
ఒక పుస్తకం కవర్ మీద ఈ శీర్షిక కనిపిస్తే ఏమనుకుంటారు? పైత్యమో, పరిశోధనో అయ్యుంటుందనుకోవచ్చు. కాని రెండూ కాదు. మధ్యస్థంగా మూడోది. తాళాలకు, మహాభారతంలోని కొన్ని ఘటనలకు, గణితానికి మధ్య తాను గమనించిన కొన్ని సామ్యాలను సగం సరదాగా, సగం సీరియస్గా రాశారు వి.రఘునాథన్. అందులోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం…
జరాసంధుడి తాళం
మగధను పాలించే బృహద్రథుడికి చాలాకాలం పిల్లల్లేరు. ఆయన భార్యలిద్దరూ కాశీ రాజు కుమార్తెలైన కవలలు. రాజు, రాణులిద్దరూ ఈ విషయమై బాధ పడుతున్నపుడు కౌశిక మహాముని ఒక మామిడి పండు ఇచ్చి దీన్ని నీ భార్యకిచ్చి తినిపిస్తే సంతాన యోగం కలుగుతుందని చెపుతాడు. ఇద్దరు భార్యల్నీ సమానంగా చూడాలని భావించే రాజు పండును చెరిసగం ఇస్తాడు. ఫలితంగా ఇద్దరూ గర్భవతులై చెరో సగం బిడ్డకు జన్మనిస్తారు.
ఈ వైపరీత్యానికి కుమిలిపోయిన రాజు ఆ రెండు సగాల్ని పారవేయిస్తాడు. మాంసభక్షణ చేసే ఒక రాక్షసి యాదృచ్ఛికంగా ఆ రెండిటినీ పక్కపక్కనే పెట్టినపుడు అవి అతుక్కుపోయి ఒకటే మగబిడ్డగా మారతాయి. ఆ బిడ్డే జరాసంధుడు. బృహద్రథుడి తర్వాత మగధను చాలా ఏళ్లపాటు పరిపాలించి చివరికి భీముడి చేతిలో మరణిస్తాడు. మొదట్లో భీముడు జరాసంధుడ్ని చీల్చి ఆ ముక్కల్ని పక్కపక్కనే పడేయడంతో అవి మళ్లీ మళ్లీ అతుక్కుపోతూ ఉంటాయి. అప్పుడు శ్రీకృష్ణుడి సూచన మేరకు భీముడు ఆ ముక్కల్ని పక్కపక్కనే కాకుండా వ్యతిరేక దిశలో పడేయడంతో జరాసంధుడు తిరిగి ఒకటి కాలేకపోతాడు. ఆ విధంగా జరాసంధుడ్ని చంపి పాండవులు రాజసూయ యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు.
ఇంతకీ ఈ కథంతా నేను ఎందుకు చెప్తున్నట్టు? జరాసంధుడి లాంటి రెండు సగాలున్న ఒక తాళం కప్ప ఉందని చెప్పడానికి. ఈ బొమ్మలోని తాళం కప్ప చూడడానికి ఒకటిగా ఉన్నా నిజానికి ఇందులో రెండు సగాలున్నాయి. వాటిని సరిగ్గా పెట్టి అమర్చినప్పుడే తాళం పడుతుంది. లేకపోతే వేస్టే. తాళం చెవితో దాన్ని తీసినపుడు అవి రెండు ముక్కలుగా విడిపోతాయి. అచ్చు జరాసంధుడి టెక్నిక్నే ఇందులోనూ ఉంది.
కోతి తాళాలు
కోతి ఆకారంలోని తాళం కప్పల్ని చూశారా! 1 ఎ. తాళం వేసి ఉన్నప్పటి చిత్రం. 1 బి. తాళం తీసినప్పటి చిత్రం. 2 వ బొమ్మలోని కోతి తాళం కూడా అలాంటిదే. తోకే దాని తాళం చెవి. దాన్ని లోపలికి పెట్టి పైకి తోసినప్పుడే తాళం తెరుచుకుంటుంది.
హనుమంతుడి తాళం
హనుమంతుడి ఆకారంలో ఉన్న ఈ తాళం కప్పకు నాభి దగ్గర ఉంది తాళం చెవి రంధ్రం.
సింహ తాళం
భారతంలోని యక్షప్రశ్నల ఘట్టం గుర్తుంది కదా! దప్పికతో అల్లాడుతూ సరస్సు దగ్గరకు వచ్చిన పాండవులను యక్షుడు నిలవరించి కొన్ని ప్రశ్నలు వేస్తాడు. సమాధానాలు చెప్పకుండా మొండిగా వ్యవహరించి నలుగురు అన్నదమ్ములు విగతజీవులవడంతో ధర్మరాజు ఆ బాధ్యతను తీసుకుంటాడు. ధర్మరాజు సమాధానాలతో సంతృప్తి చెందాక యక్షుడు ‘ఒక తమ్ముడ్ని బ్రతికిస్తాను. కోరుకో’ అంటాడు. అప్పుడు ధర్మరాజు నకులుడ్ని బ్రతికించమంటాడు. భీముడ్ని, అర్జునుడ్ని వదిలేసి నకులుడ్ని ఎందుకు అడిగావంటే తన పినతల్లి మాద్రికి కూడా ఒక కొడుకు ఉండాలన్న ఉద్దేశంతో అని జవాబిస్తాడు. ధర్మరాజు ధర్మనిరతికి సంతోషించి యక్షుడు పాండవులందరినీ బ్రతికిస్తాడు. ఈ కథ మీకందరికీ తెలిసిందే. ఇందులో ఎవరికైనా నచ్చేది ధర్మరాజు యుక్తి.
అటువంటి యుక్తితో మాత్రమే తీయగల ఒక తాళం కప్ప ఉంది. అది చూడడానికి ప్రశాంతంగా కూర్చున్న సింహం పిల్లలా ఉంటుంది. తాళం చెవి రంధ్రం కూడా మనకు కనబడుతూనే ఉంటుంది. కాని ఎన్నిసార్లు తాళంచెవి లోపల పెట్టినా తాళం మాత్రం ఊడిరాదు. యక్షుడు, మంచినీటి సరస్సులాగే తాళంకప్ప, చెవి రెండూ వాస్తవంగానే ఉంటాయి కాని మార్మికంగా వ్యవహరిస్తుంటాయి. తాళంచెవి లోపల పెట్టి తిప్పితే చాలదు. బొమ్మలో చూపెట్టినట్టుగా చివరికంటా పోనిస్తేనే తాళం తెరుచుకుంటుంది.