శ్రీ మైనేనిగోపాల కృష్ణ గారి ఉయ్యూరు జ్ఞాపకాల పరిమళాలు – 2

శ్రీ  మైనేనిగోపాల కృష్ణ గారి ఉయ్యూరు  జ్ఞాపకాల పరిమళాలు – 2

కాంగ్రెస్ కు అండగా  మునసబు గా నరసయ్య గారు

మైనేని గోపాల కృష్ణ గారి తండ్రి వెంకట నరసయ్య గారు ఉయ్యూరు లో కాంగ్రెస్ పార్టీకి ఆరోజుల్లో పెద్ద దిక్కుగా గొప్ప అండగా నిలిచారు .కాంగ్రెస్ ఆఫీసును ఏర్పరచి చాలా ఏళ్ళు నిర్వహించారు .ఆ సమయం లో ఉయ్యూరుకు వచ్చిన కాంగ్రెస్ ప్రముఖులు శ్రీ ప్రకాశం పంతులుగారు, శ్రీ మాగంటి బాపినీడు శ్రీ మరు పిళ్ళ చిట్టి గారు వీరింటికి వచ్చి ఆతిధ్యం అందుకొనే వారు .నరసయ్య గారు అత్యంత ప్రమాద, విపత్కర పరిస్తితులలో ఉయూరు మునసబు గా ఉన్నారు .అప్పుడే కాటూరు లో కమ్మ్యూనిస్ట్ ఉద్యమం  తీవ్రం గా ఉండేది .ప్రభుత్వం బూటకపు యెన్ కౌంటర్ల  లో కమ్యూనిస్ట్ లను  సామూహికం గా కాల్చి చంపుతున్న  దారుణ సమయం అది .మలబార్ పోలీసులను రప్పించి కమ్యూనిజాన్ని అనగార్చ టానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న రోజులవి . అలాంటి భయంకర సమయం లో  మునసబు గిరీ చేయటం అత్యంత సాహసం ,ప్రమాదం .కాని వీరు సమర్ధ వంతం గా తమ విధులను నిర్వహించి ప్రజల మెప్పు పొందారు .

కోట సూర్య నారాయణ మేష్టారు

గోపాల కృష్ణ గారి మరో ముఖ్య మైన జ్ఞాపకం వారికి ట్యూషన్ చెప్పి తాడంకి హైస్కూల్ లో చేర్పించిన ప్రైవేట్ మాస్టారు శ్రీ కోట సూర్య నారాయణ గారు ,ఇంటికి వచ్చి ప్రైవేట్ చెప్పేవారని తాము ఆయనకు అత్యంతా విధేయుడిగా ఉండేవాడినని తమ కుటుంబం సూర్య నారాయణ మేస్టారిని ఏంతో గౌరవిన్చిందని ,ఆయన దగ్గర చదువు కోవటమే తన అదృష్టమని అలాంటి గురువులు చాలా అరుదుగా ఉంటారని ,తాను ఇంతటి వాడినవ్వటానికి మేష్టారు  వేసిన విద్యా పునాదులే కారణమని అత్యంత వినయం గా ,భక్తీ తో చెబుతారు గోపాల కృష్ణ గారు .

నా గురువు కూడా

కోట సూర్య నారాయణ గారు నాకు కూడా గురువు గారు అవటం గొప్ప విషయం.మా ఇంటికికుడి ప్రక్క అంటే దక్షిణం గా  మూడవ ఇంటిలో దేవుల పల్లి సీతమ్మ కావమ్మ గారింటిలో ఆయన ఆద్దే కుండే వారు .నల్లని మనిషి భారీ విగ్రహం వీపు చాల వెడల్పు .నుదురు పెద్దది .పంచా చొక్కా తో ఉండేవారు చేతిలో పేం బెత్తం ఉండేది ట్యూషన్ చెప్పేటప్పుడు చొక్కా ఉండేది కాదని జ్ఞాపకం .తువ్వాల మీద వేసుకొనే వారు .ఆయన్ను చూడగానే చూసిన వారికి ’’కింది నుంచి కారి పోయేట్లు ఉండేవారు ‘’.కాని ఆయన బోధన అసామాన్యం .చదువు చెప్పేటప్పుడు ఆయన చూపించే ప్రేమ నిరుపమానం .నేను వారి దగ్గర నాలుగో క్లాసు చదివాను .ఒక్కోసారి భయపడి ఆయన ప్రైవేటు కు వెళ్ళకుండా,అలిగి మా పడమటింట్లో ఉండే ‘’భోషాణం ‘’ఎక్కి పడుకొనే వాడిని .ఆయన నేను రాలేదని తెలుసుకొని ముందు పిల్లలను పంపేవారు నన్ను తీసుకొని రమ్మని .అయినా వెళ్ళక పోతే తానే మా ఇంటికి వచ్చి బతిమాలి స్కూల్ కు తీసుకొని వెళ్ళే వారు .ఒడిలో కూర్చో బెట్టుకొని చదువు చెప్పేవారు .ఆ ఆప్యాయత జీవితం లో మరువ లేనిది .ఆయనా, ఆయన అన్న గారు కో ఆపరేటివ్ బాంక్ లో పని  చేసిన  కోట శ్రీరామ మూర్తి గారు మా  నాన్న గారి శిష్యులే .అందుకని మేస్టారికి నా మీద అంత ప్రేమ .వారి కృప, దయా, ప్రేమ ఆత్మీయత వలననే నేనూ నాలుగక్షరాలు నేర్చుకొని ఈ విధం గా నిలబడ గలిగానని వినమ్రం గా చెప్పుకొంటాను .నేను అయిదవ తరగతి హిందూ పురం లో చదివాను .మేము అక్కడి నుండి వచ్చేసరికి సూర్య నారాయణ మేష్టారు గుడివాడ దగ్గర బేతవోలు కు వెళ్లి పోయారని తెలిసింది .మా అన్నయ్య గారి అమ్మాయి ఛి సౌ  వేదవల్లి ని 1974లో చిరివాడ లో ఉంటున్న వేలూరి రామ కృష్ణ కు ఇచ్చి వివాహం చేశాము .వీళ్ళ కుటుంబం అప్పుడు చదువు కోసం బేత వోలు లో ఉండేది .వీరరు అద్దెకు ఉంటున్న ఇల్లు  సూర్య నారాయణ మేస్టారి ఇంటికి దగ్గరే .మేము తెలుసుకొని మేస్టారింటికి వెళ్లాం. వారు స్వర్గస్తులయ్యారని తెలిసింది .మేస్టారి భార్య గారిని చూశాం .వీరి పిల్లలూ ,మా అన్నయ్య గారి అల్లుడు రామ కృష్ణ,అతని  సోదరులూ గుడివాడ  కాలేజి లో క్లాస్ మేట్స్ .అలా మేస్టారిని చూడ లేక పోయినా వారి కుటుంబాన్ని చూసిన సంతృప్తి మిగిలింది

నరసయ్య గారి గుర్రపు స్వారి

గోపాల కృష్ణ గారి తండ్రి గారికి గుర్రపు స్వారీ హాబీ గా ఉండేది దానినే మంచి వ్యాయామం గ అభ్యాసం చేసే వారు .దీనికోసం కాశ్మీర్ నుంచి జాతి గుర్రాన్ని తెప్పించారు  .ఈయన తో బాటు తెలుగు దేశం మాజీ మంత్రి ,లోక్ సభ సభ్యుడు  వడ్డీ శోభనాద్రీశ్వరరావు తండ్రి  అంకయ్య చౌదరి కి కూడా కాశ్మీర్ నుంచి గుర్రాన్ని తెప్పించారు నరసయ్య గారు .దురదృష్ట వశాత్తు అంకయ్య చౌదరి గారి గుర్రానికి తీవ్రమైన జబ్బు చేసింది .ఆయన కోరిక మేరకు గుర్రాన్ని తుపాకీ తో కాల్చి చంపేశారు .నరసయ్య గారి గుర్రానికి వీర్యం   నష్టం కాకుండా ఉయ్యూరు పశువుల ఆస్పత్రి లో ఆప రేషన్ చేయించారు .విధి వక్రించి ఈ గుర్రానికి ఇన్ఫెక్షన్ సోకి చని పోయింది పాపం . ఏంతో ఉత్సాహం తో  ,గుర్రపు స్వారీ పై మోజు తో అంత దూరం నుంచి తెప్పించుకొన్న ఇద్దరి గుర్రాలు ఇలా జబ్బు పడి  చని పోవటం దురదృష్టకర సంఘటన అని గోపాల కృష్ణ గుర్తు చేసుకొన్నారు .

కమ్యూనిస్టులు –పోలీసుల వేటాట

గోపాల కృష్ణ గారి జ్ఞాపకాలలో ‘’కాటూరు ,యల మర్రులలో  ‘’పోలీసు జులుం ఇప్పటికి వణుకు పుట్టిస్తుంది ఒళ్ళు జలదరిస్తుందని చెప్పారు . కాటూరును ఆ రోజుల్లో’’ ఆంధ్రా మాస్కో ‘’అనే వారని గుర్తు చేసుకొన్నారు .ఆ రెండు ఊర్లలోఊరి లోని వారందరినీ బట్టలు విప్పదీయించి నడి బజార్లో భార్యా పిల్లల ముందు పోలీసులు పెరేడ్ చేయించే వారట .చూసే వాళ్ళు తల దించుకొనే వారట .ఇంత పాశవికం గా ,కిరాతకం గా ఆనాడు మల బారు పోలీసులు వ్యవహరించి ప్రజల్లో భీభత్సం సృష్టించారు .ఇలా చేయటానికి పోలీసులు చెప్పే కారణం వారందరూ కమ్యూనిస్ట్ టేర్రరిస్టూలకు ఇళ్ళల్లో ఆశ్రయం కలిపించి తిండి పెడుతున్నారనే అనుమానం .వాళ్ళను పోలీసుల కంట పడకుండా తప్పిస్తున్నారనే శంక .ఈ దారుణ ఉదంతం మన రాష్ట్రం లో మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో జరగటం సిగ్గు చేటు,ఘోరాతి ఘోరమైన పాశవిక చర్య  అని అభిప్రాయ పడ్డారు గోపాల కృష్ణ గారు . ఆ కాలం లో ప్రజల పరిస్తితి  ముందు నుయ్యి వెనుక గొయ్యి లా ఉండేదని అన్నారు .తమను గురించి పోలీసులకు సమాచారం ఇస్తే కమ్యూనిస్టులు ప్రజలను చంపే వారు .సమాచారం ఇవ్వక ఊరుకొంటే, తెలియదని చెబితే పోలీసుల చేతి లో నరక యాతన .ఇదీ ఆ నాటి విపరీత విపత్కర పరిస్తితి .ఇరువైపులా హింస మధ్య ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడిపిన చీకటి రోజులవి .

కమ్యూనిస్టుల దారుణాలు కూడా మహా ఘోరం గా ఉండేవి .ఉయ్యూరు దగ్గర చిన ఒగిరాల కరణం గారు మిట్ట మధ్యాహ్నం భోజనానికి కూర్చుని తింటుండగా కమ్యూనిస్టులు వారి ఇంటిపై  దాడి చేసి తమ ఆచూకి పోలీసులకు చెప్పాడనే నెపం తో ఆ ముసలి ప్రాణం ఆప సోపాలు పడుతూ కాళ్ళా వేళ్ళా పడి ప్రాధేయ పడుతున్నా ,భార్య ముందే నిర్దాక్షిణ్యం గా కాల్చి చంపేశారు .ఇదొక సంచలనమే సృష్టించింది ఆ నాడు .చిన ఒగిరాల, పెదోగిరాల గ్రామాలు కమ్యూనిస్టు లకు పట్టు కొమ్మలు ఆనాడు .యల మర్రు లో ‘’హోం గార్డ్’’ ను కమ్యూనిస్టుల ఆచూకీ ని పై అధికారులకు తెలియ జేస్తున్నాడనే అనుమానం తో కమ్యూనిస్టులు దాడి చేసి చంపేశారు .దీన్ని బట్టి ఈ ఉదంతాల న్నిటికి పోలీసులు ,కమ్యూనిస్టులు ఇద్దరూ బాధ్యులే నంటారు గోపాల కృష్ణ గారు  ఇరువైపులా అతి ఉండటం దారుణం అన్నారు . ఈ  ఉదంతాలు చరిత్రలో మిగిలి పోయిన మాయని మచ్చలు .

మా ఇంటిలో ఇంటి బట్టలు ఉతికే యాక మూరు కు చెందిన ‘’మాణిక్యం’’ అనే చాకలి అమ్మాయి మా చిన్నతనం లో  ఈ రెండు ఊళ్లలో జరిగిన దురంతాలను మాకు కధలూ గాధలుగా కళ్ళకు కట్టి నట్లు చెప్పేది . నిశ్చేస్టూలమై  అలా చూస్తూ విం టూండే వాళ్ళం .ఎన్నో రోజులు ఈ విషయాలనే ప్రత్యక్షం గా చూసి నట్లు వీడియో లో చూపించినట్లు ఏదీ వదల కుండా పూస గుచ్చు నట్లు చెప్పి మాకు మా మాణిక్యం   చెబుతుంటే ఒళ్ళు గగుర్పోడిచేది .భయం తో పెద్ద వాళ్ళ వెనక చేరి ,వినే వాళ్ళం .అంత భయంకర సంఘటనలు ఇవన్నీ .

నూనె చంద్రయ్య

ఉయ్యూరు లో ‘’తెలక ‘’కులానికి చెందిన వాడు చంద్రయ్య .వేరుసెనగ నూనె నువ్వుల నూనె ఆముదం నూనెలను ఇంటింటికీ వచ్చి అమ్మేవాడు .ఆతని గురించిన జ్ఞాపకాలను నెమరేసుకొన్నారు గోపాల కృష్ణ గారు పచ్చని ఛాయా తో మల్లె పువ్వు లాంటి పంచ తో అలాంటి తెల్ల మల్లు చేతి బనీను తో   నూనె డబ్బాలను ఒక ట్రే లాంటి దాని లో పెట్టుకొని ఇంటింటికీ తిరిగి అమ్మేవాడు .మహా మాటకారి అన్నారు గోపాల కృష్ణ గారు ..చంద్రయ్య నార్త్ ఆఫ్రికా లోని ఈజిప్ట్ ,మరొక దేశం లో ఒక రాయ బారి ఇంట్లో చీఫ్ కుక్ గా అంటే’’ చెఫ్ ‘’గా కొన్నేళ్ళు పని చేసి మళ్ళీ ఉయ్యూరు చేరాడని గోపాల్జీ అంటారు .అప్పుడు అతను ఆ దేశాల గురించి ,ప్రజల గురించి అక్కడి ప్రజల పద్ధతుల గురించి తన వంట అనుభవాల గురించి  ,ఆచార వ్యవహారాల గురించి గోపాల కృష్ణ గారింటికి నూనె అమ్మ టానికి వచ్చి నప్పుడు కబుర్లలో కధలు గా,గాధలుగా  చెబుతూంటే ‘’అరేబియన్ నైట్స్ ‘’కధలు విన్నంత మహా అద్భుతం గా ఉత్కంఠ గా ఉండేదని చెవులు నిక్క బోడుచుకుని నోరు తెరుచుకొని వినే వాళ్ళ మని గుర్తు చేసుకొన్నారు .

చంద్రయ్య గురించి నా జ్ఞాపకాలు

చంద్రయ్య గురించి నా అనుభవాలనూ ఇక్కడ గుర్తు చేసుకొంటాను .ఆతను మాట్లాడుతుంటే అదో ‘’తమాషా యాస ‘’తో ఉండేది .కబుర్ల పోగు .బట్ట నలిగేది కాదు ఎప్పుడూ స్వచ్చం గా ఉండేవాడు నుదుట యెర్రని పెద్ద పొడవైన బొట్టు ఉండేది .అతను ఎంత నీట్ గా  ఉంటాడో అతను నూనె అమ్మే పాత్రలూ,కొల పాత్రలూ అంత నీట్ గా  నూ ఉండేవి .ఎప్పటికప్పుడు తుడుస్తూ తళ తళ మెరిసేట్లు వాటిని ఉంచేవాడు .చిన్న ఒంపు గొట్టం ఉన్న జర్మన్ సిల్వర్ పాత్రలలో నూనెలు పోసుకోచ్చేవాడు .ఎంత కావాలో చెబితే అకోల పాత్రను దాని కింద పెట్టి ఆ గొట్టం ద్వారా ఒంచి పాత్రలో నూనె పడేట్లు చేసి మన పాత్రలో పోసేవాడు .ఆవిధానం అంతా చూడ ముచ్చటగా ఉండేది .అతని వద్ద అతి స్వచ్చమైన నూనేలే ఉండేవని అందరూ చెప్పుకొనే వారు .లావు పాటి మనిషి గోచీ పోసి పంచ కట్టేవాడు ఎక్కడా నూనె మరక ఆయన బట్టలకు అంటగా నేను చూడలేదు .అంత జాగ్రత్త తీసుకొనే వాడు .చంద్రయ్య దగ్గరే అప్పుడు అందరూ నూనె కొనే వారు. లేక పోతే గానుగ దగ్గరకు వెళ్లి కొనేవారు .కాపుల బజారులో నువ్వుల నూనె గానుగ ఉండేది .

చంద్రయ్య క్రమంగా నూనె అమ్మకం మానేసి వంట మేస్త్రీ గానే  స్తిర పడ్డాడు .ఇతర కులాల వారి చాలా పెద్ద పెద్ద వంటలకు  పెళ్ళిళ్ళకూ ,పార్టీ మీటింగులకు  చంద్రయ్యే వంట చేసేవాడు .చాలా రుచిగా శుచిగా చేసేవాడని పేరు .చాలా దూరపు ఊర్లకు కూడా పిలిపించుకొని వంట చేయించుకొనే వారు . ఉయ్యూరు లో కాకాని వెంకట రత్నం గారు శాసన సభకు నిల బడి నప్పుడల్లా ఉయ్యూరు సెంటర్ లో బూరగడ్డ బసవయ్య గారి డాబా మీద పెద్ద పందిరి వేసి కాంగ్రెస్ ఆఫీసు ఏర్పాటు చేసి మీటింగులు నిర్వహించేవారు .ఆఫీస్ ఓపెనింగ్ కు చంద్రయ్య తో ఉప్మా ,కాఫీ చేయించే వారు .’’ఉక్కు కాకాని ఊర (వీర )కాకాని అంటూ మా స్నేహితుడు పెద్ది భొట్ల ఆదినారాయణ అక్కడికి వెళ్లి జైలు కొట్టేవాడు .ఓపెనింగ్ సమయం లో మమ్మల్నీ అక్కడికి తీసుకొని వెళ్లి ఉప్మా తిని పించి కాఫీ తాగించేవాడు. మహా రుచిగా ఉండేవి రెండూ .అంతే తప్ప చంద్రయ్య చేతి వంట భోజనం తిన్న గుర్తు లేదు

మిగిలిన జ్ఞాపకాలు

గోపాల కృష్ణ గారి జ్ఞాపకాల’’ తేగల పాతర ‘’లో ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరుణాల మరుపు రాని మరో సంఘటన గా చెప్పారు .అక్కడి రంగుల రాట్నం వాటిపై ఎక్కి తిరగటం ,’’చెర్ బొప్పాయి గుండు’’ ఆడటం గొప్ప అనుభవం అన్నారు .ఉయ్యూరు శివాలయం, రామాలయం అనే విష్ణా లయం ,ఉయ్యూరుకు మొదటి పంచాయితీ అధ్యక్షుడైన అలీం సాహేబు గారి డాబాలో పాత పంచాయితీ ఆఫీసు, పంచాయితీ రేడియోలో వార్తలు వినటం ,ఇప్పుడు డి.బి.ఆర్ కాంప్లెక్స్ గా ఉన్న చోట ఉన్న పాత పోస్ట్ ఆఫీసు ,పోలీసు స్టేషన్ వెనక ‘’వేశ్యాలోలుర డ్రైనేజ్’’ గా పిలువ బడే ‘’రత్తి’’ అనే వెడల్పు బొట్టు చెరగని చీర తో ఉండే భారీ పర్సనాలిటి తో ఉన్న ఆవిడా ,ఆయన జ్ఞాపకాల స్మృతుల లోనుంచి ఇంకా పోలేదు .

వెన్న పూస శేషయ్య   ,సున్నంవీరయ్య , గూడెం లో పూనకాలు పూనే కోటప్ప ,టైలర్ ఖాసిం సాహేబు ,ఉయ్యూరు సెంటర్ల్ ఉన్న్న రంగూన్ సేట్ సరుకుల కొట్టూ ,ఒంటెద్దు బండి సూరి ,సీతా రామయ్య సైకిల్ షాపు,ఊర వెంకయ్య దుకాణం లో సరుకులు కొనటం అక్కడే మందు గుండు సామాను దీపావళికి కొనుక్కోవటం ,రామి నేని బుచ్చి బాబు గారి  ఏకాంబరేశ్వర పిక్చర్ పాలెస్, దానికెదురు గా రోడ్డు మీద రామ కృష్ణా రావు కాఫీ హోటల్ అందులో ఆల్ ఇన్ వన్ గా పంచేసే లుంగీతో తెల్ల చొక్కా తో ఉండే ‘’ఓనర్ కం క్లీనర్ కం సరుకు మేస్త్రి’’ అయిన కోమటి  రామ కృష్ణా రావు  ఆ హోటల్లో పెసరట్టు రుచి ,ఇడ్లీ పై వేసే స్వచ్చమైన నేతి గుబాళింపు ,అల్లం చట్నీ పుట్నాల చట్నీ ,కారప్పొడి సాంబారు మరచి పోలేదు ఆయన .హోటల్ కు వచ్చిన వారి దగ్గర ఆర్డర్ తీసుకొని ‘’రెండు పెసరా మూడు ఉల్లి అట్టూ ‘’అని అరిచి లోపల ఎవిరికో పురమాయిస్తున్నాదేమో నాన్న భావం కలిగించేవాడు వెంటనే లోపలి వెళ్లి తానే అవన్నీ వేసి కాల్చి ప్లేట్ లలో తెచ్చేవాడు .తమాషాగా ఉండేది ఆ హోటల్ ను  కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్వహించే వారు. అలాగే అక్కడే ప్రక్కన ఉన్న సారదీ స్టూడియో దాని ఓనర్ మోహన రావు అతను ఫోటో లు తీసే నేర్పు ఆ కాలం లో అతనిది ఒక్కటే ఫోటో స్టూడియో కావటం, తరువాత సినిమా హాల్ రోడ్డులో ఎవరెస్ట్ ఫోటో స్టూడియో-వీరమాచనేని బాల గంగాధర రావు గారి తండ్రి గారిది ) రావటం మరిచిపోని విషయాలే ఆయనకు .రోగులకు అత్యంత స్వల్ప ఖర్చులతో వైద్య సేవలందించిన సి బి.ఏం హాస్పటల్ అప్పటి డాక్టర్ ‘’టింపిణీఅమ్మ గారు’’,సి బి ఏం స్కూలు ఆయన మరవ లేదు .

ఉయ్యూరుకు స్పెషల్ అయిన కడుపు నొప్పి తగ్గించే ‘’వామ్ వాటర్ ‘’మందు ,తయారు చేసి లక్షలు సంపాదించిన కంతేటి సూర్రాజు విశ్వనాధంధన రాజు  సోదరులు ,వారి వడ్ల మర బియ్యం మర ,పెద్ద వంతెన దగ్గర కంతేటి ధన రాజు వడ్లు ,అటుకుల మర ,ఆది రాజు చంద్ర మౌలీశ్వర రావు గారి దంపుడు బియ్యం మరా ఉయ్యూరులో ఆయనే మొదలు పెట్టిన మొదటి ప్రింటింగ్ ప్రెస్ ‘’ఉమా ప్రెస్ ‘’ మరపుకు  రావు అంటారు .

 

బెజవాడ ,బందరు రోడ్డు పై రెండువైపులా ఉన్న మామిడి వేప మద్ది ,గానుగ ,ఎనుగులవడాచెట్లు దానికి కాసే పొడవైన లావైన బ్రౌన్ రంగు కాయలు దానికింద ఏనుగులు వడ దెబ్బకు నీడలో విశ్రాంతి తీసుకోవటం ,తుమ్మ ,బొప్పాయి ,వాక ,చింత నేరేడు ఈత పళ్ళు మామిడి పళ్ళు ,అరటి తోటలు నేరేడు పళ్ళు ,వెలగ చెట్లు కాయలు ,సీమ తుమ్మ చెట్లు అతిరుచికరమైన వాటికాయలు కోసుకు తినటం ,రేగు పళ్ళు వడ్లు పోసి  కొనటం సంక్రాంతికి వచ్చే గంగి రెద్దు మేళాలు, హరిదాసులు ,అన్న పూర్ణ కావడితో బ్రహ్మం గారి తత్వాలు పాడుకొంటూ ఇల్లిల్లూ తిరిగే పానకాలు ,దసరా వేషాలు ,గూడెం లో ఫాల్గుణ పౌర్ణమికి ఊరే గిమ్పుగా వచ్చే వందలాది ఎడ్ల జతల బళ్ళు వాటి పై ఊరేగే ఆడవేషం లో వచ్చే లావుపాటి పూజారి అన్నీ ఆయనకు జ్ఞాపకమే .

ఉయ్యూరులోని పుల్లేరు కాలవలో ఈత కొట్టటం ,చిన్న వంతెన పై నుండి మంచి ఉరవడిగా ప్రవహించే  పుల్లేరు లో దూకి ఆనందించటం ,తీయటి మధుర జ్ఞాపకాలే మైనేని గోపాల కృష్ణ గారికి .అలాగే కుమ్మ మూరు గ్రామం లో వేసవి లో బందరు కాలువ గట్ల వెంబడి తిరుగుతూ సీమ చింత కాయల్ని కోసుకోవటం, స్నేహితుల తో తిరగటం మర్చి పోలేదు .ఒకటి రెండు పెళ్లిళ్లకు వెళ్ళటం జ్ఞాపకం .ఆయనకు ఉయ్యూరు జ్ఞాపకాలే ఎక్కువ .కుమ్మ మూరు జ్ఞాపకాలు చాలా తక్కువ .

ఉయ్యూరు గురించి ఇన్ని ‘’మధురోహలు ‘’మనతో పంచు కొన్నందుకు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారిని అభినందిస్తున్నాను .

27-2-14-గురువారం –‘’మహా శివ రాత్రి ‘’సందర్భం గా శుభా కాంక్షలతో

 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-2-14-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.