మా నవ రాత్రి యాత్ర -2
అలహా బాద్ లో త్రివేణీ సంగమం
ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళ వారం రాత్రి మా ఆస్థాన టాక్సీ ఓనర్ రాము పంపిన కారులో సామాను అంతా సర్దుకొని తొమ్మిదింటికి బయల్దేరాం .బెజవాడ స్టేషన్ చేరే సరికి పది అయింది .నరస పూర్ ఎక్స్ ప్రెస్ పదిన్నరకు వచ్చింది .అందులో క్కి మా ఎసి రిజర్వేషన్ బెర్త్ లలో పడుకోన్నాం .తొమ్మిది ఉదయం నాలుగుముప్పావుకే అది గుంటూర్ మీదుగా సికంద్రా బాద్ చేరింది .వెంటనే ఆటోలో బయల్దేరి అయిదుం బావుకు మా పెద్దబ్బాయి శాస్త్రి వాళ్ళు ఉంటున్న మల్లా పూర్ చేరాం .అప్పటికే మా కోడలు సమత కాఫీ టిఫిన్లు రెడీ చేసి కూరలు ,పచ్చళ్ళు ,అన్నం వండి రెడీ గా పెట్టింది .మేము కాల కృత్యాల తర్వాత టిఫిన్ చేసి కాఫీ రెండో సారి తాగాం .మా అమ్మాయి ,తల్లీ అన్నం వగైరాలు ప్లాస్టిక్ డబ్బా లలో సర్దుకొని ‘’బిస్లేరి ‘’ మంచినీళ్ళ బాటిల్స్ ముందే మా అబ్బాయితో కొని పించి ,బత్తాయి పళ్ళు వగైరా అన్నీ పూర్తిగా సర్దుకొన్నారు .మా కోడలు ,మనవడు భువన్ స్కూల్ టైం కు స్కూల్ కు వెల్లారు .కోడలు తెలిసిన ఆటో ను స్టేషన్ కు మమ్మల్ని తీసుకు వెళ్ళటానికి మాట్లాడి ఉంచింది .ఎనిమిదిన్నరకు ఆటోలో మేము నలుగురం అంటే నేను మా శ్రీమతి మా అబ్బాయి రమణ అమ్మాయి విజ్జి బయల్దేరి తొమ్మిదిం బావుకు సికందరా బాద్ స్టేషన్ చేరాము .
పాట్నా ఎక్స్ప్రెస్ తొమ్మిదిన్నరకే ప్లాట్ ఫాం పైకి వచ్చింది .ఇక్కడి నుంచే బయల్దేరుతుంది .ఎక్కి మాసామాను సర్దుకొని బెర్తులలో పడుకోన్నాం . మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనాలు చేశాము .మా అమ్మాయికి ,అబ్బాయి రమణ కు ఇదే మొదటి సారి ఈ రూట్ లో ప్రయాణం .నాకు కాశీ ప్రయాణం ఐదో సారి మా ఆవిడకు నాలుగో సారి .సేవాగ్రం రాగానే పిల్లలతో బాటు నేనూ దిగి స్టేషన్ లో ఫోటోలు తీసుకొన్నాం .మహాత్ముని ‘’వార్ధా ఆశ్రమం ‘’ఇక్కడే ఉంది .ఇక్కడి నుంచే మొదటి సారిగా సమాజ సేవాకార్యక్రమాలు గాంధీ ప్రారంభించారు .నాగ పూర్ రాత్రికి చేరింది అక్కడ కమలా తోటలు నిండుగా కని పిస్తాయని చెప్పా. చీకట్లో కానీ పించలేదని ‘’దేప్పింది’’ మా అమ్మాయి .ట్రెయిన్ బాగానే వేగం గా నే వెడుతోంది .రాత్రి టిఫిన్ పెరుగన్నం తినేసి పడుకోన్నాం .పగలు ప్రయాణం దారికి ఇరువైపులా ‘’మోదుగ చెట్లు ‘’యెర్రని పూలతో వికసించి కనుల పండువు చేశాయి వీటినే అగ్గి పూలు అంటారు ‘’మోదుగ పూలు ‘’పేరు మీదశ్రీ దాశారదిరంగా చార్యులు నవల రాశారు చాలా పేరొచ్చిన నవల అది .మా చిన్న తనాలలో మోదుగ ఆకు విస్తళ్ళు ఉండేవి అందులోనే భోజనం .మెత్తగా బాగుండేవి .మోదుగ చెట్టు కొమ్మ ఒడుగు సమయం లో ‘’బ్రహ్మ దండం ‘’గా పనికొచ్చే పవిత్రమైనకర్ర్ర .
పదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు రైలు అలహా బాద్ చేరింది .మేము బయల్దేరిన దగ్గర్నుంచి గూగుల్ పొజిషన్ లో మా అబ్బాయి శర్మ ట్రయిన్ ను గమనిస్తూ యెంత లేటో యెంత ముందు వస్తోందో ఫోన్ చేసి చెబుతూ తెలుసుకొంటూ మానిటరింగ్ చేస్తూనే ఉన్నాడు .ఏ స్టేషన్ తర్వాత యేది వచ్చేదీ ‘’ఇటినరీ’’ కూడా టైము తో సహా నెట్లో పంపిస్తే ప్రింట్ అవుట్ తీయించి వెంట తెచ్చుకోన్నాం .కనుక ఎవర్నీ అడగాల్సిన పనే లేకుండా పోయింది .అలహా బాద్ లో దిగి సామాను అంతా మేమే వీల్ సూట్ కేసులను లాక్కుంటూ రిటైరింగ్ రూమ్స్ కు చేరాం . కింద కేంటీన్ ఉంది .టూరిజం వాళ్ళ రూమ్ ఉంది .వాళ్ళను అడిగి త్రివేణీ సంగమ స్నానం ,నగర దర్శనం కు ఇండికా కారు మాట్లాడాం .వెయ్యి రూపాయలు .బోటు ఖర్చులు మావే .స్నానానికి తినటానికి మాత్రమె సర్దుకొని ,సామాను అంతా రూముల్లో ఉంచేసి బయల్దేరాం .పన్నెండు గంటలకు కారు ఎక్కి బయల్దేరాం .ఒక అరగంట లో ప్రయాగ సంగమ ప్రదేశం చేరాం .కారు ఒడ్డునే ఆపేశాడు .సంగమ స్నానానికి తిరిగి తీసుకు రావటానికి మనిషికి నాలుగు వందల ప్రకారం ప్రత్యెక బోటు మాట్లాడుకొన్నాం .బోటు వాడు యమునా నదిని గంగా నదినీ సంగమ ప్రదేశాన్ని చూపిస్తూ స్నాన ఘట్టానికి తీసుకు వెళ్ళాడు .అక్కడ బోటులు లంగరు వేసి కదల కుండా ఉంచుతారు .బోటు అడుగు భాగాన లావు పాటి దూలం కడతారు దాన్ని ఆధారం గా చేసుకొని సంగమ స్నానం చేయాలి. ఇనప గొలుసులు కూడా అటూ ఇటూ కట్టి ఉంటాయి .ప్రవాహం ఉధృతం గా ఉంటుంది కాళ్లు ఆనవు . కొద్ది అడుగులు దాటగానే మెరక తగుల్తుంది. దాని మీద నిల బడి స్నానం చేయాలి .
బట్టలు సంచీలు బోటులో పెట్టి స్నానానికి మాత్రమె తయారై నేనూ మా ఆవిడా ముందు స్నానం చేశాము .మంత్రం నేనే చెప్పి సూర్యునికి అర్ఘ్యమిచ్చి సంధ్యావందనమూ అయిందని పించాను .తర్వాతా మా అమ్మాయి దిగింది దానికీ మంత్రం చెప్ప మా అబ్బాయినీ దింపి మంత్రం తో స్నానం చేయించాను .మా అమ్మాయి’’ మహా త్రిల్ గా ఫీల్ ‘’అయింది నిజం గా ఎన్ని సార్లు త్రివేణీ లో స్నానం చేసినా కొత్త గా నే ఉంటుంది .గొప్పఅనుభవం .ఎన్ని వేల మంది మహర్షులు పుణ్యాత్ముల పాద స్పర్శ తో పులలకించి పవిత్ర వంతమైన నేల ఇది .గంగమ్మ తల్లి కరుణ యమునమ్మ తల్లి చల్లదనం ,అంతర్వాహిని సరస్వతీ కలిసి పవిత్ర త్రివేణీ సంగమం అయింది .అందరూ పులకించి పరవశించాం రెండేళ్ళ క్రితం జూన్ నెలలో మా బావ మరిది కుటుంబం తో కలిసి వచ్చాం .అప్పుడు నా పుట్టినరోజు కూడా బోటు మీదే త్రివేణీ లో జరుపుకోన్నాం .మా శ్రీమతి ఉయ్యూరు లో చేసి తెచ్చిన నాకు ఇష్టమైన ‘’మైసూర్ పాక్ ‘’అందరికి పెట్టి సంతోష పెట్టింది .
సంగమ స్నానం అయిన తర్వాత బట్టలు మార్చుకొని అందరం బోటు ఎక్కి ఒడ్డుకు చేరాం .ఒడ్డునే అక్బర్ చక్ర వర్తి కట్టించిన కోట ఉంది .అందులోకి వెళ్లి ,అక్కడ వేలాది సంవత్సరాల వయసున్న ‘’ఆక్షయ వట వృక్ష ‘దర్శనం చేశాం .కోటలో నుంచి బయటికొచ్చి పక్కనే ఉన్న ‘’బడే హనుమాన్ ‘’ను దర్శించాం .పడుకున్న పోజు లో హనుమ ఉంటాడు .అక్కడి నుంచి నాలుగింటికి భరద్వాజ ఆశ్రమం చేరుకొన్నాం .అనేక భూ గర్భ గృహాలలో దేవతా దర్శనం చేశాము .అప్పుడే హైదరాబాద్ నుంచి శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారు ఫోన్ చేశారు .మధ్య మధ్యలో కట్ అవుఓ అస్పస్టం గా విని పించాయి మాటలు .అలహా బాద్ లో ఉన్నామని పది హేడు ఉదయానికి ఉయ్యూరు వస్తామని అప్పుడు నేనే ఫోన్ చేసి మాట్లాడుతానని చెప్పాను. సరే నన్నరామే .
అక్కడి నుండి మోతీలాల్ నెహ్రు గారి ‘’ఆనంద భవన్ ‘’చూసి చంద్రా శేఖర ఆజాద్ పార్కు ,హైకోర్టు ,అలహా బాద్ యూని వర్సిటి వగైరాలు తిరిగి చూశాం కారులో .ఆరింటికి మొదట గా ప్రయాగ లో కట్టిన శ్రీ మహా విష్ణు ఆలయం ‘’శ్రీ వేణీ మాధవ ‘’దర్శనం చేశాం .రెండేళ్ళ క్రితం చూడ లేక పోయాం .చాలా ప్రాచీన మైన ఆలయమిది .కొత్త నిర్మాణాలు చేసి వైభవోపేతం గా తీర్చి దిద్దారు .ఏడు గంటలకు రిటైరింగ్ రూమ్స్ కు చేరుకొన్నాం .రైల్వే కేంటీన్ లో టిఫిన్లు తిన్నాము .హాయిగా పడుకోన్నాం .తెల్ల వారు ఝామున నాలుగింటికి వారణాసి ఎక్స్ ప్రెస్ ఎక్కాలి .
అలహా బాద్ విశేషాలు
‘’ప్రయాగ రాజం సింహం లాంటిది .అత్యున్నత పుణ్య క్షేత్రం .పెద్ద పెద్ద పాపరాశులను క్షాళనం చేసి పవిత్రీకరించే క్షేత్రం ప్రయాగ కు సాటి ఏదీ లేదు .ప్రయాగ మహిమ వర్ణించటం ఆదిశేషుని వల్ల కూడా కాదు ‘’అని శ్రీ రామ చంద్రుడే తులసీ దాస మహాకవి విరచిత శ్రీ రామ చరిత మానస్ ‘’లో అంటాడు . దివ్య ధామం ప్రయాగ .అందుకే తీర్ధ రాజం (కింగ్ ఆఫ్ పిలిగ్రిమేజేస్)అంటారు . దేవ నదులైన గంగా ,యమునా అంతర్వాహిని సరస్వతి సంగమ స్థానం ప్రయాగ .వేలాది సంవత్సరాలుగా వేలది యోగి పుంగవులు ,మహర్షులు తపస్సు చేసి చరితార్దులైన ప్రదేశం .మాఘ మాసం లో జరిగే మాఘ మేలా కు లక్షలాది భక్త జన సందోహం త్రివేణీ స్నానం చేసి పునీతులౌతారు .పన్నెండేళ్ళ కోసారి వచ్చే మహా కుంభ మేలా లో దీని ప్రభావం వర్ణించటానికి అలవి కానిదిగా ఉంటుంది .ఇసుక వేస్తె రాలనంత జనం ఎక్కడో అరణ్యాలలో ముక్కు మూసుకొని తపస్సు చేసుకొనే అనేక రకాల సాదు సంతులు వచ్చి త్రివేణీ సంగమ స్నానం చేసి తమ వారికి జ్ఞాన బోధ చేసి సన్మార్గం లో నడి చెట్లు చేస్తారు.ఇంతటి ప్రత్యెక మేలా నిర్వహించటానికి ఒక కద ఉంది .
దేవ దానవులు సాగర మధనం చేస్తున్నప్పుడు అమృతం ఉద్భ వించింది .దీనికోసం సురులు అసురులు పోట్లాడుకొంటారు. దానవులకు దక్కకుండా చేయాలని విష్ణువు మోహినీ రూపం లో వచ్చి అమృత కలశాన్ని జాగ్రత్త పరుస్తుంటే కొన్ని బిందువులు ఒలికి త్రివేణీ సంగమం లో పడ్డాయి .ఇక్కడేకాక నాసిక్ లో ,ఉజ్జైన్ లో హరిద్వార్ లో పడ్డాయి .అందుకే కుంభ మేలా మహా కుంభ మేలా లను నిర్వహిస్తారు .గంగా నదీ దర్శనమే ముక్తి హేతువు అని పురాణ కధనం .గంగా యమునా దర్శనం చాలు అనేక జన్మ పాపాలు హరించి పోవటానికి అని గోస్వామి తులసీదాసు అంటారు .ప్రకృష్టమైన యోగం అంటే కూడలి కనుక ప్రయాగ అనే పేరొచ్చింది .బ్రహ్మ దేవుడు ‘’ప్రకృష్ట యాగం ‘’ఇక్కడ చేశాడు కనుక ప్రయాగ అయింది అనీ చెబుతారు .యజ్ఞం లేక యాగం వలన ఈ పెరోచ్చిందన్న మాట .పురాణ కాలం నుంచి ప్రసిద్ధమైన మహా పుణ్య స్థలం ప్రయాగ.
ఒకప్పుడు ఇక్కడే యమునా నదీ తీరం లో నగరానికి పడమర ‘’కౌశాంబి ‘’నగరం ఉండేది .ఇదే రాజధాని .దాని అవశేషాలు ఇప్పుడూ అక్కడ కని పిస్తాయి . 1997లో కౌశాంబి జిల్లా ఏర్పడింది .క్రీ శ ఆరవ శతాబ్ది వరకు కౌశాంబి మహోత్క్రుస్తం గా వెలిగింది .గౌతమ బుద్ధుడు చాలా సార్లు ఇక్కడికి విచ్చేసి జ్ఞాన బోధ చేశాడు .వేలాది బౌద్ధ భిక్షువులకు ఆవాస భూమి గా ఉండేది .జైన మతానికీ కేంద్ర స్తానమైంది కౌశాంబి .మౌర్య సామ్రాజ్యానికి ఉప రాజధానిగా కౌశాంబి ఉండేదని చరిత్ర చెబుతోంది .అశోక చక్ర వర్తి ఇక్కడ రెండు అంతస్తుల స్తంభాలు నిర్మించాడు .సముద్ర గుప్త చక్రవర్తి తన జయ గాధలను విజయ స్తంభాలపై 326b.c.లో చెక్కించాడు .సముద్ర గుప్తుడు ప్రయాగ లో పన్నెండు ఏళ్ళు వరుసగా యాగాలు చేశాడు .దాని స్మారకార్ధం ‘’సముద్ర కూపం ‘’అనే బావిని ప్రతిష్టాన పురం లో తవ్వించాడు .అప్పటిదాకా ప్రయాగ ఒక ఆశ్రమ స్థానం గానే ఉండేది సముద్ర గుప్తుని పన్నెండు వరుస యజ్ఞాల వలన అనేక మంది మహర్షులు ఋషులు తాపసులు ఇక్కడికి వచ్చి స్తిరపడి పోయారు .అనేక జాతుల వారు మతాల వారు ప్రయాగ చేరి శాశ్వతం గా నిలిచి పోయి దీనికి ఒక పట్టణ స్థాయిని కల్పించారు .ప్రయాగ మహా పట్టణమే అయింది కాల క్రమం లో .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-14-ఉయ్యూరు