ఉయ్యూరు మునిసిపాలిటీ ఎన్నికల సందర్భం గా ‘’మన చానెల్’’ లో’’లైవ్ ‘’గా ప్రసారమైన చర్చా వేదికలో నా ప్రసంగం
నిన్న ఉదయం ఉయ్యూరు లోని ‘’మన చానెల్ ‘’ మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్ చేసి రేపు మునిసిపల్ ఎన్నికల సందర్భం గా చర్చా వేదికనుసాయంత్రం నాలుగింటికి లైవ్ ప్రసారం చేస్తున్నామని నన్ను అందులో గ్రామ పెద్ద గా సరస భారతి అధ్యక్షుని గా పాల్గొనమని కోరారు.సరే నన్నాను .ఈ రోజు అంటే 20వ తేది గురువారం సాయంత్రం చర్చా వేదికలో పాల్గొన్నాను .మేనేజింగ్ డైరెక్టర్ ఆహ్వానం పలికి వేదిక ఉద్దేశ్యాన్ని అందరికి తెలియ జేశారు .ఇందులో చైర్మన్ పదవికి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్ధులు తమ ఎన్నికల ప్రణాళిక ఏమిటో వివరిస్తారని ,పెద్దలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని చెప్పారు .ముందుగా జగన్ పార్టీ నుంచి వంగవీటి శ్రీనివాస కుమార్ ,మరియు చైర్మన్ అభ్యర్ధి రెహ్మాన్ మాట్లాడి తమ అభిప్రాయాలను తెలియ జేశారు .తర్వాత మార్క్సిస్ట్ కమ్మ్యూనిన్స్ట్ పార్టీ తరఫున కార్య దర్శి మాట్లాడారు .తెలుగు దేశం తరఫున అభ్యర్ధులు పొగిరి రాము ,జమ్పాన ఉమామహేశ్వర రావులు తమ భావాలను ప్రణాళికలను వివరించారు .తర్వాతనన్ను మాట్లాడమన్నారు .నేను మాట్లాడిన విషయాలే మీకు తెలియ జేస్తున్నాను .
‘’మునిసిపల్ అంటే స్వేచ్చ గా ఉన్న ప్రాంతం లోని పౌరులు అని లాటిన్ భాష లో అర్ధం .ఒక విధంగా మునిసిపాలిటి అంటే ‘’స్థానిక స్వేచ్చా ప్రాంతం ‘’దీనికే ‘’నగర పాలిక’’ అంటారు .అందులోని ప్రజలు నాగరికులు గా వ్యవాహరింప బడతారు .అలెక్సాండర్ కు పూర్వం గ్రీకు దేశం లో ‘’పోలిస్ ‘’అనే స్వేచ్చాయుత నగర పాలిక సంస్థ లుండేవి .అలేక్సాండర్ తండ్రి ఫిలిప్ వీటిని జయించి ఒకే రాజ్యం చేశాడు .1687లో మన దేశం లో మునిసిపల్ పాలనా వ్యవస్థ వచ్చింది .మద్రాస్ ,కలకత్తా బొంబాయి లు మునిసిపల్ కార్పోరేషన్ లు1726 లో అయ్యాయి .1882లో అప్పటి బ్రిటిష్ వైస్ రాయ్ లార్డ్ రిప్పన్ ప్రజాస్వామ్య పాలనా విభాగం గా మునిసిపల్ చట్టం తెచ్చాడు .1919భారత ప్రభుత్వం మునిసిపాలిటీలకు అధికారాలు ఇవ్వాలని నిర్ణయించి1935లో పూర్తీ అధికారాలతో స్థానిక మునిసిపల్ ప్రభుత్వాలను ఏర్పరచింది .మునిసిపల్ వ్యవస్థ ను ఏర్పరచటం లో ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం ఇలా వివరించింది ‘’’’strategic urban planning in a country to create effective ,responsive ,democratic ,transparent ,accountable local government ‘’ఏర్పడి ప్రజా సేవలో తరించాలని చెప్పింది .దీన్ని తెలుగు లో చెప్పాలంటే ‘’దేశం లో నైపుణ్యం తో నగర ప్రణాళిక తో ,ప్రజోపకరమైన విధానాలతో బాధ్యతా యుత ,జవాబు దారీ ఉన్న ప్రజాస్వామిక ,పారదర్శక ప్రభుత్వాలు ఏర్పడాలి.వీటి ద్వారా స్థానిక ప్రాజలకు సేవలందించాలని భావం .
మునిసిపాలిటీలు ప్రజారోగ్యం ,నీటి సరఫరా ,రక్షిత మంచి నీరు ,పారిశుద్ధ్యం పై ద్రుష్టి పెట్టాలి .విద్య ను ముఖ్య విషయం గా తీసుకొని అందరికీ విద్య నేర్పించాలి .ప్రజలను అంటు రోగాలనుంది కాపాడాలి .కట్టడాల నిర్మాణం పై అదుపు ఉండాలి .ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి .ప్రజా రక్షణ ముఖ్యం .అగ్ని ప్రమాదాలనుండి కాపాడాలి .వీధి దీపాలు సక్రమం గా వెలిగెట్లు చూడాలి .అంతర్గత రోడ్లను నిర్మించాలి .ఇవన్నీ మునిసిపాలిటీ విధులు .
ఉయ్యూరు ఇప్పటిదాకా పంచాయితీ గా ఉంది .మూడేళ్ళ కితం మునిసిపాలిటి హోదా వచ్చింది .అయనా పంచాయితీ వాసన పోలేదు .మునిసిపాలిటి అని ప్రజలు ఇంకా అనుకోలేదు .పరిస్తితుల్లో మార్పు లేకపోవటమే దీనికి కారణం .సుప్రీం కోర్టు జోక్యం తో రాష్ట్రం లో మునిసిపల్ ఎన్నికలు జరగటం ఈ వ్యవస్థ పై రాజకీయ నాయకులకు ఉండే అలసత్వం ఏమిటో తెలుస్తోంది .ఉయ్యూరు మునిసిపాలిటి కి మొదటి సారి గా ఎన్నికలు ముప్ఫై వ తేదీ న జరుగుతున్నాయి .ఇక నుంచి వార్డు మెంబర్లు కౌన్సిలర్లు అని పంచాయితీ మునిసిపాలిటి అని ,సర్పంచ్ చైర్మన్ అని పిలువ బడుతారు .ఉయ్యూరు పంచాయితీ మొదటి ప్రెసిడెంట్ అలీం సాహెబ్ గారి సేవలు ఇప్పటికీ అందరూ చెప్పుకొంటారు .అలాగే కొత్త గా ఏర్పడే మునిసిపాలిటి అలాగే ఆదర్శ వంతం గా ఏర్పడి పాలించాలి ఉయ్యూరులో రాత్రి ఎనిమిది అయితే వైద్య సదుపాయం లేదు .ముందుగా దాన్ని పునరుద్ధ రించి ప్రాజల ప్రాణాలను కాపాడటం తక్షణ కర్తవ్యమ్ .దీన్ని ‘’హెల్త్ ఎమర్జెన్సి ‘’గా తీసుకొని ముందుగా అమలు చేయాలి .’’ఆధార్ కార్డు’’ తోఏర్పడ్డ ఇబ్బందుల్నుంచి జనానికి కాపాడాలి . సిలిండర్ కు వెయ్యి రూపాయల పైన ఖర్చు పెట్టి కొంటె ఆ డబ్బు బ్యాంకులలో జమ కాలేదు .ఈ డబ్బు ను ప్రజలకు తిరిగి ఇచ్చి వేసేట్లు చూడాలి .ఇది రెండవ తక్షణ కర్తవ్యమ్ . రాజకీయ నాయకుల దందా తో ఇసుక అక్రమ రవాణాకు గురై సామాన్యుడికి అందకుండా పోతోంది. దాన్ని సీనరైజ్ చేసి ఆదాయం మునిసిపాలిటీలకు దక్కెట్లు తక్కువ రెట్ల లో ఇసుక అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేయటం మూడవ ముఖ్యమైన పని .
ఉయ్యూరు సెంటర్ లో కాలేజీలు ,స్కూళ్ళు విడిచి పెట్టిన తర్వాత వందలాది విద్యార్ధినీ విద్యార్ధులు బస్సులు అందకా పుష్పక విమానాల్లాంటి బస్సుల్లో ఫుట్ బోర్డ్ మీద ప్రమాదపు అంచులలో ప్రయాణం చేస్తున్నారు. ఇది చూడటానికి చాలా భయంకరం గాఉంటుంది .అందుకని సాయంత్రం వేళల్లో ఉయ్యూరు సెంటర్ నుండే సిటీ బస్సులు, సబర్బన్ బస్సులు అన్ని వైపులకు నడిచే ఏర్పాట్లు చేయటం నాలుగవ ముఖ్యమైన పని .ఉయ్యూరు సెంటర్ లో ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు వెంటనే టైం టేబుల్ బోర్డు లు ఉంచాలి .అలాగే రైల్వే సమాచారమూ అందించాలి సెంటర్ లో ‘.ఇది అయిదవ ది.అన్నిటికి డబ్బు అవసరం ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఒప్పించి, ఒత్తిడి చేసి డబ్బు సాంక్షన్ చేయించుకోవాలి .రాజలందరి సహకారం ,కే సిపి ,రోటరీ ,లయన్ క్లబ్ ల వంటి స్వచ్చంద సంస్థల సేవలు ,వితరణ శీలురైన దాతల సహకారం తో ప్రజా సేవకు అవసరమైన నిధులు సేకరించాలి .
కొత్తగా ఎన్నికైన వారు ప్రజలకు అందు బాటు లో ఉండాలి .అధికారులకు పూర్తీ అధికారాలివ్వాలి .వారి పని విధానం పై పర్య వేక్షణ ఉండాలి .చాణక్యుడు కూడా అర్ధ శాస్త్రం లో రాజుకు దండన అధికారామే తప్ప మిగిలిన విషయాలలో మంత్రుల పర్య వేక్షణ లో జరగాలని చెప్పాడు .’’సోలార్ ఎనర్జీ’’ని ఉపయోగించి వీధి దీపాలను వెలిగించి కరెంట్ ఆదా చేయాలి .సాంస్కృతిక కార్య క్రమాలకు అన్ని హంగులతో పురమందిరం అంటే టౌన్ హాల్ నిర్మించి సభలూ సమా వేశాలు జరిపే సొకర్యం కలిగించాలి .రైల్ టికెట్ కౌంటర్ వచ్చింది .విమాన టికెట్ల కు కూడా ఉయ్యూరు లో ఏర్పాటు కల్గించాలి .చెత్తను కుళ్ళింప జేసి అందులో నుంచి విద్యుత్ శక్తి ని పొందే ఏర్పాట్లు చేయాలి .ఉయ్యూరు లో ఎన్నో ఏళ్ళుగా ప్రజలు కలలు కంటున్న ఇంజినీరింగ్ ,మెడికల్ కాలేజీ లను ప్రాభుత్వం పై ఒత్తిడి తెచ్చి ఏర్పాటు చేయాలి .
చాలీ చాలని ఇళ్ళ స్థలాలను పంచకుండా పేదలకు అర్హులకు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి తక్కువ స్తలం లో ఎక్కువ మందికి ఆవాసం కల్పించాలి .క్రీడా ప్రాంగణమూ అవసరమే .వృద్ధుల సేవాశ్రమం ముఖ్యమే .రోటరీ క్లబ్ వారు శ్మశానాన్ని చాలా ఖర్చు పెట్టి పునర్నిర్మిస్తున్నందుకు అభినందనలు .దీనికి ‘చని పోయిన వారి శవాలను తరలించటానికి అందరికి అందు బాటు లో ఉండే ‘’మహా ప్రస్తానం ‘’అన బడే ‘’వాన్ ‘’ను ఏర్పాటు చేయటం అతి ముఖ్యమైన విషయం .ఉయ్యూరు మత సామరస్యానికి ప్రతీక గా ఉంది. దీన్ని కొత్త వారు స్పూర్తిగా తీసుకోవాలి .ఎందరో పెద్దలు వ్యవహార వేత్తలు ,వ్యాపారస్తులు ,విద్యా వంతులు ఉన్న పట్టణం .ఇక్కడి వారే కొలచల సీతారామయ్య గారు రష్యా వెళ్లి ‘’ఆయిల్ శాస్త్రవేత్త ‘’గా పేరు పొందారు .సూరి సీతారం రాం గోవా వీరుడని పించుకొన్నాడు .వీరందరి ప్రేరణ స్పూర్తి మనకు ఆదర్శం కావాలి .
‘’ రాక్షసీ! నీ పేరు రాజ కీయం ‘’అన్న మాట మారిపోయి ‘’రాక్షకీ ! నీపేరు రాజకీయం కావాలి ‘’అనేది కొత్తనినాదం కావాలి . స్లోగన్ నాయకులను వదిలేసి ‘’విజన్ ‘’ఉన్న వారిని ఎన్నుకొని కొత్త మునిసిపాలిటీ కి కొత్త జవ సత్వాలను అందించండి .ఇలాంటి మంచి చర్చా వేదికను ఏర్పాటు చేసిన ‘’మీ, మా ,’’మన చానెల్ ‘’వారికి అభినందనలు .ఇలాంటి చర్చలు ఇక ముందుకూడా సామజిక అంశాలపై నిర్వహించి ప్రజా సేవ లో ముందుండాలని ‘’మన ‘’వారిని కోరుతున్నాను .నాకు ఈ వేదిక పై అవాకాశం ఇచ్చిన’’మన వారందరికీ ‘’కృతజ్ఞతలు .’’అని ముగించాను .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-3-14-ఉయ్యూరు