లను విడివిడిగా గిన్నెల్లో పోసి.. నీకు ఏదంటే ఇష్టం? అని అడిగితే- గబగబా వాటన్నిటినీ ఒక పెద్ద గిన్నెలో పోసి కలిపి ‘ఇదంటే ఇష్టం’ అనే రకం చింతపల్లి రమణ. లేకపోతే ఆయన ‘నవరస మాటకారి’ అయ్యుండేవారు కాదేమో! జనం నోళ్లలో నానే భాషనే ఏరుకుని.. ఆ మాటలకు చక్కెర పూత పూసి.. సినిమా గొంతుగా మార్చి.. తెర మీద ఆడించాక.. వాటిని విని విజిళ్లు కొట్టే జనమే తనకు ప్రేరణ అంటున్న ఆయన.. తను రాసిన డైలాగుల్లో కొన్నింటిని ‘నవ్య’ కోసం గుర్తుచేసుకున్నారు. ఆయనే ఈ వారం ‘డైలాగ్‌గురూ’..
సుప్రభాతం
భర్తను అపార్థం చేసుకునే భార్యతో ఆమె తల్లిదండ్రులు “ఓం అనే అక్షరంలో నీకు వంకర కనపడుతోంది. మాకేమో దేవుడు కనబడుతున్నాడు” అంటారు.
తొలిప్రేమ
పెళ్లి చేసుకుని మెట్టినింటికి వెళ్లిపోతుంటుంది చెల్లెలు. హీరో అయిన అన్నయ్య అప్పటికే ప్రేమించిన అమ్మాయికి దూరమై ఉంటాడు. ఇన్నాళ్లూ తోడుగా ఉన్న చెల్లి కూడా వెళ్లిపోతుండే సరికి “బుజ్జీ నువ్వు కూడా వెళ్లిపోతున్నావా?” అంటాడు పవన్. ఆ సన్నివేశానికి అయిదుపేజీల డైలాగ్ రాయాల్సిన అవసరమున్నా ఈ ఒకే ఒక్క డైలాగ్ ఆ కొరతను తీర్చింది.
సలీం
పెగ్గు పెగ్గుకు మందుప్రియుల స్వభావం ఎలా మారుతుందో పెగ్గుబోధ చేశారు మోహన్‌బాబు. “మొదటి పెగ్ అవ్వగానే కుక్క బ్లడ్ అవుతుంది. అందుకని వాగుతారు. రెండో పెగ్‌కు కోతి బ్లడ్ అవుతుంది. అందుకే తూగుతారు. ఆఖర్న పిగ్ బ్లడ్ అవుతుంది. అప్పుడు తొంగుంటారు”. ఈ సన్నివేశాన్ని బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. ఈ డైలాగు మోహన్‌బాబుకు నచ్చడంతో.. యూనిట్ మొత్తానికి చదివి వినిపించారట. రైటర్ రమణను పిలిచి అభినందించారు.
సుస్వాగతం
వాడుకలో ఉన్న పదాలనే అటు విరిచి ఇటు విరిచి.. నవ్వించే కొత్తపదాల్ని అల్లడం చింతపల్లి రమణకు ఇష్టం. బయట ఎవరో కాలింగ్‌బెల్ కొట్టడంతో తలుపు తీస్తూ వై.విజయ “లింగులింగుమంటూ ఈ కాలింగు బెల్లొకటి” అంటుంది. నడిచే నడకకు లింగులింగుమంటూ వస్తున్నాడు అంటుంటారు. అదే మాటను కాలింగులోని మొదటి అక్షరం ‘కా’ను తీసేసి ‘లింగు’ను తీసుకుని ‘లింగు లింగు’మని రాశాడు. చిత్రనిర్మాణబృందం మొత్తానికీ అది బాగా నచ్చింది.
సుస్వాగతం
“ఇందులో ప్రకాష్‌రాజ్‌ది శాడిస్టు పాత్ర. శాడిస్టులు మనల్ని ఎంత భయపెడతారో, లోపల వాళ్లంత భయపడుతుంటారు. అదొక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్. పాలకొల్లులో ‘నెలబాలుడు’ అనే చిత్రమైన పేరుపెట్టుకున్న కుర్రాడొకడు ఉండేవాడు. అప్పట్లో వాడు టెన్త్‌క్లాస్. క్లాస్‌లీడర్‌కు ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు “నేను మోనార్క్‌ను. తెలుసుకదా! మీరంతా నాకే ఓటెయ్యాలి” అని నవ్వుతూ అంటుండేవాడు. వాడికి వాడు మోనార్క్ అని ప్రకటించుకున్నా.. ఒక రోజు ఎయిత్‌క్లాస్ అబ్బాయి వాణ్ణి కొట్టాడనుకోండి. అది వేరేవిషయం. చిన్నప్పుడు నెలబాలుడి డైలాగ్ క్లాస్‌రూం వరకే ఆగిపోలేదు. అది నాతోపాటు ఫిలింనగర్ వరకు వచ్చింది. ఆ మాట – సినిమాలో ప్రకాష్‌రాజ్‌కు సరిగ్గా సరిపోయింది. అందుకే రాశాను.. “నేను మోనార్క్‌ను. నన్నెవ్వడూ మోసం చెయ్యలేడు” అని.
తొలిప్రేమ
ఏ రైటర్ అయినా అవకాశం వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట తన ఐడెంటిటీని కోరుకోవడం సహజం. ‘తొలిప్రేమ’లో నాకు అలాంటి అవకాశమే వచ్చింది. అందమైన అమ్మాయిని చూస్తాడు హీరో. కాని ఎక్కడుందో తెలీదు. ఆమె జాడ కనుక్కోమని ఫ్రెండ్స్‌కు చెబుతున్నప్పుడు ఈడైలాగ్ పడింది. హీరోకు వేణుమాధవ్ చేసే జ్ఞానబోధ ఇది – “చూడు బాలు. ఈ సిటీలో మొత్తం ఆరు లేడీస్ కాలేజీలు ఉన్నాయి. ఏడు కో ఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి. అమ్మాయిలవే ఇరవై జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం ఇరవైనాలుగువేల ఆరొందల యాభై నాలుగు మంది ఉన్నార్రా! ఇందులో ‘ఎ’ క్లాస్ అమ్మాయిలు..”ఊపిరి తీసుకోకుండా చెప్పిన ఆ డైలాగ్ కుర్రాళ్లకు భలే నచ్చింది. మద్రాసులో సాయిరెడ్డి అని నాకొక ఫ్రెండ్ ఉండేవాడు. ఆదివారం పూట అతని రూముకు వెళ్లేవాణ్ణి. పొద్దున్నే లేచి పేపర్ కొనుక్కుని పెళ్లిపందిరి క్లాసిఫైడ్స్ చూడందే వాడు స్నానం చేసేవాడు కాదు. ‘వధువు కావలెను’ కాలమ్‌లో కొన్ని చదువుతూ – “ఒరే రవణా, ఈ అమ్మాయికి అందమైన వరుడు కావాలట. తెలుపు రంగు మస్ట్ అంటోంది. పెద్ద జీతం తప్పదు. అంటే ఈ అమ్మాయి ‘ఎ’క్లాస్ అమ్మాయిరో! నాకు సరిపోతుందో లేదో? నువ్వుచెప్పురా.. నేను ఏ క్లాస్‌కు ట్రై చేయమంటావ్?” అని తినేసేవాడు. పెళ్లిప్రకటనల్లో పెళ్లి కోసం వధువు, వరుడులను క్యాటగిరీలుగా ఇచ్చినట్లు ప్రేమ గురించి ఇస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన నుంచే ఈ ఐడియా పుట్టింది.
తమ్ముడు
మా ఊర్లో శకుంతలమ్మ అనే ముసలావిడ జంతికలు అమ్ముతుండేది. వీలుదొరికినప్పుడల్లా ఆవిడ దగ్గర చేరి తన గొప్పలు చెప్పుకునేవాడు అక్కడ పనిచేసుకునే నాయీబ్రాహ్మడు సత్యనారాయణ. అతను మాట్లాడే తీరే నవ్వు తెప్పిస్తుంది. అందుకే అతనేం మాట్లాడినా ఆసక్తిగా వినేవాణ్ణి. ఒక రోజున అతను “పొద్దుట బజారుకెళ్లాను సీకుంతలక్కయ్యా. ఆ పక్కేమో మునెమ్మ, ఈ పక్కనేమో గడ్డిరెడ్డిగాడు పిత్తపరిగెలు అమ్ముతున్నారు. మీ సెల్లేమో ‘సేప తినాలనుంది. నాకు పెద్ద సేపే కావాలి ఎట్టుకురా’ అని సెప్పింది. ఆడ సూత్తే లేవు..” అన్నాడు సత్తి. “మరేటి సేశావ్” అంది శకుంతలమ్మ. “ఏటి సేత్తాం. ఎడిటింగ్ సేత్తాం. పెంటమ్మ కొడుకు వేటకు వెళ్లి ఇంతపెద్ద సేప తెచ్చాడు. నువు నమ్మవుగానీ సీకుంతలక్కయ్యా.. ఆ సేప ఇంత పొడువుంది. శానా రేటు సెప్పాడు. మనమిత్తామేటి? సత్తిగాడికి ఎవర్ని ఎక్కడ నొక్కాలో తెల్సుగదా సీకుంతలక్కయ్యా” అన్నాడు. ఆ జ్ఞాపకాన్ని అక్కడితో వదిలేసి సినిమాలోకి జంప్ అయితే – డబ్బున్న అమ్మాయికి లైన్ వేస్తుంటాడు హీరో పవన్‌కళ్యాణ్. ఒకసారి ఆమె “కెన్ ఐ స్పీక్ టు సుభాష్ (హీరో)” అని ఫోన్ చేస్తుంది. “సాయంత్రం కలుద్దాం. కారులో నేను అక్కడికి వస్తున్నా” అని పవన్ చెప్పాల్సిన సీను. దాన్నే కాస్త డ్రెమటైజ్ చేయాలనిపించింది. “ఆడంగులకు ఆమడదూరంలో ఉండే సినయ్యగారి కోసం ఆడపిల్లలు పోను సెయ్యటమా? ఏటి బాబూ ఈ విడ్డూరం. ఒక్క నిమిషమమ్మ కాలింగు సేత్తానే. సీకుంతలక్కయ్యా.. సీకుంతలక్కయ్యా. నిన్నేనే సినయ్యగారు ఏటి సేత్తున్నారు. ఓ.. సెక్కుల మీద సంతకాలెట్టేత్తున్నారా? మీకు తెల్దుగానమ్మా మా సినయ్యగార్ని పట్టుకోవడం సాలా కట్టమమ్మా! మార్నింగు మార్నింగే లేత్తారా. సెటిలాడేసుకుంటారు. ఆ తర్వాత వాటర్‌బెడ్డు మీద తొంగోని గెడ్డం గీసేసుకుంటారు” అని పనిమనిషి చెప్పినట్టుగా ఆయన చేసిన ఏకపాత్రాభినయం అద్భుతం.
లాహిరి లాహిరి లాహిరిలో
అప్పటికి నేను ప్రేమ, కుటుంబ, సెంటిమెంటు కథా చిత్రాలన్నింటికీ డైలాగులు రాశాను. కాని స్త్రీ గొప్పతనం గురించి రాసే అవకాశం రాలేదు. ‘లాహిరి లాహిరిలో’కు రాస్తున్నప్పుడు ఆ ఛాన్స్ దొరికింది. హరికృష్ణ ఒక చోట పూజ చేస్తుండగా, ఆ పక్కనే భానుప్రియ, రమాప్రభలు కూడా పూజలో నిమగ్నమై ఉంటారు. రౌడీలు వచ్చి భానుప్రియను ఏడిపిస్తారు. ముసలామె రమాప్రభకు శక్తి లేకపోయినా అడ్డుకుంటుంది. పూజ పూర్తయ్యే వరకు లేవడు హరికృష్ణ. ఆ తర్వాత లేచి రౌడీలను చితకబాది “ఆడదంటే ఆడేదనుకున్నార్రా? స్త్రీని గౌరవించమని దేవాలయాల్లో, స్టేజీల్లో, ఆర్టీసీ బస్సుల్లో మొత్తుకుంటున్నా వినరేంట్రా?” అంటాడు. ఈ మాటకు ప్రేరణ మా అమ్మమ్మ జోగమ్మ. మాది పాలకొల్లు అయితే ఆవిడది పిఠాపురం పక్కనుండే నాగులాపల్లి. వేసవి సెలవుల్లో మేమందరం ఇంటి దగ్గరే ఉంటామని చూసిపోయేందుకు వచ్చేది. ఆమె వచ్చినప్పుడు ఒక రోజు ఊరిలో పేదోళ్ల గుడిసెలు తగలబడిపోతున్నాయి. వెంటనే అక్కడికి వెళ్లిపోయి మంటల్ని ఆర్పేందుకు నీళ్లను అందిస్తోంది. ఇంట్లో వాళ్లు అమ్మమ్మను తల్చుకున్నప్పుడల్లా ఆ విషయాన్ని గుర్తు చేసుకునేవాళ్లు. ఒక స్త్రీ పట్ల మరో స్త్రీ చూపించే ప్రేమ ప్రకృతి అంత సహజమైనది. సినిమాలో ఈ సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావడంతో.. ఒక ఉదయాన్నే హరికృష్ణ నుంచి కబురొచ్చింది నాకు. ఆయన వద్దకు వెళ్లగానే ‘రమణగారు.. మంచి డైలాగు రాశారు’ అంటూ గుజరాతీ మిఠాయిల్ని తినిపించారు. నాకు అదొక తీపి గురుతు.
ప్రియమైన నీకు
‘లవ్వు సీన్లు’ అనగానే చింతపల్లి రమణ గుర్తుకురావడానికి కారణం.. ఆ సబ్జెక్టు మీద నాకు గురి కుదరడం. ఒక భావనను వెయ్యి కోణాల్లో దర్శించడానికి ఏదో ఒక అనుభవం అవసరం. బాల్యంలో అలాంటి ఒక డిస్ట్రబెన్సే జరిగింది. నాకొక మిత్రుడు ఉండేవాడు. మేమిద్దరం కలిసి ఆడుకుంటున్నప్పుడు వాళ్ల అన్నయ్య చాక్లెట్లు ఇచ్చేవాడు. “ఒరే రవణా, నీకు పాటలంటే ఇష్టం కదా. అక్కడ పాటలకొట్టు (పోటీలు) ఉంది. వెళ్లి పాల్గొను. ఫ్రైజ్ ఇస్తారు” అని ప్రోత్సహించేవారు. ఒక రోజున స్కూలుకు వెళ్లి ఇంటికొస్తుంటే- ఆయన శవాన్ని పాడిమీద మోసుకొస్తున్నారు. అదే పాడెకు ఎదురుగ్గా మరో అమ్మాయి శవాన్ని పాడె మీద తీసుకొస్తున్నారు. ఒక్క క్షణం షాక్ అయ్యాను. ఏమీ అర్థం కాలేదు. ఊహకు కూడా అందని దృశ్యం అది. ప్రేమ విఫలం కావడం వల్ల వాళ్లిద్దరూ పురుగులమందు తాగి చనిపోయారట. ‘ప్రేమ’కు మనుషుల్ని చంపే శక్తి ఉందా? మరణం వరకు తీసుకెళుతుందా? అని తీవ్రంగా ఆలోచించాను. సినిమాలకు ప్రేమ డైలాగులు రాయాల్సి వచ్చిన ప్రతిసారీ.. మనసులో ఏదో ఒక మూలన అదే జ్ఞాపకం గిర్రున తిరుగుతుండేది. అందుకేనేమో ప్రేమ సన్నివేశాలకు నేను రాస్తున్నప్పుడు నాకు తెలియకుండానే అంతగా ఇన్వాల్వ్ అవుతుంటాను. ‘ప్రియమైన నీకు’లో తరుణ్ అంటాడు “పువ్వులు పూయడానికి ఒక టైమ్ ఉంటుంది. నక్షత్రాలు పుట్టడానికి ఒక టైమ్ ఉంటుంది. ప్రేమ రావడానికి టైమ్ అంటూ ఉండదు. అదొచ్చిన తర్వాత ఏ పనీ చేయడానికి మనసుండదు” అని. ‘లాహిరి లాహిరిలో’ అయితే “మనిషిని చంపడానికి ఆయుధాలు కనిపెట్టారు. ప్రేమను చంపడానికి ఒక్క ఆయుధం కూడా కనిపెట్టలేదు” అని లక్ష్మి చెప్పే మాట ప్రేక్షకుల మెప్పు పొందింది. ‘దేవదాసు’లో నాకు వ్యక్తిగతంగా నచ్చిన డైలాగ్ “కోస్తారని తెలిసినా పూలు పూస్తాయి. ప్రేమ కూడా అంతే!”. ప్రేమకున్న సహజత్వమే ఈ వాక్యానికి ఉంది అని చాలామంది చెప్పారు.
అరుంధతి
‘అరుంధతి’ కథ వినడానికి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి వద్దకు వెళుతున్నప్పుడు నాకొక అనుమానం వచ్చింది. ‘నేను డైలాగులు రాసిన సినిమాలన్నీ ఒక రకమైన సబ్జెక్టులు. ఇదేమో బీభత్సరసమున్న కథ. దీనికి నేను రాయగలనని ఆయన ఎలా పిలిచారు?” అని. అదే మాటను ఆయనతో అంటే “లాహిరి లాహిరిలో’ కొన్ని సీన్లు చూసి మీరైతే దీనికి రాయగలరు అని మిమ్మల్ని పిలిపించాను” అని చెప్పారు. కథాబలమున్న ఇంత మంచి సినిమాకు రాయడాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. మా ఊరి దగ్గర తాళ్లసాయిబు ఉండేవాడు. పిల్లలు జడుసుకుంటే తాయత్తులు అవీ కడుతుంటాడు అతను. అక్కడికి వెళ్లి అతను మాట్లాడే తీరు, అక్కడికి వచ్చేవాళ్లు చెప్పుకునే బాధలు పరిశీలించాను. గద్దెల దగ్గర కొన్నిరోజులు ఉండిపోయాను. ముసలివాళ్ల దగ్గరికి వెళ్లి పాత దెయ్యాల కథలు చెప్పించుకున్నాను. అయినా కథ మూడ్‌లోకి వెళ్లలేదు. హైదరాబాద్‌లోని కోఠీకి వెళ్లి పాత చందమామ, బాలమిత్ర పుస్తకాల్ని కొనుక్కుని చదవడం మొదలుపెట్టా. కథకు తగ్గట్టు బ్రెయిన్ ట్యూన్ అయ్యింది. ప్రతి క్యారెక్టర్‌కు డైలాగులతోనే ఒక మాడ్యులేషన్‌ను ఫ్రేమ్ చెయ్యాలి. దీనికి ఏదైనా కొత్త భాష కావాలి. ఆ వెతుకులాటలో నాకు నేనే ఒకటి ఊహించుకున్నాను.
ఒక ఆడది నన్ను కొట్టి, పచ్చిబూతులు తిట్టి వెళ్లిపోతే, చంపితే? అని. ఆ మూడ్‌లో సోనూసూద్‌కు మాటలు రాస్తున్నప్పుడు- అతను సమాధిలో ఉంటాడు కాబట్టి మనిషి కనిపించడు. కేవలం డైలాగ్ ఒక్కటే వినిపిస్తుంటుంది. అప్పుడు నేను “నన్ను చంపి ఈ సమాధిలో కుళ్లబెట్టిన నిన్ను వదలను వదలను” అని రాశాను. ఇంకా ఏదో లోపం. వాక్యం చివర్న భయపెట్టే పదం కావాలి. బజారుకు వెళ్లినప్పుడు అందమైన అమ్మాయిలను చూసి ‘ఫిగరు భలేవుంది’ అని ఎవరో అంటుండగా వినొచ్చాను. ఫిగరు అంటే బొమ్మ. పైన రాసిన డైలాగ్‌కు ‘బొమ్మ’ను జతచేస్తే అనుకుని “వదలను బొమ్మా వదలను” రాశాక నాకే నచ్చలేదు. బొమ్మను అటుతిప్పి ఇటుతిప్పి ‘బొమ్మాళీ’గా మార్చాక ఫరవాలేదు అనిపించింది. వ్యక్తీకరణ ఇంకొంచెం తాజాగా ఉండాలని ప్రయత్నిస్తున్నప్పుడు – పక్క గదిలో మా రెండో అమ్మాయికి ట్యూషన్ చెప్పేందుకు వచ్చింది టీచరు. “ఏంటి? నిన్ననే కదా ఈ మిస్టేక్ చేశావ్. మళ్లీ అదే తప్పు. చెప్పింది చెవికి ఎక్కడం లేదా” అని గట్టిగా మందలిస్తోంది. అప్పుడు మా అమ్మాయి “చెయ్య టీచర్.. చెయ్య” అంటోంది. అది విన్న నేను “ఆ భాష ఏదో బావుందే” అనిపించింది. ‘చెయ్యను’కు బదులు ‘చెయ్య’లాగే ‘వదలను’కు బదులు ‘వదల’రాస్తే? తట్టిన వెంటనే కాగితం మీద పెట్టాను. ఆ పదాన్ని బొమ్మాళీకి అటొకటి ఇటొకటి పెట్టాను. అప్పుడు ‘వదల బొమ్మాళీ వదల’ అయ్యింది. సూపర్! మరుసటి రోజు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి వినిపిస్తే “వాటీజ్ దిస్ బొమ్మళీ సార్” అడిగారు. “అర్థమేమీ లేదండీ. ఇదొక తిట్టు కూడా కాదు. చెవికి ఇంపైన ఒక ఉద్వేగం. ఆ పాత్రకు సరిపోయే ఒక కొత్త పదం” అని చెప్పాను. “చాలా బావుంది. సినిమాలో దీన్నే పెడదాం. యు కెన్ కంటిన్యూ” అన్నారు. ‘అరుంధతి’లో బొమ్మాళీ ఎంత పాపులర్ అయ్యుందో మీకు తెలుసు. కొన్ని సందర్భాల్లో పత్రికల్లో పతాకశీర్షికలకు కూడా దీన్ని వాడారు..” అని ముగించారు చింతపల్లి రమణ.
చింతపల్లి రమణ సొంతూరు పాలకొల్లు. చదువుకునే రోజుల్లోనే రేడియోకు నాటికలు, పద్యాలు రాయడం అలవాటు. రచనా వ్యాసంగంలో కొంత అనుభవం వచ్చాక.. రేలంగి నరసింహారావు వద్దకు వెళ్లి పాతిక సినిమాలకు అసోసియేట్‌గా పనిచేశారు. ఏఆర్‌కే మోహన్‌రావు అవకాశం ఇవ్వడంతో ‘చిన్నబ్బులు’తో డైలాగ్ రైటర్ అయ్యారు. ఆ తర్వాత భీమనేని శ్రీనివాసరావు, ఎడిటర్ మోహన్ సినిమాలకు రచనా సహకారం అందించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘సందడే సందడి’, ‘దిల్’, ‘దేవదాసు’, ‘ ఆనందం’, ‘యువరాజు’, ‘వసంతం’, ‘స్నేహమంటే ఇదేరా’, ‘అరుంధతి’, ‘దుబాయ్ శీను’, ‘నమో వెంకటేశా’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ వంటి ఎన్నో మాటలు రాశారీయన.
ం మల్లెంపూటి ఆదినారాయణ