గందరగోళంలో నాటక నందులు-జి.ఎల్.యెన్ మూర్తి

 

రాష్ట్రంలో నాటకాలకు నంది బహుమతులను ప్రదానం చేసే ప్రక్రియ క్రమంగా చతికిలబడుతోంది. నాటకాలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వ సంస్థలు రాజకీయాలలో మునిగి తేలుతున్నాయి.

తెలుగునాట నంది అడుగులు తడబడుతున్నాయి. మన సాంస్కృతిక రంగంలో ప్రతిభకు పట్టంకట్టే పద్ధతులకు విధాన కల్పన చేసిన ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు కలసి ఎంచుకున్న నంది పురస్కారాలు ఈ ఏడాదితో గందరగోళంలో పడ్డాయి. 2014 ఏడాది మొదటి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాష సాంస్కృతిక శాఖతో కొత్త ఇబ్బందులు ఇబ్బడిముబ్బడి అయ్యాయి. మన రాష్ట్రంలో అత్యున్నత పురస్కారాలుగా ప్రతిష్టాత్మక స్థానంలో పరిగణనలో ఉన్నవన్నీ తెలంగాణ రాప్ట్ర ఆవిర్భావంతో తాత్కాలికంగా ఉనికి కూడా కోల్పోయే దశలోకి వచ్చేశాయి. వందల ఏళ్ల నాటి కళాప్రతిభ, శిల్ప చాతుర్యానికి ప్రతీకగా అందరి మన్ననలు అందుకునే అనంతపురం జిల్లా లేపాక్షి నందిని యథాతథంగా కొనసాగించే సంప్రదాయంపై సందేహాలు ముసురుకున్నాయి. 1964 నుంచి తెలుగుగడ్డతో పాటు దూరతీరాల తెలుగు బిడ్డలకు ప్రభుత్వపరంగా ప్రశంసలతో సత్కరించే ఆనవాయితీకి 29వ రాష్ట్రం ఏర్పాటు అడ్డంకి అయింది.
క్రమంగా ఎదుగుదల
1980లో రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం ఏర్పాటు చేసి, 2 లక్షల నగదుతో ఏటేటా ప్రదానం చేయటం ఆరంభించారు. 1990లో అప్పటికి వినోదమయంగా స్థిరపడిన బుల్లితెర పరిశ్రమకు నందులు ప్రదానం చేయటం మొదలుపెట్టారు. ఆ అవార్డుల ప్రదానోత్సవాలు హైదరాబాదులో జరిగే సంప్రదాయాన్ని మార్చి 2004లో కరీంనగర్, ఆ తరువాత రెండేళ్లు వరుసగా విశాఖపట్నంలో, ఆ తరువాత తిరుపతి, మళ్లా హైదరాబాదు, 2009, 2010లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించారు. ఆ క్రమంలోనే సమాచార పౌర సంబంధాల శాఖ వారి సౌజన్యం, సచివాలయం పూనిక, సూచనలతో ప్రతిభ రాజీవ్ పురస్కారాలు ఆరంభం అయ్యాయి. ఆ అవార్డు పొందినవారికి ముఖ్యమంత్రి ప్రశంసా పత్రంతో పాటు 50,000 నగదుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆ తరువాత ప్రముఖ చిత్ర నిర్మాత బి.ఎన్. రెడ్డి పేరిట 2 లక్షల మొత్తంతో మరో పురస్కారం నెలకొల్పారు. ఆ తరువాత నాగిరెడ్డి చక్రపాణిలను సంస్మరిస్తూ జాతీయ స్థాయి అవార్డు ప్రదానం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పారు. వీటికి మించి జాతీయ స్థాయిలో 5 లక్షల రూపాయల మొత్తంతో మాజీ ముఖ్యమంత్రి, చిత్రసీమ అగ్రనటుడు ఎన్టీరామారావు పురస్కారానికి కూడా ఎఫ్‌డిసి నెలవు అయింది. 1995 నుంచి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం నిర్వహణకు శాశ్వత వేదికను సమస్త వనరులతో ఏర్పాటు చేశారు. ఉత్తమ చిత్రాలు, కళాత్మక చిత్రాలు, బాలలకు ప్రత్యేకమైన సినిమాలు వంటివి అన్నీ నంది బహుమతులతో ముడిపడినవి మహా వైభవంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలుగా నిర్వహించటం పరిపాటి అయింది. నాటి తెలుగుదేశం ప్రభుత్వం చలన చిత్ర టెలివిజన్ రంగ అబివృద్ధి సంస్థకు చైర్మన్ మాగంటి మురళీమోహన్, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు, నాటి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.వి. రమణ నాటకాలకు నంది బహుమతులు తప్పనిసరిగా ఉండాలని పట్టుబట్టి ప్రభుత్వ వనరులు కేటాయింపులు సాధించి కొత్త సంప్రదాయానికి తెర తీశారు.
1998 నుంచి నంది నాటక పోటీలు తెలుగు రంగస్థల కళల కలలకు కొత్త రూపుతెచ్చాయి. తెలుగునేల చెరగుల్లో ఆధునిక రంగస్థల వేదికలకు, సమీకరణలకు నందినాటక పోటీలు నెలవుగా రూపొందాయి. ఎన్టీ రామారావు అభినయం, కళా వైదుష్యం చిరకాలం అందరికీ గుర్తుండేలా నాటక నంది పోటీ ఉత్సవాలను నిర్వహించారు. ఆయన జన్మదినం రోజున నంది బహుమతుల ప్రదానం, అందులో భాగంగా ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం పేరిట ఒక రంగస్థల ఉద్దండ కళాకారుడిని సత్కరించటం సంప్రదాయంగా పాటిస్తున్నారు. ఆ అవార్డును ప్రదానం చేయటంలోని ఆనవాయితీలో మార్పులు వచ్చినా నగదు మొత్తాన్ని మాత్రం నాటక రంగంలో మకుటాయమానంగా ఉండే స్థాయిని మాత్రం పాటిస్తున్నారు. అయితే, నందమూరి తారక రామారావుకు జేజేలు చెప్తూ జరిగే నాటక నందిలో ఆయన స్మృతులు ఏవీ లేకుండానే ఉత్సవాలు జరిగిపోతుండడం విషాదకరం.
ఎన్టీఆర్ పేరుతో అవార్డులు
ఆయన జయంతి కలసి వచ్చేలా చేసే పద్ధతి 1998లో మొదలై 2004తో మారిపోయింది. ప్రభుత్వాల మార్పుతో నాటక నంది ప్రతి ఏడాది సంక్రాంతి రోజు తరువాత మొదలు అయ్యేలా చేశారు. ఆరేళ్ళపాటు వరుసగా హైదరాబాదు రవీంద్రభారతిలో స్టేట్ ఫెస్టివల్ హోదాలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని అభినందించే పద్ధతి మొత్తంగా మారిపోయింది. కేవలం రాజధాని నగరంలో మాత్రమే నిర్వహించటం కన్నా జిల్లాల్లో ప్రభుత్వ అధీనంలోని ఆడిటోరియంలలో నాటక నంది నిర్వహించాలని నిశ్చయించారు. హైదరాబాదు నుంచి ఆ నంది మొదటగా విజయవాడకు తరలింది. ఆ మరుసటి ఏడాది తిరుపతి, ఆ తరువాత నిజామాబాద్, రాజమండ్రి, నెల్లూరు, ఖమ్మం, నంద్యాల, గుంటూరు, విజయనగరంలలో అన్ని ప్రభుత్వ లాంఛనాలతో, చిన్నపాటి ఒడిదుడుకులతో జరిగాయి. అన్ని చోట్లా ఉన్నతస్థాయి అధికారులు నేతలు ఆయా వేదికలపై పాలుపంచుకుని తెలుగు నాటక రంగ వికాసంపై మక్కువతో పాటు స్థానికంగా తమ ప్రాంతంలోని వేదికలను అనువుగా అందిస్తామని ప్రకటించారు. కాగా, రవీంద్రభారతి దాటిన నంది నిర్వహణకు అసలు సిసలు కేటాయింపులకన్నా ఆయా ప్రాంతాలలో అదనపు వ్యయం సగటున 60 లక్షలుగా లెక్కలు చెపుతున్నాయి. గత 13 ఏళ్లుగా జరిగిన నాటక నంది వల్ల రమారమి 550 నాటకాలు పోటీ వేదికల పైకి వచ్చాయి. ప్రపంచంలో మరెక్కడా లేనంతగా నాటకం కోసం ప్రభుత్వ పురస్కారాలు ఏర్పాటు చేసి కళాకారులకు ఆతిథ్యంతోపాటు సకల వసతులు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వన్నెకెక్కింది. ఆ వరుసలోనే ఈ ఏడాది నాటక నంది పోటీలకు చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ ప్రయత్నాలు, అనవసరపు జాప్యంతో పోటీ వేదికల పైకి రాబోతున్నాయి. సరికొత్తగా ఏర్పాటయిన భాష సాంస్కృతిక సంస్థ వారి జోక్యం, అనుమతులు అవసరమై ఆలస్యం, రాద్ధాంతం పెరిగింది.
ఉత్త పుణ్యానికి కొత్త ప్రయాస
1998లో కె.వి. రమణ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో సారథ్యం వహించిన నాటక నంది పోటీలలో వచ్చిపడ్డ మార్పులు, తెచ్చిపెట్టుకున్న చికాకులు అనంతర కాలంలో అధికారులకు ఇబ్బంది అనిపించాయి. వేరే రంగాల నందులు ప్రదానం చేయటంలో నాణ్యత, ప్రమాణాలకన్నా పైరవీలు, పలుకుబడితో పాటు ఆ సంస్థలోని కొందరు అధికారులతో లాలూచీతో నాటక వికాసం దారిమళ్లింది. బల్ల కింద చేతుల బరువుతో నంది తేలిక పడింది. ఉత్తమ ప్రతిభకు ముఖ్యమంత్రి మెచ్చి ప్రదానం చేసే బంగారు, రజత, కాంస్య నందుల నాణ్యత కూడా తగ్గింది. తొలినాళ్లలోని నంది మూసపూతలోని పాళ్లు మారిపోయాయి. తయారీదారులు మారారు. ఇందులోనూ అవినీతి పెరిగింది. ఆలస్యంగా అసలు నిజాలు తెలుసుకున్న అధికారులు ఈ కళారంగంలోని రొష్టుతో వేగలేమని, నిత్యం ఆ వ్యవహారాల్లో ఉండే సాంస్కృతిక శాఖకు నాటకాన్ని బదిలీ చేయమని వేడుకునే దాకా సాగింది.
ప్రభుత్వ ఆమోదంతో అదనంగా పది లక్షల మేరకు ని«ధులు జమ కూడాయి. 2013 నాటక నంది పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ డిసెంబరు 31, జనవరి 1న పత్రికా ప్రకటనలు జారీ అయ్యాయి. అప్పటిదాకా జరిగిన ప్రయత్నాలలో భాగంగా వరంగల్‌లోని తెలంగాణ డ్రమెటిక్ అసోసియేషన్ వారు కాకతీయ యూనివర్సిటీలో సరికొత్త ఆడిటోరియం అందుబాటులో ఉందనీ, పోటీలు అక్కడ నిర్వహిస్తే ఆదర్శంగా సహకరిస్తామనీ ప్రతిపాదించారు. నేరెళ్ళ వేణుమాధవ్, పందిళ్ల శేఖర్‌బాబుల నాయకత్వంలో ఆ ఏర్పాట్లకు సూత్రప్రాయంగా ఆమోదం అబించింది.
జిల్లా కలెక్టర్ అన్ని హంగులు సమకూర్చి వైభవంగా చేద్దామని హమీతో నాటక నందికి ఆహ్వానం పలికారు. సరిగ్గా ఆ సమయంలోనే జనవరి 1 నుంచి భాష సాంస్కృతిక శాఖ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అందులో తెలుగు నాటకం వ్యవహారాలన్నీ ఆ శాఖకు బదిలీ చేశారు. నాటక నంది నిర్వహణ భాధ్యతలు ఇక మీదట ఎవరు నిర్వహించాలన్న ధర్మ సంకటంతో వరంగల్ నంది పోటీల ప్రయత్నాలకు గ్రహణం పట్టింది. అధికారుల ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తరువాత 2013 ఏడాదికి సంబంధించి నంది నిర్వహించటం చలన చిత్ర, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థకి సమంజనమని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఏప్రిల్ 16న నిర్వహించే తెలుగు రంగస్థల దినోత్సవం, నాటక సమాజాల వారికి ఆర్థికపరమైన తోడ్పాటు అందించే వనరులు ఆ సంస్థలోనే ఉన్నాయి. రాష్ట్రాల విభజనతో అన్ని ప్రభుత్వ శాఖలలో జరుగుతున్న మార్పిడిలో నంది ఎటు పయనిస్తుందో అన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది పోటీలకు 36 పద్య నాటకాలు, 24 సాంఘిక నాటకాలు, 92 నాటికలు, 39 బాలల నాటికలు, 5 నాటక రంగ పుస్తకాల దరఖాస్తులు వచ్చాయి. పారితోషికాలు ఇరవై అయిదు శాతం ఎన్టీఆర్ రంగస్థల పురస్కారంతో సహా పెరిగాయి.
జూ జి.ఎల్.ఎన్. మూర్తి

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.