తిరువనంత పురం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి
కేరళ రాష్ట్రం లో తిరువనంత పురం అనే త్రివేండ్రం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి కొలువై ఉన్నారు .ఆయన దర్శనం త్రిమూర్త్యాత్మక దర్శనమే .మేము ‘’రధ సప్తమి’’ రోజున పద్మనాభుడిని దర్శించి తరించాం . ఆ రోజు మేము ఉయ్యూరు నుండి తెచ్చుకొన్న జిల్లేడు ఆకులను శిరసు మీద , ఒంటి మీద పెట్టుకొని మంత్రపూతం గా పవిత్ర స్నానం చేసి ,ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించటం మా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాము .అనంత పద్ముని ఆలయ విశేషాలు వివరిస్తాను .
పద్మనాభుడే చక్ర వర్తి –రాజు పద్మనాభ దాసుడు మాత్రమే
ఒకప్పుడు తిరువనంత పురం ‘’ఎట్టు వీటి పిళ్ళై ‘’అధీనం లో ఉండేది .తరువాత రాజా మార్తాండ వర్మ ,పిళ్లే ను జయించి ఈ భాగాన్ని స్వాధీన పరచుకొన్నాడు .మార్తాండ వర్మ మహా రాజే ఈ ఆలయ నిర్మాత .తనను, తన రాజ్య సర్వస్వాన్ని ఆయన పద్మనాభ స్వామికి స్వాధీన పరచి ‘’పద్మ నాభ దాసుడు ‘’గా ఉండి పోయాడు .తన తర్వాతి రాజులు కూడా పద్మనాభ దాసులుగా ఉండాలని తీర్మానించాడు స్వామి సమక్షం లో .కనుక అప్పటి నుండి రాష్ట్రానికి చక్ర వర్తి ‘’అనంత పద్మ నాభ స్వామి ‘’యే.ఆయన శంఖమే రాష్ట్ర చిహ్నం . ‘’.జూ’’ దగ్గర పెద్ద శంఖం మనం చూడ వచ్చు .మార్తాండ వర్మ వంశీకులు అందరూ వర్మ లాగానే ప్రవర్తించారు .బ్రిటిష్ ప్రభుత్వం కూడా స్వామికి’’ 21gun salute ‘’ను సభక్తికం గా సమర్పించేది .ఇందిరా గాంధి చేసిన రాజ భరణాల రద్దు తో ఇప్పుడు ప్రభుత్వ పరం అయింది ఆలయం .అయినా ఆ వంశీకులదే ప్రధమ పూజ.ఆలయం లో పద్మనాభుడి తో బాటు శ్రీ నరసింహ స్వామి ,శ్రీ కృష్ణుడు గరుడ వాహనం మీద అరేబియా సముద్రం లోని శంఖు ముఖం బీచ్ వరకు ఊరేగుతారు .పది రోజుల ఉత్సవాలు నిర్వహిస్తారు వాటిని ‘’ఆరాట్టు ఉత్సవాలు ‘’అంటారు .ఆ పది రోజులూ పబ్లిక్ సెలవులే .విమానాలు కూడా ఎగరవు అంత పకడ్బందీ గా ఉంటుంది .స్వాతి తిరుణాల్ వంశజుడైన శ్రీ రామ కుమారా వర్మ ఇప్పుడు ఇక్కడ స్వాతి ఉత్సవాలను నిర్వాహిస్తారు .ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు .శ్రీ వెంకటేశ్వర భక్తీ చానేల్ లో విద్యార్ధులకు సంగీతంనేర్పుతూసాయంత్రం పూట కని పిస్తారు
.
పద్మనాభ విగ్రహం
పద్మ నాభ స్వామి విగ్రహానికి ‘’’’సాదు సరక్కర ‘’అనే ఆయుర్వేద మిశ్రమం తో పూత పూస్తారు .అనంతుని పై శయనించే భంగిమ లో పద్మ నాభుడు దర్శనం ఇస్తాడు .శిరస్సు దక్షిణానికి ,చూపు మాత్రం తూర్పుకు ఉంటుంది .ఆది శేషుడు తల పైకెత్తి స్వామి బొడ్డులోంచి పైకి వచ్చిఎడమ చేతి లోని పద్మ స్సౌరభాన్ని ఆఘ్రానిస్తున్నట్లు కనీ పిస్తాడు .స్వామి కుడి చేయి కిందకు ఉండి శివ లింగంశిరసు పైన ఆనించి నట్లుంటుంది .బొడ్డులోని పద్మం లో బ్రహ్మ దేవుడు కనీ పిస్తాడు. బ్రహ్మ ప్రక్కనే శ్రీదేవి భూదేవి నిలబడి ఉంటారు .1,008 సాలగ్రామలతో చేసిన మాల పద్మనాభుని ఛాతీపై ప్రకాశిస్తూ ఉంటుంది .ఈ సాలగ్రామాలను నేపాల్ లోని గండకి నది నుండి తెప్పించి అతికించారు. అతకతానికి ‘’కటు సర్కర యోగం ‘’అనే ప్రత్యెక ఆయుర్వేద మిశ్రమాన్ని ఉపయోగించారు .ఇలా చేయటం వలన క్రిమి కీటకాలు దరికి చేరవట .స్వామికి అభిషేకం చేయక పోవటం ఇక్కడి ప్రత్యేకత .ప్రత్యేక మూర్తికే అభిషేకం నిర్వహిస్తారు .స్వామికి పుష్పమాలను మాత్రమె సమర్పిస్తారు .మా శ్రీమతి ప్రభావతి ఉయ్యూరు నుండి మాల అల్లుకొని వచ్చి స్వామికి సభక్తికం గా సమర్పించి ధన్యురాలైంది .అలానే గురవాయూర్ కృష్ణ స్వామికి , చిదంబర నటరాజు కూ ఉయ్యూరు నుండే మాలలు అల్లి తీసుకొచ్చి సమర్పించింది .పూలను’’ నెమలి ఈకలతోనే’’ ఊడ్చి తొలగించి శుభ్రం చేస్తారు ఆలయాన్ని.అదొక ప్రత్యేకత .
మూడు ద్వారాలలో దర్శనం
స్వామి గర్భ గృహం ఒకే రాతి తో నిర్మించారు .అందుకే దీనిని ‘’ఒత్తక్కార్ మండపం ‘’అంటారు .పద్మ నాభ స్వామిని మూడు ద్వారాల ద్వారా దర్శించాలి అదొక ప్రత్యేకత .మొదటి ద్వారం నుండి చూస్తె పద్మనాభుని ముఖము కుడి చేతి కింద ఉన్న శివలింగం కానీ పిస్తాయి .రెండవ ద్వారం నుండి చూస్తె బ్రహ్మ దేవుడు ఉత్సవ మూర్తి ,శ్రీ దేవి భూదేవి దర్శన మిస్తారు మూడవ ద్వారం నుండి చూస్తె స్వామి పాదాలు మాత్రమె దర్శన మిస్తాయి .మొదటి ద్వారం ద్వారా శివుడిని రెండవ ద్వారం ద్వారా బ్రహ్మను మూడవ ద్వారం ద్వారా శ్రీ మహా విష్ణువు పాదాలను దర్శిస్తాము అన్న మాట అంటే త్రిమూర్తుల దర్శనం అనంత పద్మ నాభుడు కలిగిస్తున్నాడు .ఈ మూడు రూపాలు దర్శిస్తే కైవల్య ప్రాప్తి లభిస్తుందని సంపూర్ణ విశ్వాసం .
ఇలా దర్శించటానికి ఒక కద ఉంది .పూర్వం బిల్వ మంగళ మహర్షి (దివాకర ముని )శ్రీ కృష్ణుని దర్శనం కోసం ప్రార్ధించాడు .ఆయన బాల కృష్ణుడు గా దర్శన మిచ్చాడు .ముని పూజా మందిరం లో ఉన్న సాలగ్రామాన్ని చిలిపి బాల కృష్ణుడు అమాంతం మింగేశాడు .మునికి కోపం వచ్చి దండిన్చాతానికి దండం తో వెంబడిస్తే బాల కృష్ణ పారి పోయాడు .వెంబడించాడు ముని అరాన్యం లో ఒక చెట్టు వెనక దాక్కున్నాడు కొంటె కిష్టయ్య .ముని అక్కడికి చేరేసరికి ఆ మహా వృక్షం నెల వాలి పోయి అందులోంచి అనంత శయన మహా విష్ణువు గా అతి భారీ విగ్రామేర్పడింది .బిల్వా మంగళుడు చూసి ఇంత భారీ విగ్రహాన్ని తాను ప్రదక్షిణం చేసి అర్చిన్చాలేనని చెప్పాడు తన యోగ దండానికి మూడు రెట్లు మాత్రమె పొడవు ఉండేట్లుగా మారి పొమ్మని ప్రార్ధించాడు భక్త సులభుడైన స్వామి అనుగ్రహించి అలానే సైజు తగ్గించు కొన్నాడు అదే ఇప్పుడు మనం ఆలయం లో దర్శించే మూర్తి .స్వామి తనను మూడు ద్వారాల ద్వారాదర్శించాలని అప్పుడే ముక్తి లభిస్తుందని తెలియ జేశాడు అప్పటి నుండి మూడు ద్వారాల ద్వారా దర్శనం అనుగ్రహిస్తున్నాడు మూడు ద్వారాలు వెండితో చేయబడి ప్రక్క ప్రక్కనే ఉంటాయి .
అనంత పద్మనాభుని ప్రత్యేకత
108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో స్వామి పడుకొని కాని కూర్చుని కాని నుంచొనికాని ఉంటె ఇక్కడ అనంత పద్మనాభుడు మూడు రకాలుగా దర్శనం ఇవ్వటం మరో విశేషం .గర్భ గుడి లో పడుకున్న భంగిమ లోను మధ్య ద్వారం లో నిలుచున్న భంగిమ లో ,ఉత్సవ మూర్తి కూర్చుని ఉన్నట్లు దర్శన మివ్వటమే ఆ విశేషం .గర్భ గుడిలోకి వెళ్లి వంగి నమస్కారం చేసే అర్హత ఒక్క తిరువాన్కూర్ మహా రాజుకే ఉంటుంది .గర్భ గుడిలో వదిలి పెట్టిన ఏ వస్తువైనా అనంతునికే చెందు తుంది .రాజును ‘’పద్మనాభ దాసు ‘’అనే అంటారు .విష్ణువే ఈ రాజ్య పాలకుడు అని ముందే చెప్పుకొన్నాం .క్షేత్రపాలకులు గరుడుడు విష్వక్సేనుడూ ..అనంతపద్మనాభుని ముఖం చాతీ తప్ప అంతా బంగారు మయమే అని ఇటీవలే కను గోన్నారట .ముస్లిం పాలకుల దండ యాత్రల భయం తో ‘’కటు సర్కర ఆయుర్వేద యోగం ‘’కలిగించి బంగారం కన పడ కుండా చేశారు .శిరసున ఉండే కిరీటం లో చెవులకు కుండలాలు ఉంటాయి .ఎడమ చేతిలో కమలం ,శివుడు కూడా బంగారు మయమే .
నైవేద్యమూ ప్రత్యేకమే
ఏడు పరశురామ క్షేత్రాలలో తిరువానంత పురం ఒకటి .స్వామికి నైవేద్యం గా పాయసం పెడతారు .తులాపాయాసం ,పరవాన్నం ,పాల్ మంగ ,ఒట్ట తులా పాయసం ,పంత రానుకాల పాయసం ,పాల పాయసం ముఖ్య నైవేద్యాలు.వీతికన్నితి కంటే ప్రత్యెక నైవేద్యం ఒకటి ఉంది దాన్ని ‘’ఉప్పు మంగ’’అంటారు .అంటే ఉప్పు నీటిలో పచ్చి మామిడి కాయను నాన వేసినది అని అర్ధం .దీన్ని నైవేద్యం పెట్టటానికి బంగారు పూత పూసిన ఎండుకొబ్బరి చిప్ప లో పెట్టి నివేదన చేస్తారు. దీనికి ‘’చిరట్ట ‘’అని పేరు .ఈ చిప్ప1200 ఏళ్ళ నుండీ ఉందట .ఇదీ విశేషమే ప్రక్కనే ఉన్న నరసింహ స్వామికి పానకం ,అప్పాలు ,ఉండ్రాళ్ళు ,అవల్ నైవేద్యం పెడతారు .
ఉత్సవాలకూ ప్రత్యేకతే
అక్టోబర్ –నవంబర్ నెలలలో ‘’అల్పషి ఉత్సవం’’,మార్చి –ఏప్రిల్ లో ‘’పైన్ కుని ఉత్సవాలను ‘’పది రోజుల పాటు పరమ వైభవం గా నిర్వహిస్తారు .అంటే ఏడాదికి రెండు సార్లు ఘనం గా ఉత్సవాలు చేస్తారు .నవరాత్రి ఉత్సవాన్నీ ఘనం గా చేస్తారు సరస్వతి దుర్గ కుమారస్వామి విగ్రహాలను ‘’కుటీర మాలిక ‘’కు తీసుకొని వస్తారు .ఆ తర్వాత పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు .తొమ్మిది రోజులు ‘’మహా భక్త కవి రాజు స్వాతి తిరుణాల్’’ సంగీతోత్సవాన్ని అద్భుతం గా జరుపుతారు .స్వాతి తిరుణాల్ త్యాగ రాజ స్వామి సమకాలికుడు .సంగీత త్రయం త్యాగరాజు ముత్తు స్వామి దీక్షితులు శ్యామ శాస్త్రి .స్వాతి తిరుణాల్ తో కలిసి సంగీత చతుస్టయంఅవుతారు .త్యాగ రాజ స్వామిని తన తిరువాన్కూర్ ఆస్థానానికి పిలిపించి సన్మా నించాలని చాలా సార్లు భక్తీ పూర్వాకం గా కబురు చేశాడు ఆహ్వానించాడు కాని త్యాగయ్య రాలేదు చివరి సారి ఆహ్వానం పంపితే ‘’మనిద్దరం కలుసుకోనేది అక్కడే పై లోకం లోనే ‘’అని మర్యాదగా రాసి పంపారట .అలాగే ఇద్ద్దరూ పెద్దగా వ్యవధి లేకుండానే మరణించారు . అమర లోకం లో ఇద్దరూ కలుసు కొన్నారని భావిన్చారందరూ.ఆరేళ్ళకొక సారి జనవరి 14న లక్ష దీపోత్సవం చేస్తారు .అప్పుడు 56రోజుల పాటు మూడు వేదాలను పారాయణ చేస్తారు .
అనంత పద్మ నాభుని ఆలయ గోపురాన్ని 1566లో నిర్మించారు .100అడుగుల ఎత్తు 7అంతస్తులతో ఉంటుంది ఆలయం ప్రక్కనే పుష్కరిణి ఉంది .దీనికే ‘’పద్మనాభ తీర్ధం ‘’అని పేరు .ఆలయం లో 365పెద్ద గ్రానైట్ స్తంభాలున్నాయి .ఆలయం ముందు 80అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం ఉంది .గోపురం కింది భాగాన్ని ‘’నాటాక శాల ‘’అంటారు .ఆలయ ఉత్సవాల రోజుల్లో ఇక్కడే కేరళ సంప్రదాయ నృత్యమైన ‘’కదా కేళి ‘’నృత్య ప్రదర్శన నిర్వహిస్తారు .
సంప్రదాయాన్ని కేరళీయులు బాగా పాటిస్తారు .ఏ ఆలయం లో చూసినా ఏనుగులు కానీ పిస్తాయి .ఆడవాళ్ళూ మగ వాళ్ళు కూడా బంగారు రంగు వెడల్పు అంచు తెల్ల చీరలు పంచలు కడతారు .చూడ ముచ్చటగా ఉంటుంది .మన దేవాలయాలు లాగా ఇక్కడి ఆలయాలు ఉండవు .అన్నీ కొయ్య, పెంకుల కప్పు తో ఉంది మన పూర్వపు వసారా ఇల్లు లాగా ఉంటాయి .యెంత పెద్ద బిల్డింగ్ మీదనైన చివర యెర్ర పెంకులున్దాల్సిందే స్వాగత ద్వారాలు అదే సంప్రదాయం లో ఉంటాయి .అక్కడ కనీ పించిన పూజారులను, అధికారుల భక్తులను ”నేల మాళిగ” ల గురించి అడిగాను ఎవ్వరూ చెప్పలేదు అడగరాదు చెప్ప రాఅన్నట్లు, ”ఆ ఒక్కటీఅడక్కు ” అన్నట్లు వారు ముఖాలు పెట్టారు చిరు నవ్వు నవ్వుతూ
అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )
మరో ఆలయ విశేషాలు మరో సారి
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-14-ఉయ్యూరు