
సినీగీత రచయితగానే ఎక్కువ మందికి తెలిసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా ఖాతాలో 12 శతకాలు కూడా ఉన్నాయన్న విషయం ఎక్కువమందికి తెలియకపోవచ్చు. ‘నైమిశ వేంకటేశ శతకం’, ‘శ్రీరామలింగేశ్వర శతకం’ భక్తి ప్రధానాలైతే, ‘సింగరేణి శతకం’, ‘బతుకమ్మ శతకం’ తెలంగాణ హృదయ ఘోషనూ, సంస్కృతినీ ప్రతిబింబిస్తాయి. సినీగీతాల్లో ‘అందరి బంధువయా- భద్రాచల రామయ్యా’, ‘జగదానంద కారకా- జయజానకీ ప్రాణనాయకా’ వంటి భక్తిగీతాలు ఎంత ప్రేక్షకాదరణ పొందాయో, ‘చినుకు చినుకు అందెలతో’, ‘ఓ వాలు జడ…’వంటి ప్రణయగీతాలు కూడా అంతే ఆదరణ పొందాయి. మూడు దశాబ్దాల, సాహిత్య, సినీ జీవిత ప్రస్థానంలో జొన్నవిత్తులకు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడిని అంటూ తన విజిటింగ్ కార్డు నా చేతికి ఇచ్చాడు. కొద్ది క్షణాల తర్వాత ‘మేము సింగపూర్ ఆహ్వానిస్తే వస్తారా?’ అన్నాడు. అంతకు ముందు కూడా చాలామంది ఇలా విజిటింగ్ కార్డులు ఇచ్చి ఈ మాటే చెప్పారు. వాళ్లెవరూ నన్ను ఆ తర్వాత పిలవలేదు. నేను కూడా వాళ్లెవరికీ ఫోను చేయలేదు. ఇదీ అలాంటిదే అనిపించి నిర్లిప్తంగా ‘వస్తాలెండి’ అన్నాను.
“మాది విజయవాడ. నాన్న టీచర్‌గా పని చేసేవారు. చాలీచాలని జీతాలతో జీవితాలు కష్టంగానే గడిచేవి. పదవ తరగతి దాకా ఎలాగోలా చదువు సాగినా ఆర్థిక కారణాలతో ఇంటర్లో చేరకుండా మూడేళ్లు ఖాళీగానే ఉండిపోయి మళ్లీ చదువు కొనసాగించాను. ఇంటర్, డిగ్రీ చదువుతున్న సమయాల్లోనే భాషా ప్రవీణ కూడా చదివాను. సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు నేను ఓ 10 నెలల పాటు మద్రాసులోని ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీలో ఉద్యోగం చేశాను. కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగం పోయింది. నాలో ఒక అయోమయం చోటుచేసుకుంది. తిరిగి విజయవాడ వెళ్లిపోదామనుకున్నాను. సినీ పరిశ్రమలోని వాళ్లకు యోగా నేర్పించే నా రూమ్మేట్ వేద భాస్కర్ నన్ను వారించాడు. నేను రాసిన నాటకాల్లోని పద్యాలు, పాటల్ని గమనించిన ఆయన ‘సాహిత్య పరమైన కొంత ప్రతిభ నీలో ఉంది. దాంతో ఏం చేయాలో ఆలోచించుకోవడం ఇప్పుడు నీ పని. అదేమీ లేకుండా వెనక్కి వెళ్లిపోయి ఏం చేస్తావు? మరికొన్నాళ్లు ఇక్కడే ఉండు. ఆరు మాసాలు కొన్ని ప్రయత్నాలు చేద్దాం. అప్పటికీ ఏమీ కాకపోతే అప్పుడు నేనే స్వయంగా విజయవాడకు పంపిస్తా’నన్నాడు. కానీ ఆరు మాసాలకంటే ముందే నాకు అవకాశాలు వచ్చాయి. రాఘవేంద్రరావు గారి ‘మన ఊరి పాండవులు’ సినిమాకు మొత్తం పాటలు రాయడంతో మొదలైన నా ప్రస్థానం మూడు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. మనలో ఏముందో గుర్తించి, ఆ దిశగా కృషి చేయకపోతే, మనది కాని జీవితంలోకి ప్రవేశించి చివరికి ఏమీ కాకుండాపోతామన్నది నా జీవితం నాకు నేర్పిన తొలిపాఠం.
మాటసాయమైనా చాలు
పసి వయసులోనే పోయిన వారు పోగా మా అమ్మకు మిగిలిన సంతానం ఐదుగురు. అబ్బాయిల్లో నేనే పెద్దవాడ్ని. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక దశలో అమ్మ ఆరోగ్యం క్షీణించడం ఆగలేదు. విజయవాడలోని ఓ హాస్పిటల్లో ఆమెకు వైద్య చికిత్సలు జరుగుతున్నాయి. కానీ, ఎక్కువ రోజులు బతకదనే విషయం స్పష్టమవుతూనే ఉంది. మేమంతా ఒకచోట ఆందోళనగా ఉన్న సమయంలో అమ్మ మా అందరినీ దగ్గరకు రమ్మంటూ సంజ్ఞ చేసింది. మేమంతా దగ్గరగా వెళ్లాం. మా అక్కయ్య వర్ధనికి సంతానం లేదు. మా బావగారు చనిపోయారు. ‘నేను పోయినా వర్ధ్థనిని నువ్వు బాగా చూడాలిరా’ అంటుందేమో అనుకున్నా. చివరి ఘడియల్లో ఆమె నుంచి ఆ మాట చెప్పించుకోవడం ఎందుకులే అనుకుని, ముందుగా నేనే ‘అమ్మా..! అక్కయ్యను ఇప్పుడు ఎలా చూస్తూ వచ్చానో ఎప్పటికీ అలాగే చూస్తాను. నువ్వేమీ బెంగపెట్టుకోకమ్మా’ అన్నాను. కాని మా అమ్మ ‘ఆ విషయం నీకు చెప్పేదేముందిరా. నువ్వే చూస్తావు. నేను చెప్పాలనుకుంది అది కాదురా. ఎన్నాళ్లు బతికినా అందరూ పోవాల్సిన వాళ్లమే. కాకపోతే మనం బతుకుతూ పక్కవాడి గురించి కూడా కాస్త పట్టించుకోవాలి నాయనా! మనం డబ్బులైతే పెట్టలేం. ఇరుగూ పొరుగుకు మీ చేతనైనంత మాట సాయమైనా చేయండి నాయనా!’ అంది. ఆ మాట వినగానే నా మనసులో ఏదో కల్లోలం మొదలయ్యింది. మృత్యువు అంచున కూర్చుని, ఇప్పుడో కాసేపో అన్నట్లున్న ఈ స్థితిలో అమ్మ నోట ఈ మాటలా? ఆ దశలో ఎవరైనా కుటుంబ పరమైన జాగ్రత్తలు చెబుతారు గానీ, ఇరుగూ పొరుగుకు మాట సాయం చేయండి అనా చెబుతారు! నా మనసు ఆ్రర్దమైపోయింది. నా కళ్లెంట బొటబొటా నీళ్లొచ్చేశాయి. రేయీ పగలు జీవితంలో కొట్టుకుపోవడం కాదు జీవన్మరణాలకు అతీతంగా ఆలోచించే మానసిక స్థితి కూడా ఉండాలి. అప్పుడు గానీ, జీవితానికి సార్థకత ఏర్పడదేమో అనిపించింది.
అమ్మ చెప్పింది…
నేను భాషాప్రవీణ చేస్తున్న రోజుల్లోనే అంటే 23 ఏళ్ల వయసు నుంచే పద్యాలూ, పాటలూ రాస్తూ ఉండేవాణ్ణి. ఇతరులెవరో వాటిని మెచ్చుకుంటే విన్న అమ్మ ఒకరోజు ‘ఒరే..! రామలింగేశ్వర స్వామికి మొక్కితే నువ్వు పుట్టావురా, ఆ దేవుని మీద ఓ నాలుగు పద్యాలు రాయి’ అంది. ఆమె మాట మేరకు నేను కొన్ని పద్యాలు రాశాను. 108 పద్యాలతో ‘శ్రీరామలింగేశ్వర శతకం’ అన్న పేరుతో ఒక పుస్తకమే వేశాను. అలా1984లో రాయడం మొదలెట్టిన ఈ పద్యరచన పాతికేళ్లుగా కొనసాగుతూనే ఉంది. 12 శతకాలు పూర్తయ్యేలా చేసింది. నేను రాసిన ‘బతుకమ్మ శతకా’న్ని సిలికానాంధ్ర సంస్థ ప్రచురించడంతో పాటు, ఒకేసారి పది దేశాల్లో ఆవిష్కరించింది. ‘నైమిశ వెంకటేశ శతకం’ రాస్తే, దేవస్థానం వారు దాన్ని ప్రచురించడమే కాకుండా నన్ను ఆ దేవస్థానపు ఆస్థానకవిగా నియమించారు. ఏవో నాలుగు పద్యాలు రాయమని అమ్మ చెబితే నేను దాన్ని సీరియస్‌గా ఎందుకు తీసుకున్నానో చాలారోజుల దాకా నాకు అర్థమే కాలేదు. అమ్మ మాట మీదున్న ప్రేమ గౌరవాలే కారణం. కానీ, ఏ కారణంగానైనా ఒకసారి ఒక ప్రవాహంలోకి కాలుమోపితే ఆ తర్వాత ఆ ప్రవాహమే మనల్ని నడిపిస్తుందేమోనని నాకనిపిస్తుంది.
నీ బలమే నీ రక్ష
మనుషులే కాదు, ఒక మంచి పుస్తకం, లేదా ఒక పద్యం, ఒక పాట ఎదురుకావడం కూడా మానవ జీవితంలో ఒక పెద్ద సంఘటనే అని నేననుకుంటాను. భాస్కర శతకంలోని ‘బలహితుడైన వేళ నిజబంధువు తోడ్పడు’ అనే పద్యాన్ని చూడటం నా జీవితంలో ఒక పెద్ద సంఘటనగా భావిస్తాను. ‘మంటలు పెద్దగా ఉన్నప్పుడు దానికి గాలి తోడై మంటను ఉధృతం చేసి ఒక కీకారణ్యాన్నే దగ్ధం చేసేందుకు తోడ్పడుతుంది. అదే మంట చిన్న దీపంగా ఉన్నప్పుడు ఆ గాలే ఆ దీపాన్ని ఆర్పివేస్తుంది. నువ్వు బలంగా ఉన్నప్పుడు బలవంతుడు కూడా నీకు సహకరిస్తాడు. అదే నువ్వు బలహీనంగా మారినప్పుడు నీ స్నేహితుడే నిన్ను ద్వేషిస్తాడు. నీ శత్రువుగా కూడా మారతాడు’ ఇదీ ఆ పద్యం సారాంశం. అలాగే, ‘నువ్వు బలంగా ఉంటే, నీ నుదుటి రాతను ఆ దేవుడు కూడా నిన్ను అడిగే రాస్తాడు’ అన్న చైనా సూక్తి నాకు బాగా నచ్చుతుంది. సంఘటనలు చెప్పను గానీ, ఇప్పటికీ నన్ను ఆటంక పరిచే వారున్నారు. పరోక్షంగానే అయినా, న న్ను ఇబ్బందులకు గురిచేసే వారున్నారు. అయితే, నేను ఎక్కడ బలంగా ఉంటానో అక్కడ ఆ ఆటంకాలు నన్ను ఏమీ చేయలేకపోతున్నాయి. ఎక్కడెక్కడ నేను బలహీనపడుతున్నానో అక్కడ ఎవరో ఒకరు నన్ను తక్కువ చేయడమో, పక్కకు నెట్టేయడమో జరుగుతోంది. ఇవి నా స్వానుభవంలో చవిచూసిన పరిణామాలు. ఎవరి జీవితంలోనైనా ఇదే జరుగుతుందని నా నమ్మకం. మీరు శక్తివంతులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని కుంగదీసేందుకు ఇతరుల ప్రయత్నాలు ఫలించవు. ఇది నా నమ్మకం. నా జీవిత సిద్ధాంతం.
పుట్టుకతోనే అర్భకులా?
ఇటీవల లక్నోకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైమిశారణ్యం వెళ్లాను. అక్కడ ‘రుద్రావర్తం’ అని ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. నేను అక్కడికి వెళ్లేసరికి కొంత మంది పిల్లలు వెంటపడి ముష్టి అడుగుతున్నారు. అదే సమయంలో పక్కనున్న ఒక గుడిసెలోంచి 18 మాసాల పసిపాప, తప్పటడుగులు వేస్తూ, నాదగ్గరగా వచ్చి చేయి చాచింది. బార్న్ రైటర్, బార్న్ సింగర్, బార్న్ డ్యాన్సర్ అంటూ ఉంటాం కదా మరైతే ఈ పసిపాప బార్న్ బెగ్గర్ అనుకోవాలా? నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏ నైమిశ వెంకటేశ దేవస్థానానికి నేను ఆస్థాన కవినో అక్కడ నాకు ఎదురైన సంఘటన ఇది. అనుక్షణం దివ్యత్వం గురించి మాట్లడటం బాగానే ఉంది గానీ ఈ దీనత్వం మాటేమిటి? ఏమిటీ దేశం? ఆ దైన్యత నుంచి వారిని బయటికి తీసుకురాకపోతే, వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగేదెప్పుడు? బలపడేదెప్పుడు? వారు ఆత్మగౌరవంతో బతికేదెప్పుడు? మనిషిని బతికించని, ఒక శిఖరంగా నిలబెట్టని ఏ దివ్యబోధలకైనా మనుగడేముంటుంది? ఏ సాహిత్యమైనా జీవన సత్యాన్ని బోధించాల్సి ఉంది. అందరి జీవితాలకూ వర్తించే సార్వత్రిక సత్యాలు ఏ ఉ్రద్గంధాల్లోనూ దొరకవు. ఎవరికి వారు ఆ సత్యాల్ని తెలుసుకోవలసిందే. వారికి ఆ స్థాయి రాకపోతే సాహిత్యం ఆ భూమికను నిర్వహించాల్సిందేనని నేననుకుంటాను.
హృదయబంధమే మిన్న
2004 సంక్రాంతి రోజున రవీంద్రభారతిలో జంధ్యాల వార్షికోత్సవం జరుగుతున్నప్పుడు నేను కొద్ది నిమిషాల పాటు ప్రసంగించాను. అది విన్న ఒకాయన నా వద్దకు వచ్చి తన పేరు వామరాజు సత్యమూర్తి అని, సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడిని అంటూ తన విజిటింగ్ కార్డు నా చేతికి ఇచ్చాడు. కొద్ది క్షణాల తర్వాత ‘మేము సింగపూర్ ఆహ్వానిస్తే వస్తారా?’ అన్నాడు. అంతకు ముందు కూడా చాలామంది ఇలా విజిటింగ్ కార్డులు ఇచ్చి ఈ మాటే చెప్పారు. వాళ్లెవరూ నన్ను ఆ తర్వాత పిలవలేదు. నేను కూడా వాళ్లెవరికీ ఫోను చేయలేదు. ఇదీ అలాంటిదే అనిపించి నిర్లిప్తంగా ‘వస్తాలెండి’ అన్నాను. కొద్ది రోజుల తర్వాత తనే ఫోన్ చేసి సింగపూర్‌కు ఆహ్వానించాడు. నేను వెళ్లాను. ఆయనే తనకు సన్నిహితులైన పెద్ద పెద్ద వాళ్లనెందరినో నాకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ఇప్పటికి నేను పదిసార్లు సింగపూర్ వెళ్లాను. ఆయన ద్వారానే నేను మలేషియా, ఆస్ట్రేలియా దేశాలకు కూడా వెళ్లాను. నా కవిత్వాన్ని అభిమానించడమే కాదు, గత పదేళ్లుగా నా ప్రాణంలో ప్రాణంగా ఉంటున్నారాయన. నాకు ఏ ఇబ్బంది వచ్చినా చెప్పుకోవడానికి, ఏ బాధనైనా పంచుకోవడానికి మొట్టమొదట నాకు గుర్తుకొచ్చేది సత్యమూర్తిగారే. ఆయనతో నాకు ఏర్పడిన స్నేహం నా జీవితానికి ఎంతో సుస్థిరత నిచ్చింది. కష్టసుఖాల్ని పరస్పరం పంచుకోగలిగేదే కదా నిజమైన స్నేహం. అప్పటిదాకా నేనెవరో కూడా తెలియని సత్యమూర్తి నా జీవనసమస్తంగా మారిపోయారు. ప్రతి పరిచయం నీ జీవితంలో భాగం కాకపోవచ్చు కానీ, కొన్ని బంధాలు మమేకం కావడమే కాదు మన ముందు కోటి కాంతిపుంజాల్ని పరుస్తాయి. రక్తబంధాలకన్నా మిన్నగా నీకొక లోకాన్ని ప్రసాదిస్తాయి. వాటి ముందు ప్రాణం కూడా తక్కువే, ప్రపంచం కూడా తక్కువేనని నేననుకుంటాను”
-బమ్మెర