గుజరాత్ మహిళా సాంఘిక సంస్కర్త విద్యాగౌరీ నీలకంఠ-విహంగ మహిళా వెబ్ మేగజైన్ -ఏప్రిల్

             అసాధారణ మేధ ఉన్న విద్యా వేత్త ,సంఘ సేవకురాలు, సాంఘిక సంస్కర్త ,వ్యక్తిత్వం తో ,సాధారణ మహిళగా సమాజ సేవ చేసిన విద్యా గౌరీ నీల కంఠ గుజరాత్ రాష్ట్ర మహిళా మాణిక్యం .గుజరాతీ ఆంగ్ల భాషల్లో విద్వద్మణి. స్త్రీ అన్నిటా అగ్రగామిగా ఎదాలని స్త్రీ శక్తి ని సమాజం గుర్తించాలని వారికి అండగా నిలిచిన అలుపెరుగని పోరాట పటిమ ఉన్న నాయకురాలు .ఆ కాలం లో గుజరాతీ మహిలలో ఎక్కువ మంది ఇంటికే పరిమితమై ఉండేవారు బయటికి రావటం నామోషి గా భావించే వారు .స్త్రీలకు విద్య నేర్పిస్తే గృహిణులుగా కుటుంబ బాధ్యత నిర్వాహించరని తరతరాల కుటుంబ వ్యవస్థ కూలి పోతుందని  నమ్మకం తో ఉండేవారు .కాని గౌరి ఇది తప్పు అభిప్రాయం అని, విద్య నేర్పిస్తే ,స్త్రీ అంతకంటే ఎక్కువ బాధ్యత తో అక్క గా, చెల్లిగా, అమ్మగా , భార్య గా  రాణించ గలరని  నిరూపించాలని నిర్ణయించుకొంది.విద్యా గౌరీ .ఆమె పేరు లోనే విద్య వుంది, గౌరీ దేవికి ఉన్న సాహసం ఉంది .,పవిత్రత ఉంది .పేరుకు న్యాయం చేసింది .

    1876జూన్ ఒకటైన  గోపీలాల్ ధ్రువ ,బాలాబెన్ లకు విద్యా గౌరీ జన్మించింది .తండ్రి న్యాయ స్థానం లో ఉద్యోగం చేయటం వలన ట్రాన్స్ ఫర్ అవుతూ ప్రదేశాలు మారేవాడు .తల్లి మాత్రం కుటుంబాన్ని కని  పెట్టుకుంటూ ,కూతుళ్ళ విద్య కోసం అహమ్మదా బాద్ లోనే ఉండేది .విద్యాగౌరి ,చెల్లెలు శారదతో కలిసి స్కూల్ లో చేరి ఏడవ తరగతి చదివింది .ఆ కాలం లో బాలికల పాఠ శాల లేక పోవటం తో మహా లక్ష్మి టీచర్స్ ట్రెయినింగ్ కాలేజి లో గుజరాతీ, ఇంగ్లీష్ భాషలు చదివింది .స్కూల్ లో చదువుతుండగానే ఒక సంఘ సంస్కర్త,విద్యా వేత్త  కుమారుడు రమణ భాయ్ తో వివాహమయింది .అప్పటికి ఆమె వయసు పద మూడు .భర్త ఆమె కంటే తొమ్మిదేళ్ళు పెద్ద వాడు అవటం తో భర్తను గురువు గా, మార్గ దర్శి గా భావించింది .భార్యా భర్తలు’’జ్ఞాన సుధ ‘’అనే పత్రికకు కధలు రాసి సంపాదక బాధ్యతకూడా  చేబట్టి నడిపారు .

           భర్త ప్రోత్సాహం తో గౌరీ మెట్రిక్ పరీక్షకు కట్టింది . మూడేళ్ళ తరువాత ఉత్తీర్ణురాలై  సోదరి శారద తోకలిసి గుజరాత్ కాలేజి లో ఆర్ట్స్ సబ్జెక్ట్ లో బొంబాయి యూని వర్సిటీ పరీక్ష రాసింది .లాజిక్ లో ఆమె మొదటి స్థానం సాధించింది .బి;ఏ.; లో మోరల్ ఫిలాసఫీ, లాజిక్ సబ్జెక్టు లను ను ఎంచుకొని ఎనిమిదేళ్ళు చదివి   పూర్తి చేసింది .’’బి ఏ పాసై ఉద్యోగాలు చేస్తూ ఊళ్లు యేలాలా?’’ అని చాలా మంది ఆమె ను నిరుత్సాహ పరిఛి చదువు ఆపమనే వారు .వీటిని లెక్క చేయకుండా అకుంఠిత  దీక్ష తో చదివి  యూని వర్సిటి మొత్తం మీద  ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణు రాలై గుజరాత్ కాలేజిలో ఫెలోషిప్ పొందింది .గుజరాత్ మొత్తం మీద గ్రాడ్యుయేట్లు అయిన తొలి హిందూ మహిళలుగా  విద్యా గౌరీ ,చెల్లెలు  శారదా మెహతా  రికార్డు సృష్టించారు .

   అహమ్మదా బాద్ లోని లేడీస్ క్లబ్ లో విద్యా గౌరీ చురుకైన పాత్ర నిర్వహించింది . క్లబ్ లో హిందూ పార్సీ క్రిస్టియన్ ముస్లిం మహిళలందరూ సభ్యులుగా ఉన్నారు ఈమె లో ని చొరవ ను గుర్తించి వారంతా గౌరీ ని ముందుంచి కార్యక్రమాలు నిర్వహించారు .అహమ్మదా బాద్ లో కాంగ్రెస్ సభ జరిగి నప్పుడు విద్యా గౌరీ సోదరి శారద తో కలిసి వందే మాతరం గీతం ఆలా పించింది . నేషనల్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యం లో విద్యా గౌరీ పేద ముస్లిం మహిళకు కుట్టుపని లో శిక్షణ నిచ్చింది .వయోజన విద్య ను ప్రోత్సహించింది .మొదటి ప్రపంచ యుద్ధం లో యుద్ధ నిధి సేకరించి తోడ్పడింది .ఈ సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం గౌరికి ‘’మెంబర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ‘’(M B .E.) ఇచ్చి గౌరవించింది .ఆమె ప్రజా సేవకు  గుర్తింపు గా  ‘’స్టార్ ఆఫ్ ఇండియా’’పురస్కారం అందుకొంది.కాని ఉప్పు సత్యాగ్రహం లో మహాత్మా గాంధీని అరెస్టు చేసి నందుకు నిరసన గా దాన్ని వాపసు ఇచ్చేసిన దేశ భక్తురాలు విద్యా గౌరీ .

   అహమ్మదా బాద్ ను కార్య క్షేత్రం గా చేసుకొని ‘’ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్ ‘’నిర్వహించింది .చురుకైన పాత్ర పోషించి అధ్యక్షురాలై, చాలా సంవత్సరాలు మహిళా సేవ చేసింది .లక్నో లో జరిగిన  అఖిల భారతీయ  కాంగ్రెస్ కమిటీ సమావేశం లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది . అహమ్మదా బాద్ లో మగన్ భాయ్ కరం చంద్ బాలికల ఉన్నత పాఠ శాలను ,దివాలీ భాయ్  బాలికా పాఠశాలను , రణ చందా లాల్ చోటాలాల్ గర్ల్స్ హైస్కూల్ ను ,స్థాపించి బాలికలకు విద్యా సౌకర్యం కలిగించింది .వివాహం వల్ల  విద్య కోల్పోయిన వితంతువులకు ,పాఠశాలలకు వెళ్ళలేని (డ్రాపౌట్స్త్)స్త్రీలకూ సెకండరీ విద్య కోసం ‘’వనితా విశ్రాం ‘’లను నెల కోల్పింది .లాల్ శంకర్ ఉమియా శంకర్ మహిళా పాఠ శాల ను అహమ్మదాబాద్ లో ఏర్పాటు చేసింది .ఆ తర్వాత ఇది కార్వే యూని వర్సిటి కి అనుబంధ సంస్థ అయింది .ఈ విద్యాలయం లోనే విద్యా గౌరీ ఇంగ్లీష్, సైకాలజీ ,ఫిలాసఫీ లను బోధించింది .’’మహి పత్ రాం రూప్  రాం అనాధ శరణాలయానికి ‘’గౌరవ కార్య దర్శి గా ఆ తర్వాత, అధ్యక్షురాలిగా సేవలందించింది .విక్తోరియల్ జూబిలీ హాస్పిటల్ ,రణ్  చంద్ లాల్ చోటాలాల్ డిస్పెంసరీ లకు సభ్యురాలి గా పని చేసింది ఎన్నో సాంఘిక, ధార్మిక సేవా సంస్థలు ఆమెకు గౌరవ పదవు లిచ్చి ఆమె సేవ కు గుర్తింపు కలిగించి గౌరవించారు .గుజరాత్ రాష్ట్రం లో అనేక చోట్ల గ్రంధాలయాలు ఏర్పాటు చేసి గ్రంధాలయోద్యమం లో చురుకైన పాత్ర వహించింది  .పదిహేనవ గుజరాతీ సాహిత్య పరిషత్ కు అధ్యక్షురాలైనది .

   గుణ సుందరి, స్త్రీ బోధ ,శారద మొదలైన ఎన్నో పత్రికలకు వ్యాసాలు రాసి ఉత్తేజాన్నిచ్చింది .సోదరి శారద తోకలిసి ఆర్.సి దత్తు రాసిన ‘’ది లేక్ ఆఫ్ పామ్స్ ‘’పుస్తకాన్ని గుజరాతీ భాషలోకి అనువదించింది .ఆమె ప్రత్యేకం గా రాసిన వివిధ వ్యాసాలూ ‘’ఫోరం ‘’ ,నారీ కుమ్ఫ్ ,జ్ఞాన సుధ  మొదలైన పత్రికలలో ప్రచురిత మైనాయి . మహిళాభ్యుదయాని కి ,వారి విద్యా వ్యాప్తికి అంతు లేని సేవ లందించింది విద్యా గౌరీ .వితంతువులు మళ్ళీ వివాహం చేసుకొంటే తప్పేమీ లేదని,  ఒక సంఘ సంస్కర్త గా బోధించింది .కులాంతర వివాహాలను ప్రోత్సహించింది .వితంతువులు ,గృహ పీడనం లో బాధితులు ,పెళ్లి చేసుకోవాలను కొనే యువతులు విధి వంచితలు ఎందరో నిత్యం ఆమె దగ్గరకొచ్చి సలహాలు,సహయం పొంది ఊరట చెందే  వారు .శారదా చట్టాన్ని, హిందూ కోడ్ బిల్ ను అమలు పరచటానికి తీవ్ర కృషి చేసి మహిళాభ్యుదయానికి దారి చూపింది .ఏ రకమైన ప్రతిఫలాపేక్ష లేకుండా బాధితుల  ,పీడితుల  అణగ దొక్క బడిన  మహిళలను ఆదుకొని సహాయ సహకారాలందించి వెన్ను దన్ను గా నిలబడి వారి అభివృద్ధికి ఇతోధిక సహకారం అందించింది ,.

     విద్యా గౌరీ వజ్రోత్సవ సభలో  గాంధీ మహాత్ముడు పాల్గొని ‘’విద్యా గౌరీ భారతీయ  మహిళా  ఆభరణం . ఆమెకు ఎన్ని సత్కారాలు చేసి సన్మానిం చినా  చాలదు .  నిత్యం మరిన్ని సత్కారాలు చేసి గౌరవించాలి .ఆమె గొప్ప సంస్కర్త అయినా సంప్రదాయాన్ని గౌరవించి పాటించే మహిళా మాణిక్యం ‘’అని కీర్తించిన మాటలు అక్షర సత్యాలు . 1958లో 82ఏళ్ళ నిండు జీవితం గడిపి విద్యాగౌరీ నీల కంఠ మరణించింది .

విహంగ

  –   గబ్బిట దుర్గా ప్రసాద్ 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.