మా నవ రాత్రి యాత్ర -1
ప్రయాణానికి నేపధ్యం
మా అమ్మాయి ఛి సౌ విజయలక్ష్మి అమెరికా నుంచి ఉయ్యూరుకు సరసభారతి నిర్వహిస్తున్న ‘’శ్రీ జయ ఉగాది వేడుకలు ,అందులో భాగం గా మా దంపతుల యాభై వసంతాల వివాహ వేడుకల కోసం వస్తోందని తెలిసి ఏంతో సంతోషించాం .మార్చి ఇరవై న బయల్దేరి హైదరాబాద్ కు ఇరవై రెండు చేరి అన్నల ఇళ్ళల్లో రెండు రోజులు గడిపి ,ఉయ్యూరు కు చేరింది .వచ్చిన దగ్గర్నుంచి హడావిడే .
సుమారు 32ఏళ్ళ క్రితం మా కుటుంబం మా అమ్మఅస్తికలను కాశీలో గంగ లో కలిపి ,అక్కడే మాసికం కూడా జరిపాం .అప్పుడు మా అమ్మాయి చిన్న పిల్ల .దాన్ని ఉయ్యూరులోనే వదిలి పెట్టి మేమిద్దరమే వెళ్లాం .కాని పాట్నా నుంచి మా రెండో అక్కయ్యా బావ గారు ,మేనళ్ళుడూ మేనకోదలూ ,పూనా నుంచి మా తమ్ముడు మోహను భార్యా ,పిల్లలూ కూడా వచ్చారు .అప్పుడని పించింది మా అమ్మాయి విజ్జి ని కూడా తీసికేడితే బాగుండేదని .కాని అస్తికలు ఉయ్యూరు నుంచి తీసుకొని వెడుతూ ,అమ్మాయిని మాతో తీసుకు వెళ్ళటం ఉచితం కాదని మానేశాం .అదుగో అప్పటి నుంచి మా అమ్మాయి సరదాగా గునుస్తూనే ఉంది ‘’నన్ను కాశీ తీసికెళ్ళ కుండా వెళ్ళారు ‘’అని .అది సరదానే అన్నా మా ఇద్దరి మనస్సులో బాధ గానే ఉంది .దానికి కూడా ఉత్తర దేశ యాత్ర ఫలం కలిగించాలని గాఢం గా మనసులో నిలిచి పోయింది .పిల్లలు అమెరికా లో ఉన్నారు కనుక ఎండలైనా ఇప్పుడే దానితో మేమూ వెళ్లి చూపించాలని నిర్ణయించాం .మా అబ్బాయి రమణ కూడా వీటిని చూడలేదు .కనుక మేము నలుగురం కలిసి సుమారు వారం రోజుల యాత్రకు ఆలోచించాం .
రిజర్వేషన్లు –టూర్ ప్రోగ్రాం
మా అమ్మాయి అమెరికా నుంచి ఇంకా బయల్దేరక ముందే మా రెండో అబ్బాయి శర్మ కు వివరాలు చెప్పి కాశీ ,ప్రయాగ ఖజురహో ,ఉజ్జైన్ ఓంకారేశ్వర్ ల టూర్ ప్రోగ్రాం ఖరారు చేయమన్నాం .వేసవి కనుక ఏ.సి లోనే వెళ్ళమని ,టికెట్లు చూస్తానని ,హోటల్ రూములు కారు కూడా ఎసి మాత్రమె వాడుదామని సూచించి టికెట్ల వేటలో పడ్డాడు .ఎప్పుడు బయల్దేరాలి అన్న సమస్య వచ్చింది. నేను మాత్రం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో శ్రీరామ నవమి కల్యాణం చేసి మాత్రమె బయల్దేరాలి అని చెప్పాను .దాని ప్రకారం ఏప్రిల్ 8మంగళ వారం శ్రీ రామ నవమి కల్యాణం అయిన రాత్రికే బయల్దేరే ఏర్పాటు చేశాడు .బేజ వాడ నుంచి డైరెక్ట్ టికెట్లు దొరక్క పోవటం తో సికంద్రా బాద్ వెళ్లి ,ఆ మర్నాడు అంటే తొమ్మిదో తేదీ ఉదయం పది గంటలకు సికందరాబాద్ నుంచి బయల్దేరే పాట్నా ఎక్స్ ప్రెస్ కు బయల్దేరెట్లు బుక్ చేశాడు .అది మర్నాడు అంటే పదవ తేదీ మధ్యాహ్నం అలహా బాదు చేరుతుంది .అక్కడ రైల్వే రిటైరింగ్ రూమ్స్ బుక్ చేశాడు .ఆ రోజంతా అలహా బాద్ లో త్రివేణీ స్నానం నగర దర్శనం .మర్నాడు ఉదయమే నాలుగింటికి వారణాశి ఎక్స్ ప్రెస్ లో బయల్దేరి ఏడింటికి కాశీ చేరటం’’ కరి వెన’’ వారి సత్రం లో రూమ్స్ లో ఉండి, అక్కడే భోజనం చేయటం ,పన్నేండవ తేదీ సాయంత్రం ఖజురహో కి వెళ్ళే బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ ఎక్కి పదమూడు ఉదయం ఖజురహోచేరటం ,ముందే బుక్ చేసిన హోటల్ రూమ్ లో ఉండి స్నానాల తర్వాత కారులో ఖజురాహో దేవాలయ దర్శనాలు ,వాటర్ ఫాల్స్ చూడటం రాత్రికి బయల్దేరి పద్నాలుగవ తేదీ ఝాన్సి మీదుగా ఉదయం ఉజ్జైన్ చేరటం .అక్కడే రైల్వే రూమ్స్ లో ఉండటం ఆ రోజూ మర్నాడు దర్శనాలు పది హీను ఉదయం భస్మ హారతి దర్శనం తర్వాత ఏడింటికి బయల్దేరి కారు లో ఓంకారేశ్వర్ వెళ్ళటం ,రాత్రికి అంటే తెల్లవారితే పదహారు బయల్దేరి భోపాల్ మీదు గా విజయవాడ కు రాత్రి రెండు గంటలకు చేరటం గా శర్మ టూర్ ప్రోగ్రాం తయారు చేసి ఆన్ లైన్ రిజర్వేషన్ చేశాడు .హోటల్ రూములు రైల్వే రూములు కార్లు అన్నీ ఫోన్ లోనో, ఆన్ లైన్ లోనో బుక్ చేశాడు కనక మాకు ఏ టెన్షన్ లేకుండా పోయింది .
ఉగాది కి అందరం ఉయ్యూరులో కలుసుకొన్నాం .ఉగాది వెళ్ళిన తర్వాతే నేను ప్రయాణం మూడ్ లోకి వచ్చి టికెట్లు వరుసలో రమణ డౌన్ లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసి ఇస్తే లైన్ లో పెట్టుకొన్నాను .మధ్యలో ఒక మార్పు జరిగింది .ఉజ్జైన్ నుంచి ఓంకారేశ్వర్ కు రైల్ ప్రయాణానికి తిరుగు ప్రయాణానికి బుక్ చేశాడు ముందే .కాని రైల్వే వాళ్ళు అ ట్రాక్ ను తీసేస్తున్నారని తర్వాత తెలియ జేశారట .అందుకని రిజర్వేషన్ కేన్సిల్ చేసి ఉజ్జైన్ నుంచి ఓంకారేశ్వర్ అక్కడినుండి ఉజ్జైన్ కి కారు బుక్ చేయాల్సి వచ్చింది .ఇది రేపు ప్రయాణం అనే వరకూ నేను గమనించలేదు .అప్పుడు శర్మకు ఫోన్ చేయటం వాడు వివరించి చెప్పటం తో విషయం అవగత మైంది
ప్రయాణ సన్నాహాలు
ఇక ప్రయాణ సన్నాహాలు ప్రారంభించాం తలొక చిన్న సూట్ కేసు ,ఒక హాండ్ బాగ్ తో బయల్దేరాలను కొన్నాం .అలహాబాద్ చేరే దాక భోజనం టిఫిన్ వగైరా అంతా తయారు చేసి తీసుకొని వెళ్ళాలను కొన్నారు. తల్లీ కూతుళ్ళు .మా అమ్మాయి తెచ్చిన’’ ధేర్మో కూలింగ్ బాగ్’’ లో ఐస్ క్యూబులు వేసి ఇంట్లో తయారు చేసిన పూరీ కూర ,అట్లూ అందులో సర్దారు .రెండు రోజుల వరకు అందులో పదార్ధం వేడిగా చల్లగా ఉంటుంది .అదీ ఆ బాగ్ ప్రత్యేకత .బిస్కెట్లు పళ్ళూ పెరుగు అన్నీ సర్దారు .కాఫీ ,మంచినీళ్ళకు డిస్పర్సిబుల్ గ్లాసులు ,ప్లాస్టిక్ ప్లేట్లు ,అరటి ఆకులు , నదీ స్నాన సమయం లో దీపారాధనకు అరటి దోప్పలూ ,వత్తులూ ఆవు నేయి అన్నీ వాళ్ళే సర్దుకొన్నారు .నేను ఆ క్షణం వరకూ కంప్యూటరు లో ఆర్టికల్స్ రాయటం మా ఆవిడ భాష లో ‘’కంపు కొట్టు కొంటూ ‘’ శ్రీరామ నవమి ఫోటోలు పంపటం ,మహిళా మాణిక్యాలు బుక్ పోస్ట్ లో హితులకు సన్నిహితులకూ పంపటం తోనే సరి పోయింది .
నవ రాత్రి కి మరో కారణం
ఇంతకీ ఈ టూర్ ప్రోగ్రాం కి ఇంకో కారణమూ ఉంది .తొమ్మిదేళ్ళ క్రితం మేము రెండో సారి అమెరికా వెళ్ళినప్పుడు మ అమ్మాయి వాళ్ళు ఉంటున్న ‘’మిఛిగాన్’’ రాష్ట్రం లోని డెట్రాయిట్ దగ్గరున్న ట్రాయ్ కి వెళ్ళాం .అప్పుడే మా అమ్మాయిని ‘’ట్విన్స్ ‘’మగ పిల్లలు పుట్టారు. డిసెంబర్ నెల గజ గజ వణికే చలి .రోజూ అడుగుకు తక్కువ కాకుండా ఐస్ పడేది .కాని అక్కడ మా అమ్మాయి స్నేహితురాళ్ళు ప్రీతీ ,జ్యోతి, బిందు, లావణ్యా ,షబ్రీన్ మొదలైన భలే మంచి బృందం ఉండేది .వారానికో సారి ఎవరొ ఒకరి ఇంట భోజనాలు ,బ్రేక్ ఫాస్ట్లు ,సాయంకాలం టిఫిన్లు ,విష్ణు.లలితా సహస్రనామ పారాయణాలు భలేగా గడిచి పోయింది. అంతా ఏంతో ఆప్యాయం గా ఆత్మీయం గా మా ఇద్దర్నీ ‘’ ఆంటీ అంకుల్ ‘’అంటూ మహా ప్రేమగా ఉండేవారు భలే సరదా బృందం అది .కడుపుతో ఉన్న వాళ్లకు సీమంతాలు ,పుట్టిన రోజు పండుగలు ,భలే కాలాక్షేపం .అంత చలి లోను .ప్రీతీ ,ఆమె భర్త శాస్త్రి గారి కోరిక పై వాళ్ళ ఇంట్లో అమెరికా లో మొదటి సారి గా నేను శ్రీ సత్య నారాయణ స్వామి వ్రతం చేయించాను . ఆ ప్రీతి వాళ్ళు ఆ తర్వాత హైదరాబాద్ చేరారు .హైదరాబాద్ లో మా అమ్మాయి వాళ్ళ మియాపూర్ స్వంత ఇంట్లో గ్రామ కుంకుమ నోము నోచుకొంటే ప్రీతి ,ఆమె తల్లి గారు వచ్చి వాయినాలు తీసుకొని భోజనం చేసి వెళ్ళారు .ఇప్పుడు ప్రీతీ వాళ్ళు భోపాల్ లో ఉంటున్నారు .అందుకని ప్రీతీ కోరికపై మా అమ్మాయి భోపాల్ వెళ్లి చూసి రావాలను కొన్నది .అది ఈ నవ రాత్రి యాత్ర గా పరిణమించింది .
ఇక ప్రయాణం విషయాలు వరుసగా ముందు తెలియ జేసి ఆ తర్వాత ఆ ప్రదేశ విశేషాలు ధారావాహికం గా రాస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-14-ఉయ్యూరు