లాడకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే – ఆయననటించిన ‘శుభాకాంక్షలు’కు మాటలు రాసినప్పటి నుంచి ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆ సినిమాలో జగపతిబాబు ఇంటర్వ్యూకు వెళుతుంటే- అప్పు తీర్చలేదన్న కోపంతో సర్టిఫికెట్లను లాక్కెళ్లిపోతాడు మార్వాడీ. అతని పక్కనే ఉన్న మిత్రుడు సుధాకర్ “ఏమిట్రా నీకీ కష్టాలు?” అంటాడు. ఆ మాటకు జగపతిబాబు “చదువు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది. జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తుంది” అని చెప్పే డైలాగ్ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. హీరో మనస్తత్వంతోపాటు కథకున్న ఔచిత్యం, పాత్ర స్వభావం దృష్టిలో పెట్టుకుని రాయడం నాకు అలవాటు. సినిమాలో డైలాగే కాదు, నిజజీవితంలోనూ జగపతిబాబు ఎన్నో ఛాలెంజ్‌లను ఎదుర్కొన్న గట్టి మనిషి. ఇదే సినిమాలో ఇంకో చోట ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నివేశం జగపతిబాబు, రవళిలకు మధ్య జరిగింది. అది – “తీగకున్న పూలు రాలిపోతే తిరిగి అతికించలేం. చేయిజారి పోయిన ప్రేమను తిరిగి తెచ్చుకోలేం”అంటాడు జగపతిబాబు. “అప్పుడు మనసు మార్చుకోవాలి” అంటుంది రవళి. “మారిపోతే అది మనసు ఎట్లా అవుతుంది. మరిచిపోతే అది ప్రేమ ఎట్లా అవుతుంది?” అని జగపతిబాబు అంటాడు. గుంటూరులో జరిగిన ఒక వేడుకలో ఇదే డైలాగును జగపతిబాబు చెప్పడం విశేషం.

అప్పట్లో ఒంగోలు ఆకురౌడీలకు ప్రసిద్ధి. వారిలో కొందరు నా బాల్య స్నేహితులు. నేను సినిమాల్లోకి వచ్చాక ఒకసారి ఊరికి వెళ్లాను. ఒంగోలు నుంచి చీరాల వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళుతుంటే – డ్రాప్ చేయడానికి కృష్ణ అనే ఫ్రెండ్ వచ్చాడు. అప్పట్లో వాడొక చిన్నపాటి రౌడీ. అయినా మనిషి చాలా మంచివాడు. రైలు ఆగుతూనే నాకంటే ముందు బోగీలోకి ఎక్కి ‘కొంచెం జరుగయ్యా. నా ఫ్రెండ్ కూర్చుంటాడు’అని ఒక ప్రయాణీకుణ్ణి సర్దుకుని కూర్చోమన్నాడు. అతను దురుసుగా మాట్లాడటంతో మా వాడు “ఏం? కనిగిరి నీళ్లు ఏమైనా తాగొచ్చినావురా.. కాటమరాజులా ఎగిరి ఎగిరి పడుతుండావు?” అన్నాడు. ఆ మాట నాకు డైలాగులా వినిపించింది. ఈ సంఘటన జరిగిన కొన్నేళ్లకు- హీరో గోపీచంద్ ‘రణం’ సినిమాకు మాటలు రాశాను. ఒక సీన్‌లో హీరో, విలన్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అంతలో విలన్ అనుచరుడు ఒకడొచ్చి హీరోను దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తాడు. దాన్ని చూడగానే హీరో “ఇక్కడ రాబందులు జమాబందీ చేసుకుంటుంటే.. ఊర పిచ్చుకలా ఎగిరొచ్చి రెక్కలు ఎగరేస్తావేంట్రా? రెక్కలు తెగిపోతాయ్” అంటాడు. రైల్లో కృష్ణ అన్న మాట.. ఈ డైలాగ్ రాయడానికి తోడ్పడింది..” అని ముగించారు మరు««ధూరి. సినీ జీవితంలో తనకు ఎదురైన గెలుపోటముల గురించి ఆఖర్న ఒకమాటన్నారు ‘ఏ జీవితమూ ఒక గెలుపుతో మొదలుకాదు. ఏ జీవితమూ ఒక ఓటమితో ఆగిపోదు’ అని. ‘ఒంటరిపోరాటం’లో వెంకటేష్‌తో రూపిణి చెప్పే డైలాగ్ అది. “ఎప్పుడో రాసిన ఆ డైలాగే నన్ను ఇప్పటికీ నడిపిస్తోంది”అని చెప్పారు.

సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. మరుధూరి రాజాకు కూడా ఒక చిన్న సెంటిమెంటు ఉంది. ఇప్పటి వరకు రెండొందల సినిమాలకు డైలాగులను రాసిన ఆయన కాగితాలన్నింటినీ- బాసరకు తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేస్తుంటారట! ‘సినిమా రచనలో ఎంత బిజీగా ఉన్నాసరే.. సహాయకులతోనైనా పంపించి ఆ పని చేయిస్తుంటాను. నాకు అదొక సెంటిమెంటు’ అంటున్న మరుధూరి రాజా.. మిగతావాళ్లలాగ డైలాగులు రాయడానికి ఏ ఖరీదైన హోటల్‌కో, అజ్ఞాతదీవులకో వెళ్లరు. ఇంట్లోనే నేలమీద ఒక చాప పరుచుకుని, వక్కపొడి, సిగరెట్టు ప్యాకెట్లను పక్కన పెట్టుకుని.. దమ్ము కొడుతూ.. రాసుకుంటాడీ ‘దమ్మున్న రైటర్’!. లేకపోతే మూడు దశాబ్దాలపాటు రైటింగ్ రాజ్యాన్ని ఏలేవారు కాదేమో!!

యజ్ఞం
“ఛత్రపతి శివాజీకి దుర్గాదేవి ఖడ్గం ఇచ్చినట్లు నీ కూతురు నా చేతికి కంప్లయింట్ ఇచ్చింది. కంప్లయింట్ చేతికొచ్చాక రెడ్డెప్ప అయితేనేం? బోడి బొక్కప్ప అయితేనేం?”

శుభాకాంక్షలు
“తీగకున్న పూలు రాలిపోతే తిరిగి అతికించలేం. చేయిజారిపోయిన ప్రేమను తిరిగి తెచ్చుకోలేం”

సిసింద్రీ
“ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మనిషిలో మాత్రం ప్రతి జంతువు లక్షణం ఉంటుంది”

ఎగిరే పావురమా
“నీ పెదవుల చప్పుడు నాకు వినిపించకపోయినా నీ గుండెచప్పుడు నాకు వినిపిస్తుందిలేరా!”

గిల్లికజ్జాలు
“పిల్లలు పిల్లలుగా ఉన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటారు. వారు పెద్దవాళ్లయ్యాక మనల్ని బొమ్మల్ని చేసి ఆడుకుంటారు”

రణం
“ఇక్కడ రాబందులు జమాబందీ చేసుకుంటుంటే ఊరపిచ్చుకలా ఎగిరొచ్చి రెక్కలు ఎగరేస్తావేంట్రా? రెక్కలు తెగిపోతాయ్!”

ఎగిరేపావురమా
“ఏ తండ్రి అయినా తన కూతురికి పెళ్లి చేసి కాపురానికి పంపించాలనుకుంటాడు. కన్నెరికం చేసి కాపురం పెట్టాలని ఎవడూ అనుకోడు. ఆ సంప్రదాయం పశువుల్లోనే కానీ మనుషుల్లో లేదు”

– మల్లెంపూటి ఆదినారాయణ

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.