ఆ కవిత చదవగానే భోరున ఏడ్చింది..

ఆ కవిత చదవగానే భోరున ఏడ్చింది..

ఆరడుగుల అందం..ఆకట్టుకునే కంచు కంఠం.. ఉరకలెత్తే భావుకత్వం.. మూర్తీభవించిన నటనా చాతుర్యం.. ఇవన్నీ కలిపితే నటుడు రంగనాథ్ అవుతారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగువాళ్లను అలరిస్తున్న ఆయనలోని బహుముఖ కోణాలను ఆవిష్కరించారు ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’లో వేమూరి రాధాకృష్ణ. ఎబీఎన్‌లో ప్రసారమైన ఆ ఇంటర్వ్యూ ‘నవ్య’ పాఠకుల కోసం..

ఆర్కే : రంగనాథ్‌గారు ఎలా ఉన్నారు? నటులకు రిటైర్‌మెంట్ లేదు కదా! వ్యక్తి జీవితం ఎలా ఉంది? వృత్తి జీవితం ఎలా ఉంది?
రంగనాథ్ : అసంతృప్తి అయితే లేదు. మనం ఆశించిన జీవితం కోసం ఎదురుచూడటం కన్నా, జీవితం ఎలా వస్తే అలా స్వీకరించడమే మంచిది అన్నది నా ఉద్దేశ్యం.
ఆర్కే: వయసులో ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆశయాలు, లక్ష్యాలు పెట్టుకుంటాం కదా? మీకు ఆ వయసులోనే అలాంటి భావన ఎలా కలిగింది?
రంగనాథ్ : మా తాతగారికి మా అమ్మ ఒక్కతే కూతురు. నేను పుట్టాక.. నన్ను ఇవ్వమని తాతగారు అడగడంతో వాళ్లింట్లోనే పెరగాల్సి వచ్చింది. ఆ ఇంట్లో ఆస్తిపాస్తుల మీద ఏనాడూ చర్చలు జరిగేవి కావు. చదువు, ఆటపాటలు తప్పిస్తే మరో టాపిక్ ఏదీ ఉండేది కాదు. మా తాతగారు మందసా మహారాజు ఎస్టేట్‌లో వైద్యుడుగా ఉండేవారు. ఆయనకు సంపాదన మీద ఆలోచనే ఉంటే అదీఇదీ చేసి.. అగ్రహారాలనే రాయించుకునేవారేమో! రాజుగారి గురించి వారు ఎప్పుడు చెప్పినా.. ఆయన గొప్పదనం గురించి చెప్పలేదు. వాళ్లు ప్రజలను ఎలా ఆదుకున్నారు, ఎలా సేవ చేస్తున్నారు అనేవే చెప్పేవారు. అవే ఆలోచనలు నాలో ఉండిపోయాయి.

ఆర్కే : మీరు సినిమా నటుడుగానే అందరికీ తెలుసు. మీలో కవి ఉన్నారని చాలామందికి తెలీదు? కేఆర్ విజయ నవ్వు మీద కూడా కవిత్వం రాశారట కదా?
రంగనాథ్ : ముప్పయి ఏళ్ల కిందట రాసిన కవిత అది..
“కలకండ తొట్టిలో/మంచి గంధం మట్టివేసి
నిండు పున్నమినాటి /వెండి వెన్నెల మొక్క నాటి
పుట్టతేనెల నీరుపోసి/వెన్నముద్దల ఎరువు వేసి
నవరత్నరాసుల ఎండలో/పన్నీటి జల్లుల వానలో
ఉంచి పెంచి పోషిస్తే/దానికి పూచే పువ్వు పేరేమి?
కేఆర్ విజయ నవ్వుకాక వేరేమి?” అని రాశాను.
ఆర్కే : ఆమె నవ్వుకు మీరంతగా పడిపోయారే?

రంగనాథ్ : ప్రపంచమే పడిపోయింది కదండీ. తమిళంలో ఆవిడ నవ్వుకే ‘మోహనపున్నగై’ అనే టైటిల్ పెట్టారు. ఆ కవితను తమిళంలోకి అనువదించి దానికొక ఫ్రేము కట్టించి మొన్న రెండు సంవత్సరాల కిందట కేఆర్ విజయకు ఇచ్చొచ్చాను. ఆ కవిత ముప్పయి ఏళ్లు నా దగ్గర ఉంది.
ఆర్కే : కవిత్వం రాయాలన్న ఆలోచన మీకెలా వచ్చింది?
రంగనాథ్ : మాది సంగీత విద్వాంసుల కుటుంబం. బాల్యంలో చదువుకుంటున్న రోజుల్లో తెలుగుమాస్ట్టారు ఒక పద్యం చెప్పారు. బాగుందే అనిపించింది. ఇంటర్‌వెల్‌లో పిల్లలందరూ బయటికి వెళ్లారు. నేను వెళ్లలేదు. పెన్ను కాగితం తీసుకుని.. “అత్తగారి పెత్తనంబు నెత్తి మీద రుద్దుచుండ తత్తరిల్లి బిత్తరిల్లి చెంతనున్న కత్తినెత్తి నెత్తిమీద మొత్తజూచ కొత్తదైన కోడలమ్మి” అని రాశాను. ఇది నా వయసుకు సంబంధం లేని కవిత. మాస్టారుకు చూపిస్తే బావుంది అన్నారు. ఆ తర్వాత రాయలేదు. మళ్లీ రామ్మోహన్ అనే ఆయన రాసిన గేయాలను చదివి.. నేను కూడా కొన్ని రాశాను. రాజమండ్రిలో ఉన్నప్పుడు మరికొన్ని కథలు రాశాను.

ఆర్కే : మీలో ఇంత భావుకత ఉంది కదా? యుక్తవయసులో ఉన్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు?
రంగనాథ్ : నాకు చిన్నప్పుడు ‘నందా’ అని ఫ్రెండు ఉండేవాడు. ఇప్పటికీ అతనే ఫ్రెండు. సంవత్సరానికి ఒకసారి మా ఇంటికొచ్చి కొన్నాళ్లుండి పోతుండేవాడు. మా భార్యాభర్తలిద్దరికీ ఏవైనా కంప్లయింట్స్ ఉంటే అతని చెప్పుకునేవాళ్లం. కొన్నాళ్లకు అతను ఎయిర్‌ఫోర్స్‌కు వెళ్లిపోయాడు. ఇక ఎవరూ లేరే అని బాధ కలిగింది. ఆ సమయంలో ఎందుకో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. తిరుపతి నుంచి 156 ట్రైన్ వస్తుందని.. పట్టాల ముందు కూర్చున్నాను. అయితే ట్రైన్ రావడం లేటు అయ్యింది. చిన్నప్పటి నుంచి నేను ఆర్టిస్టు కావాలని కోరుకుంది అమ్మ. ఇప్పుడు చచ్చిపోవడం ఏమిటి? అనిపించింది. వెంటనే ఇంటికొచ్చేశాను.
ఆర్కే : సినిమా ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేకుండా నిలదొక్కుకోవడం కష్టం కదా? మీరెలా నిలబడ్డారు?
రంగనాథ్ : నేను ఆర్థికంగా సున్నా. అయితే విద్వత్తు ఉంది. మా తాతగారు రాజుగారికి వైద్యునిగా ఉన్నప్పుడు.. అదే రాజుకు తాపీధర్మారావుగారు ట్యూటర్‌గా ఉండేవారు. వాళ్లు అలా పరిచయం అయ్యారు. కన్నాంబ, పుష్పవల్లిలది మా అమ్మమ్మ ఊరైన ఏలూరు. అక్కడ మా అమ్మమ్మకు ఇద్దరు అన్నలు. వాళ్లు హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల్లో విద్వాంసులు. మా అమ్మ జానకి సింగర్. తబలాప్లేయర్. మా అమ్మమ్మ వీణలో గోల్డ్‌మెడలిస్టు. మా అమ్మ గాయని కావాలనుకునేది. అదే టైమ్‌లో ఎస్.జానకి కూడా గాయని అయ్యారు. కొన్ని కారణాల వల్ల అమ్మ కోరిక నెరవేరకపోవడంతో కొడుకునైన నేనైనా ఆర్టిస్టు కావాలనుకుంది.

ఆర్కే : ఆ తర్వాత ఏం చేశారు?
రంగనాథ్ : ఒక దశలో – సినిమా పిచ్చి పెట్టుకుని వెళుతూపోతే జీవితం ఏమైపోతుంది? అనుకున్నాను. నేను బీఏ ఇంగ్లీష్్ లిటరేచర్ చేశాను. రైల్వే సర్వీస్ కమీషన్ పరీక్ష రాసి.. టికెట్ కలెక్టర్ అయ్యాను. అప్పుడు నా వయసు ఇరవై ఏళ్లు. రాజమండ్రిలోనే ఉండిపోయాను. ఉద్యోగంలో చేరిన సంవత్సరానికే పెళ్లి అయ్యింది. వెంటనే పిల్లలు పుట్టారు. ఎంఎస్ రెడ్డి గారు ‘కోడెనాగు’ అనే సినిమా తీశారు. ఆ తర్వాత ఆయన తీయబోయే సినిమాలో నటించేందుకు వెళ్లి.. ఆయన్ని కలిసినప్పుడు “అవును మా ‘కోడెనాగు’ సినిమాకు నటులు కావాలని ప్రకటిస్తే నువ్వెందుకు రాలేదు’ అని అన్నారు. ఏమీ చెప్పలేకపోయాను. రాజమండ్రికి చెందిన ఒక మిత్రుడు “ఎంఎస్‌రెడ్డి నాకు తెలుసు. నీ ఫోటోలు ఉంటే ఇవ్వు. నేను తీసుకెళ్లి ఇస్తాను” అన్నాడు. “మూడు ఫోటోలు కావాలాయ్యా. ఫోటో అయిదు చొప్పున మూడూ కలిపితే పదిహేను రూపాయలు అవుతాయి. ఆ పదిహేను పెడితే పిల్లకు పాలడబ్బా వస్తుంది” అని చెప్పాను.

ఆర్కే : మీ తొలిసినిమా ఎలా మొదలైంది?
రంగనాథ్ : ‘బుద్ధిమంతుడు’ నా ఫస్టు పిక్చరు. బాపు తీశారు. అందులో అవకాశం ఎలా వచ్చిందంటే – మా ‘వీణాపాణి’ బ్యానర్‌లో ఒకతను పనిచేసేవాడు. అతనికి ‘సుజనరంజని’ అనే సొంత ట్రూపు ఒకటుండేది. ‘టాటా వీడుకోలు’ పాట కోసం “మద్రాసు నుంచి ఆర్కెస్ట్రా వాళ్లను ఎందుకు తీసుకురావడం. స్థానికంగా ఉండే వాళ్లను తెచ్చుకుందాం” అనుకున్నారేమో సుజనరంజనికి కబురు చేశారు. స్క్రీన్ మీద ఎలా ఉంటానో చూసుకుందామని నేను కూడా వాళ్లతో కలిసి వెళ్లాను. షూటింగ్‌లో ఆర్కెస్ట్రా మీద షూట్ చేస్తున్నారు. నేను ఫ్లూట్ పెట్టుకుని నిలబడ్డాను. ఆ సినిమాలో నన్ను క్లోజప్‌లో చూపించారు. నేను నచ్చడంతోనే బాపుగారు తీస్తున్న ‘అందాలరాముడు’లో స్థలపురాణం ఉందని రాముడు వేషానికి పిలిచారు. అదే టైమ్‌లో గిరిబాబు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలని చూస్తున్నారు. అప్పుడు నేను వెళ్లి రమణగారికి పరిస్థితి చెప్పాను. ఆ టైమ్‌లో హీరోగా మిస్ అయ్యాను. ఆ తర్వాత రెండు సినిమాలు చేజారిపోయాయి. ‘ఇద్దరూ ఇద్దరే’లో కృష్ణంరాజు నటించి పైకొచ్చారు. ‘భారతంలో అమ్మాయి’లోనేమో మురళీమోహన్ హీరోగా చేసి క్లిక్ అయ్యారు.

ఆర్కే : మీ టైమ్ బాగలేదన్నమాట..?
రంగనాథ్ : ఒకసారి విఠలాచార్య గారు.. “ఏమిటి రంగనాథ్ మీకు పర్సనాలిటీ ఉంది, వాయిస్ ఉంది, బిహేవియర్ ఉంది, టాలెంట్ ఉంది.. ఇన్ని ఉండి కూడా మీరు రావాల్సినంత ముందుకు ఎందుకు రావడం లేదు?” అనడిగారు. “నాకేం తెలుసు సార్?” అన్నాను. “మీ జాతకం ఉంటే ఒకసారి ఇవ్వండి ?” అని అడిగారాయన. ఇచ్చాను. దాన్ని చూసి “ఇందులో ఉందండీ. మీరు హీరోగా కూడా ఉండరు. 1980లో శని ఎంటర్ అవుతోంది. కొడుతుంది మిమ్మల్ని దెబ్బ. పందొమ్మిదేళ్లు ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత బుధ దశలో వచ్చినప్పుడు నిలబడతారు” అని చెప్పారు. ఆయన చెప్పడంతో అలర్ట్ అయ్యాను. ఎంత ఇమ్మీడియెట్ ఎఫెక్ట్ అంటే – నలభై అడుగులు యాభై అడుగులు కటౌట్లు పెట్టిన హీరోకు నాలుగు నెలల్లో పోస్టర్లలో ఫోటో లేకుండా పోయింది. ఆయన చెప్పినట్లే జరిగింది. అప్పుడే ఏరియా బిజినెస్ మొదలైంది. నా సినిమాలు సక్సెస్ కాలేదు.

ఆర్కే : ఫ్యామిలీని ఎలా నెట్టుకొచ్చారు?
రంగనాథ్ : నాకు నలుగురు అన్నదమ్ములు. నెలకు రెండు బస్తాల బియ్యం అయిపోయేవి. ఇటువంటి పరిస్థితుల్లో మరో మంచి అవకాశం కోసం ఎదురుచూడలేను. అప్పుడు హీరో కృష్ణంరాజు గారి వద్దకు వెళ్లాను. “బ్రదర్ ఇలా ఉంది నా పరిస్థితి. ఐ కాంట్ వెయిట్. ఇప్పుడు నేనేం చేయాలి? విలన్ చేస్తే ఎలా ఉంటుంది? ” అడిగాను. “తప్పులేదు. ఏ టైమ్‌లో ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఏమీ చెప్పలేము. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడమే మంచిది. నిజం చెప్పాలంటే హీరోలకంటే విలనే ఎక్కువ సంపాదిస్తాడు” అన్నారాయన. కృష్ణంరాజు ఒకసారి నాకు ఫోన్ చేసి “బెంగాలీ పిక్చరు ఒకటి కొన్నాను. తెలుగులో తీస్తున్నాను. ఇందులో నువ్వు విలన్ వేస్తే బావుంటుంది? నువ్వు ఒకసారి చూడు” అని సినిమాను చూపించారు. అందులోనే నేను విలన్‌గా చేశాను. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తర్వాత – నలభై యాభై సినిమాల్లో విలన్‌గా చేసే అవకాశం వచ్చింది.
ఆర్కే: మీరొక దశలో అందర్నీ ఆకర్షించారు. అప్పుడు ఎలా ఫీలయ్యారు?
రంగనాథ్ : నేను ఇప్పటికీ హీరో అనే ఫీలవుతుంటాను. నాలోని హీరోనే నాతో ఈ వేషాలు వేయిస్తున్నాడు అనుకుంటాను. మొన్న ఎవరో అన్నారు ‘మీలో ఇంకా హీరో కనిపిస్తున్నాడు’ అని. అదెక్కడికి పోతుంది. అదే నాకు బేస్. నాలో ఆ హీరో ఉన్నాడు కాబట్టే ఇంకా పోరాడుతున్నాడు.

ఆర్కే: ఇండస్ట్రీలో మీకేమైనా ఇబ్బందులొచ్చాయా?
రంగనాథ్ : ఏ ఇబ్బందీ రాలేదు. అయితే రాజమౌళితో ఒక చిన్న తమాషా జరిగింది. ఇండస్ట్రీలో ఏదైనా గొడవ జరిగిందంటే అదే మొదటిది ఆఖరుది. ‘శాంతినివాసం’ సీరియల్ తీస్తున్నప్పుడు “సార్, దండం పెట్టినప్పుడు కళ్లు మూసుకున్నారు. కాస్త తెరవండి” అన్నారు రాజమౌళి. “కళ్లు తెరిస్తే కామెడీ వస్తుంది” అన్నాను నేను. “కామెడీనే కావాలి” అని ఆయన అన్నారు. అలా చిన్న విషయమే పెద్ద ఆర్గ్యుమెంటుకు వెళ్లిపోయింది. ఆయనకు కోపమొచ్చి “విల్ గో ఫర్ ద నెక్ట్స్ షాట్” అన్నారు. నాకూ కోపం వచ్చింది. “ప్యాకప్” అని లేచి ఇంటికి వెళ్లిపోయాను. అలా జరగడం నా లైఫ్‌లో అదే ఫస్ట్ టైమ్. ఆ తర్వాత మళ్లీ నేను, రాజమౌళి కలుసుకున్నప్పుడు “మీ వల్లే శాంతినివాసానికి అంత పేరొచ్చింది. రేపటి నుంచి ఇక రాలేనేమో! సినిమా తీసేందుకు దర్శకునిగా అవకాశం వచ్చింది” అన్నారు. “మీలో విషయం ఉంది. నేను ఒక నటుడిగా సంతృప్తి పొందిన సీరియల్‌కు మీ దర్శకత్వంలో చేశానన్న కృతజ్ఞత మీ మీద ఉంది” అని నేను చెప్పాను. “నువ్వు తప్పకుండా పైకొస్తావు. నిలబెట్టుకోవాలి” అని మళ్లీ అన్నాను.

ఆర్కే : వేషాల కోసం ఎవరిని అడిగారు?
రంగనాథ్ : ‘ఖైదీగారు’లో నటించిన తర్వాత ఏదో వేడుకకు రేపల్లెకు వెళ్లాల్సి వచ్చింది. రైలు ఎక్కిన దగ్గర నుంచి రేపల్లెలో దిగేదాగా “ఖైదీగారు’ చూశాం.. మీరు ఏం యాక్టింగ్ చేశారు సార్. మీరప్పుడప్పుడు సినిమాల్లో కనబడాలి. మీరంత మంచి ఆర్టిస్టు కనిపించకపోతే ఎలా సార్” అనడం మొదలుపెట్టారు అభిమానులు. వాళ్ల కోరికలో నుంచి ఒక థియరీ వచ్చింది. నేను వ్యక్తి రంగనాథ్ అనుకున్నాను. కాని వాళ్లు ఆర్టిస్టు రంగనాథ్ అనుకుంటున్నారు. అంటే నాలో ఇద్దరం ఉన్నాం. మరి నేను నన్ను – వ్యక్తి రంగనాథ్‌గా అనుకుంటున్నాను కాబట్టి ఒకరి దగ్గరికి వెళ్లి వేషం అడగటం లేదు. ఆర్టిస్టు రంగనాథ్ వెళ్లి అడగాలి కదా? ఎందుకంటే వాళ్లంతా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ వ్యక్తి రంగనాథ్ అనేవాడు ఆర్టిస్టు రంగనాథ్‌కు సెక్రెటరీ. వాణ్ణి ప్రమోట్ చేయడం వీడి పని అనుకున్నాను. అప్పుడే వెళ్లి ముత్యాల సుబ్బయ్య, ఎస్వీ కృష్ణారెడ్డిలను వేషాలు ఇవ్వమని అడగాల్సి వచ్చింది. అడిగిన వెంటనే వాళ్లు ఇచ్చారు.

ఆర్కే : మీ వాళ్లు సెటిల్ అయ్యారా? మీ కుటుంబం ఆర్థికంగా ఎలా ఉంది?
రంగనాథ్ : అందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు. మా ఆవిడ ఉన్నంత వరకు డబ్బు మిగల్లేదు. ఆవిడ పోయిన తర్వాత మిగలబెట్టే అవకాశం వచ్చింది. నాకొచ్చే డబ్బుతో దర్జాగానే బతుకుతున్నాను.
ఆర్కే : ఇవాళ రేపు అంత వ్యక్తిగతంగా, అంత ఎమోషనల్‌గా సేవ చేయడం అరుదు కదా?
రంగనాథ్ : ఆవిడ పడిపోయి నడుం విరిగిపోయింది. కాళ్లు చచ్చుపడిపోయాయి. పద్నాలుగేళ్లు మంచం మీదనే ఉండిపోయింది. చాలామంది ఆమెకు నేను ప్రేమతో సేవ చేశాను అంటుంటారు. కానీ బాధ్యతతో చేశాను అంటాను నేను. మా ఆవిడ కూడా “నా మీద ప్రేమ లేకుండా ఇంత సేవ ఎలా చేస్తారు?” అంటుండేది. నా ఉద్దేశ్యంలో ప్రేమ కంటే బాధ్యత గొప్పది.

ఆర్కే : మీ పిల్లలు ఏం చేస్తున్నారు?
రంగనాథ్ : పెద్దమ్మాయి ఇక్కడే ఉంది. మా భార్య సోదరుని కొడుక్కు ఇచ్చాం. అల్లుడు ఫార్మా కంపెనీలో ఏరియా మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. రెండో అమ్మాయి బెంగళూరులో లెక్చరర్. భర్త ఏరోనాటిక్స్ ఉద్యోగి. మా అబ్బాయి దుబాయ్‌లో ఉన్నాడు. అందరూ స్థిరపడ్డారు.
ఆర్కే : మళ్లీ కవిత్వం దగ్గరికి వద్దాం. మీరు రాసిన వాటిలో మీకేది బాగా నచ్చింది?
రంగనాథ్ : చాలానే ఉన్నాయి. ‘అందమైన అమ్మ’ అనే కవిత ఒకటి రాశాను. అది రాజశ్రీకి బాగా నచ్చింది. ఒకతను అనువదించి పంపితే హిందీపత్రికలో వేసుకున్నారు. ఒకసారి – తిరుపతిరెడ్డి (వేట, ఖైదీ ప్రొడ్యూసర్)తో కలిసి కాళహస్తికి వెళ్లాను. ఆయన ఫ్రెండు ఒక డాక్టర్. వాళ్లింటికి నన్ను తీసుకెళ్లాడు. ఆ ఫ్రెండు భార్య నాకు అభిమాని. “మీ కవితలు అవీ చదువుతుంటానండీ. మీరు ఎదురుగా వచ్చారు. మీ నోటితో ఒకటి చదవండి” అని అడిగింది. చదివాను.

“అప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు /అమ్మానాన్న మాటలన్నీ విన్నాను
ముద్దొచ్చే నుదిటి కుంకుమ తానవ్వాలని/పట్టుకుచ్చులాంటి జెడపై పూలదండ కావాలని /ఆదరించే అమ్మ చేతుల్ని గాజులై బంధించాలని/తెగ పొగిడేవాడు నాన్న/అబ్బా.. అమ్మ అంత అందమైనదా అని/అంత అందమైన అమ్మను
నేనెప్పుడు చూడటమాని ఆరాటపడ్డాను/ఇప్పుడు నేను పుట్టాను
అమ్మను చూశాను/నిజమే! అమ్మ అందమైనదే!
కానీ, నుదిటి కుంకుమ /జడలో పూదండ /చేతులకు గాజులు
అన్నీ అబద్ధాలు/నాన్న పోయాడట/అవన్నీ తనకిష్టమని పట్టుకుపోయాడట”
అని కవిత చదివేసరికి ఆమె భోరున ఏడుస్తూ లోపలికి వెళ్లిపోయింది. మళ్లీ రాలేదు. ఆవిడకు ఎవరో గుర్తుకొచ్చారు.
ఆర్కే : ఇప్పుడు ఏమైనా రాస్తున్నారా?
రంగనాథ్ : ఇప్పుడు ఒక పుస్తకం సిద్ధంగా ఉంది. త్వరలో వస్తుంది. దాని పేరు ‘అక్షరసాక్ష్యం’. ఆధ్యాత్మిక కోణంలో రాశాను.
ఒకసారి ఎన్.గోపీ వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు.. ఆయన భార్య ఒక నాని (రెండు మూడు లైన్ల కవిత్వం) వినిపించారు. అద్భుతం అనిపించింది. అది “వివాహమా ఎంత పని చేశావ్? పుట్టింటికి నన్ను అతిథిని చేశావ్”. ఆ తర్వాత నేను కూడా కొన్ని నానీలను రాశాను.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.