తెలుగు భాష సర్వతోముఖాభివృద్ధి కోరుకుంటున్న ఈ సమయంలో వాచక పుస్తకాలలో ఇంగ్లీషు పదాలు ఏమిటి?… వాచక పుస్తకాలు దోష రహితంగా ఉండాలి. భాషా శైలిలో ప్రామాణికత అవసరం. వాటి ద్వారా పిల్లలు తెలుగు భాష నుడికారము, సౌందర్యము గ్రహించాలి.
మన ప్రభుత్వం పదే పదే తెలుగు భాషాభివృద్ధిని కోరుకుంటున్నట్లు ప్రకటిస్తుంది. భాషాభివృద్ధి అంటే ఏమిటి? ఆ భాష సంప్రదాయాన్ని, నుడికారాన్ని, సౌందర్యాన్ని పిల్లలకు తెలియజేయడం. వ్యావహారిక భాష పేరుతో ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైంది. వ్యావహారిక భాష అనేది అన్ని చోట్ల ఒకే మాదిరిగా ఉండదు. కనుక భాషకు ఒక ప్రమాణం అవసరం. ఈ విషయం మన పూర్వులు పాటించారు. పాఠ్య పుస్తకాలలో కూడా ఆ నియమం పాటింపబడింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజకీయ జోక్యం వలన పాఠ్యా ంశాలు మారిపోయాయి. ప్రభుత్వం ఇటీవల ఒకటి నుంచి ఐదు తరగతుల వాచకాల రచనా విధానం, బోధనా పద్ధతులు పూర్తిగా మార్చివేసింది.
ఈ పద్ధతి పిల్లలకు ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వ వాదన. కానీ ప్రమాణాలు మాత్రం రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ఈ పుస్తకాలలో చూపబడిన కొన్ని చిత్రాలలోను, పదాలలోను దోషాలున్నాయి. కొన్నిచోట్ల సమాచారం తప్పులున్నాయి. వీటి విషయం ప్రభుత్వ దృష్టికి తెచ్చినా పట్టించుకోదు. కనుక ఈ తప్పులన్నీ ఒప్పులుగా చలామణి అయిపోతున్నాయి. గత వాచకాలలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు తిరిగి అదే జరుగుతుంది. పిల్లలకు గుణాత్మక విద్య అందివ్వాలని ప్రభుత్వం అంటుంది. గుణాత్మక విద్య అంటే ఏమిటి? గుణహీనమైన విద్య, కల్తీ విద్య ఎక్కడైనా ఉంటాయా? అసలు ఈ పేరు ఏమిటి? ఒకటవ తరగతి పుస్తకంలో ‘నాగలి’ చిత్రాన్ని చూపించారు. ఈ రోజులలో ఇంకా ‘నాగలి’ ఎందుకు? ట్రాక్టర్లు ప్రవేశించిన తరువాత పిల్లలు నాగలి ఎరుగరు. ఆ చిత్రానికి ‘అరక’ అని పేరు పెట్టారు. ‘అరక’ వేరు ‘నాగలి’ వేరు. రెండెడ్లను కాడికి కట్టి దున్నడానికి సిద్ధం చేసిన దానిని ‘అరక’ అంటారు. ఇందులో ఈ వాక్యాలు చూడండి.
1. రైతు అరకతో పొలానికి బయలుదేరాడు. (అరక చేనులోనే ఉంటుంది). 2. అరకతో దుక్కి దున్నాడు. దుక్కి అంటే దున్నడం, కృషి అని అర్థాలు. దుక్కి దున్నడం ఏమిటి? దుక్కిలెద్దు అంటారు. అనగా దున్నడానికి ఉపయోగించే ఎద్దు. పుస్తకంలో పలుచోట్ల ‘నాగలి’ చిత్రాన్ని చూపి దానిని ‘అరక’ అన్నారు. ‘మేషం అంటే మేక’ అని ఒక వాక్యం ఉంది. మేషం అంటే మేక కాదు. గొఱె . మేకకి గొఱె కి తేడా లేదా? రెండవ తరగతిలో గుణింతాలకు ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్ట బడింది. ఇది ఎందుకు? ఒత్తు అక్షరాలకి గుణింతాలు వ్రాయించడం అవసరం. ఉదా : ద్ద ద్దా, య్య య్యా, ఒత్తులు నేర్చుకున్నా పిల్లలు వాటిని ఏ అక్షరానికైనా ఉపయోగించగలరు. ఒక వాక్యం చూడండి. ‘గొడుగు లాగ గాలికి ఎగిరిపోయేవి కొన్ని చెప్పండి’. గొడుగు గాలిలో ఎగరడం ఏమిటి? తీవ్రమైన గాలి వీచినప్పుడు గొడుగులే కాదు చాలా ఎగిరిపోతాయి. ఇక మూడవ తరగతి వాచకంలో వింతలు చూద్దాం. పిల్లలను వ్యాకరణంలో ప్రజ్ఞావంతులుగా చేయాలని ప్రవేశపెట్టిన పదాలు చూడండి.
అచ్చులు, హల్లులు, అల్ప ప్రాణాక్షరాలు, మహా ప్రాణాక్షరాలు, సంయుక్తాక్షరాలు, ద్విత్యాక్షరాలు, ద్విరుక్తాలు మొదలయినవి. వ్యాకరణం పెద్ద తరగతులలో బోధించాలి. ‘మన పండుగలు’ అనే పాఠంలో పిల్లలు కొందరు రాజస్థాన్, బెంగాల్, తమిళనాడు వెళ్లి అక్కడ వివిధ పండుగల విశేషాలు తెలుసుకున్నారట. అందులో వాక్యం ‘వలీలకు ముస్లిములు కట్టే సమాధులను దర్గాలంటారు’ వలీలు అంటే ఎవరో తెలియజేయలేదు. ఇంకొక వాక్యం పరిశీలించండి. ‘దుర్గాదేవి గొప్ప యుద్ధం చేసి మహిషాసురుని ఓడించింది. ఆ మర్నాడు యుద్ధంలో అలసిపోయి గౌరీ మాత నిద్రపోయింది’. దుర్గాదేవి మహిషాసురుని ఓడించడం కాదు వధించింది. దుర్గాదేవి యుద్ధం చేస్తే గౌరీమాత అలసిపోవడం ఏమిటి? ఈ రెండు పర్యాయపదములని పిల్లలు గ్రహించాలా? మరొక విశేషం చూడండి. శునకం, కనకం అను పదాల అర్థాలు తెలుసుకునేందుకు ఈ వాక్యాలు చూపబడ్డాయి. 1. నేను చిన్న శునకాన్ని పెంచుకుంటున్నాను. 2. మా చెల్లెలికి కనకపు గాజులు కొన్నాము.
చిన్న శునకం కనకపు గాజులు అనకూడదు. చిన్న అనేది తెలుగు పదం, శునకం అనేది సంస్కృత పదం. అలాగే కనకం సంస్కృతం, గాజులు తెలుగు. వనరాజు అంటే అర్థం అడవికి రాజు సింహం అని చూపారు. వనరాజు ప్రయోగం ఏమిటి? వనదేవత ఉంటుంది. మృగములకి రాజు కనుక సింహాన్ని మృగరాజు అన్నారు. అది సరియైన ప్రయోగం. వాచక పుస్తకాలలో ప్రతి పదం, పద్యం పిల్లలకు పూర్తిగా అవగాహన కావాలి. ఇంగ్లీషులో దీనిని డిటైల్డు స్టడీ అంటారు. నాలుగైదు తరగతులలో 16 పాఠాలున్నాయి (ఒక్కొక్కదానిలో) ఇవికాక మరొక ఆరున్నాయి. ఇవి చదివి ఆనందించడానికి ఉద్దేశింపబడ్డాయి. ఇవి వాచక పుస్తకంలో ఎందుకు? పాఠ్యాంశాలు కొన్ని పత్రికలలోని కథల వలె ఉన్నాయి.
నాలుగవ తరగతి సూది కథలో తాటి దూలం అని ఒక ప్రయోగం ఉంది. తాటి వాసం అనాలి. అది సరియైన పలుకుబడి. చిత్రంలో తాటి వాసాన్ని టేకుదుంగ వలె చూపించారు. ఐదవ తరగతి శతక పద్యాలలో ‘ఏరకుమీ కసుర్యలు’ అను పద్యానికి భావంలో భూమిపై పచ్చికాయలు ఏరి తినకూడదని ఉంది. ఇక్కడ భూమిపై అని చెప్పనవసరం లేదు. ‘గోపి డప్పు కథ’ అను పాఠం అతుకుల బొంత వలె ఉంది.
అందులో ‘వీడు పొద్దున్నే నా మట్టిపాత్ర పగలగొట్టాడు అందులోనే బట్టలు ఉడికించి ఉతకాలి’ అని ఉంది. బట్టలు మట్టిపాత్రలో ఉడకబెట్టడం ఏమిటి? బట్టలు బానలో ఉడక బెడతారు. అది చాలా పెద్దది. తెలుగు భాష సర్వతోముఖాభివృద్ధి కోరుకుంటున్న ఈ సమయంలో వాచక పుస్తకాలలో ఇంగ్లీషు పదాలు ఏమిటి? గతంలో తెలుగు వాచకాలలో ఇంగ్లీషు పదాలు ఎన్నడూ లేవు. ఈ వాచకాలలో ఉన్న కొన్ని ఇంగ్లీషు పదాలు చూడండి. ఫోటో, పాలిథిన్, పోస్టర్, కేబుల్ వైరు, బ్యానర్, బొకే, ఓవెన్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్, మాస్క్ ఇలా చాలా ఉన్నాయి. ఇవి ఆధునిక తెలుగు వాచకాలు కనుక వాటిలో ఇంగ్లీషు ఉపయోగింపబడింది కాబోలు. వాచక పుస్తకాలు దోష రహితంగా ఉండాలి. భాషా శైలిలో ప్రామాణికత అవసరం. వాటి ద్వారా పిల్లలు తెలుగు భాష నుడికారము, సౌందర్యము గ్రహించాలి. వచ్చాడు, వెళ్లాడు వంటి పదాలు పుస్తకాల ద్వారానే నేర్చుకోవలసిన అవసరం లేదు. ఉపాధ్యాయులు చెప్పవలసిన అవసరం లేదు.
– వేదుల సత్యనారాయణ