
బడుగులకు అందునా మహిళలకు ప్రాధా న్యం ఇవ్వని భారత పాలకవర్గాలు మార్చి 10 సావిత్రిబాయి వర్ధంతిని ఉపాధ్యాయ దినంగా పాటించడం విస్మరించారు. అందుకే ఆమె స్మృతిలో మార్చి 10, 2014 నాడు హైదరాబాద్‌లో స్త్రీ విముక్తి ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం’ పాటిస్తూ సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రెండు తేదీలు ప్రక్కపక్కనే రావడం యాదృచ్ఛికమేమోగానీ సావిత్రిబాయి స్మృతిలో శ్రామిక మహిళల సమస్యలు, పోరాటాలు, స్త్రీ విముక్తి అంశాలను చర్చించడం సందర్భోచితమని భావిస్తున్నాం. దీనర్థం మార్చి 8 ప్రాధాన్యం తగ్గించడమో, విస్మరించడమో ఎంతమాత్రం కాదు. శూద్ర-అతిశూద్ర మహిళల విద్యాబోధనలో జీవితమంతా వెచ్చించి, ప్లేగు వ్యాధి సోకినవారికి నిస్వార్థంగా సేవచేస్తూ ఆ సేవలో వ్యాధిసోకి అసువులు బాసిన సావిత్రిబాయికి దేశీయంగా సముచిత స్థానం లభించాలనే మా ప్రయత్నం.
సమాజ వికాసంలో విద్య నిర్వహించిన పాత్ర, అందించిన చైతన్యం, తదనంతరం మహిళా ఓటు హక్కు డిమాండ్, స్త్రీల సంపూర్ణ విముక్తికై నడిపించిన ఆధునిక విప్లవ భావాలు ఒకదానికొకటి పెనవేసుకునే ఉన్నాయి. ఇంగ్లండ్‌లో మహిళా విద్య గురించి చర్చించిన కొద్దికాలానికే, భారత్‌లో రెండు వేల ఏళ్లుగా విద్యకు నోచుకోని బడుగులకు జ్యోతిరావు ఫూలేతో కలిసి బడులు నెలకొల్పారు సావిత్రిబాయి. తత్కారణంగా సాంప్రదాయ వాదుల దాడులకు, బెదిరింపులకు వారు ఎదురీదిన వైనం మరువలేనిది. ఫాతిమాబేగంతో కలిసి విద్యాబోధనలో ఆమె చేసిన కృషిని, ఒక ఉద్యమంగా భావించకపోవడం వల్ల, రమాబాయి రెనడే లాంటి వాళ్లు తప్ప సాంప్రదాయ కమ్యూనిస్టుల చరిత్ర గ్రంథాల్లో సావిత్రిబాయి పేరు ఎక్కడా పేర్కొనబడలేదు. అందుకే మార్చి 8 అందించిన స్త్రీ సమాన హక్కుల పోరాట స్ఫూర్తిని దేశీయ వనితల త్యాగాల కృషితో మేళవించి జరుపుకుందాం.
అధికార మార్పిడి (1947, ఆగస్టు 15) తర్వాత ఫ్యూడల్ సామ్రాజ్యవాద దోపిడీల సాంస్కృతిక వికృత పోకడలు వివిధ రూపాల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండు ఆధిపత్య దోపిడీ విధానాలకు తోడయిన కులవ్యవస్థ మూలంగా అటు కులీనులకు, ఇటు కులహీనులకు స్త్రీలు బానిసలుగానే మారారు. అసమాన జంట వివాహవ్యవస్థలో రైతు-కూలి, శ్రామిక మహిళలు సాపేక్షికంగా స్వేచ్ఛను అనుభవిస్తున్నా అది వారు శ్రమను అమ్ముకునే దోపిడీగా, అదనపు విలువను మరింత కోల్పోయే కారుచౌక శ్రామికులుగా మిగిలిపోతున్నారు. పట్టణాల్లో ఉద్యోగులకుండే క్రెచ్ సౌకర్యం లేక, అదనపు ఇంటి చాకిరితో చిక్కి శల్యమవుతున్నారు. శ్రామిక స్త్రీలకు పునర్వివాహం (మారుమనువు) మధ్య తరగతికి లాగా గగనకుసుమం కాదు. కానీ కాపుసారా తాగి వరంగల్ జిల్లాలో వందల సంఖ్యలో మరణించిన పురుషుల భారాన్ని మోస్తూ లంబాడ స్త్రీలు పడుతున్న నరకం మాటల్లో వర్ణించలేము. వలసల్లో, భర్తలు బతుకుదెరువు కోసం బొంబాయి, దుబాయి పోయినప్పుడు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, అంగడి పాలవుతున్న సంసారాలు స్త్రీల ఎదురీతకు పరీక్షగా నిలుస్తున్నాయి. అవిద్యతో పితృస్వామ్య భావజాలాన్ని అందిపుచ్చుకున్న అత్తా-కోడళ్ల తగువులు, భర్తల వేధింపులు కేవలం గృహహింస పరిధిలోనివే కావు. సామాజిక వ్యవస్థీకృత హింసగా పరిగణించే పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటాలను పదును పెట్టుకోవడానికి మార్చి 8 ఒకానొక ముఖ్యమైన సందర్భం.
ప్రగతిశీల మహిళా సంఘం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పురుడు పోసుకున్నా శ్రమజీవులైన గ్రామీణ రైతు-కూలీ మహిళలు, బీడీ కార్మికుల్లాంటి అసంఘటిత రంగ మహిళా కార్మికుల మధ్యనే తన కార్యరంగాన్ని ఎంచుకుంది. సిరిసిల్ల ప్రాంతంలో దొరలకు వ్యతిరేకంగా పోరాడి, దొరల చేత సామూహిక అత్యాచారానికి గురైన కొదురపాక రాజవ్వను, రాజ్యంతో అత్యాచారానికి గురైన సముద్ర లింగాపురం సత్తెవ్వను, సీమలో సాయుధ ముఠాలకి వ్యతిరేకంగా పోరాడిన ఎంతోమంది వీరవనితలను ఎత్తిపట్టి ్కౖగి (స్త్రీ విముక్తి) పోరాట చరిత్రను స్వంతం చేసుకుంది. దూబగుంట కళ్లు తెరువకముందే సామాన్య ప్రజలు ఎక్కువగా బలయ్యే సారా వ్యతిరేక పోరాటాలకు నాంది పలికింది. 1974లో అధిక ధరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంతో పాటు, విద్యాలయాల్లో ఈవ్‌టీజింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించింది. 1977లో రమేజా బీ పై నల్లకుంట పోలీస్ స్టేషన్లో జరిగిన అత్యాచారంపై, ఒంగోలులో ఇందిరా అత్యాచారం, హత్యపై రాష్ట్రమంతా ఉద్యమించింది. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ప్రభుత్వం- పోరంబోకు- దేవుని మాన్యాలన్నీ దళితులకే దక్కాలని, అవన్నీ స్త్రీ పురుషులకు సమానంగా చెందాలని పోరాడింది. ఈ క్రమంలో ఎన్నో దాడులు, అరెస్టులను, కేసులను ఎదుర్కొని నిలబడింది.
నూతన ఆర్థిక-పారిశ్రామిక విధానాలతో 1991 తర్వాత తీవ్రంగా ముందుకు వచ్చిన ప్రపంచీకరణ మూలంగా అసంఘటిత రంగాలన్నీ స్త్రీలకే రిజర్వు చేయబడినాయి. పని స్థలాల్లో లైంగిక వేధింపులు, హక్కుల నిరాకరణ, వేతన వ్యత్యాసం మహిళా శ్రామికుల పట్ల సర్వసాధారణ విధానంగా కొనసాగుతుంది. అందుకే సమాన పనికి సమాన వేతనమంటూ జరుగుతున్న పోరాటాలు ఒక మేరకు విజయం సాధించినా, మౌలిక మార్పులు లేవు. ఆడ కూలి – మగ కూలి అనే పేరుతో శ్రమదోపిడీ నిరాఘాటంగా కొనసాగుతుంది. విద్యాహక్కు చట్టానికి నోచుకోని వాళ్లల్లో అధిక శాతం బాలికలే ఉన్నారు. అయితే విద్యతో పాటు సాంస్కృతిక చైతన్యం పెరగకపోవడంతో విద్యావంతులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో భ్రూణ హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాల్లో తప్ప అంతటా 0-6 బాలబాలికల్లో తీవ్రమైన సంఖ్యా వ్యత్యాసం కనబడుతుంది. రాజస్థాన్ లాంటి చోట్ల ఇప్పటికీ మూడు తరాలుగా ఆడ సంతానం లేని గ్రామాలున్నాయంటే పరిస్థితి తీవ్రత మనకు బోధపడుతుంది. వెలగట్టని ఇంటి చాకిరీ, సామాజిక బాధ్యత గల పిల్లల పెంపకం పైబడి సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల శ్రమ వృధాగాబడుతున్నది.
ప్రపంచంలో పారిశ్రామిక విప్లవాలతో బాటు, సాంఘిక పునరుజ్జీవ వుద్యమాలు ఎన్ని జరిగినా, సోషలిస్టు దేశాలు అతికొద్ది కాలం సాధించిన ప్రగతి కాగడాబట్టి వెతికినా ఎక్కడా కానరాదు. ప్రత్యేకించి భారతీయ కుల వ్యవస్థలో నీచవృత్తులెన్నో దళిత మహిళలకే అంటగట్టబడుతున్నాయి. ఢిల్లీలో నిర్భయ ఘటన రోజు ఉత్తరప్రదేశ్‌లో దళిత మహిళలపై అత్యాచారం, సజీవ దహనం ఘటన మీడియాలో మచ్చుకైనా కానరాలేదు. గొంతులేని దళిత-బడుగు వర్గాల మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులెన్నో చీకటి కుహరాల్లోనే మగ్గిపోతున్నాయి. బహుళజాతి సంస్థల లాభాపేక్షకు స్త్రీల శరీరం మార్కెట్ సరుకుగా మారి లైంగిక దాడులకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. స్త్రీల దుస్తుల కారణంగా అత్యాచారాలు జరుగుతున్నాయనే వాళ్లు పసిపిల్లలపై దాడులకు ఏమి జవాబు చెప్పగలరు?
– కరుణ