అడుగడుగునా అగ్ని పరీక్షలే

 

సాగిపోవాలనుకుంటే సంఘర్షణ గానీ, ఆగిపోవాలనుకుంటే ఏముంది? డాక్టర్ తొడసం చందు ఆగిపోవాలనుకోలేదు కాబట్టి సాగిపోవడానికి అవసరమైన ఘర్షణంతా పడ్డాడు. ఊరి పొలిమేరలు దాటడమే గగనమైపోయి, మూడో తరగతిలోనే చదువు ఆగిపోయి ఎక్కడో పశువుల కాపరిగా ముగిసిపోవాల్సిన జీవితం జిల్లా మెడికల్ ఆఫీసర్ స్థాయికి రావడం ఆశ్చర్యమే కదా మరి! తాను ఒక స్థానానికి చేరుకోవడమే కాకుండా తన జాతి జనులను పురోగమన దిశగా నడిపించారాయన. ఆదివాసుల హక్కులను కాలరాసే దురాగతాల మీద గళమెత్తేందుకు గోండులను సన్నద్ధం చేసిన ఘనత ఆయనకు ద క్కుతుంది. ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు ఈ వారం ‘అనుభవం’లో..

ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని గుండాల మా ఊరు. మా ఊళ్లో మూడవ తరగతి వరకే ఉంది. నాలుగవ తరగతి కోసం ధర్మపురి వెళ్లాల్సి వ చ్చింది. అక్కడికి వెళ్లాలంటే మూడు గంటలు నడి చి, ఆ పైన తెప్పల మీద గోదావరి దాటి వెళ్లాలి. ఆ ప్రయాణం కష్టమని చెన్నూరు భీమవరంలో చేరాను. ఆ ఊరు ఇంకా దూరం. ఆ రోజుల్లోనే అంటే 1975-76 ప్రాంతంలోనే అక్కడికి వెళ్లడానికి 10 రూపాయలు బస్సు చార్జీలు అయ్యేవి. కాకపోతే అక్కడ హాస్టల్ ఉంది. మేము చదువుకున్న స్కూలు, హాస్టలు రెండూ ఆదివాసీ పిల్లల కోసం ఎన్. వి. రాజిరెడ్డి అనే దాత కట్టించినది. ఇతర కులాల పిల్లలు కూడా అందులో ఉండి చదువుకునే వారు. అక్కడ నేను పదవతరగతి దాకా చదువుకున్నాను. ఆ స్కూల్లో ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థికి హైదరాబాద్‌లో పై చదువుల కోసం ఆయన ఆర్థిక సాయం అందించేవారు. కాని నేను పదవ తరగతి పరీక్షలు రాసి మా ఊరికి వచ్చిన కొద్ది రోజులకే మా గూడెం గూడెమంతా అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఎవరికీ నిలువ నీడ లేకుండా పోయింది. అందుకే నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వ చ్చినా సంతోషం అనిపించలేదు. స్కూలుకు వెళ్లి నా సర్టిఫికెట్లన్నీ తీసుకుని మా ఊరికి వచ్చేశాను.
హైదరాబాద్ పయనం
అయితే, మా హెడ్‌మాస్టర్, హాస్టల్ వార్డన్‌లు నన్ను వదిలిపెట్టలేదు. వెంటనే రమ్మని ఉత్తరం రాశారు.కానీ, ఆ ఉత్తరాన్ని మా నాన్నకు చూపించాను. అప్పుడు మాకు ఉన్నదల్లా ఒక మేకపోతు. మా నాన్న ఆ ఊరూ ఈ ఊరూ తిరిగి 300 రూపాయలకు ఆ మేకను అమ్మేశాడు. ఆ డబ్బులు తీసుకుని వస్తున్న సమయంలో దొంగలు నాన్న మీద దాడి చేసి ఆ మొత్తం లాక్కుని వెళ్లిపోయారు. ఆ పరిస్థితిలో మా అమ్మ తన కాళ్ల కడియాలు, నా చేతికి ఉన్న దండ కడియాలు అమ్మేసి వచ్చిన 300 రూపాయలు నా చేతిలో పెట్టింది. అయితే,స్కైలాబ్ గురించిన భయాందోళనలతో అట్టుడికి పోతున్న రోజులవి. అందుకే హైదరాబాద్‌కు వెళ్లడానికి వీల్లేదంటూ మా అమ్మమ్మ గోలపెట్టింది. వేరు వేరు ప్రదేశాల్లో కన్నా ఒకేచోట చనిపోవడం మేలు కదా! అన్నది ఆమె వాదన. నాన్న మాత్రం ఆమె వాదనను తోసిపుచ్చాడు. బతకడానికి కలిసి ఉండాలనుకోవడంలో అర్థం ఉంది గానీ, చావడానికి ఒకచోట ఉండాల్సిన పనేముంది? అంటూ నాన్న ఘాటుగానే ఖండించి నన్ను మా ఊరి పొలిమేరల దాకా సాగనంపి వెళ్లిపోయాడు. మా వార్డెన్ ఇచ్చిన లేఖ తీసుకుని వారిచ్చిన వివరాల ఆధారంగా నేను హైదరాబాద్‌లో ఉన్న రాజిరెడ్డి గారిని కలిశాను. నన్ను చూసి ఆయన మహా సంతోషపడ్డారు. అమ్మమ్మ వాదనను నాన్న ఖండించిన తీరు అప్పుడు కాదు కానీ ఆ తర్వాత నన్ను ఎంతో లోతుగా కదిలించింది. మునుముందుకు సాగిపోవాలనుకునే వాడికి మరణం భయపెట్టకూడదని నాకు ఆ సంఘటన ద్వారా బలంగా తెలిసొచ్చింది..
డాక్టర్ కావాలనుకుని పేషంట్‌నై….
అమీర్‌పేట న్యూసైన్స్ కాలేజ్‌లో చేరి ఇంటర్‌మీడియేట్ ఇక పూర్తయిపోతుందనుకున్న సమయానికి ఇంద్రవె ల్లిలో కాల్పులు జరిగి చాలామంది ఆదివాసులు చనిపోయారు. దాని ప్రభావం వల్ల ఎప్పుడైనా మేము మా ఊరికి వెళితే మమ్మల్ని నక్సలైట్లు అంటూ అరెస్టు చేయడం మొదలెట్టారు. ప్యాంట్, షర్ట్ వేసుకుని ఎవరు కనపడినా చాలు నక్సలైట్లుగా పేరు నమోదు చేసి మీ అన్నలు ఎక్కడున్నారో చెప్పండి అంటూ వేధించేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంద్రవెల్లిలో గాయాల పాలైన వారికి వైద్య సేవలు అందించడానికి వచ్చిన డాక్టర్లను చూసినప్పుడు అంతకుముందే మనసులో ఉన్న మెడిసిన్ చేయాలన్న కోరిక మరి కాస్త తీవ్రమయ్యింది. ఆ స్ఫూర్తితోనే ఎంసెట్ రాయడానికి ఉస్మానియా మెడికల్ కాలే జ్‌కు వెళ్లాను. సరిగ్గా ఆ రోజుల్లోనే మతకలహాలు జరుగుతున్నాయి. రెండు వైపుల నుంచి ర్యాలీ వస్తున్న సమయంలో నేనూ, నా మిత్రులం అందులో ఇరుక్కుపోయాం. లాఠీ చార్జి జరిగి నా చేయి విరిగింది. నన్ను తీసుకువెళ్లి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. సీటు రాదని తెలిసినా పట్టుదల కొద్దీ ఎంసెట్ ఎంట్రెన్స్ రోజున వెళ్లి ఎడమ చేతితో ఎగ్జామ్ రాసి భరించలేని నొప్పితో మళ్లీ హాస్పిటల్‌లో చేరిపోయాను. డాక్టర్ అవుదామని వచ్చి పేషంట్ అయిన నా దుర్గతి నన్ను తీవ్రమైన దుఃఖానికి గురిచేసింది.

ఇక్కడ ఉంటే ఇలాంటి సంఘటనలు ఇంకేం జరుగుతాయోనని మెడిసిన్ ఆలోచనలను విరమించుకుని మా ఊరికి వెళ్లిపోయాను. కానీ, అక్కడికి వెళితే మాత్రం సుఖమేముంది? నక్సలైట్లేమో తమ క్యాడర్ పెంచుకునే ప్రయత్నంలో మా వెంటపడటం, పోలీసులేమో మేము వాళ్లకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్నామనుకోవడం ఇదే గొడవ. పిల్లాడి ప్రాణాలకే ముప్పు ఏర్పడేలా ఉందని రాజిరెడ్డి తెలిసిన వాళ్ల ద్వారా వెంటనే హైదరాబాద్‌కు తీసుకురమ్మని కబురు పంపారు. అంతగా చెప్పాక కూడా వెళ్లకపోవడమేమిటని బయలుదేరి వస్తుంటే, ఒక గుట్టమీది నుంచి జారి పడిపోయి నా కాలు విరిగింది. వరుస గాయాలతో నేను ఏమైపోతున్నానో నాకే బోధపడని స్థితి. ఇంక అమ్మనాన్నల విషయం ఏమనుకోవాలి? అందుకే మెడిసిన్ విషయం తర్వాత, ముందు బతకడం ముఖ్యం అనుకున్నా. అందుకే హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న ఒక చిన్న ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరాను. వాళ్లు నాకు 200 రూపాయల వేతనం ఇచ్చేవారు. ఆ డబ్బుతోనే మెడిసిన్ కోచింగ్ తీసుకున్నాను. అదే 1983లో నే ను రాసిన ఎంట్రన్స్‌లో సీటు వచ్చేలా చేసింది. అడ్డంకులున్నవి ఆగిపోవడానికే అనుకుంటే అధిగమించడం అనే మాట మన నిఘంటువులోనే ఉండదు. అందుకే అడ్డంకులు తాత్కాలికంగా ఆపగలవేమో గానీ, ఆ తరువాత అవే మనల్ని ముందుకు సడిపించే సాధనాలని నేను భావిస్తాను.
కొండపల్లితో నన్ను ముడివేసి…
నేను మెడిసిన్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు అంటే 1983లో ఖైదీగా హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో చేరిన కొండపల్లి సీతారామయ్యను డాక్టర్ వేషంలో ఉన్న నక్సలైట్లు తప్పించారు. సీతారామయ్యను తప్పించిన వారిలో నేనూ ఉన్నానన్న అభియోగం మోపి నన్ను, నాతో పాటు మరో 30 మందిని పోలీసులు దేవాపూర్‌లో అక్టోబర్ 23న అరెస్టు చేశారు. నేనున్నది గాంధీ హాస్పిటల్‌లో. ఆ సంఘటన జరిగింది ఉస్మానియా హాస్పిటల్‌లో అని చెప్పినా వినిపించుకోకుండా ఓ ఐదారు పోలీసు స్టేషన్లు తిప్పారు. నువ్వు నక్సలైట్‌వు. మీ నాయకులంతా ఎక్కడున్నారో, మీ దళం ఎక్కడుందో చెప్పు. లేదంటే కాల్చేస్తాం అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. తర్వాత కొంత మందిని వదిలేసి 11 మందిని మాత్రం కోర్టుకు తీసుకువెళ్లి అక్కడినుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. మెడిసిన్ చేస్తున్న కారణంగా నేను ఒట్టి నక్సలైటును కాక నక్సలైట్ నాయకుడు అయి ఉంటానని నన్ను మిగతా అందరితో కలిపి కాకుండా వేరే సెల్‌లో ఉంచారు. ఈ కేసు విషయంలో పోలీసులు నన్ను కోర్టులో హాజరు పరిచినప్పుడు చూస్తే కోర్టు ప్రాంగణంలో దాదాపు 500 మంది ఆదివాసులు కనిపించారు. వాళ్లంతా నక్సలైట్లుగానో లేదా నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చిన వారిగానో, మరో రకంగా వారికి సహకరించిన వారిగానో అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్లే. నన్ను కోర్టు ఆవరణలో చూసి నాన్న బావురుమని ఏడ్చేశాడు. మా విషయం తెలిసిన ఐటిడిఏ వారు నా తరపున ఒక లాయర్‌ను నియమించారు. ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ రిజల్టు వచ్చేనాటికి నాకు బెయిల్ దొరికింది. ఆ తరువాత ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి కోర్టుకు హాజరయ్యే వాణ్ని. నిన్ను మరో వ్యక్తిగా చిత్రించే సమాజం ఎప్పుడూ నీ పక్కనే ఉంటుంది. ఆ స్థితిలో నువ్వు నువ్వుగా నిలబడలేకపోతే, నీ జీవితం నీ చేతుల్లోకి రాదని నాకు ఎదురైన ప్రతి సంఘటనా పలు మార్లు చెప్పింది.
చట్టాలంటే లెక్కే లేదా?
నాకు, నా సహవిద్యార్థులు కొంతమందికి బెయిల్ దొరికిన నాటి నుంచి మాకోసం వచ్చే ఆదివాసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వాళ్లకోసం అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తూ వచ్చాం.నా సెకండ్ ఇయర్ నుంచే ఈ కార్యక్రమాలు ఉధృతం చేశాను. ఆ క్రమంలో ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలు,ఆదివాసీ మహిళల మీద జరిగిన అత్యాచారాలు వేల సంఖ్యలో బయటికి రాసాగాయి. గిరిజనుల భూముల్ని ఎవరూ కొనకూడదు అని చెప్పే 1/70 చట్టం ఉంది. అయినా, వారికి సంబంధించిన రెండు లక్షల ఎకరాల భూములు 150 మంది ఆదివాసీయేతరుల చేతుల్లో ఉన్నట్లు బయటపడింది. ఆ విషయమై మేము మాట్లాడటం మొదలుపెట్టగానే తమ గోడు వెళ్లబోసుకోవడానికి మా కోసం వేలాది మంది రావడం మొదలెట్టారు. దాంతో అంతకు ముందున్న గోండు వన ఆదివాసి విద్యార్థి సంఘాన్ని గోండు వన సంఘర్షణ సమితిగా మార్చి, ఆదిలాబాద్‌లోని ప్రతి గ్రామానికీ వెళ్లి ఆదివాసులకు సలహాలు ఇచ్చే రాయి సెంటర్స్ ప్రారంభించాం. ఒక వైపు మేము ఇదంతా చేస్తుంటే మరో వైపునుంచి ఎన్‌టిరామారావు ప్రభుత్వం భూములపై గిరిజనులకుండే హక్కులను తొలగించే ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ ధోరణి మమ్మల్ని దిగ్భాంతికి గురిచేసింది. ఆ వెంటనే మేము దానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, ఉభయ గోదావరులు, శ్రీకాకుళం దాకా పోరాటాన్ని ఉధృతం చేశాం. వి.పి సింగ్‌ను ప్రత్యక్షంగా కలిసి ఈ విషయాల్ని నివే దించాం. ఆయన ఎస్.సి, ఎస్.టి కమీషనర్‌ను మన రాష్ట్రానికి పంపించారు. దానివల్ల చాలా మేలు జరిగింది. భారతీయ జన ఆందోళన్ అన్న సంస్థ నిర్వహణలో దేశంలోని పలు యూనివర్సిటీలకు వెళ్లి ఆదిలాబాద్ ఆదివాసుల సమస్యల గురించి వివరంగా మాట్లాడటం మొదలుపెట్టాం. ఇవన్నీ ఎన్‌టిఆర్ ప్రభుత్వాన్ని తన నిర్ణయం మార్చుకునేలా చేసింది. ఏకపక్షంగా మన పనేదో మనం చేసుకుంటూపోతే చాలదు, మనకు విరుద్ధంగా ఏం జరుగుతోందో తెలుసుకోకపోతే ఎంత ప్రమాదమో మాకు బోధపడింది.
అనాథల కోసం
ఒక రోజు ఒక ఆదివాసి ఒక అమ్మాయిని నా వద్దకు తీసుకువచ్చారు. ఏదో చిన్న సమస్య కారణంగా ఆ పిల్ల కళ్లల్లో తమకు తెలిసిన ఒక చెట్ల మందు పెట్టి పట్టీ కట్టేశారు. ఆ క ట్టు విప్పి చూస్తే అప్పటికే ఆ పిల్ల చూపు పోయింది. ఏమిటి మీరు చేసిన పని అని ఆగ్రహం వ్యక్తం చేశాను. ‘మేము ఊరూరూ తిరుగుతూనే ఉన్నాం, మదర్స్ కమిటీలు ఉన్నాయి. వెంటనే మా వద్దకు తీసుకువస్తే ఈ గతి పట్టేది కాదు కదా!’ అంటే వాళ్లు ఏమీ చెప్పలేక ఏడ్వడం మొదలెట్టారు. ఆ పిల్ల వెంట వచ్చిన పెద్దవాళ్లు ఆ అమ్మాయికి తల్లిదండ్రులిద్దరూ లేరని, ఆమె అనాథ అని చెప్పారు. వీళ్లంతా మానవత్వంతో ఆమెను చూస్తున్నార ంతే. ఆ చెట్టు పసరుతో మంచి జరుగుతుందనుకున్నారు కానీ ఇలా అనుకోకుండా జరిగిపోయింది అన్నారు. ఆ తర్వాత ఇలాంటి వాళ్లు ఇంకెంత మంది ఉన్నారోనని సర్వేచేశాం. ఇంద్రవె ల్లి పరిధిలోనే అలాంటి వారు 30 మంది దాకా ఉన్నారని తేలింది. ఈ విషయాన్ని ఆర్.డి.ఓ గారికి చెబితే వారికోసం ఒక హాస్టల్ ఏర్పాటు చేసి, పౌరసరఫరా శాఖ నుంచి బియ్యం, పప్పు లాంటి ఆహార పదార్థాలను సమకూర్చారు. అలా కొంతమంది పిల్లల జీవితాలను కాపాడగలిగాం. శరీర వ్యవస్థ గురించి తెలియక ఆరోగ్యాలు కోల్పోవడం, సామాజిక వ్యవస్థ గురించి తెలియక తమ ఉనికిని కోల్పోవడం ఆదివాసుల లోకంలో అడుగడుగునా కనిపించే దృశ్యాలు. ఎంతోమంది పెద్దలు ఆదివాసుల వేల ఎకరాల భూముల్ని కైవసం చేసుకుంటూ ఉంటే ఆదివాసుల చట్టాలు నిస్సహాయంగా ఆక్రోశిస్తున్నాయి. నేను ఓ మెడికల్ ఆఫీసర్‌గా ఆదివాసుల సమస్యల్ని పరిష్కరించండని వెళితే, ఈ సారి ఎం.ఎల్.ఏగా పోటీ చేయవచ్చు కదా అంటూ ఎర వేస్తాయి ప్రభుత్వాలు. కానీ, ఆదివాసుల జీవితాలకు కవచంగా నిలబడడానికి మించిన పదవి గానీ, ఆ పోరాటంలో సాగిపోవడానికి మించిన జీవన ధర్మం గానీ మరొకటి లేదని నా అంతరాత్మ నాకు నిరంతరం చెబుతూ ఉంటుంది.
– బమ్మెర

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.