పుల్లెల వారి ప్రస్తావనలు -2

పుల్లెల వారి ప్రస్తావనలు -2

‘’పుల్లెల వారి ప్రస్తావనలు ‘’లో వ్యాకరణం ,అలంకార శాస్త్రం ,వేదాంతం ,అర్ధ శాస్త్రం ,ధర్మ శాస్త్రం ,వివిధ విషయ గ్రంధాలు ,ఇతర రచనలు అనే విభాగాలున్నాయి .వ్యాకరణం లో ‘’లఘు సిద్ధాంత కౌముది ‘’పై-41పేజీలలో విస్తృత చర్చచేశారు .పాణినీయం పై కొత్త లోకాలు చూపించారు .వీటిని ఇదివరకే అందించాను .అలంకార శాస్త్రం లో వక్రోక్తి తో ప్రారంభించి కావ్య మీమాంసా ,కావ్యా దర్శం ,కావ్యాలంకారం,,కావ్యాలంకార సూత్రాలు ,ఔచిత్య విచారం,కావ్య ప్రకాశం ,లోచన సహిత ధ్వన్యాలోకం ,అలంకార శాస్త్రం లను తన  సునిసిత మేధో పరిజ్ఞానాన్ని అందించి దానిలో అభి రుచి ఉన్న వారికీ మార్గ దర్శనం చేశారు .

వేదాంత విషయాలను తైత్తిరీయ ,కేన ,ప్రశ్న ,ముండక ,మాండూక్య ఉపనిషత్తు లు ,వాటి విశేషాలులో చెప్పారు ,వాటిల్లో అద్వైత భావ విన్యాసం ద్రుష్టి గోచారం చేశారు .అద్విత తత్త్వం అందరికి అందు బాటు లో ఉండేది కాదని ,అదొక అత్యున్నత మైన ఆధ్యాత్మిక స్తితి అని అన్నారు .ఇది కొందరికి మాత్రమె సాధ్యం అన్నారు .శంకరా చర్య విరచిత బ్రహ్మ సూత్రా భాష్యాన్ని అరటి పండు ఒలిచి చేతిలో పెట్టి నంత హాయిగా వివరించారు .ఆస్తిక ,నాస్తిక దర్శనాలను స్పృశించారు ..వేదాంతానికి ‘’ఉత్తర మీమాంస’’ అనే పేరుందనిచెప్పారు . ప్రసిద్ధ విమర్శకుడు హెచ్ ,పాత్త ర్ వేదాంతం అంటే అద్వైతమే అన్న భావం ఏర్పడింది .దీనికి కారణాలు వేదాంతంకు మూలం  వ్యాసుడు రాసిన బ్రహ్మ సూత్రాలే నన్నారు .ఈ సూత్రాలకు ఏంతో మంది వ్యాఖ్యానాలు చేసినా శంకరాచార్యుల వ్యాఖ్యానమే సరోత్క్రుస్ట మైనదని చెప్పారు .ఏది సత్యం ?ఏది అసత్యం ?/అనే మాటలకు శంకరులు ‘’సర్వ విధాలా ఏనాటికీ మార్పు లేని సత్యం ,సర్వ విధాలా ఏ నాటికీ మార్పు లేని అసత్యం ‘’అనే అర్ధాలు గ్రహించారని వివరించారు .ఈ విషయాన్ని ప్రొఫెసర్ చంద్ర ధర శర్మ ‘’ది క్రిటికల్ స్టేడి ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ‘’అనే గ్రంధం లో విపులం గా చర్చిన్చాడని గుర్తు చేశారు .మాయా శక్తి అనిర్వచనీయం .దాన్ని కనుక్కోవటం కష్టం అన్నారు.దీనికి ఎన్నో ఏళ్ళ క్రితం పేపర్ లో పడిన ఒక సంఘటన ను గుర్తు చేశారు .’ఒక చిన్న దేశానికి చెందిన  రాణి ఒక దుకాణానికి వెళ్లి  ఒక చిన్న వస్తువును దొంగీలించిందట .దీని సాధక బాధకాలు ఆవిడకు తెలియనివి కాదు .కాని జరిగి పోయింది .ఆ సమయం లో ఆమె ప్రవర్తన ‘’అనిర్వచనీయం ‘’.అన్నారు .ఇదే మాయ .

పరమేశ్వరుడు జగజ్జీవ శరీరుడు .జ్ఞాని దృష్టిలో జగత్తు అనేది లేదు అని అంగీకరిస్తే చిక్కు ఉండదు అంటారు .శంకరులకు ఉపనిషత్తుల్లో మాయా వాదం అనే బ్రహ్మాస్త్రం దొరికింది.దాన్ని  వశం లో ఉంచుకొని వైశేషిక ,సంసాంఖ్య,,మీమాంసాది ద్వైతులను నిర్భయం గా ఎదుర్కొని వాదం లో జయం పొందారు .అద్వైతికి ఎవరి తోనూ విరోధ ,విద్వేషాలు ఉండవు అన్నారు .వేదాంతానికి సంబంధించిన విషయాలను ఒక చోట క్రోడీకరించి ఇలా చెప్పారు .-1-బ్రహ్మం మాత్రమె ఏకైక సత్యం .అది నిర్గుణ  నిర్వివేదం .జ్ఞాన స్వరూపం ,ఆనంద రూపం .2-నిర్వచనానికి అందని మాయ తన  శక్తి తో పని చేస్తే బ్రహ్మమే సగుణ  బ్రహ్మ అవుతాడు .ఈ రూపానికి శివ విష్ణు మహేశాది పేర్లున్నాయి .3-జగత్తు మిధ్య అని చెప్పినా మిధ్యాత్వం అనేది కేవలం పరి భాషికమే .ఇతర సంప్రదాయాల ప్రకారం జగత్తు ఎంత సత్యమో అద్వైతం ప్రకారమూ అంతే  సత్యం .అంతా మిధ్య అని ఏ అద్వైతీ స్వేచ్చగా ,శాస్త్ర విరుద్ధం గా ప్రవర్తించ కూడదు .జగత్తు ఏమై పోతుందో అన్న బాధ అక్కర్లేదు .అది అందరిని వెన్నంటే ఉంటుంది .4-ద్వైతులు చెప్పే సాలోక్య ,సామీప్య ,సాయుజ్య ,సారూప్య ముక్తులు అద్వైతానికి అడ్డు కావు .ఏ విషయాన్ని ముండక ఉపనిషత్ భాష్యం లో శంకరులే వివరించారు ‘’మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళటం కాదు .సర్వ వ్యాప్తమైన బ్రహ్మ ను సాక్షాత్కరించుకొన్న వారు ఆ బ్రహ్మ లోనే ప్రవేశిస్తారు .అంటే బ్రహ్మ గానే ఉంటారు ‘’అని స్పష్టం గా చెప్పారు .5-వేదాంత అధ్యయనం వలన నిజమైన ప్రయోజనం కొద్ది మందికే కలుగుతుంది .

‘’యెన్ సైక్లో పీడియా ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ‘’లో పాత్తర్ అద్వైత సిద్ధాంతానికి ప్రధాన అంశాలను విశ్లేషించి చెప్పాడని పుల్లెల వారు చెప్పి, వాటిని ఒక చోట చేర్చారు .అద్వైతాన్ని సైద్దాన్త్రిక ఆధారం  మీద ,ఉపయోగించే స్తితి మీద చెప్ప వచ్చు .తత్వ శాస్త్రం సంసార బంధం నుంచి విముక్తి లభించే మార్గం సూచించాలి  .బంధం అవిద్య వల్లే ఏర్పడింది. అవిద్య తొలగే వరకు అవిశ్రాంత కృషి చేయాలి. జ్ఞానం పొందితే బంధం చేదింప బడుతుంది .జ్ఞానం అంటే తెలియ బడ వలసినది. చూసేది ,చూడ బడేది అనే భేదం నశిస్తే లభించే జ్ఞానమే మోక్ష దాయకం .ఈ పరిశుద్ధ చైతన్యమే ఆత్మ .ఈ ఆత్మ శుద్ధ చైతన్యమే. బ్రహ్మ కంటే భిన్న మైంది కాదు .ఇది సత్యం కాదు అనే బాధితం కాని దే నిజమైన సత్యం .శుద్ధ చైతన్యమే సత్యం .దీని అనుభవం  సుషుప్తి లో కలుగుతుంది ..ఆస్తికత్వం లో ఏకేశ్వర వాదం గొప్పది .వేదం ప్రామాణ్యాన్ని అంగీకరించే వారి ద్రుష్టి యే మంచిది .అని శాంకరాద్వైతాన్ని సవివరం గా సందేహ రహితం గా అన్ని ప్రమాణాలతో పుల్లెల వారు నిరూపించారు .

శ్రీ మద్  భగవద్గీత కు శంకర భాష్యం పై చర్చిస్తూ  ‘’యన్నామ ధేయ స్మరణేన  జం తుహ్    ప్రాప్నోతి నిస్శ్రేయష భాగ దేయం –తాన్ శంకరాచార్య శుభాభిదేయాన్ నిత్యం నమామః శివ రూప దేయాన్ ‘’అనే శ్లోకం తో ఆచార్య శంకరుల గుణ నామ కీర్తనం చేశారు .గీత అంటే గానం చేయ బడిందని అర్ధం కాని ఇక్కడ చెప్ప బడింది ఉప దేశింప బడిందని అర్ధం .ఉప నిషత్ అనే పదాన్ని విశేష్యం గా అధ్యాహారం గా తెచ్చుకొని ‘’ఉపదేశించ బడిన ఉపనిషత్తు ‘’అనిఅర్ధం చెప్పుకోవాలి .ఇందులో ప్రతి శ్లోకమూ ఉపనిషత్తే.మహా బారతం భీష్మ పర్వం లో 25-42అధ్యాయాల మధ్య ఉన్న18 అధ్యాయాలే భగవద్ గీత .భారతం లో ఒక పేరు భాష్యం లో వేరొక ఏరు అధ్యాయాలకు ఉన్నాయి ఆరవదానికి ధ్యాన యోగం శంకర భాష్యం లో ‘’అభ్యాస యోగం ‘’అయింది .రామానుజుడు ‘’యోగాభ్యాస యోగం అన్నాడు .ఎనిమిదో అధ్యాయానికి ఒక దానికే తారక బ్రహ్మ యోగం  బ్రహ్మాక్షర  నిర్దేశ యోగం ,అక్షర పరబ్రహ్మ యోగం ,ధారణా యోగం ,మహా పురుష యోగం ,అభ్యాస యోగం అనే పేర్లున్నాయి

ఆత్మ జ్ఞానానికి కావలసింది విషాదం కాదు .విషాద గంధ శూన్యమైన వైరాగ్యం అని చక్కని అర్ధం చెప్పారు పుల్లెల వారు .అందుకే శ్రీ కృష్ణుడు అర్జునునికి ‘’నీకు కర్మ మార్గం లోనే అధికారం ‘’అని ఖచ్చితం గా చెప్పాడు .గీతా శాస్ట్ర ప్రారంభం రెండవ అధ్యాయం అయిన ‘’సాంఖ్య యోగం ‘’లోని 11 వ శ్లోకం తోనే ప్రారంభం అని శంకర భగవత్పాదులు సూచించారని ,దీన్ని రామ రాయ కవి సమర్దిన్చాడని వివరణ ఇచ్చారు .భగవద్ గీత ‘’మానసికం గా ,బౌద్ధికం గా ,ఆధ్యాత్మికం గా వేరు వేరు స్థాయిల్లో న్న మానవులలో ప్రతి ఒక్కరికీ ఉపయోగించే వేరు వేరు సన్మార్గాలను చూపడం ద్వారా సర్వ లోక ప్రియత్వాన్ని సంతరించుకొన్న ‘’సర్వ జన హిత గ్రంధం ‘’గా పుల్లెల వారు విశ్లేషించారు .సర్వ మత సామరస్యమే  గీత చెప్పిందన్నారు .ఈ భావం దేశ మంతటా ప్రతిష్టిత మైనదన్నారు ఎనిమిదో శతాబ్దానికి చెందినఒక కర్నాటక రాజు వేయించిన శిలా శాసనం లో ఉన్న ఒక శ్లోకం ఈ విశాల దృక్పధాన్ని అభి వ్యక్తీకరించిందని ఆచార్య పుల్లెల గుర్తు చేశారు ,

‘’యం శైవాః సముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినో –బౌద్దా బుద్ధ ఇతి –ప్రమాణ పటవఃకర్తేతి నైయాయికాః

అర్హన్నిత్యధ ,జైన శాసన  రదాః  కర్నేతి మీమాంసకాః –సో-యంనొ విదధాతు వాంచిత ఫలం త్రైలోక్య నాదో  హరిహ్ ‘’

‘’ఏ మహా విష్ణువు ను శైవులు శివుడని ,వేదాంతులు బ్రహ్మ అని ,బౌద్ధులు బుద్ధుదని ,నైయాయకులు కర్త అని ,జైనులు అర్హత్ అని ,మీమాంసకులు కర్మ అని ,ఉపాసిస్తున్నారో త్రిలోక నాధుడైన ఆ శ్రీ హరి మన కోర్కెలు తీర్చు గాక ‘’అని అర్ధం .

దీన్ని పుల్లెలా వారు ఆధునిక కాలానికి అన్వయిస్తూ ఒక శ్లోకం రాసి  చెప్పారు –

‘’యం శైవాః శివ ఇత్యహుర్మజద ఇత్యర్చంతి  యం పార్శికాః-యూదైస్చైవ జహోవ ఇత్యభి దధ త్యల్లేతి మహమ్మదః

చీనాః షాగరిత్య చిన్త్య మహిమాః   సిక్   ఖాః పరత్మేతి తే –సర్ర్వే క్రైస్తవాశ్చ గాడితి స నః పాయాత్ సదాత్మా పరః ‘’

‘’ ఏ పరమాత్మ శైవులు శివుడని ,పార్సీలు అహద్  మజ్ దఅని ,యూదులు యహోవా అని ,ముస్లిములు అల్లా అని ,చైనీయులు షాంగ్ తి అని ,సిఖ్ లు పరమేశ్వరుడని ,క్రిస్తియన్లు గాడ్ అని ఆరాధిస్తారో ఆ పరమాత్మ మనలను రక్షించు గాక అని విపులార్ధం .

కృష్ణుడు అర్జునితో ‘’నివృత్తి మార్గం అందరికీ వర్తిచదు .ప్రస్తుతం దీనికి నీకు అధికారం లేదు .కొన్ని వేలలో ఎఒక్కరికో ఇది సాధ్యం .నువ్వ్వు కర్మ యోగాన్ని చేయాల్సిందే .యుద్ధం చేసి అన్యాయాన్ని పార ద్రోలి ధర్మ ప్రతిష్టాపన చేయాల్సిందే ‘’అని నిష్కర్ష గా ఉపదేశించాడు అని అన్నారు .శ్రీ కృష్ణుడు మొదటి నుంచి చివరి దాకా ‘’అస్మత్ ‘’అనే శబ్దాన్ని ప్రయోగించి చెప్పాడు .అంటే విష్ణు భక్తీ యోగం గా చెప్పినట్లు అనుకోవాలి .కాని భక్తీ యోగాన్ని శ్రీ శంకరులు  అభినవ గుప్తుడు ‘’శివ భక్తీ యోగం ‘’గా ప్రతి పాదించారు .పరతత్వం ఒక్కటే అయినప్పుడు అన్నీ అంగీకరాలే అంటారు ఆచార్య పుల్లెల .’’ఉత్తమః పురుషస్త్వన్యః ‘’అన్నప్పుడు పరమాత్మ మహా విష్ణువు ,మహాశివుడు ,మహా గణపతి ,మహా శక్తి ఏదైనా కావచ్చు నంటారు .

1875లో జన్మించిన బెల్లం కొండ రామ రాయ కవి 38 ఏళ్ళు మాత్రమె జీవించి గీత కు ‘’భాష్యార్య ప్రకాశికః ‘’అనే వ్యాఖ్య రాశారని ,వారికి వేదం  న్యాయ ,శబ్ద శాస్త్రాలలో అసాధారణ పాండిత్యం ఉన్నాదని 150కి పైగా గ్రంధాలు రాశారని అందులో అద్వైతానికి చెందిన గ్రంధాలు సర్వోత్క్రుస్టం అని పించుకోన్నాయని ,అందుకే రామరాయ కవి కి ‘’అభినవ శంకరులు ‘’అన్న బిరుదు ను పండిత లోకం ప్రదానం చేసిందని జ్నాపకం చేశారు .రామరాయ కవి వ్యాఖ్య మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారి వద్ద ఉంది  నేనూ  దాన్ని తిరగేశా. బుర్రకేక్కిన వైనం లేదని జ్ఞాపకం .

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -15-3-14-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.