కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చు మీచ్చ్యూ ‘’-1

కార్టూనిస్ట్ జయదేవ్  స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చు మీచ్చ్యూ ‘’-1

పది రోజుల క్రితం ఉయ్యూరు లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం నన్ను ఆకర్షించింది తీసుకొచ్చి దాదాపు నాన్ స్టాప్ గా చది వేశాను .’’గ్లాడ్ టు మీట్ యు ‘’కు కార్టూనిస్ట్ పేరే పై శీర్షిక .దాన్ని తన’’ పర్సనల్ స్టోరీస్ ‘’అని ప్రముఖ కార్టూనిస్ట్ జయ దేవ్ చెప్పుకొన్నాడు .జయదేవ్ కార్టూన్ల గురించి తెలియని వారు లేరు .కాని అతను ఒక జువాలజీ లెక్చరర్ అని  ప్రొఫెసర్ స్థాయికి ఎదిగాడని ,ఎన్నో పరిశోధనలు చేశాడని నాకు మాత్రం తెలియదు .ఈ పుస్తకం లో అన్నీ విడమర్చి చక్కగా చెప్పాడు .మాల తీ చందూర్ అన్నట్లు మద్రాస్ మౌంట్ రోడ్డు ,మైలాపూరు ,బీచి ,టి నగర్ ,కోడంబాక్కం ,తాను నివశించిన పాత చాకలి పేట అన్నిటిని ‘’ఇమ్మోర్తలైజ్ ‘’చేశాడు .తన బంధు గణాన్ని వారి సహ్రుదయతను ,చదువు చెప్పిన ప్రతి ‘’అయ్య వారిని ‘’స్నేహితులను ,శిష్యులను ,తన తో పని చేసిన కొలీగ్స్ ను ,ప్రొఫెసర్లను ,తానూ చూసిన సినిమా షూటింగులను ,కార్టూనిస్టూలతో పరిచయాలను ,విదేశీ కార్టూనిస్టులతో కలిసి పని చేయటం బాపూ ,రమణ ల తో  కలిసి యానిమేషన్ చేయటం ,వంశీ తో పరిచయం ,పులికాట్ సరస్సు అందాలు, వాటిలో జీవ వైవిధ్యం, తన రిసెర్చ్ విధానం ,ఆ నాటి చిరు తిళ్ళు, తెలుగు సినిమాలకు నేల టికెట్టు కు వెళ్ళిన తీరు ,కామన్ వెల్త్  క్రికెట్ పై పడ్డ మోజు ,విశ్వనాధ ,గొల్ల పూడి ,ధారా ,సూరిబాబు ల తో పరిచయం ,మద్రాస్ లో పుట్టినప్పటి నుంచి ఉంటున్నా ,తనకు ‘’అరవ తెలుగు ‘’అబ్బకుండా స్వచ్చమైన ‘’కృష్ణా జిల్లా తెలుగు ‘’ అలవడిన విధానం ,చెన్నై లో జరిగిన వేడుకలు ,సంబరాలు ,బీచ్ షికార్లు ,విదేశీ యానం అన్నిటిని అక్షర బద్ధం చేశాడు ఈ కార్టూన్ శిల్పి .పుస్తకం ఖరీదు రెండు వందల యాభైరూపాయలు . ,పేజీలు  400.కొని చదివే వారికి ప్రతి పైసా సార్ధక మైనట్లే .ప్రతి పేజీ అనుభూతిని  నింపేదే.ప్రతి పేజీ లో పైనా ,ప్రక్కనా ఆయన కార్టూన్లు గిలిగింతలు పెట్టి, పుస్తకం విలువ ను మరీ పెంచాయి .నాలుగేళ్ల క్రితమే అచ్చు అయిన ఈ పుస్తకం ఇప్పుడు నా కంట పడింది. చదవటం ప్రారంభించిన రోజు నుంచి అయిపోయే దాకా  చదివాను .ఈ మధ్య నన్ను అలా చదివించిన పుస్తకం లేదు .దాదాపు అరవై ఏళ్ళ కిందటి  చెన్నై సంగతులు ,ఆయన తండ్రి ఉద్యోగం తో బాటు ఆంద్ర దేశం అంతా తిరిగి చూసిన విషయాలు ‘’ఒక ఇతిహాసం ‘’అని పించింది .ముళ్ళ పూడి వారి ‘’కోతి- కొమ్మచ్చి’’ లా విజయ వంత మైన కదా కధనం ఇది .చదివిన వారందరూ తప్పకుండా ‘’గ్లాచ్చ్యు రీడ్ యు జయదేవ్ ‘’అంటారు .సందేహం లేదు .జయదేవ్ సంతకమూ మంచి ఎట్రాక్షన్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే . ఇందులో మనం అందరం తెలుసు కోవలసిన విషయాలున్నాయి .వాటిని కొంత నా  మాటలతో, కొంత జయదేవుని మాటల లోను తెలియ జేస్తాను .

Inline image 2

చిన్నతనం లో కోతి  కొమ్మచ్చి ఆట ఆడి చెయ్యి విరక్కొట్టు కున్నాడు జయదేవ్ .పుత్తూరు కట్టు తో సాఫు అయింది .తెలుగు కార్టూనిస్టూ లంతా బాపు ను అనుకరించారని ,తానూ అనుకరించానని తర్వాత తన ధోరణి లో వేశానని చెప్పాడు .జయదేవ్ గీసిన జాతీయ పర్యావరణ దినోత్సవ కార్టూన్ కు మొదటి బహుమతి వచ్చింది .ఆంద్రసచిత్ర వార  పత్రిక లో పని చేసి శంభు ప్రసాద్ గారి పాదాలు తాకి నమస్కరించి పులకించాడు .తొమ్మిదో తరగతి చదివే టప్పుడు ఇంగ్లిష్ పోయిట్రీ లో వర్డ్స్ వర్త్ రాసిన ‘’ఫిడేలిటి’’కవిత లో ప్రకృతి వర్ణన చదివి పులకించి దానికి తగినట్లు బొమ్మ గీశాడు .లోయ లో ప్రతిధ్వనులు విని పిస్తాయి అని చేసిన కవి వర్ణన కు అనుగుణం గా ఒక గుహను చిత్రించి ,దానికి ఎదురుగా కాకి బొమ్మ వేసి ,అది అరిస్తే ప్రతిధ్వనించే తీరు ను బొమ్మలో వలయాలు  అలలు గా గీసి స్కూల్ మేగజైన్ లో ప్రచురించాడు  .అందరూ అభినందించారు ఈ బాల చిత్రకారుని ప్రతిభ కు .

సెలవలకు  బెజ వాడ వచ్చినప్పుడు తమ్ముడితో కలిసి అట్ట ముక్క లతో కార్లూ ,లారీలు చేశాడు .చక్రాలుగా ఇంజెక్షన్ బాటిల్స్ ,రబ్బరు మూతలు వాడాడు .సినిమా ప్రొజెక్టర్ కూడా ఇమ్ప్రోవైజేషన్ పద్ధతిలో తయారు చేసి అందరి మెప్పును పొందాడు .స్వాతి బలరాం మద్రాస్ వచ్చినప్పుడల్లా జయదేవ్ ను కలిసే వాడట .’’కార్టూనిస్టు బాగా ఆలోచించే కార్టూన్ గీయాలి ‘’అని జయదేవ్ అభిప్రాయం .చూసిన వారినీ ఆలోచింప జేయాలి .సైన్స్ టు డే లో జయదేవ్ కార్టూన్లు పడ్డాయి .2000లో అమెరికా వెళ్ళినప్పుడు తన కార్టూన్లను అక్కడి పత్రికలకు పంపినా ఎవరూ వేసుకోలేదని ,అది అమెరికా వారి పాలసి అని చెప్పాడు నిజాయితీగా .తెలుగు కార్టూనిస్ట్ శ్రీనివాస్ అమెరికా లోని డల్లాస్ లో సెటిలయ్యాడని చెప్పాడు .అతను అమెరికా పౌరుడై ,వాల్ స్ట్రీట్ జర్నల్స్ లో కార్టూన్లు వేసి మంచి పేరు పొందాడని చెప్పాడు .జర్మన్ పత్రిక లో తను వేసిన w.t.o పడిందట .జెకోస్లోవేకియా పత్రిక లో ఫుల్ పేజీ లో జయ దేవ్ కార్టూన్లు వేశారు .బల్గేరియా లోను పేరు  పొందాడు .

బెల్జియం ‘’Knokke-Heist’’కార్టూన్ ఎక్సి బిషన్ లో పది ఏళ్ళు జయదేవ్ కార్టూన్లు ప్రదర్శింప బడ్డాయి .వాళ్ళ కేటలాగు లోనూ ఇతని పేరు చేరింది .గుర్తింపు వచ్చింది .అందు వల్ల 25వ అ అంతర్జాతీయ కార్టూన్ పోటీకి జూరీ మెంబర్ గా నియమించి గౌరవించారు .హైదరాబాద్ లో జరిగిన ‘’వరల్డ్ హ్యూమర్ కాన్ఫ రెన్స్ ‘’లో పాల్గొని బల్గేరియా నుంచి వచ్చిన  ‘’హౌస్ ఆఫ్ హ్యూమర్ అండ్ సటైర్ ‘’ప్రతినిధులను కలిసే భాగ్యం కలిగిందని గర్వం గా చెప్పుకొన్నాడు. వాళ్ళనుండి ‘’APPROpOs’’పత్రిక సంపాదించానని అందులో ప్రపంచ కార్టూనిస్టుల కార్టూన్లు ప్రచురిస్తారని జయ దేవ్ చెప్పాడు .ప్రముఖ కార్టూనిస్ట్ చంద్ర కార్టూన్ లలో కమ్యూనిస్టు భావాలు ఉంటా యన్నాడు .జయదేవ్ హైదరాబాద్ లో ‘’హార్ట్ యానిమేషన్ ఎకాడమి ‘’కి ప్రిన్సిపాల్ గా పని చేశాడు .కార్టూనిస్టు కుటుంబాలు కలిసి నప్పుడల్లా సందడే సందడి అంటాడు జయ .

గోపాల్ అనే తెలుగు లెక్చరర్ జయదేవ్ కాలేజి లో నే పని చేస్తున్నాడు .ఇద్దరూ ఫిలిం సెన్సారుబోర్డు సభ్యులుగా ఆరేళ్ళు పని చేశారు . ఆద్వాని గారు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ గా పని చేసినప్పుడు ,జయదేవ్ ఆయన్ను కలిసి పరిచయం చేసుకొన్నప్పుడు ‘’సెన్సారు బోర్డు లో ఒక కార్టూనిస్ట్ ఉండటం నాకు సంతోషం గా ఉంది ‘’అని మెచ్చుకున్నారట .నిర్మాత నాగి రెడ్డి గారితో,దర్శక నిర్మాత ఎల్ వి ప్రసాద్ గారాల తో కూచుని సినిమాలు చూసి జడ్జి చేయటం మరచి పోలేని అనుభవం అంటాడు .ప్రసాద్ గారి ‘’మేరె ఘర్ మేరె బచ్చే ‘’సినిమాకి టైటిల్సు యానిమేషన్ జయ దేవ్ చేశాడు ఇందులో స్మితా పాటిల్ రాజ బబ్బార్ నటించారు .వీరు భార్యా భర్తలు అన్న సంగతి అందరికి తెలుసు నను కొంటాను .దర్శకుడు విజయా బాపినీడు ‘’విజయ ‘’సినిమా మాస పత్రిక నడిపే వారు  .అందులో పదహారు పేజీల ‘’హాస్యాను బంధం ‘’అంతా జయదేవ్ చేతుల మీదే జరిగేది .చదివిన ప్రతి వారూ ఈ హాస్యాను బంధాన్ని జాగ్రత్తగా వేరు చేసి దాచుకొనే వారట .దీన్ని చూసిన ప్రసాద్ గారు యాని మేషన్ నేర్చుకొనే కోరిక తనకు ఉన్నదని తెలుసుకొని బొంబాయి లో రామ్మోహన్ దగ్గర నేర్చుకోమని పంపారట .బాపుడైరేక్ట్ చేసిన ‘’కలియుగ రావణా సురుడు ‘’సినిమాకి Aసర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు లో రామలక్ష్మీ ఆరుద్ర  పట్టు బడితే, జయదేవ్ నంద గోపాల్, గోపాల్ మెంబర్లు గా అక్కర్లేదని అడ్డు తగిలారు .చివరికి రామ లక్ష్మి మాటే నెగ్గి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా దెబ్బతింది అని చెప్పాడు జయ దేవ్ .ఆ సినిమాలో యవ్వనోద్రేకం కలిగించే సీన్లు లేనే లేవని రామాయణ కద ను మరో కోణం లో బాపు చిత్రించాడని ,రావు గోపాల రావు రావణుడిని గుర్తుకు తెస్తాడని ,శారద ను చెర బడతాడని ఇంతకూ మించి అభ్యంతర కర మైన సీన్లు లేవని తాము వాదించినా రామ లక్ష్మి లేడీ మెంబర్ కనుక ఆమె మాటకే విలువ నిచ్చి ఎ సర్టిఫికేట్ ఇచ్చి బాపును నట్టేట ముంచారని బాధ పడ్డాడు జయదేవ్ .

త్యాగ రాజ కాలేజికి విశ్వ నాద వచ్చాడు .అద్భుతం గా మాట్లాడాడు అక్కడి ప్రముఖులందరూ విశ్వ నాద కు శాలువాలు కప్పి సత్క రించారు .వాటిని గోపాల్ మడత పెట్టి జాగ్రత్త చేస్తుంటే విశ్వ నాద కొంటెగా ‘’జాగ్రత్త చేయండి మా ఆవిడా వడియాలు పెట్టుకోవ టానికి బాగా ఉపయోగ పడతాయి ‘’అన్నాడట .వెంటనే గోపాల్ ‘’ఇక్కడి వాళ్ళు ఏంతో ఆత్మీయం గా మీకు ఇచ్చిన ప్రత్యెక శాలువలు ఇవి .వీటి మీద వడియాలు పెట్టి డైరెక్టు గా నోట్లో వేసు కోవచ్చు ‘’అని చమత్కరిస్తే విశ్వనాధ తో బాటు అందరూ పగల బడి నవ్వారని జయ దేవ్ గుర్తు చేసుకొన్నాడు .తన ప్రసంగం లో విశ్వనాధ తెలుగు కవుల చమత్కారాన్ని వర్ణిస్తూ ‘’కవిత్వం అంటే సినిమా పాటలు రాసేంత సులభం కాదు ఆరుద్ర గారూ ‘’అని ముందు వరుస లో కూర్చున్న ఆరుద్ర ను ఉద్దేశించి అన్నాడు .ఆయన ఒక్క సారిలేచి నుంచొని ‘’అవును ‘’అన్నట్లు గా తల ఊపి కూర్చున్నాడు .మళ్ళీ విశ్వనాధ ‘’చూశారా సినిమా కవులు లేస్తారు, కూచుంటారు తప్ప వాళ్లకు మాటలు రావు ‘’అని చమత్కరిస్తే సభ నవ్వులతో మారు మోగిందని జయ దేవ్ ఉవాచ .

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -6-3-14-ఉయ్యూరు

.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.