తెలుగు సాహితీ శిఖరం పుట్టపర్తి.. – వాండ్రంగి కొండలరావు

తులసీదాసు రామాయణాన్ని చదివేందుకు పుట్టపర్తి వారు హిందీ భాషను నేర్చుకున్నారు. ఆ రామాయణాన్ని యుద్ధకాండవరకు కంఠస్థం చేసిన మహానుభావుడు నారాయణాచార్యులు. ఆ ప్రభావంతోనే జనప్రియ రామాయణాన్ని రచించారు…. వీరి రచనలలో తొలుత రవీంద్రకవి ప్రభావం ఉన్నప్పటికి ఆ తరువాత అరవిందయోగి ప్రభావం కన్పిస్తోంది.
కవిగా, పండితునిగా, సాహితీ విమర్శకునిగా, అనువాదకునిగా, బహుభాషా కోవిదునిగా, సంగీత కళానిధిగా, వక్తగా ఎనలేని ఖ్యాతిని సొంతం చేసుకున్న సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు ధన్యజీవి. ‘వాణి నా రాణి’ అని పిల్లలమర్రి పినవీరభద్రుడు చెప్పుకున్నట్లు, శ్రీశ్రీ ‘ఈ శతాబ్దం నాది’ అని వెల్లడించుకున్న తరహాలోనే ‘పాండితీ శోభ పదునాల్గు భాషలందు’ అని పుట్టపర్తి నారాయణాచార్యులు సగర్వంగా చెప్పుకున్నారు. వందకుపైగా కృతులను రచించి తెలుగుభాషకు వన్నెతెచ్చిన మహానుభావుడు ప్రాచీనతకు నవ్యతకు ఓ వారధిగా నిలిచాడు. ఇన్ని ప్రత్యేకతలున్న మరో కవి తెలుగు సాహిత్యంలో కన్పించరనేది అక్షరసత్యం.
‘ఘల్లుఘల్లుమని, కాళ్ళ చిలిపి గజ్జెల మోయ/ ఆడెనమ్మో శివుడు! పాడేనమ్మ శివుడు!…’ అనే రీతిలో శివతాండవం కావ్యాన్ని రాశారు. పుట్టపర్తి వారికి ఈ కావ్యం అఖండ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. వీరి కవితా శక్తిని, పాండితీ వైవిధ్యాన్ని, సంగీత, నృత్య హేలను లోకానికి చాటి చెప్పిన అద్భుత కావ్యమిది. ‘శివతాండవం’లోని ఖండికలను పుట్టపర్తి ఆలాపించిన సందర్భాలలో ప్రేక్షకులు, ఉర్రూతలూగేవారట. పరవశించి నాట్యం చేసేవారు. రగడ ఛందస్సులో దీనిని రాసారు.
1914 మార్చి 28వ తేదీన అనంతపురం జిల్లా చియ్యేరు గ్రామంలో జన్మించారు. దక్షిణ భారతదేశపు భాషలతో పాటు సంస్కృతం, మరాఠీ, బెంగాలీ, పార్శీ, ఫ్రెంచ్ తదితర 14 భాషలను నేర్చుకొని సెహబాస్ అనిపించుకున్నారు. అనంతపురం, పెనుగొండలలోను, తిరుపతి సంస్కృత కళాశాలలోను విద్యాభ్యాసం చేశారు. పదునాలుగేళ్ల వయసులోనే ‘పెనుగొండలక్ష్మి’ అనే పద్యకావ్యాన్ని రాసారు. ఈ కావ్యం విద్వాన్ పరీక్షకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించారు. ఆయన విద్వాన్ పరీక్షకు (1938) హాజరయినప్పుడు తాను రచించిన ఈ కావ్యాన్నే పాఠ్యాంశంగా చదువుకోవలసి వచ్చింది. సాధారణంగా ఏ రచయితకూ ఎదురుకాని ఆశ్చర్యకరమైన అనుభవం ఇది. పెనుగొండలో రూపొందించిన పద్మినీ జాతి స్త్రీ శిల్పాన్ని తనివి తీరా చూసి కవి పొందిన భావావేశానికి నిదర్శనంగా ‘ఉలిలో తేనెల సోనలన్ చితికి… ముద్దుగొనియుండున్ ప్రేమ విభ్రాంతుడై’ అనే ఈ పద్యం పెనుగొండలక్ష్మీ కావ్యంలో ఎంతో హృద్యంగా కన్పిస్తుంది. కాళిదాసు ‘మేఘసందేశం’ ఆధారంగా నవ్యతను రంగరించి సామాజిక స్పృహతో పుట్టపర్తి వారు ‘మేఘదూతం’ కావ్యాన్ని రాసారు. ముచ్చటగా మూడు అధ్యాయాలతో ఉన్న ఈ గేయ కావ్యంలో సామాన్యుడే కథానాయకుడు. మానవతా దృక్పథానికి, శాంతికాముకతకు, వర్ణనా రమణీయతకు, చారిత్రాత్మకతకు నిలువుటద్దంగా నిలుస్తుంది. ఈ రసమయ కావ్యంలో ఓరుగల్లు వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూ ‘అచట విద్యానాథు/ ఢమరకవి కనిపించు/ చీకిపోయిన గుండియలతో/ నా కట్టు బాష్ప సంతతితో’ అని రాసిన తీరు మనల్ని ఎంతో ఆకట్టుకుంటుంది.
పుట్టపర్తి వారి కావ్యాలలో మరో ఆణిముత్యం ‘షాజీ’. ఈ కావ్యాన్ని తొమ్మిదవ ఏటనే రాసారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు.
పాండిచ్చేరిలో అరవిందయోగితో తనకు గల పరిచయం ఓ దివ్యానుభూతిగా పుట్టపర్తి వారు పేర్కొనేవారు. అరవిందుడు రాసిన ఆంగ్ల గ్రంథాలలో ఎనిమిదింటిని తేట తెలుగులో అనువదించారు. వీటిలో ‘తలపులు-మెరుపులు’, ‘గీతోపన్యాసములు’ ముఖ్యమైనవి. పుట్టపర్తివారు ప్రొద్దుటూరు, కడప, అనంతపురం విద్యాలయాల్లో అధ్యాపకునిగా పనిచేశారు. ఆయన ప్రతిభను గుర్తించి 1955లో తిరువాన్కూర్ (కేరళ) విశ్వవిద్యాలయం వారు నిఘంటు విభాగంలో ఎటమాలజిస్ట్గా నియమించారు. ఆ తరువాత న్యూఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీలోని భాషా శాస్త్రాల గ్రంథాలయంలో 1958 నుంచి రెండేళ్లపాటు గ్రంథ పాలకునిగా పనిచేసి విశిష్ట సేవలందించారు. కుటుంబ సమస్యల వల్ల ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి తిరిగి కడప రామకృష్ణ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా చేరి ఉద్యోగ విరమణ వరకు అక్కడే పనిచేశారు. ప్రసిద్ధి చెందిన తులసీదాసు రామాయణాన్ని చదివేందుకు పుట్టపర్తి వారు హిందీ భాషను నేర్చుకున్నారు. ఆ రామాయణాన్ని యుద్ధకాండవరకు కంఠస్థం చేసిన మహానుభావుడు నారాయణాచార్యులు. ఆ ప్రభావంతోనే జనప్రియ రామాయణాన్ని రచించారు. మలయాళ భాషను అధ్యయనం చేసి నాటి కేరళ విద్యామంత్రి రాసిన ‘కొదిలైలున్ కురు శిలైక్’ అనే నవలను ఆంధ్రీకరించారు. విశ్వనాధ సత్యనారాయణ రాసిన ప్రసిద్ధ నవల ‘ఏకవీర’ను మలయాళ భాషలో అనువదించారు.
శివకర్ణామృతం, త్యాగరాజ సుప్రభాతం వంటి సంస్కృత గ్రంథాలు, విజయనగర సామాజిక చరిత్ర, మహాభారత విమర్శనం, రాయలనాటి రసికతా జీవనం, సమర్థరామదాసు, ఆంధ్ర మహాకవులు, వసు చరిత్ర వైభవం వంటి విమర్శనాత్మక గ్రంథాలు, గాంధీజీ మహాప్రస్థానం, కందుకూరి వీరేశలింగం, సరోజినీదేవి, అరవిందుడు వంటి జీవిత చరిత్రలను వెలయించారు. కేంద్ర సాహిత్య అకాడమీ కోరిక మేరకు బుద్ధ భగవానుడు, కబీర్ వచనావళి గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. వీరి రచనలలో తొలుత రవీంద్రకవి ప్రభావం ఉన్నప్పటికి ఆ తరువాత అరవిందయోగి ప్రభావం కన్పిస్తోంది. దేశ పర్యటనలలో భాగంగా హృషికేశ్ వెళ్లినపుడు అక్కడ శివానంద సరస్వతీ మహరాజ్ పుట్టపర్తి వారికి ‘సరస్వతీ పుత్ర’ బిరుదును ప్రదానం చేసి సత్కరించారు.
1974లో కేంద్ర ప్రభుత్వం పుట్టపర్తి వారికి ‘పద్మశ్రీ’ బిరుదునిచ్చి గౌరవించింది. ఆయన రాసిన జనప్రియ రామాయణానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1975లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టానిచ్చి సత్కరించింది. 1987లో ఆయన రచించిన ‘శ్రీనివాస ప్రబంధం’ గ్రంథానికి కలకత్తా భారతీయ భాషా పరిషత్తు వారు భిల్వార్ పురస్కారాన్ని ఇచ్చారు. బూర్గుల రామకృష్ణరావుచే బ్రహ్మభూషణ అవార్డును పొందారు. మధుర, చిదంబరం, నైవేలి, ఢిల్లీ, జంషెడ్పూర్ తదితర ప్రవాసాంధ్ర ప్రాంతాలలో సయితం ఘనసన్మానాలు అందుకున్నారు. నైనిటాల్లో జరిగిన అఖిలభారత కవి సమ్మేళనం, ఆకాశవాణి జాతీయ కవి సమ్మేళనంలో పురస్కారాలను గ్రహించారు. ఆచార్యుల వారి ధర్మపత్ని కనకమ్మ కూడా రచయిత్రి కావడం విశేషం. ఈ దంపతుల రచనలు ‘కావ్యద్వైయి’ సంపుటంగా వెలువడింది. తెలుగు సాహిత్య చరిత్రలో చెరగని ముద్ర వేసిన పుట్టపర్తి నారాయణాచార్యులు 1990 సెప్టెంబర్ 1న ఈ విశాల ప్రపంచం నుంచి నిష్క్రమించారు. ఆయన పేరు చిరస్మరణీయుల జాబితాలో చేరిపోయింది. జ్ఞానపీఠ్ అవార్డుకు అన్ని అర్హతలున్నా, ఎంచేతనో ఆయనకు దక్కలేదు.
– వాండ్రంగి కొండలరావు
అక్రిడేటెడ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
(మార్చి 28, 2014న శతజయంతి ముగింపు సందర్భంగా)