నాయకురాలు నాగమ్మ ఉదాత్త చరిత్రకు వక్రీకరణం
పల్నాటి యుద్ధానికి హేతువు నాయకురాలు నాగమ్మేనని ఎనిమిది శతాబ్దాలుగా అవాస్తవ ప్రచారం జరుగుతూనే ఉంది… మహా పండితుడు అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు, కవిరాజు త్రిపురనేని రామస్వామి సైతం పల్నాటి చరిత్రపై తమ రచనలలో సత్యదూరమైన సంగతులనే పొందుపర్చారు.
అన్యాయం చేయడంలో కాలం కూడా అతీతం కాదే మో!. చరిత్ర గతులను సవరించిన మహా నేతలు కొందరిని సరిగా అర్థం చేసుకున్నట్లు కనిపించదు. వైతాళికులందరినీ ఒక తీరున దర్శించలేదేమో అనిపిస్తుంది. మార్గదర్శకులు కొందరి పట్ల ఒక వివక్షాపూరిత వైఖరిని అవలంభించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. రచయితలు, కవులు ఒక పక్షం వైపు వొరిగి రచనలు సాగించినట్లు ధ్రువపడుతుంది. అట్లా అనేక విధాలుగా రచనలలో వక్రీకరణకు గురైన మహా మహిళా నేత ‘నాయకురాలు నాగమ్మ’ ఒకరు.
నాగమ్మ సుగుణ శీలమైన వ్యక్తిత్వం, శాంతికాముక స్వభావం అనేక మంది రచనలలో వక్ర భాష్యానికి లోనయ్యాయని ‘పలనాటి చరిత్ర’ లోలోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే వెల్లడవుతుంది. నాయకురాలును ఆవిష్కరించిన అనేక మంది రచయితలు నిజాలు తెలిసినప్పటికీ తమ కలాలను వక్రగతుల్లోనే నడిపారు. నీతిమంతమైన ఆమె రుజుమార్గాన్ని కుడికంటితో గమనిస్తూనే, ఎడమ కంటితో ఆమెను నేరస్థురాలిగా చిత్రీకరిస్తూ వచ్చారు. శాంతిదూత, మధ్యయుగాల మహిళామణి అయిన నాయకురాలిపై దోషిగా ముద్ర వేసి చరిత్రలో నిలబెట్టారు. మహాకవి శ్రీనాథుని ప్రామాణిక రచన ‘పలనాటి వీరచరిత్ర’లోని అంశాలను మరుగునవేస్తూ వంకర భావాలు చెబుతూ వస్తున్నారు; అనంతర కాలానికి చెందిన కవులు, రచయితలు, పలనాటి చరిత్రను అక్షర బద్ధం చేయడానికి పూనుకున్న వారిలో నలుగురైదుగురు మినహా మిగిలిన వారందరూ మూల ప్రామాణిక గాథను దోవ తప్పించినవారే.
దాదాపుగా కలం పట్టిన ప్రతి రచయిత నాయకురాలిపై సిరా విదిలించిన వారే. ఏతా వాతా అందరూ ఆమెకు మరక అంటించిన వారే. నాయకురాలి మనస్తత్వాన్ని, నడవడిని, ఆలోచనా సరళిని మధ్య రేఖపై నిలుచుని దర్శించకపోవడం వారి హ్రస్వ దృష్టి అని నేననుకోవడం లేదు. రచన ప్రారంభానికి పూర్వమే వారివారి ఆలోచనలలోకి దోషం ప్రవేశించడమే ఈ ధోరణికి ఆలంబన అనిపిస్తుంది. పరిశోధకుల్లా లోతుల్లోకి వెళ్ళిన వారు తమ తమ కలాలను నిజాయితీగా నడపలేకపోయారు. కారణాలేమైనప్పటికీ; అనేకమంది నాయకురాలిని కపటిలా, యుద్ధపిపాసిలా, కుట్రదారుగా ప్రచారంలోకి తీసుకొచ్చేందుకు తమ ఆలోచనలకు ఎనలేని పదును పెట్టారు. ఆమెను దోషిగా, నేరస్థురాలిగా నిరూపించేందుకు అనేక కట్టుకథలు, పుట్టకథలు సృష్టించారు. అవసరమైన ప్రతి సందర్భంలోనూ తమ విజ్ఞానాన్నంతా ఉపయోగించి గాథను కల్పనా మలుపులు తిప్పారు. బ్రహ్మనాయుడు, ఆయన పుత్రరత్నం బాలచంద్రుని తప్పిదాలన్నింటినీ నాయకురాలికి ఆపాదించి ఆమెను చారిత్రక యవనికపై ముద్దాయిగా నిలిపారు. ప్రఖ్యాత కవులు, రచయితలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఎలాంటి సంశయం, సంకోచం లేకుండా నాయకురాలిపై అభాండాలు వేశారు. నిగ్గు తేలకుండానే నిందలు మోపారు.
మచ్చుకు పల్నాటి యుద్ధానికి కారకాలను, ప్రేరకాలను మూల్యాంకనం చేసుకుంటే…! పల్నాటి యుద్ధానికి హేతువు నాయకురాలు నాగమ్మేనని ఎనిమిది శతాబ్దాలుగా అవాస్తవ ప్రచారం జరుగుతూనే ఉంది. మొత్తం రక్తపాతానికి నాయకురాలి యుద్ధకాంక్షే కారణమని జనబాహుళ్యంలోనూ, అనేక రచనల్లోనూ తొంగిచూస్తున్న అంశం. కవులు, రచయితలు ఈ నిందా ప్రచారాన్ని తమతమ కపాలాలలోకి, కలాలలోకి దట్టించి వదిలారు. సాహితీ లోకంలో ఉద్దండులైన మహాపండితుడు అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు, కవిరాజు త్రిపురనేని రామస్వామి సైతం పల్నాటి చరిత్రపై తమ రచనలలో సత్యదూరమైన సంగతులనే పొందుపర్చారు. అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు పలనాటి వీర చరిత్రకు సంబంధించిన కాలాలు అన్నింటినీ ధ్రువపర్చడానికి చాలా శ్రమకోర్చారు. ఈ వీరగాథపై ఆయన లోతైన పరిశోధన గావించి వివిధ అస్పష్ట అంశాలను పరిష్కరిస్తూ 1911లో ప్రథమ భూమిక శీర్షికతో 82 పేజీల సంపాదకీయం ముద్రించగా, 1938లో ద్వితీయ భూమిక మకుటంతో 96 పేజీల మరో సంపాదకీయం పాఠకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సంపాదకీయాలకు శ్రీనాథ విరచిత ‘బాలచంద్రయుద్ధం’ ద్విపద ఘట్టాన్ని అదే పుస్తకంలో చివరన జతచేసి తెచ్చారు.
పలనాటి వీరచరిత్రను శ్రీనాథుడు తొలుతగా గ్రంథీకరణ గావించిన విషయం ఇక్కడ మనం గుర్తుకు తెచ్చుకుందాం. అంటే శ్రీనాథుడికి మునుపు ఈ వీరగాథ మౌఖికరూపంలో కొనసాగింది.
అనగా శ్రీనాథుడి ‘పలనాటి వీరచరిత్ర’ కావ్యమే చరిత్రపై తొట్టతొలి రచన, ఆయన గ్రంథమే ప్రామాణికమని స్పష్టమౌతుంది. అయితే శ్రీనాథుని పలనాటి వీరచరిత్రలోని ‘కల్లిపోరు’, ‘బాలచంద్ర యుద్ధం’ ఖండికలు మాత్రమే మనకు లభ్యమయ్యాయి. ఈ రెండు ఖండికలలోనే నాయకురాలి రాజనీతి, మానవతా ధోరణి, బ్రహ్మనాయుని రణదాహం, కుట్రపూరిత స్వభావం, బాలచంద్రుని శౌర్యం, దుందుడుకు పోకడలు మనకు తేటతెల్లమౌతాయి. అయితే ఈ ప్రామాణిక అంశాలను వదిలి వేసిన అక్కిరాజు, త్రిపురనేని నాయకురాలినే దుష్టురాలిగా మలిచారు. అక్కిరాజు తన ‘శ్రీనాథ భట్టకృతి పల్నాటి వీరచరిత్ర’ ప్రథమ భూమికలో వ్యాఖ్యానించిన విషయమేమిటంటే ‘పల్నాటి యుద్ధమునకు నాగమ్మయే కారకురాలు’. అదే విధంగా కవిరాజు తిప్రురనేని తమ ‘భగవద్గీత’లో మహాభారత గాథలోని ద్రౌపది, పల్నాటి వీరచరిత్రలోని నాయకురాలి వ్యక్తిత్వాలను సమాంతరంగా విశ్లేషిస్తూ చెప్పుకొచ్చిందేమిటంటే – ‘నలగాముని వైపున నాగసాని లేనియెడల బల్నాటి యుద్ధ మెసంగియుండదు. మనుజుల పుఱ్ఱెలతో జదరంగమాడనేర్చిన చతురుపాయ ప్రయోగ. విధానవేత్త నాగసాని’
నిజానికి అపారమైన తన సేనావాహినితో కారంపూడి రణభూమికి చేరుకున్న అనంతరం తనంత తానుగా సుహృద్భావ ఆలోచన చేసిన నాయకురాలు నలుగాముని ఒప్పించి సంధి ఒడంబడికకు శ్రీకారం చుట్టింది. తనకు అత్యంత ఆప్తులైన వారిని రాయబారులుగా సంధి కార్యక్రమం చక్కబెట్టుకురమ్మని బ్రహ్మనాయుడి శ్రేణుల వద్దకు పంపింది. బ్రాహ్మనాయుడి వర్గీయుల గొంతెమ్మ కోర్కెలన్నీ అంగీకరించింది. వారిని సంతృప్తి పరిచి సంధి మార్గాన్ని సుగమం చేసుకుంది. ఈ సంఘటనా సారాన్ని శ్రీనాథుడు తన ‘పలనాటి వీరచరిత్ర’లో అక్షరబద్ధం చేశారు. అక్కిరాజు వారు తమ ‘శ్రీనాథ భట్టకృతి పల్నాటి వీరచరిత్ర’కు అనుసంధానం చేసిన ‘బాలచంద్ర యుద్ధ ఘట్టం’లో ఈ సంధి సంఘటనలు ద్విపద ప్రకియలో సూర్యబింబంలా ప్రకాశిస్తూనే ఉన్నాయి. ‘తలపోసి మదిలోన తగిన వారలను/ వాసిగా బ్రహ్మన్న వద్దకు బంపి/ బవరంబు గాకుండా పట్టుటకార్య/ మని పెద్దలనదగు ఆప్తవర్గమును/ కొండ అన్నమరాజు కోటకేతుండు/ కూరిమి హితుడు మాడ్గుల వీరరెడ్డి/ పరమాప్తుడౌ చింతమల్లి రెడ్డియును/ మొదలైన సువిచార ముఖ్యులైనట్టి/ చనపర్ల బిలిపించి నదుబుద్దిననియె/ బహుపరాక్రమ ప్రాభవులైన/ వీరులు రాజులు వెలియశోభిల్లు/ కొలువులులోనికి పోయి కూరిమి మీర/ సవరంబు గాకుండి సంధిÄౌనట్లు/ మాటాడి ఆటమీద మాచర్ల భాగ/ మేలుకొమ్మని చెప్పు మింకొక మాట/ నాయుని వద్దకు నరసింగుదెచ్చి/ కులవైరమడతుము కోరిమీరంద/ రొక్కటి కమ్మని యొప్పించిరండు’.
ఈ మొత్తం ద్విపదలో బ్రహ్మనాయుడి పక్షం వారి మాచర్ల రాజ్యాన్ని వారికే ఇచ్చివేస్తామని, మరింకనూ అలరాజు హంతుకుడని అభియోగాన్ని ఎదుర్కొంటున్న నరసింగరాజును కూడా అప్పగించుతామని నాయకురాలు సంధి అంశాలుగా ప్రతిపాదించిన వైనం మనకు బోధపడుతుంది.
ఆరు సంవత్సరాల పాటు పల్నాడుతో పాటు పలనాటి చరిత్రకు అనవాళ్ళు దొరికే ఇతరేతర ప్రాంతాలలో సంచరించి THE EPIC OF PALNADU అను మకుఠంతో పలనాటి వీర చరిత్రను వెలువరించిన అమెరికన్ పరిశోధకుడు H.Roghair కూడా యుద్ధపరిణామాలను విశదీకరిస్తూ : ‘యుద్ధం చేయలేమంటూ, యుద్ధానికి కారణం లేదంటూ బ్రహ్మన్న వర్గీయులు గోసంగులు (మాదిగలు/దళితులు) యుద్ధ భూమిని విడిచి వెళ్ళిన వైనాన్ని తెలియజేశార’ని అన్నారు. నాయకురాలి పక్షానే ధర్మం ఉందన్న గోసంగుల నిర్ణయం ఆమె నిబద్ధతను, చిత్తశుద్ధిని నిరూపిస్తున్నాయి. యుద్ధరహిత పల్నాడు కోసం నాయకురాలు చూపిన చొరవ, తపన, స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఖౌజజ్చిజీట ఇలా రాశారు : “But the Gosangis saw no reason for the war, and they turned back. Each man went to his own place. After they were gone, repeatedly messages were sent to them, asking them to come back. But whenthe messengers came, the Gosangis said that they would not come. The Gosangis were the first followers of the creed (Bhram Naidu)”. (THE EPIC OF PALNADU ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది.)
శ్రీనాథుని ప్రామాణిక రచనలో వాస్తవాలు ఈ విధంగా ఉంటే పండితశ్రీ అక్కిరాజు, కవిరాజు త్రిపురనేని నాయకురాలికి ప్రతికూలంగా ఎందుకు వ్యాఖ్యానించారు? పండితులచే, ప్రముఖులచే ప్రతిభా ప్రశంసలు అందుకుని శహభాష్ అనిపించుకున్న వారు ఈ ఇద్దరు. శ్రీనాథుని కావ్యాంగాలు చదవకుండానే నాయకురాలే యుద్ధానికి కారకురాలని ఈ ఇరువురూ నిర్ధారించారా? నాయకురాలిని తప్పుపట్టడానికి కారణం వీరికి బ్రహ్మనాయుడిపై గల వాత్సల్యమా? లేక నాయకురాలిపై పెంచుకున్న వ్యతిరేక భావనా? అనే ప్రశ్నలు మన ముందుకొస్తాయి. ప్రామాణిక అంశాలను పక్కదోవ పట్టించడం ఎంత వరకు సబబు? వీరిరువురికి సమాజంలో గల గౌరవ ప్రతిష్ఠలకు ఇలాంటి సత్యదూర అల్లికలు భంగం కలిగించవా? నాయకురాలి మేరునగ మార్గాన్ని కురచపరిస్తే, విశాల మానవతావాదాన్ని పలుచపరిస్తే వీరికి వొరిగేదేమిటో అర్థం కాదు. పల్నాటి చరిత్రను ఆవిష్కరించడానికి ముందుకొచ్చిన అనేకమంది రచయితలు ప్రమాణాలను పాటించకుండా, నిజాలను గౌరవించకుండా నాయకురాలిని కించపరచడానికే ప్రయత్నించారని తెలియజేయడానికే ఈ విషయాలను మీ ముందుకు తెచ్చాను. ఇకనైనా నాయకురాలిని, ఆమె నీతిమంతమైన జీవన గమనాన్ని, అజేయమైన ఆమె ధీరత్వాన్ని తెలుగు సమాజమంతా నిజాయితీగా అర్థం చేసుకోవాలి.
– వై.హెచ్.కె. మోహన్‌రావు
అధ్యక్షులు, పల్నాడు రచయితల సంఘం