పంచ్ డైలాగ్ రైటర్ -కోన వెంకట్

 

ఐమాక్స్ థియేటర్ పక్కనే తోపుడుబండి మీద వేరు శెనక్కాయలు కొనుక్కుందామని వెళితే – “ఏమిట్రా.. కోన వెంకట్‌లాగ అటుతిప్పి ఇటుతిప్పి మాట్లాడేస్తున్నావ్? అప్పుడే హీరో అయిపోయావా ఏంటి?”అని అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన కొడుకును మందలిస్తూ.. వాడు అడిగిన అయిదు రూపాయల బిళ్లను చేతిలో పెట్టాడు ఆ తండ్రి. ఆయన కొడుకు హీరో అవుతాడో లేదో కానీ కోన వెంకట్ మాత్రం అతని దృష్టిలో హీరో. తెర మీద కనిపించని ఒక డైలాగ్ రైటర్ హీరో రేంజికి ఎలా వెళ్లాడు? ప్రేక్షకులనే హీరోలుగా భావించి.. వాళ్లకు నచ్చినవి రాస్తున్నాడు కాబట్టే అంత పాపులర్ అయ్యాడనిపిస్తుంది. రైటర్‌గా మాంచి దూకుడు మీదున్న ఆయన ‘నవ్య’కు చెప్పిన అనుభవాలే ఈ వారం ‘డైలాగ్‌గురూ’..

రెడీ
ఒక పాత్రకు ఎన్ని సీన్లు ఉన్నాయన్నది ప్రధానం కాదు. ఆ పాత్రకు సరైన క్యారెక్టరైజేషన్ ఇచ్చామా లేదా అన్నదే ముఖ్యం. అప్పుడే ఆ పాత్రకు మంచి డైలాగులు రాసే అవకాశం లభిస్తుంది. ఆ దృష్టితోనే ఎంత చిన్న పాత్రకు అయినా క్యారెక్టరైజేషన్ ఇవ్వడానికే నేను ఇష్టపడుతుంటాను. ఇందులో బ్రహ్మానందం పేరు మాక్‌డోవెల్ మూర్తి. మాగుంట సుబ్బరామిరెడ్డికి అప్పట్లో మెక్‌డోవెల్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. ఆయన వద్ద మూర్తి అని ఒకాయన పనిచేసేవారు. అతను నాకు ఫ్రెండు కావడంతో ‘మెక్‌డోవెల్ మూరి’్త ఐడియా వచ్చింది. ‘రెడీ’లో బ్రహ్మానందానికి దగ్గరై విలన్ ఇంట్లో మకాం వేయాలనుకుంటాడు హీరో రామ్. బ్రహ్మానందం సూట్‌కేసును తనే కొట్టేసి, దాన్ని తిరిగి అతనికి అప్పగిస్తాడు. అదీ సీన్. సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్‌కు తనకన్నీ తెలుసు, తనో క్రియేటర్. ఏది ఊహించుకుంటే అది జరిగిపోతుంది. తనకంటే గొప్పవాడు ఎవడూ లేడు.. అనుకునే స్వభావం ఆయనది. హీరో డబ్బు సూట్‌కేసు తిరిగి అందజేసినా అతను తనకున్న బుద్ధి పోనిచ్చుకోలేదు. ఇంటికొచ్చిన హీరోతో “ఏమయ్యా భోంచేశావా?” అడుగుతాడు. “లేదు సార్” అంటాడు రామ్. “ఏమేయ్ ఇంట్లో వీడికి తినడానికి ఏదైనా ఉందా? లేదంటే కుక్కలకు పడేశావా?” అని భార్యను అడుగుతాడు. “లేదండీ ఉంది” అంటుందామె. “అయితే వీడికి పెట్టు” అని ఆయన చెప్పే సీను ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఈ డైలాగ్‌ను సన్నివేశం నుంచి విడదీసి చూస్తే ఏమీ అనిపించదు. ఆ సిట్యుయేషన్‌లో ఆ పాత్ర చెప్పడం వల్ల సీన్‌కు వర్కవుట్ అయ్యింది.
బాలు
మితిమీరిన హీరోయిజాన్ని ఇష్టపడని హీరో పవన్‌కళ్యాణ్. నేచురల్ హీరోయిజాన్నే ఇష్టపడతారాయన. ‘బాలు’ వచ్చేనాటికి వన్‌లైనర్ డైలాగుల హవా నడుస్తోంది. ‘మొక్కే కదాని కోస్తే పీక కోస్తా’లాంటి డైలాగులు పాపులర్ అయ్యాయి. పవన్‌కు కూడా ఇలాంటి వన్‌లైనర్స్ పెడితే బావుంటుందన్నది నా ఆలోచన. హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో షూటింగ్ జరుగుతుంటే వెళ్లాను. పవన్ కళ్యాణ్ గుండె మీద విలన్ గన్ను పెట్టే సన్నివేశ చిత్రీకరణ జరుగుతోంది. అప్పటికే సీన్ రాసేశాను. షూటింగ్ మొదలయ్యాక “ఘనీని చంపడానికి గన్నులు కాదురా.. గుండెలు కావాలి” అన్న ఐడియా వచ్చింది. వెంటనే దర్శకుడు కరుణాకర్ దగ్గరికి వెళ్లి ‘కరుణా ఇక్కడ ఈ డైలాగు వస్తే అదిరిపోతుంది” అన్నాను. ఆయన ఎగ్జయిట్ అయ్యాడు. “నువ్వు అయితే ఏం లాభం. ఆయనకు నచ్చాలి కదా!” అన్నాను. అక్కడే ఉన్న పవన్ మా ఇద్దర్నీ చూసి “కోనా ఏంటి అంటున్నావు?” అని అడిగారు. “వద్దులే గురూ నీకు చెబితే నా మీద మళ్లీ జోకులు వేస్తావు” అన్నాను. “పర్లేదు చెప్పు”అని ఆయన అడగ్గానే “ఆల్రెడీ థియేటర్‌లో ప్రేక్షకున్నైపోయి నువ్వు చెప్పిన ఈ డైలాగుసీన్‌ను చూసేశాను. అదిరిపోయింది. అయితే నువ్విప్పుడు చెబుతావో లేదోనన్న భయం” అని చెప్పాను. ఆ తర్వాతే “ఈ ఘనీని చంపడానికి..” డైలాగును చెప్పగానే “ఇక్కడ కరెక్టుగా సెట్ అవుతుంది. పెట్టేద్దాం” అని పవన్ అంగీకరించగానే ఓకే అయ్యింది.
సాంబ
హీరో, హీరోయిన్, విలన్ ఎవరైనా సరే, ఎంటర్‌టైన్ చేస్తూ మాట్లాడితే బోర్ కొట్టదు. విలనిజంతో కూడా ఎంటర్‌టైన్ చేయొచ్చు. విలన్ అనగానే హార్ష్‌గా మాట్లాడాలనేమీ లేదు. మనం ఒక్కోసారి హారర్‌ఫిల్మ్‌ను చూసి కూడా ఎంటర్‌టైన్ అవుతుంటాం. అందుకే నా సినిమాల్లో విలన్లు వినోదాన్ని పంచుతూనే హీరోతో ఫైట్ చేస్తుంటారు. ఆస్తి రాయించుకునేందుకు ఒక వ్యక్తి మెడ మీద కత్తి పెట్టిన ప్రకాష్‌రాజ్ “అ-అడిగాను, ఇ- ఇవ్వనన్నావు, ఉ- ఊరుకుంటానా” అంటాడు. అఆఇఈలను కాయిన్ చేస్తూ ఫన్నీగా రాయడంతో విలన్ అంటే భయపడే చిన్నపిల్లలకు కూడా గుర్తుండిపోయింది. దర్శకుడు వినాయక్‌కు అయితే ఈ రోజుకీ నచ్చిన డైలాగ్ ఇది.
భగీరథ
కొన్ని సినిమాలు ఆడకపోతే అందులో ఎంత మంచి డైలాగులున్నా ప్రాచుర్యం పొందవు. అలాంటిదే ఇది. ఆ టైమ్‌లో నేను కొత్త రైటర్‌ను. బహుశా ఇప్పుడు రాసుంటే బాగా పాపులర్ అయ్యుండేదేమో! రవితేజ జేబులో పైసా ఉండదు. అది తెలిసిన ఫ్రెండు “ఒరే నీ దగ్గర పైసా లేదు. ఏం చేస్తావు?” అంటాడు. అప్పుడు రవితేజ “ఒరే, మనకు జేబులు ఎడమవైపే ఎందుకు పెడతారో తెలుసా? మనం చెయ్యి పెట్టుకున్నప్పుడు జేబులు ఖాళీగా ఉన్నా అక్కడున్న గుండె మనకు ధైర్యం చెబుతుంది” అని అంటాడు. అందులో జీవితసత్యం దాగుంది. చాలామంది పైకొచ్చినోళ్లు ‘జేబులో రూపాయి లేకుండా పైకొచ్చాను’ అంటుంటారు. ఆ దశ విజేతలకే కాదు. సామాన్యులకూ ఉంటుంది. స్ట్రగులింగ్ డేస్‌లో ప్రతి వాడికీ అలాంటి అనుభవం ఉంటుంది. సినిమాకు రాస్తున్నప్పుడు జేబులు గుర్తుకొచ్చి ‘అవును జేబులు ఎడమవైపే ఎందుకు కుడతారు’ అని నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను. ఎనభైశాతం మందిది కుడిచేతివాటం కనుక ఎడమవైపు జేబు పెడితే తీసుకోవడానికి సులువుగా ఉంటుందని ఆ వైపు పెట్టుంటారు అనుకున్నాను. దాన్నే ఇంకొక అర్థంలో చెబితే? అన్న ఆలోచన నుంచే ఆ డైలాగు పుట్టింది.
బాడీగార్డ్
ఇది హిందీకి రీమేక్. ఒరిజినల్‌లో ఉన్న డైలాగులు తెలుగులో లేవు. డైలాగ్స్ రాస్తున్నప్పుడే “హిందీలో ఉన్నవి నేనేవీ వాడుకోను. అన్ని సొంతంగానే రాస్తాను. మీకు నచ్చితే వాడండి. లేకపోతే అవే పెట్టుకోండి” అని హీరో వెంకటేష్‌తో చెప్పాను. ఆయనకు నచ్చాకే నా డైలాగుల్ని వాడుకున్నారు. ఒక సీన్‌లో “ప్రేమ బస్ జర్నీ లాంటిది. ఎప్పుడైనా దిగి వేరే బస్ ఎక్కొచ్చు. కాని పెళ్లి ఫ్లయిట్ జర్నీ లాంటిది. ఒక్కసారి ఎక్కితే మధ్యలో దిగడానికి కుదరదు”అన్న డైలాగ్ వస్తుంది. ఈ మాట కొత్త జనరేషన్‌కు బాగా పట్టింది. ఇలాంటివి రాయడానికి ప్రేరణ- నేనెప్పుడూ నేటి తరానికి దగ్గరగా ఉండటం. సమాజానికి దగ్గరగా ఉండటం. బయట ఏం జరుగుతోంది? నీ చుట్టుపక్కల ఏం జరుగుతోంది? నీ ఇంట్లో ఏం జరుగుతోంది? అసలు నీ కూతురు ఏం ఆలోచిస్తోంది? అన్నవి పరిశీలిస్తుంటాను. నిజజీవితంలో యువత ఉద్వేగాలేవీ తెలియకుండా రాసుకుంటూ పోతే అన్నీ కల్పితాలైపోతాయి. రాసిన కొన్ని మాటలైనా ‘అరే, మనం విన్నది నిజమేగా’ అని ప్రేక్షకులకు అనిపించాలి. అలాంటిదే ‘ప్రేమ బస్ జర్నీలాంటిది’. మరో చోట.. హీరో మీద పగబట్టి వెంటాడుతుంటాడు విలన్ కోటశ్రీనివాసరావు. దాన్నే కౌంటర్ చేస్తూ హీరో “పగలే నీకు కనబడదు. నీకెందుకురా పగలు” అని చెప్పే డైలాగ్ కూడా బాగా హిట్టయింది.
వీడే
కోన వెంకట్ అనగానే చాలామందికి ‘ఎంటర్‌టైన్‌మెంటే’ గుర్తుకొస్తుంది. ఇలాంటి ముద్రను చెరిపేసిన డైలాగ్‌లను ఇందులో రాశాను. ఊరి అభివృద్ధి కోసం మంత్రిని కలవడానికి కొంతమందిని తీసుకుని నగరానికి బయలుదేరతాడు రవితేజ. రైలు ఎక్కించడానికి ఊరి ప్రజలంతా రైల్వేస్టేషన్‌కు వస్తారు. అక్కడొక ఊరి పెద్దాయన హీరోతో “ఒరే టికెట్టు, డబ్బులు, మంత్రిగారి అడ్రసు మంగ చేతికి ఇచ్చాను” అని జాగ్రత్తలు చెబుతాడు. అప్పుడు రైలు డోర్ దగ్గర నిల్చున్న రవితేజ “మరి నాకేం ఇచ్చావ్?”అంటాడు. “మన ఊరి భవిష్యత్తు” అంటాడాయన. అప్పుడు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే మ్యూజిక్, ఏదో సాధించుకొస్తాడన్న ఊరి ప్రజల ఆశకు.. ఆ చిన్న మాట తోడు కావడం.. ప్రేక్షకులను కదిలించింది. ఈ సీన్‌కు మాటలిచ్చినప్పుడు రవిరాజ పినిశెట్టి కూడా “చిన్న మాటే అయినా చాలా టచ్చింగ్‌గా ఉంది” అన్నారు.
బాద్‌షా
ఇదివరకే నేనన్నాను ‘ప్రజెంట్ జనరేషన్‌తో ఉండటం ఇష్టం’అని. వాళ్లను దృష్టిలో పెట్టుకునే దీన్ని రాశాను. నేటి కుర్రకారుకు బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో తెలీదు కానీ ఫేస్‌బుక్ అకౌంట్ మాత్రం గ్యారెంటీగా ఉంటోంది. దీన్ని డైలాగ్ రూపంలో వినిపించాలనుకున్నప్పుడు- జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆలోచించాల్సి వచ్చింది. ఇదివరకు ఆయన సినిమాల్లో హింసకు ప్రాధాన్యం ఉండేది. ఆ అభిప్రాయాన్ని తొలగించి, ఆయనలో ఉన్న మరిన్ని కొత్త కోణాలను చూపిస్తే బావుంటుంది అనుకున్నాను. ఫ్రెండుతో మందుకు కూర్చున్న ఎన్టీఆర్ (పక్కనే హీరోయిన్ ఉన్నా చూడనట్లు నటిస్తూ) “అసలు ఈ దేశం నాశనమై పోవడానికి కారణం ఈ ఎలెక్షన్లు, కరప్షన్లు, 2జీలు, 3జీలు కాదు బాసు. సింగిల్ జి. జి ఫర్ గర్ల్స్” అని సుదీర్ఘంగా చెప్పే డైలాగ్‌లో ఫేస్‌బుక్ ప్రస్తావన వస్తుంది. మరోచోట మాస్ ఆడియన్స్ కోసం రాసిన “బతకాలంటే బాద్‌షా వెనకుండాలి. చావాలంటే బాద్‌షా ముందుండాలి” కూడా ఎన్టీఆర్ అభిమానుల్ని ఆకట్టుకుంది.
అదుర్స్
జూనియర్ ఎన్టీఆర్‌తో నేను ‘సాంబా’, ‘అదుర్స్’, ‘బాద్‌షా’ చేశాను. మొదటి సినిమాతో మొదలైన మా స్నేహం మూడో సినిమాతో బలపడింది. అదుర్స్‌కు రాస్తున్నప్పుడు “మాస్ ఇష్టపడే ఎన్టీఆర్‌ను అలాగే ఉంచుదాం. క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ, పిల్లలు ఇష్టపడే మరో ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా చూపిద్దాం” అనుకున్నాము. దానికి తగ్గట్టు డైలాగులు రాసే బాధ్యత నామీద పడింది. ఎన్టీఆర్ అనగానే వయలెన్స్ అనే భావన నుంచి దూరం జరిగి.. ‘చారి’ పాత్రను సృష్టించాము. దాదాపు దీన్నొక కార్టూన్ క్యారెక్టర్‌లాగ తీర్చిదిద్దాము. అందుకే ఆ పాత్ర ఎంత ఆకట్టుకుందో, ఆయన చెప్పిన డైలాగులు అంతే అద్భుతంగా అనిపించాయి. “ఏమిటే బామ్మా, మా గురువుగార్ని వీళ్లందరూ కలిసి నాకేశారు” అని బ్రహ్మానందాన్ని ఉద్దేశించి.. నయనతార ఇంట్లో చెప్పే అతని డైలాగ్స్ వినోదాన్ని పంచాయి. ఇప్పటికీ ఎన్టీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినప్పుడల్లా “ఏంటి కోనా.. అదుర్స్ 2 కథ ఎప్పుడిస్తావు?”అనే అడుగుతుంటారాయన. ఆ కథను సిద్ధం చేసే ప్రయత్నంలో ఉన్నాను.
ఢీ
అప్పటి వరకు బ్రహ్మానందం జిమ్‌క్యారీలాగా ఫేసులు మార్చి, ముఖం మీదే కొట్టుకున్నట్లు కామెడీ చేసేవారు. తప్పు ఆయనది కాదు. కొత్తగా చేయించుకోలేని దర్శకులది. నాకే కొన్నిసార్లు ‘అయ్యో ఆయన చేసిన ఫెర్మార్మెన్సే మళ్లీ రిపీట్ అవుతోందే’అనిపించేది. అలాంటి టైమ్‌లో ‘ఢీ’లో చారి పాత్రకు డైలాగులు రాయాల్సి వచ్చింది. ఇందులో ఆయనది కథలో భాగంగా ఉంటూనే నవ్వించే పాత్ర. జరుగుతున్నవన్నీ తెలుస్తున్నా ఏదీ బయటికి చెప్పని భయస్తుడు కాబట్టే.. “రావుగారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి” అంటుంటాడు. ఆ మాటను ప్రతి భర్త భార్యతో, ప్రతి తల్లి తండ్రితో, ప్రతి ఫ్రెండు తోటి ఫ్రెండుతో ఎప్పుడో ఒకసారి అనుంటారు. దిస్ టాక్స్ అబౌట్ సైకాలజీ.
మంత్రి ద్రోణంరాజు సత్యనారాయణ దగ్గర రాఘవాచారి అనే ఆయన పీఏగా పనిచేసేవారు. మనిషి అయితే చాలా మంచోడు. మనం ఏ పని చెప్పినా కాదనడు. ఓపిగ్గా వింటాడు. ఆఖర్న మాత్రం.. “మనకెందుకులెండి బాబూ”అని తప్పించుకునేవారు. అతను గుర్తొచ్చే “రావుగారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి” రాశాను. రాఘవాచారిలోని చారినే.. సినిమాలో బ్రహ్మానందం పాత్రకు పెట్టాను. ఆ ‘చారి’ ఎంత ఫేమస్సు అయ్యాడో మీ అందరికీ తెలుసు.
దూకుడు
ఆ టైమ్‌లో తెలుగు టీవీ ఛానళ్లలో రియాల్టీ షోల హవా నడుస్తోంది. డ్యాన్సులు, పాటలు నచ్చితే ఎస్ఎంఎస్ రిక్వెస్ట్‌ల ద్వారా ఒపీనియన్స్‌ను పంపమనేవాళ్లు. అందుకే ‘దూకుడు’లో రియాల్టీ ప్రోగ్రామ్ అని బ్రహ్మానందాన్ని నమ్మించి, అతని ఇంటిని అద్దెకు తీసుకుని.. అవకాశం దొరికినప్పుడల్లా ఆడుకుంటుంటాడు హీరో మహేష్‌బాబు. అలా తనకు తానే బ్రహ్మాండంగా నటించేస్తున్నాననుకుని ఫీలైపోయే బ్రహ్మానందానికి ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ పెడితే ఎలా ఉంటుంది? శీనువైట్ల, గోపీమోహన్, నేను కలిసి కూర్చుని చర్చిస్తున్నప్పుడు ఆ ఆలోచన వచ్చింది. దాంతో బ్రహ్మానందానికి ‘మీకు కనక నా ఫెర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే” అనేది రాశాను. ఆ సీన్ సినిమాకే హైలైట్.
“నా పేరు పద్మశ్రీ. కంగారు పడకు. ఎవరూ ఇవ్వలేదు. నేనే పెట్టుకున్నా” అని ఒక చోట అంటాడు బ్రహ్మానందం. ఇప్పటికీ అది గుర్తుకొచ్చి నవ్వుతుంటారు ప్రేక్షకులు. ఆ పేరు పెట్టడం వెనక ఒక తమాషా జరిగింది. ‘దూకుడు’ తొలిరోజు షూటింగ్ కోసం వచ్చిన బ్రహ్మానందంతో ‘ఇందులో మీ పేరు పద్మశ్రీ..” అని చెపితే ఒప్పుకోలేదు. ‘నాకు ఆల్రెడీ పద్మశ్రీ ఉంది. మళ్లీ అదే పేరుతో ఈ పాత్రను వేస్తే బావుండదేమో? దయచేసి మార్చండి. లేకపోతే నాకు ఇబ్బందులొస్తాయి” అన్నారు. “మీకు ఆ పేరు పెట్టింది కోనవెంకట్. ఆయనతో మీరే మాట్లాడండి” అని శీనువైట్ల నాకు ఫోన్ కలిపి “బ్రహ్మానందం మాట్లాడతారట..” అంటూ ఆయన చేతికి ఫోన్ ఇచ్చారు. ఆయన చెప్పిందంతా విని “సార్, మీ క్యారెక్టర్ పేరు మార్చడానికి కుదరదు. నాకంటే బాగా నటించేవారు ఇంకెవ్వరూ లేరు అనుకుని ఫీలైపోయి నటించే పాత్ర మీది. అందుకే మీకు ఆ పేరు పెట్టాల్సొచ్చింది. దాన్ని బేస్ చేసుకునే డైలాగుల్ని రాశాను. పేరు మారిస్తే క్యారెక్టరైజేషన్ మారిపోతుంది” అన్నాను. “లేదు కోనా, నువ్వు బుర్రపెట్టి ఆలోచిస్తే పేరు మార్చగలవు. వెంటనే మార్చు” అని ఫోన్ పెట్టేశారు. నేను మాత్రం మార్చలేదు. మళ్లీ బ్రహ్మానందం ఫోన్ చేసినా.. ఎత్తలేదు. ఆఖరికి శీనువైట్ల ఎలాగో తిప్పలు పడి ఆయన్ని ఒప్పించారు.
మహేష్‌కు తేలికైన తెలంగాణ యాసలో డైలాగులు పెడితే బావుంటుంది అనిపించింది. నేను పదో తరగతి నుండి సిటీలోనే చదువుకున్నాను. తెలంగాణ ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు. వాళ్లతో తిరిగేవాణ్ణి. ఒకసారి ఎక్కడో కాలనీలో ఎవరో గొడవ పడుతుంటే ‘వీడో పెద్ద తుతుంబర్‌గాడు’ అన్న మాట విన్నాను. అది అలాగే మనసులో ఉండిపోయింది. రౌడీతో గొడవ పడుతున్నప్పుడు “నేనేమన్నా తుతుంబర్‌గాన్ననుకున్నావ్ బే” అని మహేష్ చెప్పేసరికి ఆ పదం చాలామందికి నచ్చింది. మరొక సన్నివేశంలో – తండ్రిని చంపాలనుకున్న వారందర్నీ ఏరిపారేయాలనుకుంటాడు మహేష్. తన తోటి సహచరులతో ఆ మాట చెప్పేటప్పుడు ఏదైనా బలమైన, తాజా మాటొకటి కావాలి. ఆ డైలాగ్‌కు ఎంటర్‌టైన్ చేసే గుణంతోపాటు, హీరోయిజాన్ని ప్రతిబింబించే స్వభావం ఉండాలి. అలా అనుకుని రాసిందే “ఒక్కొక్కడి బల్బులు పగిలిపోవాలి’ అని.
* * *
ఇంటర్వ్యూ ముగిస్తున్నప్పుడు “మొన్న అమెరికా వెళ్లినప్పుడు ఒక ఫీచర్‌ఫిల్మ్ చేశాను. త్వరలో యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నాం” అన్నారు కోన. ‘తోకలేనిపిట్ట’తో నిర్మాతగా అడుగుపెట్టి, రాంగోపాల్‌వర్మ సినిమాలకు రాసి, ఈ స్థాయికి వచ్చిన ఆయన ప్రస్తుతం స్క్రీన్‌ప్లే, డైలాగ్‌రైటింగ్ మీదే తన దృష్టంతా పెట్టారు.

దూకుడు
ఒక చోట మహేష్‌కు లెంతీ డైలాగ్ రాశాను. అది శీనువైట్లకు నచ్చలేదు. సినిమాలో ప్రేక్షకులు విన్నది “ఈ దూకుడే లేకపోతే పోలీస్‌మాన్‌కు పోస్టుమాన్‌కు తేడా ఉండదు సార్” అన్నది. అంతకుముందు ఏం రాశానంటే “ప్రతి దేశానికీ లీడర్లు అవసరం. లీడర్లకు ప్రజలు అవసరం. కానీ ప్రజలందరికీ పోలీసులు అవసరం. ప్రతి పోలీసోడికీ దూకుడు అవసరం. ఈ దూకుడే లేకపోతే పోలీసోడికీ పోస్టుమాన్‌కు తేడా ఉండదు సార్” అని. అయితే ఎందుకో శీను ఇంతపొడవున్న డైలాగ్ వద్దన్నారు. “లేదు లేదు. మహేష్‌బాబు ఊపిరి బిగబట్టి దీన్ని చెబితే అదిరిపోతుంది” అని పట్టుబట్టాను నేను. ఆఖరికి ఒప్పించలేకపోయినా.. ఆ చివరి లైన్‌కు మాత్రం మంచి స్పందనే వచ్చింది.

బలుపు
సిచ్యుయేషన్, క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడే మంచి డైలాగ్ పుడుతుంది. అలాంటి డైలాగ్‌ను చెప్పాల్సిన చోట, చెప్పాల్సిన పాత్ర, చెప్పాల్సిన విధంగా చెబితే అప్పుడు పాపులర్ అవుతుంది. ‘బలుపు’నే తీసుకుంటే – హీరో రవితేజ న్యాచురల్ ఆర్టిస్టు. అతను డైలాగులు చెబుతున్నట్లు ఉండదు. ఎవరో మన పక్కన నిల్చున్న మనిషి మనతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ఒక చోట రౌడీలతో “ముందు డైలాగ్‌ను కొట్టనా, లేక నిన్ను కొట్టనా? రెండింటిలోనూ పంచ్ ఉంటుందిరో” అంటాడు. అలాంటి డైలాగుల్ని ఒక్క రవితేజకు మాత్రమే రాయగలం. ఎంత న్యాచురల్ హీరో అయినా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే కొన్ని మాటలు కూడా అవసరం. అలాంటిదే “నా వాయిస్‌కు బేస్ ఎక్కువ. నా చేతికి దురదెక్కువ. టోటల్‌గా ఈ బాడీకి బలుపెక్కువ”.

“గంటసేపు జనం మధ్య కూర్చుంటే చాలు. అక్కడ కనిపించినన్ని చిత్రవిచిత్రమైన క్యారెక్టర్లు ఏ సినిమాలోనూ కనిపించవు. నన్నెప్పుడూ స్టిమ్యులేట్ చేసేవి రద్దీకూడళ్లు. ముంబయిలోని ఇన్ఆర్బిట్‌మాల్, బ్యాంకాక్‌లోని పటాయ బీచ్, వైజాగ్ బీచ్ రోడ్‌లో ఉన్న నోవాటెల్ హోటల్, మాదాపూర్‌లోని కాఫీడే నా డెస్టినేషన్స్. ఎన్నోసార్లు అక్కడ కూర్చుని రాసుకుంటుంటాను”

“నేను లేకుండా బ్రహ్మానందం వందల సినిమాలు చేసుండొచ్చు. కాని ఆయన లేకుండా నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. నేను రాసే డైలాగులన్నీ ఎంత పాపులర్ అవుతాయో.. ఆయనకు నేను పెట్టిన పేర్లు కూడా అంతే గుర్తింపు పొందాయి. ఎందుకంటే ఆ పాత్రలన్నీ మన మధ్య ఉండేవి కాబట్టి. ‘రెడీ’లో మెక్‌డోవెల్ మూర్తి, ‘బాద్‌షా’లో పద్మనాభసిన్హా, ‘అదుర్స్’లో భట్టు, ‘దూకుడు’లో పద్మశ్రీ, ‘ఢీ’లో చారి, ‘వెంకీ’లో గజాలా గజదొంగ. ఏ సినిమాకు డైలాగులు రాస్తున్నా నేను బ్రహ్మానందానికి ఏం పేరు పెడతానని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు డైరెక్టర్ శీనువైట్ల, ఫిల్మ్ రైటర్ గోపీమెహన్”

షేడ్స్ ఆఫ్ కోనా
“నేను మితిమీరిన ద్వందార్థాలు, వెగటు హాస్యం రాయను. నాకు ఇద్దరు కూతుళ్లు. వాళ్లతో కలిసి సినిమా చూసినప్పుడు వాళ్లు ఎబ్బెట్టుగా ఫీలవ్వకూడదు కదా! అందుకనే మాగ్జిమమ్ వాటిని అవాయిడ్ చేస్తాను. నాకు క్లీన్ హ్యూమర్ అంటేనే ఇష్టం. మాస్ పేరును అడ్డం పెట్టుకుని గీతలు దాటే ప్రయత్నం చేయను..”
“ఒక స్టేచర్ ఉన్న ఆర్టిస్టులు సీన్‌లో ఉన్నప్పుడు వాళ్లకు కూడా ఏదో ఒక డైలాగు ఉండాలి. అప్పుడే వాళ్లకు సంతృప్తి. లేకపోతే ‘ఏంటి సార్, పొద్దున్నించి సీన్‌లో నిల్చోబెట్టారు. మీరు నాకు ఒక్క డైలాగు కూడా రాయలేదు” అంటూ నాకు కొందరు నటులు ఫోన్లు చేస్తుంటారు. కాబట్టి ఏ సీన్‌లో అయినా, ఎంత చిన్న ఆర్టిస్టుకు అయినా సరే.. ఒక్క డైలాగైనా రాస్తుంటాను..”
“కామెడీ డైలాగులు రాయడానికి క్యారెక్టరైజేషన్ మూలం. అదొక ట్రాన్స్‌ఫార్మర్‌లాంటిది. ఎన్ని బల్బులైనా వేసుకోవచ్చు”
“ఏది రాసినా పైన్నుంచి ఊడిపడదు. సినిమాల్లో వచ్చేవన్నీ ఇదివరకు ఎక్కడో ఎవరో ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకున్నవే! అవి తెరమీద కనిపించేసరికి ప్రాచుర్యం పొందుతాయి. అంతే!”
– మల్లెంపూటి ఆదినారాయణ

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.