వ్యంగ్య హాస్యం లో ”యశ్వంత్ ”-కుష్వంత్

వ్యంగ్యం,శృంగారం,హాస్యమూ ఆయన ఆయుధాలు
సర్దార్జీ జోకులకు చిరునామా
నవలా రచయిత, పాత్రికేయుడు కూడా

దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు భారతీయ వీఐపీలకు పోలీసులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు సూచించారు. కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని చెప్పారు. అవేంటంటే..తరచూ ఒకే హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లవద్దు
ప్రతిరోజూ ఒకే సమయంలో ఒకే పార్కుకు వాకింగ్‌కు వెళ్లవద్దు
ప్రతిరోజూ ఆఫీసుకు ఒకే కారులో వెళ్లవద్దు
ప్రతి రాత్రీ ఒకే స్థలంలో ఒకే వ్యక్తితో పడుకోవద్దు

… కాస్తంత శృంగారంతో కూడిన హాస్యం కనిపించిందా!? అయితే ఇది తప్పకుండా కుష్వంత్ సింగ్ జోకే! వ్యంగ్యంతో కూడిన హాస్యోక్తులతో.. సర్దార్జీ జోకులతో.. తన రచనలతో దేశ ప్రజలను ఆనందడోలికల్లో ఓలలాడించిన ప్రఖ్యాత రచయిత, జర్నలిస్టు కుష్వంత్ సింగ్ (99) ఇకలేరు! సంపూర్ణ జీవితాన్ని అనుభవించడమే కాకుండా జీవిత చరమాంకం వరకూ ఏదో ఒక రచన చేస్తూ వచ్చిన అక్షర సైనికుడు గురువారం ఉదయం తన స్వగృహంలోనే ప్రశాంతంగా తుది శ్వాస విడిచారు. కుష్వంత్ భార్య 2001లోనే మరణించగా.. ప్రస్తుతం ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చనిపోయే చివరి క్షణం వరకు మానసికంగా ఆరోగ్యంగా, స్పృహలోనే ఉన్నారని, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయన మరణించారని కుష్వంత్ తనయుడు రాహుల్ సింగ్ చెప్పారు. ఉదయం మరణించిన కుష్వంత్‌కు గురువారం సాయంత్రమే ఢిల్లీలోని దయానంద్ ముక్తిధామ్ విద్యుత్తు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతోపాటు కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, కపిల్ సిబల్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ, జయా జైట్లీ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. కుష్వంత్‌కు అభిమానులు ఎంతమందో ఆయనను ద్వేషించేవారు కూడా అంతేమంది! భారత్, పాక్ శాంతి ప్రక్రియలో కుష్వంత్ అత్యంత కీలక పాత్ర పోషించారు. వీసా నిబంధనలు లేకుండా ఇరు దేశాల ప్రజలు స్వేచ్ఛగా సంచరించాలని ఆకాంక్షించేవారు. అలాగే, దేశంలో ‘సర్దార్జీ జోకులు’ తెలియనివారు ఉండరు. కుష్వంత్ జోకులనే సర్దార్జీ జోకులని పిలుస్తారు. అందుకే, కుష్వంత్ చనిపోయారని తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో నివాళులు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఐయూఎంఎల్ నాయకుడు అహ్మద్, కేంద్ర మంత్రి మనీష్ తివారీ, సినీ నటుడు షారుక్ ఖాన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

బూతు జోకుల రచయిత
కుష్వంత్ అనగానే చాలామంది బూతు జోకుల రచయితగానే చూస్తారు. ఆయనను ‘ద డర్టీ ఓల్డ్ మేన్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం’ అని కూడా అంటుంటారు. కానీ, శృంగారం, జోకులు ఆయన జీవితంలో ఒక భాగం మాత్రమే. రచయితగా ఆయన విభిన్న అంశాలపై రచనలు చేశారు. భారత్, పాకిస్థాన్ విభజన సమయంలో జరిగిన ఘటనలపై ఆయన రాసిన ‘ట్రైన్ టు పాకిస్థాన్’ మనసులను పిండేస్తుంది. ఇరు దేశాల సరిహద్దుల్లో అప్పటి ఘటనలను కళ్లకు కడుతుంది (ఇందులో కూడా ఆయన శృంగారానికి పెద్దపీట వేశారనేది మరో విమర్శ). మహిళలను ఆయన కేవలం శృంగారానికి పనికొచ్చే వస్తువుగానే చూశారు. అదే విషయాన్ని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు కూడా. అందుకు తన చివరి రోజుల్లో రాసిన ఆత్మకథ ‘కుష్వంత్‌నామా – ద లెసన్స్ ఆఫ్ లైఫ్’లో ఆయన విచారం కూడా వ్యక్తం చేశారు. “మీకో విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచీ నేను కాముకుడినే. శృంగారపరమైన ఆలోచనలు నాకు నాలుగో ఏటనే మొదలైపోయాయి. ఇప్పుడు 97 పూర్తయ్యాయి. ఇప్పటికీ నా మది నిండా అవే ఆలోచనలు. భారతీయ సమాజంలో మహిళలను తల్లులుగా, చెల్లెళ్లుగా, కుమార్తెలుగా పరిగణిస్తారు. కానీ, నేను ఎన్నడూ అలా చూడలేదు” అని రాసుకున్నారు. న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రారంభించి దౌత్యవేత్తగా ఎదిగారు. తర్వాత జర్నలిస్టుగా మారారు. భారత ప్రభుత్వం తరఫున కెనడా, టొరంటోల్లో సమాచార అధికారిగా పని చేశారు. బ్రిటన్, ఐర్లండ్‌ల్లోని హై కమిషన్ కార్యాలయంలో సమాచార అధికారిగా వ్యవహరించారు. ఆ తర్వాత ప్రణాళికా సంఘం ప్రచురించే ‘యోజన’ పుస్తకానికి వ్యవస్థాపక ఎడిటర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ద నేషనల్ హెరాల్డ్, హిందుస్థాన్ టైమ్స్‌లకు ఎడిటర్‌గా పని చేశారు. అప్పట్లో ఆయన రాసిన ‘విత్ మాలిస్ టూవార్డ్స్ వన్ అండ్ ఆల్’ ఎంతో ప్రాచుర్యం పొందింది.

ఇందిరకు అత్యంత సన్నిహితుడు
రచయితగా, జర్నలిస్టుగా, కామెంటేటర్‌గా విభిన్న పాత్రలను ఆయన పోషించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుల్లో కుష్వంత్ ఒకరు. ఇందిర విధించిన ఎమర్జెన్సీని సమర్థించిన అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. అందుకే, ఎమర్జెన్సీ ముందు 1974లో ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్‌తో సత్కరించింది. 1980లో రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు. కానీ, ఇందిరా గాంధీ హయాంలోనే అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై సైనిక చర్యకు నిరసనగా ఆయన పద్మ భూషణ్‌ను వెనక్కి ఇచ్చేశారు. అయినా, కేంద్రం 2007లో ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 97 ఏళ్ల వయసులో తన ఆత్మకథ ‘ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మాలిస్’ను రాశారు. దానిని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్‌కు అంకితమిచ్చారు. ఆ తర్వాత గత ఏడాది “2012 స్వాతంత్య్ర దినోత్సవం రోజున నాకు 98 ఏళ్లు వచ్చాయి. నా ఆరోగ్య పరిస్థితి నాకు తెలుస్తూనే ఉంది. మరో పుస్తకాన్ని ఇక రాయలేను. నేను చాలా ఏళ్లు జీవించాను. నాకు లోటు అన్నదే తెలియదు. సంపూర్ణ జీవితాన్ని అనుభవించాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను చచ్చిపోవాలని అనుకుంటున్నా. నా జీవితంలోనూ, జోకుల్లో కూడా నేను మనిషినీ వదిలిపెట్టలేదు. దేవుడినీ వదిలిపెట్టలేదు. అందుకే, తమను నవ్వించిన వ్యక్తిగా ప్రజలు గుర్తుంచుకుంటే నాకదే చాలు” అని రాసుకున్నారు. విచిత్రం ఏమిటంటే.. ప్రజలు ఆయనను హాస్యప్రియుడుగానూ గుర్తుంచుకుంటారు. అపహాస్య ప్రియుడుగానూ గుర్తుంచుకుంటారు!!

ప్రముఖ రచయిత, జర్నలిస్టు కుష్వంత్ సింగ్ వందేళ్లూ పూర్తి చేస్తారని ఎంతగానో ఆశించిన మేధావులు, విమర్శకులు, విశ్లేషకులు, కాలమిస్టులు, పాత్రికేయులు, రచయితలకే కాక అశేష పాఠకులకు, అభిమానులకు ఆయన తీవ్ర నిరాశనే మిగల్చినట్టయింది. ఈ లోకాన్ని దాదాపు పూర్తిగా చదివేసి, జీర్ణించుకున్న కుష్వంత్ అజ్ఞాత లోకానికి తన 99వ ఏట తరలిపోవడం కోట్లాదిమంది అభిమానుల్ని విషాదంలో ముంచేసిందనడంలో సందేహం లేదు. భారతదేశంలో ఆయన వంటి రచయిత గానీ, కాలమిస్టు గానీ న భూతో న భవిష్యతి.

ఇప్పటి పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో హడాలి అనే గ్రామంలో 1915 ఫిబ్రవరి 2న జన్మించిన కుష్వంత్ సింగ్ లండన్‌లో న్యాయశాస్త్రం చదివారు. ఆయన వ్యంగ్య, హాస్య రచనల్లో పేరెన్నికగన్న వ్యక్తి. కవితలు, పద్యాలంటే చెవి కోసుకునే కుష్యంత్ పాశ్చాత్యులకు, భారతీయులకు మధ్య ఉన్న సామాజిక, నడవడికి సంబంధించిన సారూప్యాలను తన హాస్య రచనల్లో, ప్రసంగాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. 1970, 1980 దశకాల్లో ఆయన అనేక సాహిత్య, వార్తా సంచికలకు, రెండు జాతీయ వార్తా పత్రికలకు సంపాదకుడుగా పనిచేశారు. 2007లో దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ ఆయనను వరించింది. ఆయన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘యోజన’ పత్రికకు ప్రారంభ సంపాదకుడు. ఆ తరువాత ఆయన ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ వారపత్రికకు సంపాదకుడుగా బాధ్యతలు నిర్వహించి, దాని సర్క్యులేషన్‌ను 65 వేల నుంచి నాలుగు లక్షలకు తీసుకు వెళ్లారు.

ఆ తరువాత ‘నేషనల్ హెరాల్డ్’, ‘హిందుస్థాన్ టైమ్స్’ దినపత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీలో ఆయన నిర్వహించిన ‘విత్ ది మెలైస్ టువార్డ్స్ వన్ అండ్ ఆల్’ అనే కాలమ్ కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంది. ఈ కాలమ్‌లో ఆయన లౌకికవాద భావాలు, శాంతి సందేశాలు ప్రతిఫలించేవి. ఉర్దూ, పంజాబీ భాషల్లో ఉద్దండులైన పలువురు రచయితలతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆయన తన కాలమ్స్‌లో తప్పనిసరిగా ప్రస్తావించేవారు.
గ్రంథకర్తగా ఆయన దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన రాసిన ‘ట్రెయిన్ టు పాకిస్థాన్’, ‘ఐ షల్ నాట్ హియర్ ది నైటింగేల్’, ‘ఢిల్లీ’ పుస్తకాలు అనేక పర్యాయాలు పునర్ముద్రణలకు నోచుకున్నాయి. 95 ఏళ్ల వయసులో ఆయన రాసిన ‘ది సన్‌సెట్ క్లబ్’ అమ్మకాల్లో ఓ రికార్డు సృష్టించింది. ఇక ఆయన రాసిన ‘ఎ హిస్టరీ ఆఫ్ ది సిక్స్’ అనే రెండు సంపుటాల గ్రంథం అనేక భాషల్లోకి తర్జుమా అయింది. ఆయన అనువాదాలు, రచనల్లో సిక్కు మతం, సంస్కృతి, ప్రకృతి, వర్తమాన విశేషాలు, ఉర్దూ కవితలు పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన 2002లో రాసిన ఆత్మకథ ‘ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మెలైస్’ అనే గ్రంథం విదేశాల్లో సైతం విపరీతంగా అమ్ముడుపోయింది. ఆయన 80కి పైగా గ్రంథాలు రాశారు.

1980 నుంచి 1986 వరకూ రాజ్యసభ సభ్యుడుగా కూడా ఉన్న కుష్వంత్‌కు 1974లో పద్మభూషణ్ పురస్కారం లభించింది కానీ, 1984లో స్వర్ణాలయంపై సైనికుల దాడికి నిరసనగా ఆయన ఆ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. ఆయన కావల్ మాలిక్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనకు రాహుల్ సింగ్ అనే కుమారుడు, మాలా అనే కుమార్తె ఉన్నారు. ఢిల్లీలో స్థిరపడ్డారు. తన స్త్రీలోలత్వం గురించి, కొందరు ప్రముఖ మహిళలతో ఉన్న సంబంధాల గురించి చేతిలో ‘స్కాచ్’ గ్లాసుతో నిర్మొహమాటంగా చెప్పుకునేవారు.

ఆయన తన ప్రజా జీవితంలో కొన్ని అభాండాలను కూడా మోయక తప్పలేదు. ఆయన పాలక కాంగ్రెస్ పార్టీకే అనుకూలమనే విమర్శలు వస్తుండేవి. ఇందిరా గాంధీ కుటుంబానికి ఆయన సన్నిహితుడు కావడం అందుకు కారణం. స్వర్ణాలయం మీద దాడి జరిగిన తరువాత ఆ సాన్నిహిత్యం బెడిసింది. ఆమె మరణానంతరం సిక్కుల మీద దేశవ్యాప్తంగా జరిగిన దాడులు కూడా ఆయనను కలచివేశాయి. ఆ తరువాత ఆయన ప్రముఖ న్యాయవాది హెచ్.ఎస్. ఫుల్కా ప్రారంభించిన సిటిజెన్స్ జస్టిస్ కమిటీలో చేరి సాధారణ పౌరుల హక్కుల కోసం పోరాడారు.

తాను చాలా అదృష్టవంతుడినని, చక్కని భోజనం, మధురమైన మద్యం ఏనాడూ తనకు దూరం కాలేదని కుష్వంత్ చెప్పేవారు. ‘కుష్వంత్‌నామాః ది లెసన్స్ ఆఫ్ మై లైఫ్’ అనే తన పుస్తకంలో ఆయన జీవితం నేర్పిన పాఠాల గురించి చక్కని ఉదంతాలతో రాశారు. వృద్ధాప్యం, మరణం పట్ల భయం, సెక్స్‌లోని ఆనందం, కవితల్లోని మాధుర్యం గురించి, హాస్యం ప్రాధాన్యం గురించి, సంతోషకర జీవితం గురించి అద్భుతంగా వ్యాసాలు రాశారు. అలాగే రాజకీయ నాయకులు, రాజకీయాలు, భారతదేశ భవిష్యత్తు వంటి అంశాలపై కూడా ఆయన లోతైన అవగాహనతో వ్యాసాలు రాశారు.ఆయన స్వయంగా చెప్పినట్టు ‘ది డర్టీ ఓల్డ్ మ్యాన్’ కుష్వంత్ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.