బ్రౌన్ సాహిత్య గుడి పూజారి స్వర్గీయ శ్రీ జానుమద్ది హనుమచ్చాస్త్రి
ఒకప్పుడు సాహితీ మండలికి కన్వీనర్ గా ఉన్న నేను ఒక సంక్రాంతికి దాదాపు నలభై మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించి ,ఆ కవితలను ‘’నవ కవితా సంపుటి ‘’గా కృష్ణా జిల్లా రచయితల సంఘం సౌజన్యం ,ఆర్ధిక సహకారం ముద్రణ తో నా సంపాదకత్వాన పుస్తకం వెలువరించాను. అందరికి ఉచితం గా అందించాను. అప్పుడు కడప లో ఉన్న శ్రీ జాను మద్ది హనుమచ్చాస్త్రి గారికి ఒక పుస్తకం పంపాను .వారు దాన్ని అందుకొని తాను చదివానని ,బాగా ఉందని ,మంచి ప్రయత్నం అని మెచ్చి ఆ పుస్తకాన్ని తమ బ్రౌన్ లైబ్రరీ కి అందించానని ఉత్తరం రాశారు .అప్పటి దాకా వారి గురించి విని ఉండటమే కాని ఇలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరప లేదు .ఏంతో ఆనందం కలిగింది .వారి ఆశీస్సులు అమోఘం అని పించాయి .
అయి దేళ్ళ క్రితం 2009నవంబర్ 24 న నేను అధ్యక్షుడి గా సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ‘’ను ఏర్పరచిన తరువాత ప్రతి ముఖ్యమైన కార్య క్రమం ఆహ్వానాలు వారికి పంపుతూనే ఉన్నాను .సరసభారతి ప్రచురించిన పద కొండు పుస్తకాలను ఆవిష్కరణ జరిగిన వెంటనేవారికి పంపే వాడిని .వారు ప్రతి పుస్తకాన్ని అందుకొని ,చదివి బాగుందని మెచ్చు కొంటూ దానిని బ్రౌన్ లైబ్రరీకి అంద జేస్తున్నానని తెలిపే వారు .వారి సౌజన్యం మరువ లేనిది .వారిని ఉయ్యూరు తీసుకొని వచ్చి సత్క రించి ఆ పుంభావ సరస్వతి ఆంధ్ర సాహిత్యానికి చేసిన సేవకు ఋణం తీర్చుకోవాలని భావించాను .కాని అది ఒక కల గానే మిగిలి పోయింది .ఆచరణ కు నోచుకోలేదు .మనసులో బాధ గా నే ఉండేది .వారి వయసు ఇంత దూరం ప్రయాణానికి అనుమతిస్తుందా అనేదీ నాకు లోపల పీడించిన సందేహం కూడా .
నేను రాసి , సరసభారతి ప్రచురించిన పదవ పుస్తకం ‘’సిద్ధ యోగి పుంగవులు ‘’వారికి చేరగానే నాకు ఫోన్ చేసి మాట్లాడారు జాను మద్ది వారు .చాలా విషయాలను సేకరించి శ్రమ తో నేను రాసిన పుస్తకం గా దాన్ని మెచ్చారు .అంతే కాదు అందులో నేను రాసిన ‘’త్రైలింగ స్వామి ‘’గారిని గూర్చి తన వద్ద మరింత సమాచారం ఉందని దాన్ని నాకు పంపిస్తానని దాని తో బాటు వారు రాసిన ‘’52 మహా శక్తి పీఠాలు ‘’పుస్తకాన్ని పంపుతున్నానని చెప్పారు .అలా గే ఆ రెండూ నాకు చేరేట్లు పంపారు .వారికి ఫోన్ చేసి కృతజ్ఞతలను చెప్పుకొన్నాను .వారి మాట కొంచెం కడప యాస తో ఉన్నా ఏంతో విజ్ఞాన దాయక సంభాషణ చేస్తారు .ఆ మహాను భావుడి తో మాట్లాడే అరుదైన అవకాశం నాకు లభించిందని ఏంతోసంతృప్తి చెందాను .
నేను రాసిన నా ఆరవ పుస్తకం ‘’శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ‘’ను జాను మద్ది వారికీపంపినపుడు అందినట్లు తెలియ జేసి అందులో నేను రాసిన ‘’శ్రీ హనుమత్ కదా నిధి ‘’ పుస్తకం తనకు నేను పంప లేదని గుర్తు చేశారు .అందుకని వెంటనే పంపాను .ఈ కదా నిధి పుస్తకానికి స్పాన్సర్ కడప వాసి ,ప్రస్తుతం అమెరికా లో ఉంటున్న శ్రీమతి పవని మాధవి అమెరికాలో మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి కి కుటుంబ స్నేహితురాలు .మేము మూడవ సారి అమెరికా వెళ్లి నప్పుడు మాధవి కుటుంబం తో మంచి పరిచయమేర్పడింది .ఆమె తండ్రి పవని రాదా కృష్ణ గారు కడప లో ఏలెక్ట్రికల్ ఇంజినీర్ గా పని చేసి రిటైర్ అయ్యారు .ఆయన కు అంకితమిచ్చి ‘’కదా నిధి ‘’ని ప్రచురించమని మాధవి కోరింది .కాని ఆయన తన తల్లి గారికి అంకితమివ్వమని నాకు ఫోన్ చేసి చెప్పారు. దురద్రుస్టవశాత్తు అయన గుండె పోటు తో 2011జనవరి ఒకటవ తేదీ న అకస్మాత్తు గా మరణించారు ..మాధవి కోరిన దాని ప్రకారం ఆ పుస్తకాన్ని రాదా కృష్ణ గారికి వారితల్లి గారికి కలిపి అంకితం ఇచ్చాను . దీని ముద్రణ ఖర్చులన్నీ మాధవి భరించింది .
హనుమత్ కదా నిధి పుస్తకం చదివిన శ్రీ హనుమచ్చాస్త్రి గారు నాకు ఫోను చేసి రాదా కృష్ణ గారి కుటుంబం తో తనకు చాలా కాలం గా పరిచయం ఉందని మాధవి వాళ్ళు బాగా తెలుసని చెప్పారు .సంతోషం కలిగింది నాకు .మళ్ళీ ఒక సారి జాను మద్ది వారు ఫోన్ చేసి రాదా కృష్ణ గారి సోదరులు తమ తో మాట్లాడటానికి అప్పుడే తమ ఇంటికి వచ్చారని వారితో మాట్లాడమని చెప్పారు .ఆయన తో మాట్లాడి పరిచయం చేసుకొన్నాను .అలా మాధవి కుటుంబం వారితో పరిచయం కలిగించారు హనుమచ్చాస్త్రి గారు .మరో సారి వారే ఫోన్ చేసి తాను రాసిన ‘’చారిత్రిక మహా పురుషులు ‘’పుస్తకాన్ని పంపిస్తానని చెప్పి పంపారు .అందగానే ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పాను .
ఈ విధం గా ఆ సాహితీ విరాణ్మూర్తి తో పరిచయం కలిగి నందుకు ఆనందం గా ఉంది .కడప లో ఆయన్ను అందరూ ‘’జానుమద్ది గారు ‘’అని గౌరవం గా సంబోధిస్తారు .ఆయన వ్యాసాలూ ముద్రించని పత్రిక ఆంద్ర దేశం లో లేదు అంటే అతిశయోక్తి కాదు .ప్రతి విషయాన్నీ మూలాలకువెళ్లి పరిశోధించి సాదికారికం గా గా చెప్పే సామర్ధ్యం వారిది .వారి వ్యాసం ఎక్కడ చూసినా ముందు చదివే వాడిని .చాలా ఇన్ఫర్మేటివ్ గా ,ఆలోచనాత్మకం గా రాస్తారు .ఆయన రాసిన దాని కంటే అదనం గా మనకు ఇక ఏ సమాచారమూ మిగలదు .అదీ వారి ప్రత్యేకత .మొదటి విమానాన్ని భారతీయులే రైట్ సోదరుల కంటే ముందే బొంబాయి లో నడిపారని వారు రాసిన వ్యాసం ఎంతో వివరణాత్మకం గా, స్పూర్తి దాయకం గా ఉంది .తొంభై ఏళ్ళ వయసులోనూ వారి సాహితీ వ్యాసంగం కుంటూ పడక పోవటం ఆశ్చర్యమేస్తుంది .సార్ధక జీవి .అందరి తో మంచి గా ఉంటూ ,అన్ని మతాలను ఆదరిస్తూ స్నేహం చేస్తూ ,మంచి మనిషి అని పించుకొన్నారు .బ్రౌన్ లైబ్రరీని కడప లో నిర్మించి ,దాతల సహకారం తో వేలాది పుస్తకాలు సేకరించి ,గ్రంధాలయానికి ‘’అక్షర నిధి ‘’సేకరించిన అలుపెరుగని సాహితీ యోద్ధ .అందుకే వారిని ‘’బ్రౌన్ శాస్త్రి ‘’అని ఆప్యాయం గా పిలుచుకొంటారు .వారి సర్వమత సహనం వారిని ‘’జాన్ అహ్మద్ శాస్త్రి ‘’ని చేసింది .బ్రౌన్ లైబ్రరీకి ఏటా ముప్ఫై లక్షల రూపాయల గ్రాంట్ ను ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి తో శాంక్షన్ చేయించుకొన్న ఘనత వారిది .ఆ దనం తో ఇప్పటికి ఆ లైబ్రరీలో లక్ష కు పైగా పుస్తకాలు ఉన్నాయి .ఇది జానుమద్ది వారి కృషికి గొప్ప నిదర్శనం .ఈ సాహితీ శిఖరం అద్రుశ్యమైనందుకు చింతిస్తూ అక్షర నివాళులు అందిస్తున్నాను .
శ్రీ హనుమచ్చాస్త్రి గారు నాకు రాసిన లేఖ ను దీనితో జత పరుస్తూ మరొక్క మారు క్రుతజ్ఞాతాంజలి ఘటిస్తున్నాను ..
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-3-14-ఉయ్యూరు