సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -5
వివాహం –దాంపత్యం
21-కలిసి ఉండటం ముఖ్యం –శ్రీమతి సింహాద్రి పద్మ (అవని గడ్డ )
ఇంటికి పునాది లాగ –దాంపత్యానికి వివాహం సహజం
అన్ని వివాహాల శాస్త్రీయతా ఒక్కటే –
ఇద్దరు జీవితకాలం కలిసి ఉండటమే వివాహ పరమార్ధం
నిజానికి ఇద్దరూ కలవటం కలిసి ఉండటం యెంత కష్టం ?-యెంత కష్టమో అంతతేలిక
ఎన్ని అహంభావ కవచాలు విప్పాలి ?ఎన్ని అహంకార కవాటాలు తెరవాలి?
ఒకచో వలపు వాగ్దానాలు మెరవాలి –ఒకచో కానుకల ప్రశంసలు తళుక్కు మనాలి
కన్నీటి వేళ ఓదార్పు స్పర్శలు –భరోసా ఇచ్చే సాహచర్యం కావాలి
మనసెరిగి మసలటం కమ్మనైన నమ్మకం –జీవితకాలం కలిపి ఉంచే సూత్రం
ఒకరికొకరు చేసుకొన్న ప్రమాణాలతో –కలిసి చేసే ప్రయాణాలు జీవన సాఫల్యం
ఒకరి లోకి ఒకరు ప్రవహిస్తూ –ఒకరిగా ఉండటం
పాటకు ప్రాణం గా కవితకు భావం లా కలిసుం డటం ముఖ్యం
కలిపుంచేది ఏదైనా సమ్మతమే –విడదీసేది ఏదైనా దుర్మార్గమే
జీవితకాలం కలిసుండటమే మరీ మరీ ముఖ్యం .
22-అంతర్జాతీయం –శ్రీ బందా వెంకట రామా రావు (విజయ వాడ)
ఊరూరా ఉండేవి మెరక వీదులోక నాడు –ఆమెరకలన్ని కలిసి అమెరిక అయిం దీనాడు
హత విధీ !ఇంకెక్కడి వివాహం ,లేదేక్కడా దాంపత్యం –చాటింగులు ,డేతింగులు మీటింగుల పర్వం లో
స్త్రీకి స్త్రీకి వివాహామట –పురుషుల మధ్య దాంపత్యమట
విడాకుల చట్టాల వికృత రూపం విశ్వమంతా అలముకొంది
వేరుకుంపట్లు ,నిర్లక్ష్యం నిర్లజ్జా నాగరకత పేరులో నిండిన లోకం లో
వివాహ పరమార్ధం మరిచి విశ్రుంఖలత వెర్రి చేష్టలతో చేస్ట లుడిగి పోతున్నాం
వివాహ దాంప త్యాలు వంశోన్నతికోసమే నని మరిచి పోరాదు
ఉన్నది ఇవ్వటం లేనిది పొందటమే సహజీవన సౌందర్య పరమార్ధం .
23-జయీ భవ –శ్రీ మతి మాదిరాజు శివ లక్ష్మి (ఉయ్యూరు )
కొత్త తలపులతో గుండె ఝల్లు మంటుంటే –హృదయాంతరాళాల్లో మధురిమలు మోగుతుంటే
భారత ఖండాన ఒక దివ్య శిశువునివ్వాలనని –ఉవ్విళ్ళూరుతూ కొంగు ముడి వేసుకొంటారు
సుక్షేత్ర దేశం లో పవిత్రాశయాలు నెరవేర్చాలని –అందరూ ధన ధాన్యాలతో సుఖం గా వర్ధిల్లాలని
నూతన దంపతులు ఆ ఆది దంపతులను వేడుకొంటారు
ప్రపంచానికే మకుటాయమైన భారతీయ వైవాహిక వ్యవస్థ కు
జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ .
24-జేజేలు –కుమారి మాది రాజు బిందు వెంకట దత్తశ్రీ (యాకమూరు)
చక్కగా చిక్కగా ఆత్మీయంగా –అపురూపం గా అనురాగం గా దైవాంశ సంభూతం గా
సాగుతున్న దాంపత్యం నిత్య నూతనం –అదే శ్రీ దుర్గా ప్రసాద్ గారి అయిదు పదుల దాంపత్య జీవనం
నవనీతమై నిత్య ‘’ప్రభావతం ‘’అయి –సరస భారతి యై –
సమాజానికి సాహితీ వెలుగు లందిస్తున్న దంపతులు వారు
కుటుంబాన్ని ,సమాజాన్నీ సమన్వయ పరుస్తూ
తెలుగు తల్లికి ముద్దుల పట్టియై –సరసభారతికి సారదులై అలరారుతున్న సుమనస్కులు
ధర్మో రక్షతి రక్షితః అన్న ఆర్యోక్తిని అభి వ్యక్తీకరిస్తూ –గృహస్తాశ్రమ ధర్మానికి నిలువుటద్దాలై
ఈ తాత గారు అమ్మమ్మ గారి అర్ధ శతాబ్ది దాంపత్య మహోత్సవానికి జేజేలు .
25-మన ధర్మం మనో ధర్మం –రోటేరియన్- శ్రీ నిమ్మగడ్డ సుబ్బా రావు (ఉయ్యూరు )
వివాహం ఇష్టం తో చేసుకోవాలి –దంపతులు ఆదర్శ ప్రాయం గా మసలుకోవాలి
వంశం సమాజం అభివృద్ధికి సంభావన తో సహక రించాలి
ఆకళింపు అవగాహన ఆచరణ తో అందరి మనసులు ఆకర్షించాలి
ధర్మార్ధ కామాలకు సమ వర్తనులై సాగాలి -వీటితోనే మోక్షం సాధించాలి
మనిషి లోని ‘’షి ‘’ని లుప్తం చేయరాదు –అప్పుడే పరి పూర్ణ దాంపత్య ఘనత .
26-నిన్ను నీవు తెలుసుకో –శ్రీమతి కోకా విమల కుమారి (విజయ వాడ )
మల్లెల పరిమళం పంచిన పరమానంద జీవన సారం అన్యోన్య దాంపత్యం
తాళిని ఎగ తాళి చేస్తే తప్పవు తిప్పలు –అనాలోచిత పోరాటాలు
అనర్ధ హేతువని మహిళా తెలుసుకోవాలి
శృతి మించిన ఆత్మాభిమానం వరం కాదు శాపమే అవుతుందని గ్రహించాలి .
మూడు ముళ్ళ బంధాన్ని ముచ్చట అని తేలిక చేయొద్దు
నిన్ను నువ్వే తెలుసు కొంటేనే –నీఉనికి రక్షణ
27-వివాహమే జగద్రక్ష –శ్రీమతి కోపూరి పుష్పా దేవి (విజయ వాడ )
ప్రపంచాన్ని సవ్యం గా నడిపేది ,లోకాన్ని స్వచ్చం గా ఉంచేదీ వివాహమే
ఆధునిక సమాజానికి వారధి వివాహం –
మానవ విలువలపై విశ్వశాంతి భవన నిర్మాణమే వివాహం
మమకారాల ఎరువులు చల్లి –ప్రేమ సుమోద్యానవనాల్ని వృద్ధి చేస్తుంది
సాంస్కారానికి కట్టిన పట్టం వివాహం –స్త్రీకి పురుషుడు ఆలంబన
పురుషుడికి స్త్రీకి ఆరాధన –సంసార వ్యవ సాయం తో సంతాన పంట పండాలి
ఆదర్శ సమాజాలే శ్రీ రామ రక్ష –అందుకే వివాహమే జగద్రక్ష .
దాంపత్యం
అక్కడి అమ్మాయి ఇక్కడి అబ్బాయి కలిస్తే కమనీయం
సృష్టికి ఉషోదయం –అతనికి ఆమె అపురూపం అతనికి ఆమె ప్రాణ దీపం
ఆమె ప్రమిద అయితే ఆతను తైలం –కళ్యాణ వత్తి ని వెలిగిస్తే జగతికి వెన్నెల కాంతులే
ఆమె తోడుంటే కొండలే అవుతాయి పిండి –అతని కోపాగ్ని ఆమె చిరునవ్వు మంచుకి తలొం చుతుంది
ఆమె రుస రుసల సెగలూ పొగలూ –అతని ఆప్యాయతాబిమానాల పవనానికి పరారు
చిన్ని చిన్ని కలతలు –కాపురపు మధుర భాష
కోపాలూ ఆవేశాలు సంతోషాలూ సరిగమలూ –సంసార కావ్యం లో మధుర ఘట్టాలు
సంప్రదింపుల శృతి లయలు –సర్దు బాట్ల దిద్దు బాట్ల ఐక్యతా రాగాలు
కష్టాల్లో కన్నీళ్ళల్లో అండా దండా –మనవల ముద్దు మురిపాలలో స్వర్గ సుఖాలు
మంచికి బాసటగా సమాజానికి చేరువగా
ప్రాణ శరీరాల్లా ఏకమై మమైకమై ఒకరికొకరై
వర్దిల్లేదే దాంపత్యం –ఇది స్వర్గానికి సాపత్యం .
28-స్థిర నిర్ణయం –లయన్ శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ (యాక మూరు )
వివాహ వ్యవస్థను పునరుద్ధ రించటానికి పదండి ముందుకు
దాంపత్య జీవిత పరమార్ధాన్ని చాటి చెప్పుదాం రా రండి
కలిసి మెలిసి బతికి కుటుంబాలను కాపాడుకోవటానికి తరలి రండి
వారసత్వ విలువలు కాపాడాలంటే సంస్కృతిని పాడాలంటే ముందుకు నడవండి
మనసున మల్లెలు పూయించి మధురానుభూతుల్ని పంచె
దాంపత్య జీవన ఔన్నత్యం నవతరానికి తెలియ జేద్దాం
అని మనసులో అందరం స్థిర నిర్ణయం చేసుకొందాం –అనుకొన్నది సాధిద్దాం
29-.శ్రీమతి డా.జి రేజీనా (విజయ వాడ )
ఇరు మనసులు పెన వేసుకొనే మధుర క్షణాలే వివాహం
మూడు ముళ్ళ బంధం రెండు కుటుంబాల బాంధవ్యానికి నాంది
కొత్త జీవితానికి తెర దీసే మహిమాన్విత రసధుని
వావి వరుసలు పెరిగి బల పడే బంధుత్వం
గళానికి తాళి నల్ల పూసలు కాలికి మట్టెలు తో నూతన వధువు నవ కాంతులజ్యోతి
ఆలూ మగలూ పాలూ తేనే వలే కలిసి రెండువైపులా బందుత్వాన్ని దృఢ పరచాలి
చిలిపి సరస సాంగత్య విలాసాల నుండి సంసార చదరంగం లో
అన్నీ తట్టుకొంటూ గమనం సాగించాలి
జీవన నౌకను గమ్యం చేర్చటానికి బాధ్యతల ఇరుసు పై చాక చక్యం గా
ద్వంద్వాలను అనుభ విస్తూ –ఆవలి తీరం చేరటమే దాంపత్య పరమావధి .
30-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల అర్ధ శతాబ్ది వివాహ మహోత్సవ సందర్భం గా
శుభాభి నందనలు –శ్రీమతి వారణాసి సూర్య కుమారి (మచిలీ పట్నం )
సీ.ఆదర్శ మూర్తులైనట్టి దుర్గాప్రసాద్ –గారు ప్రభావతి ఘనులు వారు
ఆదిదంపతులిల నవతరించితి రను –చందమ్ము భాసిల్లు జంట వారు
సాహితీ రధమునకు సారధి యగుచును –ప్రగతి పదము నడుప గల వారు
అర్ధ శతాబ్ది వివాహ వేడుకలను –సురల యాశీస్సుల నరయు వారు
తే.గీ.నాల్గు ముఖముల నరయునా నలుడు సతిని –వక్ష మందిడుకొనే హరి లక్షణముగ
పార్శ్వమున నిలిపే సతి ని పరమ శివుడు –మనసు నిడిరి దుర్గా ప్రసాద్ మమత నింపి .
సీ.ఆడంబరము లేక ఆనంద లహరిని –జీవితమున శాంతి సిరుల నొంది
పిల్ల పాపల తోడ చల్లగ కాలము –గబ్బిట వారికి గడుచు చుండ
బంధు మిత్రుల యెడ బాంధవ్య బంధమున్ –సహజ రీతి మెలగు సహ్రుదయులుగ
పూర్వ పుణ్య ఫలము పొంది వీరు శతాబ్ది –కళ్యాణ వేడుకల్ ఘనత గాంచు
తే.గీ పూవు తావి చంద్రుడు వెన్నెల వలెనుండి –భావి తరముల వారికి భాగ్య మనగ
వీరు అన్యోన్య దాంపత్య విలువ తెలిపి –మంచి మార్గము సూచించు మాన్యు లగుచు
ఆయురారోగ్య సంపద లలరు గాక .
‘’వివాహం –దామత్యం ‘’శీర్షిక లో కవితలు సంపూర్ణం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-14-ఉయ్యూరు