పుల్లెల వారి ప్రస్తావనలు-1
వారం క్రితం ఉయ్యూరు లైబ్రరీకి వెళ్ళినప్పుడు పురాణం సూరి శాస్త్రి గారి ‘’నాట్యాం బుజం ‘’తో బాటు’’ పుల్లెల వారి ప్రస్తావనలు ‘’ పుస్తకమూ తెచ్చాను .మొదటిది చదివి అందులోని విషయాలు తెలియ జేశాను .అది అవగానే పుల్లెల వారి పుస్తకం చదివాను .ఇది 760 పేజీల బృహత్ గ్రంధం . ఎన్నో శాస్త్ర అలంకార వేదాంత కావ్య చర్చలున్న ఈ మహా గ్రంధాన్ని హైదరాబాద్ లోని ‘’సంస్కృత భాషా ప్రచార సమితి ‘’ కేవలం రెండు వందల రూపాయలకు అందించటం వారి ఆదర్శానికి తార్కాణ గా నిలిచింది .పుల్లెల వారి శేముషీ వైదుష్యానికి ఈ పుస్తకం అక్షర రూపమే .వారి సంస్కృత పాండితీ గరిమ ,శంకారద్వైతం పై వారికున్న అవగాహన ,సమన్వయం ,విస్తృత గ్రంధావ లోడనం , కౌటిల్య అర్ధ శాస్త్రం పై ఉన్న పట్టు ,అన్నీ చవి చూడ తగిన గ్రంధం ఇది .కాస్త ఓపిక, తీరిక, అవగాహన ,ఉంటె ఇది ఒక మణి దీపమే .
ఆచార్య శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రుడు గారిని మొదటి సారి గా సుమారు పాతిక ఏళ్ళ క్రితం హైదరాబాద్ లో శృంగేరి శారదా పీఠం లో చూశాను .అప్పుడు వారికి ‘’నోరి చారిటబుల్ ట్రస్ట్’’ వారు వారి సాహితీ సేవ కు పురస్కారం ప్రదానం చేశారు .ఆ ట్రస్ట్ నిర్వ హిస్తున్న శ్రీ నోరి రామ క్రిష్నయ్య గారు మద్రాస్ నుండి స్వయం గా వచ్చి సత్కరించి నగదు బహుమతి అందించారు .ఆ సభ కు ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరా రావు అధ్యక్షత వహించారు .పుల్లా రెడ్డి స్వీట్స్ అధినేత కూడా వచ్చిన జ్ఞాపకం .నోరి రామ క్రిష్నయ్య గారి అన్న గారు వెంకట శ్రీనాధ సోమయాజులు గారు అప్పటికేఒక ఏడాది క్రితం మరణించారు .వీరు దశోపనిషత్తులను శ్రీ శంకర భాష్యానికి అనుగుణం గా అనువదించారు బ్రహ్మ సూత్రాలను ,గీత నూ అనువాద సహిత వ్యాఖ్యానాలు రాసి ప్రచురించారు .వివాహం మీద పుస్తకం రాశారు .మరణం పునర్జన్మ పై గ్రంధమూ రాశారు .సోమయాజులు గారు మా రెండవ అబ్బాయి శర్మ భార్య ఇందిర(మా కోడలు )కు మాతా మహులు .వీరి వివాహ విషయం లో ఉయ్యూరు వచ్చి మాతో మాట్లాడిన వారు యాజులు గారే .ఒక సారి తమ్ముడు రామ క్రిష్నయ్య గారితో కలిసి ఉయ్యూరు వచ్చారు కూడా ,.పుల్లెల వారి సన్మాన సభ మేము హైదరాబాద్ లో మా శర్మా వాళ్ళింట్లో ఉండగా తెలిసి మా అబ్బాయి ప్రోద్బలం తో మా ఇద్దర్నీ వెంట బెట్టుకొని తీసుకొని వెళ్ళారు .ఇదీ నేపధ్యం .అప్పటి దాకా పుల్లెల వారి గురించి వినటమే కాని వారి విద్వత్తు తెలిసిన వాడిని కాను .అప్పుడే ఆయన ప్రతిభను అందరూ వివరిస్తుంటే ఇంత గొప్ప మహాను భావుడి పరిచయం ఇంత ఆలస్యం గా పొందానా అని అనుకొన్నాను .ఆ తరవాత వారి పుస్తకాలు కొన్ని చదివాను .వారి రామాయణ భాగాలు మా తమ్ముడు నాకు అంద జేశాడు . చదివి భద్రం గా దాచుకొన్నాను . .ఇప్పుడు ముందుగా పుల్లెల వారి గురించి వివరించి ఆ తర్వాత’’ ప్రస్తావనల’’లో వారు చెప్పిన విషయాలపై సంక్షిప్తం గా నాకు తెలిసింది అందిస్తాను .
ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు
మహా మహోపాధ్యాయులు పద్మశ్రీ విభూషితులు ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు 24-10-1927నతూర్పు గోదావరి జిల్లా కోన సీమ లో జన్మించారు తండ్రి సత్యనారాయణ శాస్త్రి గారి వద్దనే కావ్య నాటక ,సిద్ధాంత కౌముది మొదలైనవి నేర్చారు .మద్రాస్ సంస్కృత మహా విద్యాలయం లో వేదాంత శాస్త్రం అభ్యసించి సర్వోత్తములుగా ఉత్తీర్ణులై స్వర్ణ పతకం పొందారు .వేదాంత శిరోమణి తో బాటు విద్వాన్ అయ్యారు .ఉస్మానియా యూని వర్సిటి లో ‘’రస గంగాధరం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ డి.సాధించారు .అక్కడే సంస్కృత ఆచార్యులై ,సంస్కృత అకాడెమీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు . .
వాల్మీకి మహా కవి రచించిన శ్రీమద్ రామాయణానికి ప్రతి పదార్ధ తాత్పర్యాలతో ‘’బాలా నందినీ ‘’వ్యాఖ్యానం రాసి పది సంపుటాలుగా ప్రచురించారు . వక్రోక్తి జీవితంలఘు సిద్ధాంత కౌముదికి వీరి తెలుగు వ్యాఖ్య సర్వ జనాకర్షణమయింది ,కావ్యాలంకారం ,కావ్యాదర్శం ,కావ్యాలంకార సూత్రం ,కావ్య ప్రకాశ ,,లోచన సహిత ధ్వన్యా లోకం మొదలైన పది గ్రంధాలకు తెలుగు లో విస్తృత వ్యాఖ్యలు చేశారు .‘’సు సంహత భారతం ‘’అనే సంస్కృత నాటకం ,పాశ్చాత్య తత్వ శాస్త్రేతిహాసం ,బ్రహ్మ సూత్రాలు ,భగవద్గీతా శంకర భాష్యాలకు తెలుగు వ్యాఖ్యానాలు రాశారు .దాదాపు అరవై చిన్న గ్రంధాలు రాశారు .మొత్తం మీద వీరి వాజ్మయ రాశి నూటా యాభై గ్రంధాలను దాటింది .
సంస్కృత అకాడెమి డైరెక్టర్ గా ,సురభారతీ సమితి కార్య దర్శి గా సుమారు ముప్ఫై గ్రంధాలకు ,అప్పయ్య దీక్షితేంద్ర కేంద్ర ప్రకాశ సమితికి వైస్ చైర్మన్ గా ఎనిమిది గ్రంధాలకు సంపాదకులుగా ఉన్నారు .సంస్కృత భాషా సమితి ప్రచార సభ్యులుగా ,,ఉప కుల పతి గా ,కులపతి గా సుమారు ముప్ఫై ఏళ్ళు సేవ లందించారు. కేంద్ర సంస్కృత బోర్డు సభ్యులైనారు .లాల్ బహదూర్ శాస్త్రి విద్యా పీఠ సభ్యులు గా పని చేశారు .తిరుమల తిరుపతి దేవస్థానం గ్రంధ ప్రచురణ సంస్థ కు సలహా సంఘ చైర్మ గా వ్యవహరించారు .
పుల్లెల వారికి 1987లో రాష్ట్ర పతి పురస్కారం లభించింది .1993లో ఉత్తర ప్రదేశ్ సంస్కృత సంస్థాన విశ్వ భారతి లక్ష రూపాయల పురస్కారాన్నిచ్చి సత్కరించింది .1997లో గుప్తా ఫౌండేషన్ ,2000శివానంద ఎమినేంట్ సిటిజెన్ పురస్కారం ,2004లో బిర్లా ఫౌండేషన్ వారి వాచస్పతి పురస్కారం తో లక్ష రూపాయల నగదు బహుమతి ,2007లో అప్పా జోశ్యుల విష్ణు భోట్లా కందాలై వారి పురస్కారం ,2011లో సి పి.బ్రౌన్ అకాడెమి 2,50,000 రూపాయల సర్వోత్క్రుస్ట పురస్కారం మొదలైన వెన్నో అవార్డులు రివార్డులు అందుకొన్న విద్వాన్మణి శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రుడు గారు .
లాల్ బహదూర్ శాస్త్రి విద్యా పీఠం పుల్లెల వారికి ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుద ప్రదానం చేసి గౌరవించింది .2011భారత ప్రభుత్వం ‘’పద్మ శ్రీ ‘’ని మాత్రమె ఇచ్చి చేతులు దులుపు కొంది..ఎన్నో విద్యా సంస్థలు ఆధ్యాత్మిక సంస్థలు పుల్లెల వారిని సత్కరించి సమ్మానించి ఆ సాహిత్య సరస్వతీ మూర్తికి నీరాజనాల నందించి ధన్యత చెందాయి .పుల్లెల వారిలో మనకు ఒక శంకరాచార్యులు ఒక కౌటిల్యుడు ఒక వాల్మీకి ఒక వ్యాసుడు ఒక కాళిదాసు ,ఒక పాణిని ,ఒక ముమ్మటుడు ,ఒక విశ్వనాధుడు ఒక క్షేమేంద్రుడు ఒకరని ఏమిటి సకల అలంకార శాస్త్ర వేత్తలందరూ కని పిస్తారు మూలల లోకి చేరి విస్తుతం గా పరిశీలించి నిగ్గు తెలిస్తేనే కాని వారికి తృప్తి ఉండదు .ఎనభై ఏ ఏడేళ్ళవయసు లో ఇంతటి మహా మహులు మన మధ్య జీవిస్తూ ఉండటం మనకు గర్వ కారణం .మన జన్మ ధన్యం కూడా .
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –14-3-14-ఉయ్యూరు