కళింగాంధ్ర చరిత్రలో అపూర్వ ఘట్టం… – డా. తుర్లపాటి రాజేశ్వరి

కళింగాంధ్ర చరిత్రలో అపూర్వ ఘట్టం… – డా. తుర్లపాటి రాజేశ్వరి

కొసమెరుపు ఏమిటంటే భాగవతులు ప్రదర్శించే ఈ ‘కేళిక’లో ‘చోడగంగు’గా నిజమైన చోడగంగదేవ్ నటించటం! రంగస్థలం మీద తెరతీయగానే చోడగంగదేవ్ గుర్రం మీద, కత్తితో కనిపించగానే ప్రేక్షకులలో ఆశ్చర్యం, రాజూ అతడి పరివారంలో ఆందోళన మొదలైంది. రాజపాత్రధారి రంగస్థలంమీద కత్తితో పలువిధాల విన్యాసాలు చేస్తూ, రెప్పపాటులో వేదికమీద నుంచి జనం మధ్యలోకి దూకాడు. కొత్త రాజును సమీపించి అతడి శిరసును ఖడ్గంతో ఖండించి, తాను చోడగంగదేవ్‌నని ప్రకటించాడు. పిమ్మట సింహాసనాన్ని అధిష్టించాడు.

అనంతవర్మ చోడ గంగదేవ్ (క్రీ.శ. 1078-1147) గాంగ వంశ రాజులలో సుప్రసిద్ధుడు. ఈ రాజు పాలనలో ఒడిషా రాజకీయంగా, సాంస్కృతికంగా పురోగమించింది. చోడ గంగదేవ్ కళింగ రాజ్యాధిపతి దేవేంద్రవర్మ మొదటి రాజరాజు కుమారుడు. దేవేంద్రవర్మ మొదటి రాజరాజు కళింగ దేశాన్ని క్రీ.శ. 1072 నుంచి 1078 వరకు పాలించాడు. చోళరాజుని, వేంగీ దేశాన్ని పాలిస్తున్న నాటి చాళుక్య రాజుల్ని జయించిన పరాక్రమవంతుడు. చోళరాజైన మొదటి కుళోత్తంగుని కుమార్తె రాజసుందరిని మొదటి రాజరాజు వివాహమాడాడు. వీరి కుమారుడే చోడ గంగదేవ్. తండ్రి మొదటి రాజరాజు మరణానంతరం క్రీ.శ. 1078లో చోడ గంగదేవ్ కళింగ రాజసింహాసనాన్ని అధిష్టించాడు. దాయాదులు ఈ రాజ్యాన్ని ఆక్రమించాలని ప్రయత్నించటంతో చోడ గంగదేవ్ చిన్న వయసులో కష్టాల పాలయ్యాడు. దాయాది దేవేంద్ర వర్మ, ఉత్కళ సోమ వంశరాజు పురంజయునితో కలిసి చోడ గంగదేవ్‌ని ఓడించాడు. రాజ్యాధికారం పోగొట్టుకున్న చోడ గంగదేవ్ మారువేషంలో కొన్నాళ్ళు ఆంధ్ర దేశంలో సంచరించి- నాటకీయంగా మళ్ళీ రాజ సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ సందర్భం మన తెలుగు కవితోనూ, మన తెలుగు కళారూపంతోనూ ముడివడి చరిత్రలో అద్భుత రసమయ ఘట్టంగా నిలిచింది. ఈ విషయాలను మన తెలుగు రచయితలూ, పరిశోధకులూ, అటు ఒడియా చరిత్రకారులూ, ఒడియా గ్రంథాలు ఉటంకించటం విశేషం.
వేములవాడ భీమకవి ఆంధ్ర దేశంలో సుప్రసిద్ధ శైవక్షేత్రం దాక్షారామం సమీపాన గల వేములవాడ గ్రామ నివాసి. భీమకవి తెలుంగాధీశుని సంబోధిస్తూ ఈ క్రింది పద్యం చెప్పాడు.

‘ఘనుడన్ వేములవాడ వంశజుడ; దాక్షారామ భీమేశనం
దనుడన్, దివ్యవిషామృత ప్రకటనా కావ్యధుర్యుండ; భీ
మన నాపేరు: వినంగ జెప్పితి దెలుంగాధీశ: కస్తూరికా
ఘన సారాది సుగంధ వస్తువులు వేగందెచ్చి లాలింపురా!’
ఈ సమాచారం వల్ల భీమకవి దాక్షారామంలో ప్రధాన దైవతమైన భీమేశ్వరుని అనుగ్రహం వలన జన్మించిన వాడని, విషమయమూ, అమృతమయమూ అయిన కావ్య నిర్మాణం చేయగల సమర్థుడనీ, సుగంధ ద్రవ్యాలంటే మోజు ఉన్నవాడనీ, ఇతరులను శాసించే పద్ధతిలో ఎంతటి వారితోనైనా మాట్లాడే – వెరసి – ఒక విలక్షణ వ్యక్తిత్వం కలవాడిగా ఊహించవచ్చు. భీమకవి శాపానుగ్రహ శక్తి, రచనలను గూర్చి ‘అమరకవుల’లో విద్వాన్ దీపాల పిచ్చయ్య శాస్త్రి, ‘సమగ్రాంధ్ర సాహిత్యం’లో ఆరుద్ర, తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథంలో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి, తదితరులెందరో పేర్కొన్నారు.

భీమకవి ఒక వితంతువుకి పుట్టినందున వేములవాడలో సాటి బ్రాహ్మణులందరూ వీరి కుటుంబాన్ని వెలివేశారు. ఒకరోజు గ్రామంలో చైనులు గారింట్లో కాశీ సమారాధాన జరుగుతోంది. ఒక భీమేశ్వరుని కుటుంబం తప్ప తక్కిన బ్రాహ్మణులందరూ భోజనాలకి వచ్చారు. లోపల వడ్డన పూర్తి అయింది. భీమన బయట అరుగు మీద కూర్చున్నాడు. జరిగిన అవమానానికి చాలా బాధపడుతూ, గ్రామంలో బ్రాహ్మణులకి బుద్ధిచెప్పటానికి ఇదే సమయమని తలచాడు. ‘పప్పలన్నీ కప్పలూ- అన్నమంతా సున్నమూ’ అని ఒక చిన్నపాట పాడాడు. వెంటనే లోపల విస్తళ్ళలో వడ్డించిన అన్నము సున్నమైంది. పప్పలు (భక్ష్యాలు) కప్పలై – ఇల్లంతా గంతులు వేస్తూ తిరగటం మొదలెట్టాయి. దానితో సమారాధన రసాభాస అయింది. దీనికంతటికీ కారణం భీమన కుటుంబాన్ని తాము వెలివేయటమని చైనులుగారు తెలుసుకున్నారు. ఆయన బయటకు వచ్చి భీమనను చూసి, క్షమాపణ చెప్పటంతో భీమన ‘కప్పలనీ పప్పలూ – సున్నమంతా అన్నమూ’ అని పాట పాడాడు. విచిత్రంగా అలాగే జరిగింది. ఆరోజు నుంచీ చిన్న భీమన భీమకవిగా మర్యాదా, మన్ననా పొందాడు. అప్పట్లో కవులు రాజుల సంస్థానాలను సందర్శించి తమ ప్రతిభా పాండిత్యాలను ప్రదర్శించి – పండిత సభలో సత్కారాలందుకునేవారు. వేములవాడ భీమకవి రాజాస్థానాలని సందర్శిస్తూ, ఒకమారు కళింగ దేశం వెళ్ళి రాజు చోడ గంగు దర్శనం కోరాడు. అయితే రాజు ‘సందడిలో ఉన్నాను: అది తీరాక రమ్మను’ అని భటుడికి చెప్పిపంపాడు.. అప్పుడు భీమకవికి కోపం వచ్చింది. ఇలా అన్నాడు.

‘వేములవాడ భీమకవి వేగమె కళింగ గంగు తా
సామము మాని కోపమున సందడి దీరిన రమ్ము పొమ్మనెన్
మోమును జూడ దోషమిక ముప్పది రెండు దినంబు లావలన్
జామున కర్థమందతని సంపద శత్రుల జేరు గావుతన్’
కవిగారి శాపం వల్లనో, రాజుకు పట్టిన దుర్దశ వల్లనో రాజ్యం శత్రువుల హస్తగతమైంది. చోడగంగు మారువేషంలో ఆంధ్ర దేశంలో తలదాచుకున్నాడు. ఒక రోజు రాత్రి భీమకవి వైభవంగా దివిటీలవారు త్రోవచూపుతుండగా పల్లకీలో వెళుతుంటే, పక్కన ఒక వ్యక్తి దారి సరిగ్గా కానరాక చీకట్లో గోతిలో పడి ‘..కాలి దివిటీ లేని బ్రతుకేమి బ్రతుకురా?’ – అని ఆక్రోశించటం వినిపించింది. కవి పల్లకీ ఆపి, మాటలలో అతడే రాజు చోడగంగు అని తెలుసుకున్నాడు. రాజు కూడా పల్లకీలో వ్యక్తి భీమనయని గ్రహించి తన తప్పు క్షమించమని, వేడుకున్నాడు. భీమకవి తన వాక్కు అమోఘమైన శక్తిగలదని చెబుతూ, రాజుని అనుగ్రహిస్తూ ఈ క్రింది విధంగా అన్నాడు.

‘వేయి గజంబులుండ పదివేల తురంగములుండ నాజిలో
రాయల గెల్చి సజ్జ నగరంబున బట్టము కట్టుకోవడిన్
రాయ కళింగ గంగ! కవిరాజు భయంకరమూర్తి సూడు దా
బోయిన మీన మాసమున బున్నము పోయిన షష్ఠి నాటికిన్’
కవిగారి దీవెన ఫలించి చోడగంగు ఉత్కళ రాజ సింహాసనాన్ని ఆక్రమించగలిగాడు. అయితే అది నాటకీయంగా రాజు మన భాగవతుల బృందంతో కలిసి సాధించగలిగాడు.
కళా సాంప్రదాయం కూచిపూడి భాగవతుల ప్రదర్శన : కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామం కూచిపూడి. నాట్య ప్రశస్తి తెలుగునాట అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఉండటం చేత సిద్ధేంద్రయోగికి పూర్వమే కూచిపూడి నాట్యవిద్యకు నిలయంగా భాసిల్లినదనే సిద్ధాంతాన్ని డా. వేదాంతం రామలింగశాస్త్రి ‘కూచిపూడి నాట్య ప్రశస్తి’ వ్యాసంలో వక్కాణించారు. కూచిపూడి నాట్యవిద్యలో భరతుడు మొదలైన ఆలంకారికులు, శాస్త్రవేత్తలూ పేర్కొన్న నాట్యాలంకార సూత్రాలన్నీ ప్రతిబింబిస్తాయి. అంతేకాకుండా శాస్త్రాలలో చెప్పని దేశీయతా విజ్ఞానాన్ని స్వంతం చేసుకుని కూచిపూడి నాట్యకళ ప్రశస్తి పొందింది. కూచిపూడి పండితులు – దేశ ద్రిమ్మరులు. శతాబ్దాలుగా వీరు ఊళ్ళలో పర్యటిస్తూ, అక్కడ ప్రదర్శనలిస్తూ కళాపోషకుల ఆదరణతో తమ జీవినం గడిపేవారు. ప్రదర్శనకు సమకాలీన చరిత్రలను స్వీకరిస్తూ – సమాజంలో రుగ్మతలను దురాచారాలను ఖండిస్తూ – రసోచితంగా ప్రదర్శించేవారు. పగటి వేషాలు కూడా జానపద కళారూపాలలో ఒకటి. కూచిపూడి పగటి వేషధారులకు నిలయంగా ఉండేది. సమీపాన ఉన్న గడ్డిపాడులో ఈ కళాకారుల సంఖ్య అధికంగా ఉండేది.

వేములవాడ భీమకవి ఆశీస్సులు పొందిన చోడగంగు శత్రువులు తనని గుర్తించకుండా పగటి వేషగాండ్ర ముఠాలో చేరి ఊరూరా తిరుగుతూ, వారితో సజ్జనగరం వెళ్ళాడు. ఈ విషయాన్ని అనంత వర్మ, చోడగంగదేవ్‌పై పరిశోధన చేసిన ఒడిషా చరిత్ర పరిశోధకుడు డా. కైలాస్ చంద్రదాస్ ఈ కింది విధంగా పొందుపరిచారు.
“… a group of people of Kuchipudi Bhagavat sect proceeded to kalinga with their musical instruments for a show. on the way the man carrying all the musical instruments on bealf of the party died. the party was in eager need of a man who would carry app these instruments to kalinga. The party people saw the deserted king (who was not known to them as chodaganga) who was singing a song. They negotiated with him that he would carry all the musical instruments to kalinga and would get food for his service. In this way the Bhagavata group and the man carrying all the musical instruments reached kalinganagara. The new king made all arrangements for stay. It was decided that the party would play the act by which he defeated the former king chodaganga..” (O.H.R.J. Vol XXXIV No : 344. Page 3)

ఇందులో కొసమెరుపు ఏమిటంటే భాగవతులు ప్రదర్శించే ఈ ‘కేళిక’లో ‘చోడగంగు’గా నిజమైన చోడగంగదేవ్ నటించటం! రంగస్థలం మీద తెరతీయగానే చోడగంగదేవ్ గుర్రం మీద, కత్తితో కనిపించగానే ప్రేక్షకులలో ఆశ్చర్యం, రాజూ అతడి పరివారంలో ఆందోళన మొదలైంది. రాజపాత్రధారి రంగస్థలంమీద కత్తితో పలువిధాల విన్యాసాలు చేస్తూ, రెప్పపాటులో వేదికమీద నుంచి జనం మధ్యలోకి దూకాడు. కొత్త రాజును సమీపించి అతడి శిరసును ఖడ్గంతో ఖండించి, తాను చోడగంగదేవ్‌నని ప్రకటించాడు. పిమ్మట సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ అద్భుత రసాత్మక ఘట్టం గురించి ‘ఎల్లోరా’ తమ వ్యాసంలో పేర్కొన్నారు.

‘పగటి వేషాల ద్వారా రాజులలో మార్పును తేవడం, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడం ప్రత్యేకించి ఉదహరించవలసి ఉంటుంది. కళింగ గంగ రాజు పగటి వేషాల వారి సాయంతోనే శత్రువులను జయించాడనే కథ విన్నదే కదా!’ (జానపదకళలు – 2వ ప్రపంచ తెలుగు మహాసభలు, 1981 ప్రత్యేక సంచిక, పుట-88.)

‘మాదలాపంజి’ జగన్నాధ స్వామి ఆలయం పూరీలో భద్రపరిచిన “Temple Chronicle’. ఇందులోని రాజభోగం అధ్యాయంలో ఈ వృత్తాంతం పేర్కొన్నారు. “He came in the guise of an actor (nata besa re ase) pounced upon kataka (The soma vamsi kingdom) and declated himself king”. (O.H.R.J. Vol XXXIV No.344)
చోడ గంగదేవ్ సంహరించిన రాజు పేరు కర్ణదేవుడు. ఈ విషయం 12వ శతాబ్దికి చెందిన బెంగాలీ గ్రంథం రామచరిత్రలో కూడా పేర్కొనబడినట్లుగా కైలాస చంద్రదాస్ తన పరిశోధనా వ్యాసంలో రాశారు.
భాషా, ప్రాంతీయతా ఎల్లలను అధిగమించిన చోడగంగదేవ్ ఉత్కళ విజయ గాథ; అటు కూచిపూడి భాగవతుల ప్రాచీనతనీ, కళింగ చరిత్రలో వారు పోషించిన అమోఘమైన పాత్రనీ, ఇటు వేములవాడ భీమకవి కవితా శక్తిని ఉదహరించే సంఘటనలతో చరిత్రలో అపూర్వ కథనంగా నిలిచిపోయింది.
– డా. తుర్లపాటి రాజేశ్వరి

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.