సాహితీ భోజనాలు! 1

సాహితీ భోజనాలు!

తినడం ఒక భోగం – తినలేకపోవడం ఒక రోగం – తినాలనుకోవడం ఒక యోగం. మన మహాకవుల, మహా పండితుల భోజన ముచ్చట్లను ఆస్వాదించండి.

భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితమ్,
మహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దథి’
అని ఒక దేశీయ కవి పలికాడు. జీవులకెల్లరకు ముఖ్యంగా కావలసినది భోజనం. అట్టి భోజనమెవరి వలన సమకూరుచున్నది? మన వలన – మన వలన. కావున మన వృత్తియే ప్రప్రధానమైనది. గీ ‘వృత్తులన్నిటిలో వంట వృత్తి మొదలు’ అని మహాకవి గంగాదాసు గారి సూత్రమున్నది. ఈ వృత్తి కళయా, శాస్త్రమా యని కృతయుగము నుండియు బూర్యపక్ష రాద్ధాంతములగుచూనే యున్నవి. బుద్ధ దేవుని అభిప్రాయం ఇది కళ అనియే. కానీ యశోకాదుల మహాసభలలో ఇది శాస్త్రమని నిర్ణయింపబడినదని తాళపత్ర గ్రంథములలో ఉన్నట్లు తెలియుచున్నది. ఇది కళ అనియే నా నమ్మకం. గానము, శిల్పము, చిత్రలేఖనము, కవిత్వము అను కళలు దీని కాలిక్రింద దిగదుడుపు. అవి లేకున్నా ప్రపంచానికి నష్టం లేదు. నిత్య ప్రపంచ యాత్ర దీనితో జరుగవలసినది కానీ, వానితో గాదు. గాన ప్రపంచమున భైరవిరాగము లేకపోయిన యెడల బ్రాణోపద్రవమేమియ లేదు. మహానన ప్రపంచమున బప్పు లేకపోయిన యెడలనెంత ప్రాణసంకటమో యోజింపుడు. పేరొందిన ‘టాజ్‌మహల్’ పెసరట్ల పలావు కంటె నెక్కువది కాదు. కన్నుల నిండు కంటె గడువు నిండే ఘనమని పాశ్చాత్య పండితులందరు బ్రహ్మసూత్ర నిర్మాణ మొనర్చి యున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థాము దేశమున కొనర్చిన మేలు కంటే నొక నీరుళ్లిపాయ ప్రపంచమున కొనర్చుచున్న యుపకారము శత సహస్ర గుణాధికమై విరజిల్లుచున్నది. క్రొత్త చింతకాయ పచ్చడికున్న ‘మజా’ గుహాంతర్దేవాలయముల కెక్కడిది? సోమనాథేశ్వరుని యాలయమును గజినీ మహ్మదు కూలద్రోసినాడు. భారతమాత కొక్క తలవెంట్రుక యూడినట్లయిన లేదు. కానీ ఈ దినమున బనసకాయను బచన కళా ప్రపంచము నుండి బహిష్కరింపుడు. ఆర్యావర్త మల్లలాడి యల్లలాడి యంబుధిలో బడిపోవదా? చెవులు గోసిన గొర్రెలవలె బేరుమని పితృదేవతలు నెత్తినోరు కొట్టుకొని యేడువరా? ఉద్గతులూడి భ్రష్టులైపోవరా? పచనకళ యందు శిల్పమే ఇట్లు మాఱునప్పుడింక జిత్ర లేఖనమా? మిళ్లి గరిటె యెక్కడ? ఒంటె వెండ్రుక కుంచెక్కడ? పులుసు గూనల ముందు రంగుచిప్పి లాగునా? రవివర్మ రాయబారపు సభాపటమంతయు మా కామిగాడు చేసిన కందబచ్చల కాడమీర కాలిగోటికి సాటియగునా? కొత్తిమీరెపు గారమునకు గోటి మోహినుల తమాషా అంతే! మనము బుద్ధిహీనులమై ఈ వృత్తి నాశ్రయింపలేదు. హెచ్చుతగ్గులుగా గాక సమానముగ నుప్పుపడిన గంజియైన ద్రాగవచ్చును గానీ, పంచదార తక్కువయైన పరమాన్నము పశువుల గోలెములకే కాని పనికిరాదే? ఏ రసము కూడ నేమాత్రము హెచ్చు కాకూడదు, తక్కువ కాకూడదు. సమానముగా నుండవలయు’నని కామకవితో చెప్పించినారు పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు.
‘కవితా సమాధిలో కూచున్నాడా- సరి అయిన తాదాత్మ్యం సిద్ధించిందా, ఒక అతనికి భోగాల మీదికి దృష్టిపోదు. కష్టాలు కనబడవు. నీరసం వచ్చి చెయ్యి ముడుచుకుపోగూడదు. పేగులు మాడి దృష్టి చెదిరిపోకూడదు. ఈ ప్రతిబంధకాలు కలక్కుండా వుండడానికే కవికాహారం. ధనికుడైన వాడికయినా కవితావేశం కలిగినప్పుడిదే ప్రవృత్తి. పర్సులో (బహుమితంగానే) డబ్బుండినా, దృష్టి రచనా వ్యగ్రమై కదలలేక కలమూ, కాగితాలు క్రింద బెట్టలేక, కూరల కోసం బజారుకి వెళ్ళాలన్న స్ఫురణే కలక్క, ‘కూరగాయలేవీ లేవు మరి’ అంటూ వంటింట్లో నుంచి కేకవినవచ్చినా ప్రకృతిలో పడలేక, వేళకి మాత్రం పీటమీదికి వెళ్ళి – ఆ పూటకు వూరగాయలతోనూ, చారు, మజ్జిగలతోనూ భోజనం అయిందనిపించుకుని చెయ్యి ఆరడం తడవుగా మళ్ళీ కలం పట్టి, దాంతో ప్రపంచం మరిచిపోయిన సందర్భాలెన్నో వున్నాయి నా జీవితంలో’ అంటారు శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ గారు.
సత్రాలు – భోజనాలను గురించి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి మాటల్లో – ‘కొన్ని ఊళ్ళల్లో భుక్తల గృహాలల్లోనూ (తూర్పు దేశంతో అగ్రహారకులను భుక్తలంటారు), కొన్ని ఊళ్ళల్లో సత్రాలలోనూ భోంచేస్తూ ఎలాగైతేనేం కాశీ నుండి తుని చేరాం. గంజాం వచ్చింది మొదలు స్వయంగా వండుకోవడం తప్పింది. త్రోవలో చాలా వరకు సత్రాలన్నీ శ్రీమహారాజులం గారివే. ఆ సత్రాలు సదుపాయంగా అన్నోదకాలివ్వడానికే అసలు ద్రవ్యదాత లేర్పరచి వున్నారట. కానీ ఇటీవల ఆ సంస్థానానికి దివాన్‌గిరి చేసిన శ్రీ పెనుమత్స జగన్నాథ రాజుగారు ఒక్క సత్రం తాలూకు సొమ్ముతో రెండేసి సత్రాలు పెట్టి ఆ సదుపాయం పూర్తిగా తగ్గించారని మా గురువుగారు శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రులు గారు చెప్పగా విన్నాను. నాకు ఈ కాశీయాత్ర ప్రయాణంలో గురువుగారు చెప్పిన మాట అనుభవంలోకి వచ్చింది. దివాన్‌జీ జగన్నాథ రాజుగారు కూడా మహాయోగ్యుడే కానీ, వారి ఉద్దేశం – ఏదో ఆ పూట తిని వెళ్ళేవాళ్ళకి సదుపాయమెందుకు? అసలు లేకపోవడం కంటే, ఇంత చారునీళ్లు – అన్నం వుంటే చాలదా అనియట. మంచి యోగ్యులకు తోచే వూహలు కూడా ఒకప్పుడు లోకాపకారకాలవుతాయి అన్నందులకీ సత్రాలే ఉదాహరణ. దివాన్‌జీ గారు ఒకటి రెండు చేస్తే; దానిలోని గుమాస్తాలు, వంట బ్రాహ్మలు మరికొంత తగ్గిస్తే, తుదకు నీళ్లలో పప్పుమాత్రం వేసి తీసిన తోటకూర, సుద్ద కలిపిన నీళ్ళవంటి మజ్జిగ – ఈ రీతిగా భోజనం ఏర్పాటవుతుందని వేరే వ్రాయనక్కరలేదు. ఈ భోజనం అప్పుడే చూచాను. మళ్ళీ ఈ మధ్య నాలుగేండ్ల నాడు విజయనగరం విద్యార్థులు భోంచేసే సత్రంలో చూచాను.

చూడడమంటే చూడడం కాదు, తిని చూచాను. మీరీ రోజులలో సత్రభోజనానికెందుకెళ్ళారని శంకింతురేమో! బొబ్బిలి పట్టాభిషేకం కృతి ఇచ్చి వచ్చేటప్పుడు, ఇదివరలో నావద్ద చదివిన కొందరి కోరిక మీద విజయగనరంలో ఆగవలసి వచ్చింది. ఆ విద్యార్థులు నాకోసమేదో పెద్ద ప్రయత్నం చేయబోతే, ‘అబ్బాయీ! మీరంతా ఎక్కడ భోంచేస్తే, అక్కడే నేనుకూడా భోంచేస్తాను. ఒక పూటకేమిటి, మీ విద్యార్థుల పంక్తిని భోంచేయడం నాకు పరమ సంతోషం’ అన్నాను. దానిమీద ఆ సత్రాధికారితో చెప్పి ఏదో సదుపాయం కల్పించాలని అనుకున్నారు కానీ, నేను దానికి అంగీకరించక, ‘నా పేరు చెప్పనే వద్దు. నేను వచ్చినట్లు విజయనగరంలో ఎవ్వరికిన్నీ తెలియకూడదు. అలాగైతేనే నేను వస్తాను. లేకుంటే రానేరాను’ అని ఖండితంగా చెప్పేటప్పటికి, విధిలేక వాళ్లు అందుకే అంగీకరించారు. ఆ కారణం చేత ఆ విద్యార్థుల సత్రభోజనం నాకు అనుభవానికి వచ్చింది. ద్రవ్యదాతల లోపముందేమో అంటే, రోజు ఒకటింటికి పన్నెండు రూపాయలు కూరలకే ఇస్తారట! ఈ సత్రాధికారి ఎవరో సామాన్యుడు కాక వేదం వచ్చిన వారి కుటుంబంలో పుట్టి, వేదం చెప్పికొన్న శోత్రియుడని కూడా విన్నాను. అందుకే కాబోలు ఇంత శోత్రియంగా విద్యార్థుల భోజనం వుందనుకోవలసి వచ్చింది.’ అన్నారు శాస్త్రిగారు.
ఒకసారి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు బందరు వచ్చారు.

ఒకరాత్రి వారిని అడివి బాపిరాజు గారు తమ ఇంటికి విందుకు పిలిచారు. ప్రక్కనున్న కాటూరి వారిని, మరొకరిని పిలిచారు. ఆ సాయంత్రం బజారుకి వెళ్ళి కూరగాయలు వగైరాలు కొనుక్కు వెడుతూ కనిపించిన మిత్రులందరితో ‘ఈ రాత్రి వేంకట శాస్త్రిగారు మా ఇంటికి విందుకు వస్తున్నారు. మీరు కూడా వస్తారా?’ అని చెబుతూ వెళ్ళారు. భోజనం వేళకి ముప్పై మంది గుంపు చేరిందక్కడ. బాపిరాజు గారు తిందర విందర్లాడుతున్నారు. పిలవడంలో ఆయన ఉద్దేశం విందు తర్వాత గోష్టిలో పాల్గొనడానికి రమ్మని. అది స్పష్టంగా లేక అంతా విందుకే వచ్చారు. కాటూరి వారు బాపిరాజు గారిని కోప్పడి దొడ్డి దోవన పక్క ఇళ్ళలోంచి సామాన్లు జేరవేయించారు. తొమ్మిదవుతోంది. చెళ్ళపిళ్ళవారు ‘పొద్దుపోతుంది మడి కట్టుకోమన్నావా? ఈ కబుర్లు భోజనాల దగ్గరే చెప్పుకుందాం’ అన్నారు. బాపిరాజు గారు ‘చిత్తం చిత్తం’ అంటూ లోపలికి వెళ్ళారు. అందరికీ విస్తర్లు వేశారు. అంతా కూర్చున్నారు. మొదటగా వండిన పప్పు, పచ్చడీ, కూరా కొంచెం కొంచెంగా విస్తట్లో రాచిపోతున్నారు. విస్తట్లో వేసిన పదార్థాలు చూచి చెళ్ళపిళ్ళవారు ‘మా బాపిరాజు కాగితాల మీదనే చిత్రలేఖనం అనుకున్నాను. విస్తళ్ళలో కూడా గరిటెను కుంచెగా చేసి చక్కని చిత్రాలు గీశాడు’ అన్నారు. అంతా గొప్పగా నవ్వుకున్నారు. అసలు విషయం అర్థమై, శాస్త్రిగారు సంభాషణలోకి దింపారు. పదార్థాలన్నీ పదిగంటలకు తయారైనాయి. తృప్తిగా భోజనాలైనాయి. శాస్త్రులు గారు చేయి కడుక్కుని వచ్చి, వాకిట్లో మడత కుర్చీలో పడుకుని, బాపిరాజు గార్ని పిలిచి ‘ఆలస్యమైనా అమృతతుల్యమైన భోజనం పెట్టావు. నీ సంకల్పం మంచిది. అందువల్లనే ముగ్గురు ముప్పై అయినారు’ అన్నారు.
ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారు మద్రాసులో హోటలుకు భోజనానికి వెళ్ళారు. ఒక ముద్ద తిని మళ్ళీ కాస్త నెయ్యి వేయమన్నారు. సర్వరు నేతికి అదనపు చార్జీ అన్నాడు. ‘అన్నానికి’ అన్నారు విశ్వనాథ వారు. ‘దానికీ అంతే’నన్నాడు సర్వరు. ‘మరి దేనికి లేదు అదనం’ అన్నారు. ‘కూర, పచ్చడి, సాంబారు’ అన్నాడు సర్వరు. ‘అయితే కూర తీసుకురా’ అన్నారు. ఉండచేసి నోట్లో పెట్టారు. మళ్ళీ కూర… మళ్ళీ కూర… ఇలా ఎనిమిది సార్లు అడిగారు. ‘ఎన్నిమార్లండీ బాబు’ అని వాడు విసుక్కున్నాడు. ‘దీనికి అదనం లేదన్నావుగా? ఎన్ని సార్లయితేనేం?’ అన్నారాయన.
వాడింకొకసారి వేసి, దణ్ణం పెట్టాడు మళ్ళీ అడగవద్దని.

అప్పుడు కోపం వచ్చి ‘అదనం ఏమిటి? నీ మొహం. తినేవాళ్ళకు పెట్టాలి. తినలేని వాళ్ళెలాగు వుంటారు. వాళ్ళందరి వంతూ నువ్వే తింటావా?’ అన్నారు. వాడికేం అర్థం అవుతుంది, వెళ్ళిపోయాడు. ప్రక్కనున్న మిత్రుడు ‘అంత కూర ఎలా తిన్నారు’ అన్నాడు. ‘ఇంతమాత్రం తెలియదు. పంతంలో ఎంత బలమన్నా వస్తుంది. నేతికి అదనం ఏమిటి? రాను రాను దేశంలో బతుకులు అదనం అయిపోతున్నాయి. నిజానికి మనందరివి అదనపు బ్రతుకులే’ అని విసుక్కున్నారు.
విశ్వనాథ వారు భోజన ప్రియులు. ఒక్కోసారి కూరగాయలు తామే తరుక్కునే వారు. ఆయనకెంతో సంతోషం ఆ పని. ఒకసారి ఆయన కత్తిపీట దగ్గర కూర్చుని కూరగాయలు తరుగుతున్న ఫొటోను ప్రభలో వేశారు. అందరూ జడిశారు ఆయనకు కోసం వస్తుందని. తరువాత కనిపించిన రావూరి సత్యనారాయణతో ‘కత్తిపీట ఫోటో వేశారే! బాగుంది. ఏం, కవిగారు కలం పట్టుకోవాలంటే ఏదైనా తినాలా, వద్దా? కూర రుచి మనకు తెలుస్తుంది. మనం తరిగితే ఏం వండుతున్నారో ముందు తెలుస్తుంది. అసలు విషయం చెప్తాను. ఇది రాస్తే రాయి, లేకపోతే లేదు గానీ పడకటింటి ముచ్చట్ల కంటే, వంటింటి ముచ్చట్లు గొప్పవి. ఇక్కడ ముసలితనంలో ముచ్చట్లు తిరుగుతాయి, అక్కడ పెరుగుతాయి. జీవిత సాఫల్యం మాట ఎలా వున్నా, జిహ్వ చాపల్యం గొప్పది’ అన్నారు విశ్వనాథ వారు.
తినడం ఒక భోగం- తినలేకపోవడం ఒక రోగం – తినాలనుకోవడం ఒక యోగం.
– మువ్వల సుబ్బరామయ్య

Category:

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

1 Response to సాహితీ భోజనాలు! 1

 1. very nice sir
  On 17-Apr-2014 7:29 PM, సరసభారతి ఉయ్యూరు
  wrote:
  >
  > gdurgaprasad posted: “సాహితీ భోజనాలు! Published at: 14-04-2014 03:33 AM
  తినడం ఒక భోగం – తినలేకపోవడం ఒక రోగం – తినాలనుకోవడం ఒక యోగం. మన మహాకవుల, మహా
  పండితుల భోజన ముచ్చట్లను ఆస్వాదించండి. భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప
  సమన్వితమ్, మహిషంచ శరచ్చంద్ర చంద్రిక”
  >

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.