మైనేని గోపాల కృష్ణ గారి ఉయ్యూరు జ్ఞాపక పరిమళాలు
శ్రీ మైనేని ని గోపాల కృష్ణ గారి స్వగ్రామం కొమ్మ మూరు .ఉయ్యూరుకు నాలుగు కిలో మీటర్లు .వారి తండ్రిగారు వెంకట నరసయ్య గారు. తల్లి గారు సౌభాగ్యమ్మ గారు .తాత గారు తాతయ్య చౌదరి గారు .నాయనమ్మ చిలకమ్మ గారిది ఆ ప్రక్కనే ఉన్న గరిక పర్రు .తాత గారి మేన మామ సూరప నేని సూరయ్య గారి పుత్రికే చిలకమ్మ గారు .గోపాల కృష్ణ గారి పెద్దన్నయ్యకు సూర్య నారాయణ అని నాయనమ్మ గారే పేరు పెట్టించారు .అందుకని ఆయన్ను ‘’బాబు ‘’ అని ఆమె పిలిచే వారు .అందువల్ల ఆయన్ను అందరూ’’ బాబు’’ అని లేక’’ పెద బాబు’’ అని పిలిచేవారు .చిలకమ్మ గారు 80ఏళ్ళకు పై బడి జీవించారు .గోపాల కృష్ణ గారికి ఆమె బాగా జ్ఞాపకం ఉన్నారు .రాత్రి పూట ఆమె ‘’హరే రామ హరే రామ రామ రామ హరే హరే ‘’మంత్రాన్ని ఆరుబయట కూర్చో బెట్టి చెప్పిన జ్ఞాపకమూ ఆయనకు ఉన్నది .గోపాల కృష్ణ గారి తాత గారి మరణ సమయం ఆసన్న మైనదని తెలుసుకొన్న తండ్రి గారు బెజా వాడ నుండి ఫోటో గ్రాఫర్ ను తీసుకు వచ్చి వీరి తాత గారి ఫోటో తీయించారు. ఫోటో తీసిన కొన్ని రోజులకే తాతయ్య గారు1928లో మరణించారని గోపాల కృష్ణ గారికి చెప్పారట . .వారి మరణం వీరికి తెలియదు .అప్పటికి వీరి కుటుంబం ఉయ్యూరుకు రాలేదు .
గోపాల కృష్ణ గారు 10-1-1935లో ఉయ్యూరు లో జన్మించారు అందువల్ల తన స్వగ్రామం ఉయ్యూరు అనే చెబుతారు .పిల్లల చదువు పల్లెటూరు అయిన కుమ్మ మూరు లో సాగదు అని తండ్రి గారి తో పోరి, కాపురాన్నివీరి తల్లి గారు ఉయ్యూరు లో కాపురం పెట్టించారట .అప్పటి శ్రీ రామ కృష్ణా రైస్ మిల్ నుకీ శే .వెంట్రప్రగడ మల్లయ్య గారి కుమారుదు అంజయ్య గారు ,రామి నేని బ్రదర్స్ ,మైనేని బ్రదర్స్ కలిసి నిర్మించారట .ఉయ్యూరు లో మొదటి కలప వ్యాపారాన్ని,(ఇది వెల్లంకి వెంకట రాయులు పేర ఉన్నా ) మొదటికాంక్రీటు వర్క్స్ , మొదటి సినిమా హాలు ను కూడా మైనేని గోపాల క్రిష్నయ్య గారి తండ్రిగారు వెంకట నరసయ్య గారే ప్రారంభించారు ,వ్యాపారం వారికి వెన్నతో బెట్టిన విద్యలా అలవడింది .గాలి వానకు రెండు సార్లు కూలి పోయినందు వలన మాను కొన్నారు .అదే ఇప్పుడు శాంతి దియేటర్ ఉన్న స్థలం .అంతకు ముందు ఉప్పుడు మిల్లు ఉండేది .వీరి తండ్రిగారు ‘’సౌభాగ్య కోటేశ్వరి సూపర్ మార్కెట్ ‘’ను ఏర్పాటు చేయాలని శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ గారి తండ్రి గారిసలహా సంప్రదింపులతో ప్లాన్ కూడా వేశారు .ఇప్పుడున్న పిల్లి మాణిక్యం కొడుకు తిరుపతి రావు డాబాలో ఒక బట్టల షాపు కూడా ప్రారంభించారు .ఇవన్నీ గోపాల కృష్ణ గారి బాల్య జ్ఞాపకాలు .వీరితల్లి దండ్రులకు చాలా కాలం పిల్లలు కలుగక పోతే కాశీ ,ప్రయాగ, బదరీనాధ, కేదార నాద ,రామేశ్వర పుణ్య క్షేత్రాలను దర్శించి వచ్చారు అలహా బాద్ లో మోతీలాల్ నెహ్రు గారి ఇల్లు కూడా చూసి వచ్చారట వారు .యాత్రా ఫలము ,పూర్వపు నోముల ఫలమూ కలిసి తొమ్మిది మంది సంతానం కలిగింది .ఇంత వరకే గోపాల కృష్ణ గారికి జ్ఞాపకం అన్నారు .ఇదంతా 1950కి పూర్వం జరిగిన సంఘటనలు .ఆ తర్వాత గోపాల కృష్ణ గారు పై చదువులకోసం బెజవాడ వెళ్ళారు .
1976లో గోపాల కృష్ణ గారి తండ్రి గారు నరసయ్య గారు మరణించారు .అప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులు ఎవరికి ఏదికావాలో తీసుకోమని అంటే గోపాల కృష్ణ గారు ‘’నానా రాజన్య విఖ్యాత జన చరిత్రము ‘’అనే పుస్తకం కావాలని చెప్పి తీసుకోన్నారట .అది తరువాత ఏమైనదో తెలియదని ఇప్పటికి బాధ పడతారు .ఆ పుస్తకాన్ని అంత విలువైనదిగా ఆయన భావించారు .2004 లో గోపాల కృష్ణ గారి భూరి విరాళం తో ఇప్పుడున్న ఏ సి గ్రంధాలయం ఏర్పడి ప్రారంభోత్సవానికి వారు వచ్చారు .అప్పుడు శ్రీ రామినేని భాస్కరేంద్ర ఒక పాత ప్రతిని సంపాదించి ఉయ్యూరులో వీరికి అందజేశారు .ఆ పుస్తకం లో ఏంతో మంది ఆంద్ర ప్రముఖుల జీవిత చరిత్రలు ఫోటోలు ఉన్నాయని అది అమూల్య మైన పుస్తకమని,దాన్ని చేజార్చు కొన్నందుకు ఇంకా బాధ పడుతూనే ఉన్నానని గోపాల కృష్ణ గారంటారు .ఆ గ్రంధం లో వీరి తాత గారు తాతయ్య చౌదరి గారి గురించి కూడా వివరం గా ఉంది .అందులోని ముఖ్య విషయాలు తెలుసు కొందాం . శ్రీ మైనేని తాతయ్య చౌదరి
1861 దుందుభి నామ సంవత్సరం లో కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా కుమ్మ మూరు గ్రామం లో కమ్మ వారి ఇంట శ్రీ మైనేని తాతయ్య చౌదరి గారు జన్మించారు .పూర్వాచార పరాయణులు ,గుణ శీల సంపన్నులు .వీరి పూర్వీకులు దేవర కోట సంస్థానం లో ముఖ్యనాయకులు .బంది పోట్లను అణచి వేసి, శాంతి భద్రతలను కాపాడిన ధైర్య సాహసో పేతులు .అందువల్ల .సంస్థానాదిపతుల మన్ననలను పొందారు .అందులో వెంకయ్య గారొకరు .విశేషం గా దనం సంపాదించి .వితరణము నందు ముందు నిలిచారు .వెంకయ్య గారికి వెంకట నరసయ్య అనే పుత్రుడు కలిగాడు .పశువులకు మనుష్యులకు త్రాగు నీటి సౌకర్యం లేనందువలన వెంకట నరసయ్య గారు బందరు పడవల కాలువ కు ఆనుకొని ఉన్న కుమ్మ మూరు గ్రామానికి దగ్గర ‘’దేశాలమ్మ చెరువును ‘’ఎంతోస్వంత డబ్బునుఖర్చు చేసి ‘’త్రవ్వించి నీటి కొరత తీర్చిన దయామయుడు .వీరికి మొదటి భార్య వలన ఇద్దరు కుమార్తెలు కలిగారు .పుత్ర సంతానం కోసం 80వ ఏట ద్వితీయ వివాహం చేసుకొన్నారు .వీరిద్దరికీ ఇద్దరు కుమారులు కలిగారు .ఈ కొడుకులలో ఒక రైన వెంకట రత్నం గారికిలక్ష్మీ నారాయణ ,తాతయ్య అనే కుమారులు పుట్టారు .
మైనేని తాతయ్య గారు చిన్నతనం నుండి కుటుంబ వ్యవహారాలకు దూరం గా ఉంటూ ,అనేక సద్విషయాలను సంగ్రహిస్తూ ,గడిపారు .వీరి యవ్వనం లో తండ్రిగారే కుటుంబ బాధ్యతలను నిర్వహించేవారు .వీరి వార్ధక్యం లో కూడా వీరి కుమారులే వ్యవహారాలను చూసుకోవటం వలన ఎప్పుడూ ధర్మా చారాలతో వెళ్ళ బుచ్చుతూ విశ్రాంతి గా ఉండేవారు తాతయ్య గారు .ఐహికం పై కాక అముష్మికం పైనే ద్రుష్టి నిలిపిన వీరి జీవితం లో ఒక సంఘటన మార్పు తెచ్చింది .యోగుల వలన ,చదివిన ఆధ్యాత్మిక గ్రంధ పరిచయం వలన తాతయ్య గారికి ఉన్మాదాన్ని నివారించే ఔషధం తయారు చేసే ప్రక్రియ అలవడింది .తన స్వంత మందులతో వేలాది మంది పిచ్చి వాళ్లకు వైద్యం చేసి నయం చేసి మంచి కీర్తిని పొందారు .వీరి పేరు జిల్లా దాటి వ్యాపించింది .ఎక్కడెక్కడి నుండో రోగులు వచ్చి చికిత్స చేయించుకొని స్వస్థత పొంది వెళ్ళేవారు .బందరు వాసి ముక్తేవి ప్రకాశ రావు అనే లాయరు గారి సోదరుడు తీవ్ర ఉన్మాదం తో ఉంటె వైద్యం చేసి మామూలు మనిషి ని చేశారు పబ్లిక్ ప్రాసిక్యూటింగ్ ఇన్స్పెక్టర్ అప్పల నరసయ్య గారి పిచ్చి ని కూడా నయం చేశారు .వీరు ఇచ్చే డాక్టర్ సరిఫికేట్ కు ఏంతో విలువా ,గౌరవం ఉండేది .ప్రతిఫలాపేక్ష లేకుండా పశువులకూ గుర్రాలకూ వైద్యం చేసి రోగాలను పోగొట్టే చాతుర్యం తాతయ్య గారిది .
తాతయ్య చౌదరి గారు అశ్వ పరీక్ష లో ,ఆశ్విక శిక్షణ లో గొప్ప సమర్ధులు .వీరు తలబెట్టిన ప్రతి పనిని కుమారుల నుండి మంచి ప్రోత్సాహం లభించేది .దైవ చింతన తో ,పరోప కార పారీణత తో,సార్ధక జీవనాన్ని సంతృప్తిగా గడిపి ,1928 శ్రీ విభవ నామ సంవత్సర కార్తీక బహుళ పంచమి సోమవారం డిసెంబర్ మూడవ తేదీన మరణించారు .
తాతయ్య గారి పెద్ద కుమార్తె ను గుడ్ల వల్లేరు లోని మల్లికార్జున చౌదరి అనే సంపన్నునికిచ్చి వివాహం చేశారు .చిన్న కుమార్తెను చిన ఒగిరాల వాస్తవ్యులు ,భూస్వామి అయిన కంచెర్ల వెంకట రత్నం గారికిచ్చి పెళ్లి చేశారు .పెద్దకుమారుడు నరసయ్య గారు కుమ్మమూరు మునసబ్ గా ఉండేవారు నరసయ్య గారు సాదు శీలి దకష్ట గల వారు వ్యాపార వేత్తలు .ఆంద్ర ఆంగ్ల భాషలలో నిష్ణాతులు .తమ్ముడు లక్ష్మీ నారాయణ ను గృహ వ్యవహారాలను నిర్వహించే ట్లు చేశారు మిగిలిన ఇద్దరు సోదరులు గోపాల క్రిష్నయ్య ,పరందాంయ్యలను ఇంగ్లీష్ విద్య చదవటానికి ప్రోత్సహించారు .వీరిలో మూడవ వారైన గోపాల క్రిష్నయ్య గారు సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొని ,పాఠ శాల ను పరిత్యజించి ,కొంతకాలం సంస్కృతాన్ని అభ్యసించి ,ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం యొక్క అవసరాన్ని గుర్తించి మళ్ళీ బడిలో చేరి చదువు కున్నారు .పరంధామయ్య గారు పట్ట భద్రులయ్యారు .
మైనేని వెంకట నర్సయ్య గారు అంటే గోపాల కృష్ణ గారి తండ్రి గారు కుమ్మ మూరు గ్రామం లో మంచి పలుకు బడిని సంపాదించి పెద్దరికం తో అందరి దృష్టినీ ఆకర్షించారు .గ్రామం లో విద్యాభి వృద్ధికి ఒక పాఠ శాల నెలకొల్పి,మంచి భవనాన్ని నిర్మించిన ఆదర్శ మూర్తి , విద్యాభిమాని ..ఈ స్కూల్ లోనే మొదట్లో స్వర్గీయ లంకా బసవా చారి గారు టీచర్ గా పని చేశారు .ఆయన వద్దనే గోపాల కృష్ణ గారి అక్కగారు ,అన్నగారు చదువుకొన్నారు .బసవాచారి గారు నాకూ ఉయ్యూరు హైస్కూల్ లో ఎనిమిదవ తరగతి క్లాస్ టీచర్ .ఇంగ్లీషు సోషల్ చెప్పేవారు .ఆ తర్వాత అదే స్కూల్ లో ఇద్దరం కలిసి ఉపాధ్యాయులు గా పని చేశాం .విద్య పై నరసయ్య గారికి ఉన్నఅభిమానం , ఆదరణ మాటల తో చెప్ప లేనిది .బందరు జాతీయ కళా శాలకు ఒక అర ఎకరం మాగాణి భూమిని ,,వెయ్యి రూపాయలను విరాళం గా ఇచ్చి దాన శాసనాన్ని రాయించిన వితరణ శీలి ,దాత, దాన గుణ సంపన్నులు ,ధర్మ స్వరూపులు .ఈ పవిత్ర కార్యానికి తండ్రి గారు తాతయ్య చౌదరిని ప్రోత్సాహ పరచి కీర్తిని సాధించిన పుణ్య మూర్తి .డబ్బు, సంపదా పుష్కలం గా ఉన్న మైనేని వారి కుటుంబం ఉదార శీలం చేత దాన గుణం చేత, విద్యాభిమానం చేత, ధర్మా చరణం చేత అందరి మనసులనుఆకర్షించారు . ఏది చేసినా సామాజిక బాధ్యత గా చేశారే తప్ప కీర్తి కోసం ఆశ పడి చేయనే లేదు ..
ఇందులోని మైనేని తాతయ్య చౌదరి గారి జీవిత విశేషాలను గోపాల కృష్ణ గారు నాకు 2011 జూన్ నాలుగవ తేదీ పంపిన బందరు హిందూ కాలేజి తెలుగు పండితులైన శ్రీరాం వీర బ్రాహ్మ కవి గారు రాసిన ‘’నానా రాజన్య చరిత్రము ‘’లోని వ్యాసం లోనివే. భాష సరళం చేసి రాశాను అంతే .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-14-ఉయ్యూరు