దొరసాని -దాసీ ఇద్దరూ సున్నాలే

 

ఒకప్పుడు ఆంధ్రదేశంలో విజయనగరం తర్వాత వెంకటగిరి అతి పెద్ద జమీందారి. 1900 సంవత్సరం నాటికి ఈ జమీందారి రాబడి సాలుకు 15 లక్షల రూపాయలంటే అది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ జమీందారీని వెలుగోటి వంశస్తులు దాదాపు మూడు శతాబ్దాలు పాలించారు. ఆ సమయంలో ఈ జమీందారీలో అనేక మార్పులు వచ్చాయి. ఆ మార్పులను, అప్పటి సాహిత్యాన్ని విశ్లేషించి డాక్టర్ కాళిదాసు పురుషోత్తం రాసిన పరిశోధనా గ్రంథం ‘వెంకటగిరి సంస్థాన చరిత్ర- సాహిత్యం’. దీని ద్వారా ఆ నాటి పరిస్థితులనేకం మనకు తెలుస్తాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..

చంద్రగిరి సంస్థానాధీశుల్లో 27వ తరానికి చెందిన వాడు కుమారయాచమనాయుడు. 1848లో ఈయనకు పట్టాభిషేకం జరిగింది. ఈయన వెంకటగిరి సంస్థానాన్ని పరిపాలించిన జమీందారుల్లో మహా సమర్థుడు. జమీందారి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చేసినవాడుగా, పరిపాలనను క్రమబద్ధం చేసినవాడుగా సంస్థాన చరిత్రలో ఇతనికి సుస్థిర స్థానం ఉంది. కుమారయాచమనాయుడు బాల్యం ఎట్లా గడిచిందో మనకు తెలియదు. ఈయన ఏం చదువుకున్నాడో, ఎటువంటి శిక్షణ పొందాడో వివరించే అధారాలేమీ లేవు. ఈయన ఆస్థాన పండితుల వద్ద సంస్కృతాంధ్రాలు, పార్సీ నేర్చుకున్నట్లు మాత్రం తెలుస్తోంది. ఆస్థానపండితుడు తర్కభూషణం వెంకటాచార్యుల బోధనలవల్ల బాల్యం నుంచే వైష్ణవం పట్ల అభిమానం ఉన్నట్లు, ఆధ్యాత్మిక, మత విషయాల్లో అభినివేశం ఉన్నట్లు తెలుస్తోంది. తన పాండిత్య విశేషం చేత, కవిపండిత పక్షపాతం చేత ‘సర్వజ్ఞ’ కుమారయాచమనాయుడని విఖ్యాతి పొందడమేకాక, ఆ పేరుతోనే పుస్తక రచన చేశాడు. 19వ శతాబ్ది ఆరంభానికి ఆంధ్రదేశంలోని వెలమ జమీందార్లలో వెంకటగిరి, నూజివీడువారు మాత్రమే రాజగౌరవంతో ప్రసిద్ధులయ్యారు. ఈ ఇద్దరితో పోల్చదగిన వెలమజమీందార్లు మరెవరూ ఆంధ్రదేశంలో ఆనాడు లేరు. సిరిసంపదలతో తులతూగడంతో పాటు, ఏడుగురు పురుషసంతానం ఉండటం కూడా వెలమ జమీందార్లలో కుమారయాచమనాయుని హోదా పెరగడానికి కారణమయింది. పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు జమీందార్లు పురుషసంతానం లేకపోవటం వల్ల కుమార యాచమనాయుడి కొడుకులనే దత్తత తీసుకున్నారు. తన తదనంతరం సంస్థానాధిపత్యం వహించే వారికి మార్గదర్శకంగా ‘నడుచుకోవాల్సిన పద్ధతుల’ను ఆయన ‘మామూల్ నామా’ పేరుతో చిన్న పుస్తకంగా రాశాడు. దీనిలో ‘ఘోషా నిబంధనలు’ అమలు చేయవలసిన పద్ధతుల గురించి చాలా సుదీర్ఘంగా వివరించాడు.

ఘోషా స్త్రీలు
పది పన్నెండు సంవత్సరాలు నిండిన మగపిల్లలను కూడా జనానాలోకి పోనివ్వగూడదని, జనానా మీద నిరంతరం నిఘా ఉంచాలని, ‘సాక్షాత్తూ అన్నదమ్ములు ఒకరి జనానావారిని ఒకరు చూడకూడదని’ కఠిన నిబంధన విధించాడు. ఈడొచ్చిన పురుషులు తల్లిని, తోడబుట్టినవాళ్లను తప్ప పినతల్లులు, పెదతల్లులు, వారి యుక్తవయస్కులైన కుమార్తెలను, సవతి తల్లులను కూడా చూడకూడదని నియమం పెట్టాడు. పూజలు పునస్కారాలు జరిపే సందర్భంలో కూడా పురోహితుణ్ణి పరదా చాటున కూర్చోబెట్టి మంత్రాలు చెప్పించాలని, ‘వైద్యుడు చూడవలసి వచ్చినప్పుడు ఇదే రీతిన పరదా చాటున వుంచి హస్తము చూపించవలయును’ అని చెప్పాడు. ఘోషాపద్ధతిని మినహాయింపు లేకుండా అమలు చేయమంటాడు. ఒకవేళ ఇంటల్లుడు ‘మన ఇంటిలోనే’ కాపురం ఉంటే, ఆయన భార్య పోతూ వస్తూ ఉండాల్సిందే తప్ప, అల్లుడు జనానాలోకి వెళ్లకూడదంటాడు. జనానా స్త్రీలు ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్లినా, సవారీలకు పరదాలు కట్టి తీసుకొని వెళ్లాలని, ప్రయాణంలో కూడా దాసీలు జనానా స్త్రీలవెంట ఉండాలని, మాట వినిపించేంత దూరంలో పురుషులెవరినీ ఉండనివ్వకూడదని, ఈ నియమం కఠినంగా అమలుపరచాలని సూచిస్తాడు. తండ్రి కూతుళ్లతో, అన్నదమ్ములు అక్కచెల్లెళ్లతో ప్రత్యేకస్థలంలో కలుసుకొని సంభాషించవచ్చని కాస్త నిబంధన సడలిస్తాడు. జనానాస్త్రీలను వీలయినంత వరకూ పుట్టిళ్లకు పంపకూడదని, అత్యవసర పరిస్థితిలో పంపవలసి వస్తే భర్తో, మరుదులో వెంట వెళ్లాలనీ అంటాడు. వెళ్లిన చోట పహరా ఏర్పాటు చేసి, ‘పిన్న, పెద్ద గొల్ల మొదలైన వాండ్లు’ లోపలికి వెళ్లి పురుషులు లేరని తేల్చుకున్న తర్వాతే జనానా స్త్రీలను లోపలికి పంపాలని జాగ్రత్త చెబుతాడు. జనానా స్త్రీలు తండ్రికి, తోబుట్టువులకు మాత్రమే స్వయంగా జాబులు రాసుకోవచ్చని, ఇతరులెవరికైనా రాయవలసివస్తే, వేరే ఎవరి చేతయినా రాయించాలని సూచిస్తాడు. ఆటపాటలు, వినోదకార్యక్రమాలు వంటి ప్రదర్శనలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో కూర్చొని చూడాల్సిందే. వాళ్లు నాలుగు గోడల మధ్య జీవిస్తూ, రాజవీధి గుండా వెళ్లే ఊరేగింపులను ‘చిరుసోరణగండ్లు’ (చిన్న చిన్న రంధ్రాలు కలిగిన కిటికీలు) గుండా పరదాలమాటున నిలబడి చూసేవారు. మామూల్ నామా ఇప్పటి వరకూ పరిశోధకులకు అందుబాటులో లేదు. జమీందారి జీవితానికి సంబంధించిన అనేక పార్శ్వాలను- శృంగార జీవితంతో సహా ఇది స్పృశించింది.

వెంకటగిరివారికి కాళహస్తి, సైదాపురం, ముత్యాలంపాడు, తిరువూరు, తంగెళ్లమూడి, సోమవరప్పాడు తదితర జమీందార్లతో ఇచ్చిపుచ్చుకొనే సంబంధాలుండేవి. 1960ల వరకూ వెంకటగిరి సినిమాహాల్లో జనానాస్త్రీలకు ప్రత్యేక ప్రదర్శన ఉండేది. ‘ఈ రోజు నగిరోళ్ల ఆట’ అని ముందుగా ఊరంతా దండోరా వేసేవాళ్లు. జనానాస్త్రీలు మరణించినప్పుడు కూడా పరదాలు కట్టిన పల్లకీలోనే జమీందార్లకు ప్రత్యేకమైన రుద్రభూమికి తరలించి, అక్కడ దడులచాటున అంత్యక్రియలు జరిపేవారు. జనానా స్త్రీల చదువుసంధ్యల వివరాలు తెలియకపోయినా, 1870 ప్రాంతాలకు వెంకటగిరి రాణివాసంలో కొందరయినా చదువుకున్న స్త్రీలు ఉన్నట్లు మామూల్ నామా సూచిస్తోంది. ‘ఆర్థికహోదాను బట్టి దొరసాని, దాసి ఇద్దరూ సున్నాలే. ఇద్దరూ జీతం లేని దాసీలే..’

ఆడపాపలు
అంతఃపురదాసీలను వెంకటగిరిలో ఆడపాపలని అంటారు. పసివయసులోనే అంతఃపురంలో దాసీలుగా చేరి జీవితాంతం ఆ వృత్తిలో కొనసాగుతారు. వీళ్లలో తల్లీ కూతుళ్ల జంటలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క రాణికి డజనుపైగా దాసీలుంటారు. రాణివాసంలో జనానా స్త్రీలకు, వారి బిడ్డలకు ఈ దాసీలు సంరక్షకులుగా, సహాయకులుగా ఉంటారు. వీరికి పెళ్లిళ్లు చేయరు. మగపిల్లలు పుడితే వాళ్లు కూడా జమీందార్ల సేవలో బతుకు వెళ్లదీస్తారు. ఆడపిల్లలు పుడితే తల్లుల మాదిరే కులవృత్తి స్వీకరిస్తారు. రాజకుటుంబాల్లో బయటనుంచి కోడళ్లుగా వచ్చిన యువతులు బాల్యం నుంచి తమకు దాసీలుగా ఉన్న స్త్రీలను తమవెంట తీసుకువస్తారు. కుమారయాచమనాయుని వ్యక్తిగత సేవకుల్లో 89 మంది బందీలు ఉన్నట్లు నమోదయింది. వీళ్ల జీతభత్యాలు కూడా పేర్కొనబడలేదు. బహుశా వీళ్లు ఆడపాపలయి ఉంటారు. వెంకటగిరి రాజావారి తల్లితోను, కుమార్తెతోను జరిపిన ఇంటర్వ్యూలో దాసీలే దొరలబిడ్డలకు పాలిచ్చి పెంచేవారని తేటతెల్లమయింది. దీనికి కారణం దొరసానుల అందం చెడిపోతుందనే భావం వాళ్ల మనసుల్లో ఉండటమే.. వారు ఎలాగూ నగర సంతానమే కాబట్టి, నగరంలో భాగమే కాబట్టి ఆడపాపలకు అందమైన పేర్లు పెట్టేవారు.

ఆడపాపల్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. చాలా మంది ఆడపాపలకు వాళ్ల తండ్రులను గురించి తెలియదు. ఏ ఊరి నుంచి వచ్చారో ఆ ఊరి పేరు చెప్పుకొనేవాళ్లు. మత కర్మల్లో- తల్లి, అమ్మమ్మ, ఆమె తల్లి పేరు చెప్పి తర్పణాలు చేయించే ఆచారం ఉండేది. వెంకటగిరిలో ఆడపాపలు, వారి కుటుంబ సభ్యులు వందల సంఖ్యలో ఉండేవాళ్లు. 1930-40 నడుమ అక్కడ కొంత మంది ఆడపాపలు తమ కుమార్తెలకు వివాహాలు చేశారు. అప్పుడు జమీందారు ఈ విధంగా పెళ్లిళ్లు చేసిన దాసీలను పనుల్లోంచి తొలగించి, వారి మీద ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేశాడు. జమీందార్లు తమ కామవాంఛకు దాసీ పుత్రికలకు ఉపయోగించుకుంటున్నారని జమీన్‌రైతు పత్రిక ఆరోపించింది. “దాసీ లోకమంతయు ఈ విపరీతచర్యలకు సభలు చేసి, తమ అసమ్మతిని తెలిపి జమీందార్ల దుండగముల బహిర్గమనర్తురని ప్రార్థన’ అని ఆ పత్రిక విజ్ఞప్తి చేసింది.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.