
గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కొన్ని మూర్ఖపు పనులు, అనేక అవినీతి కార్యాలు చేసింది. గాంధీ శాంతి పురస్కారానికి చండీ ప్రసాద్ భట్‌ను ఎంపిక చేయడంలో మన్మోహన్ ప్రభుత్వం నిస్సందేహంగా సరైన పనిచేసింది.
పర్యావరణ ఉద్యమ పథ నిర్దేశకుడు చండీ ప్రసాద్ భట్‌కు ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1994లో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు జాతిపిత గౌరవార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటుచేశారు. ఇది వార్షిక పురస్కారమే అయినప్పటికీ యూపీఏ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు కేవలం ఇద్దరికి మాత్రమే ప్రదానం చేసింది. 2005లో దక్షిణాఫ్రికా క్రైస్తవ మతాచార్యుడు డెస్మాండ్ టూటూకి ప్రదానం చేశారు. ఈ ఏడాది చండీ ప్రసాద్ భట్‌ను ఆ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ బహుమానం కింద గ్రహీతకు కోటిరూపాయల నగదు బహూకరిస్తారు.
ఈ పురస్కారాన్ని మొట్టమొదట ఆఫ్రికా స్వాతంత్రోద్యమ నాయకుడు జూలియస్ నైరేరికి ప్రదానం చేశారు. అనంతర గ్రహీతలలో శ్రీలంక సామాజిక సేవకుడు ఎ.టి.అరియరత్నే, ‘నల్ల సూరీడు’ నెల్సన్ మండేలా, కోరెట్టా స్కాట్ కింగ్ (అమెరికా పౌర హక్కుల నాయకుడు కీర్తిశేషుడు డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ సతీమణి), ఐరిష్ శాంతి ఉద్యమకారుడు జాన్ హ్యూమ్ మొదలైన వారు ఉన్నారు. నిరుపేదల ఆర్థిక స్వావలంబనకు విశేషంగా దోహదం చేస్తున్న గ్రామీణ్ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్‌కు కూడా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేశారు. అధికారంలో ఉన్న గత పదేళ్ళలో కేవలం ఇద్దరికి మాత్రమే గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేసిన యూపీఏ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక అవార్డు, రాజీవ్ గాంధీ ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ పురస్కారాన్ని 2004 నుంచి ఏటా ప్రదానం చేస్తూనే ఉంది!
సరే, గాంధీ శాంతి పురస్కారానికి చండీ ప్రసాద్ భట్‌ను ఎంపిక చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని మరి చెప్పనక్కర లేదు. 1934లో గఢ్వాల్లో ఒక రైతు కుటుంబంలో భట్ జన్మించారు. సమాజ సేవకు అంకితమైన జీవితమాయనది. రిషికేష్-బదరీనాథ్ సెక్టార్లో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆయనొకసారి జయప్రకాష్ నారాయణ్ ప్రసంగాన్ని విన్నారు. ఆ వెంటనే ఆయన ఉద్యోగానికి స్వస్తిచెప్పి సమాజ సేవకు అంకితమయ్యారు.
1964లో ‘దశౌలి గ్రామ్ స్వరాజ్య సంఘ్’ను భట్ ఏర్పాటు చేశారు. కుటీర పరిశ్రమల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టించడానికి అంకితమయిన సంస్థ అది. తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించే, వ్యవసాయ పనిముట్లను తయారుచేసే సహకార సం ఘాలను ‘స్వరాజ్య సంఘ్’ నిర్వహించింది. ఆ కృషి క్రమంలో ‘స్వరాజ్య సంఘ్’కు అటవీ శాఖతో ఘర్షణ పడవల్సిన అగత్యమేర్పడింది. గ్రామీణ చేతివృత్తి కళాకారులకు అవసరమైన కలప మొదలైన ముడి సరుకులను విక్రయించడానికి అటవీశాఖ నిరాకరించింది. అయితే కలప మొదలైన వాటిని కాగితపు తయారీ, ప్లైవుడ్ పరిశ్రమలకు విక్రయించేది. 1970లో అలకనందలో పెను వరద వచ్చింది. కొండ వాలుల్లోని మట్టి కొట్టుకుపోయింది. కొండలపై వాణిజ్య ప్రాతిపదికన అడవులను పెంచడం సామాజిక దురన్యాయమేకాక పర్యావరణానికి దానివల్ల తీవ్ర హాని కలుగుతుందని భట్‌కు స్పష్టమయింది.
1973 ఏప్రిల్‌లో మండల్ అనే గ్రామంలో భట్ నాయకత్వంలో కొంతమంది గ్రామీణులు చెట్లను నరికివేయడాన్ని నిరోధించారు. అలా ‘చిప్కో ఆందోళన్’కు అంకురార్పణ జరిగింది. మైదాన ప్రాంతాల్లోని కర్మాగారాలకు కలపను వేలం వేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణకు ఆవిర్భవించిన రైతు ఉద్యమమది. మండల్ గ్రామంలో రైతుల విజయం ఆధునిక భారతీయ పర్యావరణోద్యమ సంస్థాపక సంఘటనగా చరిత్రలో నిలిచింది. దరిమిలా అనేకప్రదేశాల్లో చెట్ల నరికివేతను విజయవంతంగా నిలిపివేసిన అనంతరం పర్యావరణ పునరుద్ధరణకు ‘స్వరాజ్య సంఘ్’ పూనుకుంది. భట్ నాయకత్వంలో చెట్ల పెంపకం శిబిరాలను నిర్వహించడాన్ని ప్రారంభించింది. పచ్చదనం హరించుకుపోయిన కొండలపై దేశవాళీ మొక్కలను పెంచడంపై గ్రామీణులకు ప్రేరణ కల్గించడంలో ఈ శిబిరాలు సఫలమయ్యాయి.
గత నాలుగు దశాబ్దాలకు పైగా ఉత్తరాఖండ్ గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ఎటువంటి ప్రచార పటాటోపాలకు పోకుండా, నిరంతరమూ కృషి చేస్తూ వస్తున్నారు. ఉపాధి కల్పన, మహిళా సాధికారత, దళితుల విముక్తి, సరే, పర్యావరణ సుస్థిరతలకు ఆయన కృషి ఇతోధిక దోహదం చేసింది. తన కృషి ద్వారా ఆయన పలు తరాల కార్యకర్తలు, రచయితలకు స్ఫూర్తి నిచ్చారు. జర్నలిస్టులు అనీల్ అగర్వాల్, సునీతా నారాయణ్, మేధావి-కార్యకర్తలు అనుపమ్ మిశ్రా, శేఖర్ పథక్, సామాజిక సేవకుడు సచ్చిదానంద్ భారతి మొదలైన వారందరూ చండీ ప్రసాద్ భట్ కృషి నుంచి స్ఫూర్తి పొందిన వారే. వీరంతా ఉత్తరాఖండ్‌లోనూ, భారతదేశమంతటా పర్యావరణ పరిరక్షణకు అనుపమానమైన సేవలు అందించినవారే.
నేను 1981లో భట్‌ను మొట్టమొదటసారి ఆయన స్వగ్రామమైన గోపేశ్వర్‌లో కలిశాను. అనేక సంవత్సరాలుగా ఆయనతో నా సమావేశాలు నాకు ఇంకాబాగా జ్ఞాపకమున్నాయి. ‘స్వరాజ్యసంఘ్’ కార్యాలయంలో చిప్కో ఆందోళన్ చరిత్రగురించి నాకు వివరంగా చెప్పడం, ఇప్పుడు విశేష ప్రాచుర్యంగల ‘పహార్’ పత్రిక తొలి సంచికను పితోర్‌గఢ్‌లో ఆవిష్కరించడం, ముస్సోరిలో ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులను ఉద్దేశించి ప్రసంగించడం, ఢిల్లీలో తన మనవడితో ఆడుకోవడం ఇత్యాది సందర్భాలలో నేను ఆయన్ని చాలా సన్నిహితంగా గమనించాను. సదా అత్యంత హుందాగా వ్యవహరించే వ్యక్తి భట్. ఈ ధీమంతుడు చాలా నిరాడంబరుడు. ప్రజా శ్రేయస్సు పట్ల ఆయన నిబద్ధత ప్రగాఢమైనది.
గాంధీ శాంతి పురస్కారానికి చండీ ప్రసాద్ భట్‌ను ఎంపిక చేశారని దిన పత్రికలలో చదివినప్పుడు ఆయనకు వెంటనే అభినందనలు తెలుపడానికి ఆయనకు ఫోన్ చేశాను. ఎన్నిసార్లు చేసినా భట్ అందుబాటులో లేరు. కొండప్రాంతాల్లో ఏదో ప్రయాణంలో ఉండి ఉంటారని భావించాను. అవును, ఆయన ప్రయాణంలోనే ఉన్నారు. ఎట్టకేలకు గఢ్వాల్ జిల్లాలోని దాక్‌పథర్ అనే పట్టణం నుంచి ఆయన నాతో మాట్లాడారు. పది సంవత్సరాల క్రితం వరకు ఆయన బస్సుల్లోనే ప్రయాణించేవారు. ఇప్పుడు అష్టపదుల వయస్సులో ఉన్నందున కారులో ప్రయాణాలు చేయడానికి ఆయన అంగీకరిస్తున్నారు. కారులోనే అయినప్పటికీ గోపేశ్వర్ నుంచి డాక్‌పథర్‌కు ప్రయాణం చాలా కష్టతరమైనది. కొండలు దిగి రిషికేష్‌కు రావడానికి ఆరుగంటలు పడుతుంది. ఆ తరువాత యమనా నదీ తీరాన పశ్చిమ దిశగా నాలుగు గంటలు ప్రయాణించాలి. ఆ రోడ్లపై పదిగంటలపాటు ప్రయాణించడమంటే, ఉత్తర భారతావని ప్రమాణాల ప్రకారం చూసినా చాలా భీతి గొల్పే విషయమే.
దాక్‌పథర్‌లోని ఒక కళాశాల ఆహ్వానంపై ఆయన ఆ పట్టణానికి వెళ్ళారు. ఆయన ఎప్పుడు ఏమి చేస్తుంటారో అది- బోధన, సేవ-చేస్తున్నప్పుడే, గాంధీ శాంతి పురస్కారం తనకు ప్రదానం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్త ఆయనకు చేరింది. గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కొన్ని మూర్ఖపు పనులు, అనేక అవినీతి కార్యాలు చేసింది. అయితే గాంధీ శాంతి పురస్కారానికి భట్‌ను ఎంపిక చేయడంలో యూపీఏ ప్రభుత్వం నిస్సందేహంగా సరైన పనిచేసింది.
– రామచంద్ర గుహ